కొంచెంసేపు అలా కూర్చొని నెమ్మదిగా హాలు తలుపు తీసుకొని బయటకొచ్చాడు. అతన్నెవరూ పట్టించుకోలేదు. పక్కన బెడ్ రూంలో కెళ్ళి ఫోనెత్తి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. పిరమిడ్స్ కాంపిటీషన్లో తమ స్కూలుకి ప్రయిజ్ వచ్చిందో లేదో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా వుందతనికి.
"ఏమవుతుందిరా? నీ ప్లేస్ లో వేసిన ఆ సంతోష్ గాడు బ్యాలెన్స్ తప్పాడు. మన పిరమిడ్ కూలిపోయింది. నీమీద మన డ్రిల్ మాస్టారికి బాగా కోప మొచ్చింది" అన్నాడు స్నేహితుడు.
అవినాష్ నీరసంగా ఫోన్ పెట్టేశాడు.
అతని కలల ఆశల పిరమిడ్ కూడా పేకమేడలా కూలిపోయింది.
హాల్లోంచి తన రూంలో కెళుతూ వుండగా ఎవరో "టీ.వీ. పెట్టరాదూ" అనటం వినిపించింది.
"అరె, మర్చిపోయాను" అంటూ వెళ్ళి ఆన్ చేసింది పార్వతి.
టీ.వీ. కొత్తగా వచ్చినరోజులవి. చాలామంది ఇళ్ళల్లో యింకా టీ.వీ.లు రాలేదు. తనింట్లో వున్న కలర్ టీ.వీ. సెట్టు చూపించుకోవాలని ఆమె ఆరాటం.
"ఈ రోజు పడింట్ నెహ్రూ పుట్టినరోజు. దేశమంతా పిల్లల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. దేశం నలుమూలల నుంచీ చిల్డ్రన్స్ డే వివరాలు అందుతున్నాయి" అని చెబుతున్నాడు వ్యాఖ్యాత. పిల్లలంతా టీ.వీ.ని ఆసక్తిగా చూస్తున్నారు.
నలుగురు పిల్లలు పాడుతున్నారు.
"పండిత నెహ్రూ పుట్టినరోజు. బాలలందరికి పండుగరోజు".
టీ.వీ. స్క్రీన్ మీద నెహ్రూ మొహం కనబడుతుంది. అందులో ఆయన నవ్వుతున్నాడు. కానీ ఆ నవ్వు వెనక విషాదం గుర్తించిన వాళ్ళెవరూ అక్కడలేరు. పనిపిల్ల వేలినుంచి ఇంకా రక్తం వస్తూనే వుంది.
3
విశ్వేశ్వర్, అన్నపూర్ణలకు ఇద్దరు పిల్లలు. మహతి పుట్టిన చాలాకాలానికి సుకుమార్ పుట్టాడు. మొదటి కూతురు మహతి పుట్టిన సంతోషమంతా ఆ దంపతులకి మూడు నెలల్లోనే హరించుకుపోయింది. తరువాతైనా కొడుకు పుడతాడో లేదో అన్న బెంగ మొదలైంది. ఆ రోజుల్లోనే రెండుసార్లు గర్భం రాగానే నాగపూర్ వెళ్ళి రహస్యంగా సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేయించి ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేయించుకుంది. అన్నపూర్ణ. ముచ్చటగా మూడోసారి కొడుకు అని కన్ఫర్మ్ అవటంతో వాడు కడుపులో వున్నప్పటినుంచే అతి గారాబంగా పెంచసాగింది. రెండుసార్లు అబార్షన్ అవటంతో ఆమె ఆరోగ్యం క్షీణించి సుకుమార్ సుకుమారంగానే పుట్టాడు. సుకుమార్ కి పుట్టినప్పటినుంచీ అనారోగ్యం. దానికితోడు అతిగారాబం. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కొడుకు పుట్టడం కోసం ఎన్ని పూజలు చేసిందో, ఎన్ని మొక్కులు మొక్కుకుందో ఆమె చెపుతూ వుంటుంది.
"ఈ రోజుల్లో కూడా కొడుకూ, వారసుడూ అని అంతగా కోరుకునే తల్లిదండ్రులున్నారంటే ఆశ్చర్యంగా వుంది. అందులోనూ అంత చదువుకున్న వాళ్ళు" అన్నాడు దశరధ ఈ విషయం తెలిసి.
