Previous Page Next Page 
ధ్యేయం పేజి 3


    దశరధ్ కి తన ఇరవై అయిదో యేట కౌసల్యతో పెళ్ళి జరిగింది. అప్పటివరకూ అతడు చాలా ఇరుకైన సంబంధాలున్న కుటుంబ వ్యవస్థలో పెరిగాడు. పెళ్ళి జరిగిన తరువాతే అతడిలో మానవ ప్రవృత్తులని, కుటుంబసభ్యుల్లోని సంబంధ బాంధవ్యాలని విశ్లేషిస్తూ వుండాలి అన్న విషయం తెలిసొచ్చింది. కుటుంబ సభ్యుల్లో ఆత్మీయత, ఆప్యాయత, అనుబంధం అంతలా అల్లుకొని వుంటాయని అత్తవారింట్లో గడిపిన మొదటి మూడు రోజుల్లోనే అతడు గ్రహించాడు. పిల్లలు తల్లిదండ్రులతో కబుర్లు చెబుతూ జోక్స్ వేయడం, అత్తామామలు తమ పిల్లలతోనే కాకుండా అల్లుళ్ళతో కూడా సరదాగా మాట్లాడటం అతడికి సంతోషంగా, ఆనందంగా అనిపించింది.

    రెండోరోజు చిన్నబావమరిది సినిమా ప్రోగ్రాం వేశాడు. కొత్త సినిమా కావటంతో ఒక టికెట్ తక్కువ దొరికింది. "మీరు చూసిరండి. నేనింటికి వెళతాను" అన్నాడు చిన్నవాడు. "నీకీ హీరో అంటే ఇష్టంగా, ఈ సినిమా కొచ్చింది నీకోసమే ఇంటికి నేవెళతాన్లే" అన్నాడు పెద్దల్లుడు. "ఎవరో వెళ్ళడమేంటి నాకు పెద్ద ఇంట్రస్ట్  లేదు. నేనే వెళతాను" అన్నారు మామగారు.

    దశరధ్ చిన్నప్పుడు చదువుకున్న భారత కథ గుర్తిచ్చింది. బకాసురుడికి ఆహారంగా వెళ్ళడానికి కుటుంబ సభ్యులందరూ నేనంటే నేననటం ఆ కథ. ఇక్కడ సినిమా బకాసురుడి కథ కాకపోయినా ఎవరో ఒకరు వెనక్కి వెళ్ళటం తప్పనిసరి పరిస్థితి. పురాణ కథల్ని కథలుగానే చదివాడు తప్ప దశరధ్ యిలాంటి పాయింట్ ని ఎప్పుడూ జీవితానికి అన్వయించుకోలేదు.

    "నేనెక్కువ సినిమాలు చూడను. మీరంతా చూసిరండి" అన్నాడు. జీవింతంలో తనంతట తానుగా అంత కలుపుగోలుగా మాట్లాడటం అతడికి అది మొదటిసారి. ఆ మాట తనెంత మనస్ఫూర్తిగా అన్నాడో తలచుకుంటుంటే అతడికే ఆశ్చర్యమనిపించింది. చివరికి మామగారి మాటే నెగ్గింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అంతేకాదు సినిమా చూసి వచ్చేసరికి అందరికీ ఆయనే వంటకూడా  చేసేశాడు. ప్లాస్క్ లో పోసి స్వయంగా కప్పుల్లో పోసి అందించాడు.

    తనకిచ్చిన టీలో 'అల్లం' రుచి గమనించి, ఆశ్చర్యంతో పాటు సంతోషంతో కంటనీరు తిరిగింది దశరధ్ కి. ఉదయం ఏదో మాటల్లో తనకి టీలో అల్లం వేస్తే ఇష్టమని బావమరిదితో చెప్పటం ఆయన విన్నట్లున్నాడు ఇలాంటి చిన్న చిన్న  విషయాలే ఆప్యాయతని పట్టిచ్చేస్తూ వుంటాయి.

    తన తల్లిదండ్రుల నించి తను పొందలేకపోయిందేమిటో అప్పుడర్థమైంది అతడికి. అంతేకాదు తన కుటుంబ సభ్యులకి తను పంచి పెట్టవలసిందేమిటో కూడా తెలిసొచ్చింది.

    అతనికి తెలిసినంతవరకు తన తల్లిదండ్రులకి ఒకరిపట్ల మరొకరికి అసంతృప్తి. దాన్ని సరియైన పద్ధతిలో వ్యక్తం చేసుకొని, దాని లోటు పాట్లని సరిదిద్దుకునే ఆలోచన వాళ్ళెప్పుడూ చేయలేదు. దాంతో రోజూ ఘర్షణ. ఆ ఘర్షణకి పిల్లలు బలైపోయారు. పిల్లలుకూడా ఆ వాతావరణంలో ఒకరిపట్ల మరొకరు ఆత్మీయత అనేది పెంచుకోకుండా ఏకాకులుగా మిగిలిపోయారు. నిర్లిప్తత అనే అడ్డుగోడ తప్ప ఆ ఇంట్లో మరేం మిగలలేదు.