"మన కళ్ళెదుటే కనిపిస్తున్నారుగా. అయినా, ఈ విషయంలో చదువుకున్న వాళ్ళు, చదువు లేనివాళ్ళు అన్న భేదంలేదు. తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన కొన్ని నమ్మకాలను వదలడానికి ఈ చదువులు పనికిరావు. సుకుమార్ ఒక్కపూట అన్నం సరిగ్గా తినకపోతే ఆ తల్లి కూడా తినదు. రెండోరోజుకి కాస్త జ్వరం వస్తే ఏడుస్తూ కూర్చుంటుంది" అంది కౌసల్య.
ఆ రోజు సుకుమార్ వాళ్ళింట్లో పుట్టినరోజు డిన్నర్ పూర్తయి ఇంటికి వచ్చేసరికి తొమ్మిదైంది. దశరధ్ పిల్లలతోపాటు కూర్చొని రేడియోలో న్యూస్ వింటున్నాడు. కౌసల్య మర్నాడు ఉదయానికి పిల్లలకి కావాల్సిన స్కూలు సరంజామా అంతా సర్దిపెడుతోంది.
ప్రతిరోజు రాత్రి తొమ్మిది నుంచి పదిగంటలవరకూ ఆ దంపతులు ఇద్దరూ పూర్తిగా పిల్లలతో గడుపుతారు రేడియోలో న్యూస్ వినటం పట్ల పిల్లలకు అభిరుచి కలుగజేశాడు దశరధ్. ఆ తర్వాత కాసేపు పాఠాల గురించి ఇతర విషయాలు గురించి మాట్లాడుతాడు. ఆపైన పిల్లలకి నిద్రవచ్చేవరకు ఏవైనా కథలు చదివి వినిపిస్తాడు.
"అమ్మా! మహతి ఇవాళ ఎందుకు ఏడ్చింది?" వున్నట్టుండి అంది నిఖిత.
తల్లి ఏదో చెప్పబోతుంటే "నాకు తెలుసు ఎందుకేడ్చిందో" అన్నాడు రాము "........ఆ సుకుమార్ కేకు కట్ చేశాక వాళ్ళ మమ్మీకి, డాడీకి ఇచ్చాడుగానీ అక్క మహతికి పెట్టలేదు" అన్నాడు.
"చాలా మంది వున్నారు కదా, మర్చిపోయి వుంటాడు" అని సర్దిచెప్పింది కౌసల్య.
"సుకుమార్ మరచిపోతే వాళ్ళ మమ్మీ, డాడీలకైనా గుర్తుండాలిగా" అంది నిఖిత.
"వాళ్ళు కూడా హడావిడిలో వున్నారు కదమ్మా, ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మామూలుగా జరుగుతూ వుంటాయి" అన్నాడు దశరధ్.
రాము కొంచెం కోపంగా "ఎందుకు వాళ్ళనలా సపోర్ట్ చేస్తావ్. ఒక్క బిస్కెట్ వుంటే మేమిద్దరం చెరిసగం పంచుకోవాలని చెప్తావుగా. మరి సుకుమార్ తప్పుచేస్తే మందలించకపోవటం వాళ్ళతప్పుకాదా" అని అడిగాడు.
"తప్పేగాని, కావాలని చేసుండకపోవచ్చుగా" అంది. "సరే అవినాష్ కనిపించలేదు, పార్టీకి రాలేదా?" మాట మార్చింది కౌసల్య.
"వచ్చి త్వరగా వెళ్ళిపోయాడు. ట్యూషన్ వుందంట. వాడికి బాగా జ్వరంగా వుంది. అయినా ట్యూషన్ మానడు".
"అవినాష్ కి చదువంటే చాలా ఇష్టం. క్లాస్ ఫస్ట్ వస్తాట్టగా. కానీ గేమ్స్ అంటే ఇంట్రస్ట్ లేదనుకుంటాను" అడిగాడు దశరధ్.
"ఎందుకు లేదు ? వుంది. పిరమిడ్స్ లో బాగా చేస్తాడు. వాళ్ళ డాడీ వద్దన్నాడని ఆఖరిరోజు మానేశాడు. డ్రిల్ మాస్టారు తిట్టడం నేను చూశాను" అన్నాడు రాము.
"ఆయనకు ముందుగా చెప్పకపోవడం తప్పుకాదా."
"బాగుంది పప్పా, స్కూల్లో ఏ గేమ్స్ ఆడాలో కూడా డాడీని అడిగి పర్మిషన్ తీసుకోవాలా" అన్నాడు రాము చిత్రంగా చూస్తూ.
కౌసల్య కలుగజేసుకుంటూ "అవినాష్ కి చాలా త్వరగా జ్వరం వస్తూ వుంటుంది. అందుకే వాళ్ళ పేరెంట్స్ కి భయం" అంది.
"అదేంకాదు" అన్నాడు రాము- తనకు అసలు కారణం తెలుసన్నట్టుగా.
"ఇతరులకోసం మనం ఇంతసేపు ఆలోచించుకోవటం అనవసరం రామూ, పదైంది పడుకోండి" అన్నాడు దశరధ్ ఆ గదిలోనుంచి బైటకొస్తూ.
పిల్లలిద్దరూ పడుకున్నారు. కౌసల్య అక్కడే వుండిపోయింది. నిఖిత కాస్తకూల్ గా వున్నట్లు ఆమె గమనించింది. పిల్లల్లో ఏమాత్రం చిన్న మార్పు వచ్చినా దాని గమనించి పట్టుకోవడం చాలా కొద్దిమంది తల్లులకే సాధ్యం. ఆ కొద్దిమందిలో కౌసల్య ఒకరు.
పడుకున్న పది నిముషాలకే రాము నిద్రపోయాడు. నిఖిత ఇంకా పక్కమీద దొర్లుతూ వుంది. కౌసల్య ఆ అమ్మాయి తలమీద చెయ్యివేసి నెమ్మదిగా నిమరసాగింది.
"అమ్మా నేనొకమాట అడగనా" నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగింది నిఖిత.
"ఏంటమ్మా, అడుగు" తల సవరిస్తూ అంది.
"మహతికి, అన్నపూర్ణా ఆంటీ ఓన్ మదర్ కాదు కదూ" అన్నదా పాప కౌసల్య అదిరిపడింది.
"నిక్కీ, ఎందుకు నీకీ అనుమానం వచ్చింది?" అని అడిగింది.
ఎనిమిదేళ్ళ నిఖితలో ఏదో అంతర్మధనం సాగుతున్నట్లు కౌసల్య గ్రహించింది.
"ఓన్ మమ్మీ కాదు కాబట్టే మహతిని సరిగ్గా చూడటంలేదు అవునా.స్వంత తల్లులైతే బాగా చూసుకుంటారట కదా. సవితి తల్లులే కష్టాలు పెడతారటగా!"
కౌసల్య మొహం వాడిపోయింది. "అలా అని ఎవరు చెప్పారమ్మా" అని అడిగింది.
"ఇందాక పార్టీలో సునీతక్క చెప్పింది".
కౌసల్యకి బాగా కోపం వచ్చింది. సునీతకి ముప్పై ఐదేళ్ళుంటాయి. ఒక పాపని పక్కన కూర్చోబెట్టుకుని ఇలాంటి కబుర్లు చెప్తూ తప్పుడు భావాలు నూరిపోయడం ఎందుకో అర్థంకాలేదు. మహతి, అన్నపూర్ణకి స్వంత కూతురని సునీతకు తప్పకుండా తెలిసేవుంటుంది. ఒక నిజానికి ఒక అబద్ధం అనే రంగు పులమకపోతే అవతలివాళ్ళలో ఉత్సాహం కలగక పోవచ్చు అందుకని ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పనవసరంలేదు.
ఈ లోపులో నిఖిత అడిగింది. "ఒక మమ్మీ చచ్చిపోతే మళ్ళీ పెళ్ళి చేసుకునే డాడీలు చాలా చెడ్డవాళ్ళు కదు మమ్మీ!"
సినిమాలు చూసేటప్పుడు పెద్దవాళ్ళు దగ్గరుండి విడమరచి చెప్పకపోతే, పిల్లల్లో ఎలాంటి తప్పుడు అభిప్రాయలు వస్తాయో చెప్పడానికి ఇది సజీవమైనా ఉదాహరణ.
"ఈ పెద్ద మాటలన్నీ నీకెందుకు" కసిరి నిఖితని వూరుకొబెట్టడం చాలా సులభం. చాలామంది తల్లిదండ్రులు చేసేపని అదే. కాని కౌసల్య అలా చెయ్యలేదు. పిల్లలకి మొదటి పాఠశాల ఇల్లు. తల్లిదండ్రులే మొట్టమొదటి ఉపాధ్యాయులు అన్న సత్యాన్ని కౌసల్య బాగా నమ్ముతుంది. "ఈ కాలంలో ఆడవాళ్ళందరూ బాగా చదువుకుంటున్నారమ్మా. పిల్లలని ఎలా చూసుకొవాలో వాళ్ళకి తెలుసు. తను నిజం అమ్మ అవునో కాదో తెలియకుండా కూడా పెంచుతారు" అంది.
నిఖిత ఆ మాటకూడా నిజమే అన్నట్లు తలూపుతూ "అవునమ్మా మన కాలనీలో ఫ్లాట్ నెంబర్ ఫార్టీలో వుంటారు చూడు, ఆ అబ్బాయి పేరు నిశ్చల్. వాళ్ళ అమ్మ స్వంత అమ్మకాదట. అయినా ఎంతబాగా చూసుకుంటుందో" అంది.
కౌసల్య ముఖం చిట్లించి "ఆ విషయాలన్నీ నీకెలా తెలుసు" అంది.
"సునీతక్కే చెప్పింది".
ఈ మాటలకి కౌసల్య కాస్త కఠినంగా "ఇంకెప్పుడూ ఆ సునీతక్కతో కూర్చుని కబుర్లు చెప్పకు" అంది. నిఖిత కొంచెం భయపడినట్లుగా కనపడి "సరేనమ్మా" అంది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ పాప నిద్రపోయింది. కౌసల్య మనసు పాడయింది. ముఫ్పై ఐదేళ్ళ వయసులో పిల్లలని పక్కన కూర్చోబెట్టుకొని ఎందుకిలాంటివన్నీ చెప్తుందో అర్థం కాలేదమెకు. ఆ తర్వాత ఆమె ఆలోచనలన్నీ కూతురు అడిగిన ప్రశ్నలవైపే మళ్ళాయి.
మొదటి బిడ్డని తల్లిదండ్రులు అపురూపంగా చూసుకుంటారు. రెండవ బిడ్డ పుట్టగానే సహజంగా తల్లిదండ్రుల దృష్టి చంటిపాప మీదికి మళ్ళుతుంది. దాంతో పెద్దపాపకి ఒక అభద్రతాభావం లాంటిది కలిగి, ఎవ్వరూ చూడకుండా చెల్లినో, తమ్ముడునో కొట్టడం గిచ్చడం లాంటివీ చేస్తూ వుంటుంది. ఇద్దరి పిల్లల మధ్యా సమైక్యతని పెంపొందించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. దశరధ్, కౌసల్యలు పిల్లల విషయంలో అంత శ్రద్ధ తీసుకొని జాగ్రత్త పడబట్టే రామూకి చెల్లెలంటే ప్రేమే కాదు, పెద్ద వాడిగా బాధ్యతలు కూడా తీసుకుంటాడు. ఏ ఇంట్లో అయినా ఇద్దరు పిల్లల మధ్య సంఘీభావం లేదూ అంటే దానికి ప్రధమ దోషులు తల్లిదండ్రులే.
"ఏమిటంతసేపున్నావు ఆ గదిలో, పిల్లలు నిద్రపోలేదా" అని అడిగాడు దశరధ్.
కౌసల్య అతని పక్కగా కూర్చుంటూ జరిగినదంతా చెప్పింది.
సమాజంలో రోజురోజుకీ నైతిక విలువలు దిగజారిపోతున్నాయని వాపోయేవాళ్ళు కూడా తమ ఇంట్లోనే మారుతున్న విలువలని గ్రహించలేక పోతున్నారు. ఒక ఉద్యోగంచేసే కూతురు ఒక నెల వెయ్యి రూపాయలు జీతం ఇంటికి తీసుకొచ్చి ఏదేనా సొంతానికి ఖర్చు చేద్దామనుకుంటే "వద్దమ్మా, పెళ్ళికి పనికొస్తుంది వుంచు" అనే తల్లిదండ్రులు కేవలం ఆర్ధికపరమైన ఇబ్బందులవల్లే ఇలా అంటున్నారా? అందరూ పునరాలోచించుకోవాల్సిన ప్రశ్న ఇది. కంటికి ఎదురుగా కనిపిస్తున్న అన్యాయాన్ని గుర్తుంచకుండా వుండటం బాధాకరమైన విషయం. దాన్ని ఎదిరించలేకపోవటం మరీదారుణం.