    గతం ఎప్పుడూ ఒక అనుభవం. ఆ అనుభవసారాన్ని తమ భవిష్యత్తుకి, తమ పిల్లలకి ఉపయోగించాలని అతనికి తెలియజెప్పింది అతని భార్య కౌసల్య. చదువుకోవటం, పెరగటం, పెద్దవటం, పెళ్ళి జరగటం, చనిపోవటం ..... అన్నీ యాంత్రికంగా జరిగిపోతాయని అప్పటి వరకూ అతనికొక గాఢమైన అభిప్రాయం వుండేది. అలా కాకుండా బ్రతకటం జీవించడం కోసమని అతడికి అతడి భార్య తెలియజెప్పింది.

    పిల్లల్ని కనటంతో బాధ్యత మొదలవుతుంది. ఆ పిల్లలు పెరిగి తమ వ్యక్తిత్వాన్ని తాముగా సంతరించుకునేవరకూ ఆ బాధ్యత పెరుగుతూనే వుంటుంది. ముఖ్యంగా వాళ్ళ బాల్య, యవ్వన దశలు తల్లిదండ్రులకే కష్టమైన కాలం, క్లిష్టమైన కాలం. అందుకే పిల్లల వయసుని దృష్టిలో వుంచుకొని ఆ స్థాయిలోనే ఆలోచించాలని వాదిస్తుంది కౌసల్య.

    తనకలాంటి ఆలోచనలు కలగకపోవటానికి కారణం - తాను పెరిగిన విధానంలో లోపమా? లేకపోతే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేకపోవటమా? అని చాలాసార్లు ఆలోచించాడు దశరధ. అతడికి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఆ విషయం అతనికి ఆనందాన్నిచ్చిందికూడా. ఎందుకంటే అతడు మునుపటి దశరధ కాదు. సానబెట్టిన బంగారంలా అతని వ్యక్తిత్యం ఇప్పుడు ప్రకాశిస్తూంది.

    డోర్ బెల్ మోగగానే వంటింట్లో పనిచేస్తున్న అనసూయమ్మ వచ్చి తలుపు తీసింది. కృష్ణమూర్తి అప్పుడే ఆఫీసునుంచి వచ్చాడు. "రుక్మిణి ఏది?" లోపలికి వచ్చి చెప్పులు విడుస్తూ అడిగాడు తల్లిని.

    "అవినాష్ వాళ్ళింట్లో పార్టీకదా! కిట్టీపార్టీయో...... అదేదో పార్టీ. డానికి వెళ్ళింది. అంది.

    "పిల్లలు?"

    "వాళ్ళు కూడా అక్కడికే వెళ్ళారనుకుంటా. నాకు చెప్పలేదు" టీ కప్పు తెచ్చి అందిస్తూ అంది. కృష్ణమూర్తి ఆలసటగా వెనక్కి వాలి పడుకున్నాడు. ఇంటికొచ్చే సమయానికి భార్య ఇంట్లో లేకపోవటం అతడికెందుకో అసంతృప్తిగా అనిపించింది. తల్లి వచ్చి పక్కన నిలబడింది. "నువ్వేం అనుకోనంటే నేనొకమాట చెబుతాను. వింటావా?" అని అడిగింది.

    "ఏమిటో చెప్పు" అన్నాడు.

    "ఏంలేదు. ప్రీతమ్ కి పన్నెండేళ్ళు కూడా లేవు. అప్పుడే స్కూటర్ నడపటం దేనికి? వాడలా స్కూటర్ తీసుకొని వెళ్ళిపోతుంటే నా గుండె దడదడలాడుతూ వుంటుంది. తిరిగి వచ్చేవరకూ గాభరాగా వుంటుంది" అంది.

    కృష్ణమూర్తి నవ్వాడు, "పన్నెండేళ్ళే అయినా బాగా పోడుగేగా, ఫరవాలేదు. ఇప్పటినుంచే అన్నీ నేర్చుకోవటం మంచిది" అన్నాడు.

    "ఏమోరా, నాకు భయమేస్తూంది. స్కూలు కూడా లేదు. ఆ స్కూటర్ తీసుకుని పొద్దుననగా వెళ్ళాడు. భోజనానికి కూడా రాలేదు. ఇంక వాడి చెల్లెలయితే వాళ్ళమ్మ దగ్గిర డబ్బుతీసుకొని సినిమాకి వెళ్ళిపోయింది. ఇంతవరకూ రాలేదు."

    "ప్రీతమ్ దగ్గిర డబ్బుందిలే అమ్మా! ఎక్కడో టిఫిన్ చేసే వుంటాడు. నువ్వలాంటి భయాలేం పెట్టుకోవద్దు. మీ రోజుల్లోలా కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఇండివిడ్యుయాలిటీ వుండాలి. అన్నట్టు ఇండివిడ్యుయాలిటీ వుండాలి. అన్నట్టు ఇండివిడ్యుయాలిటీ అంటే...." అని నవ్వాడు. "నీకెలా చెప్పాలో నాకు తెలియటంలేదు. వ్యక్తిత్వం అను. అలాంటి వ్యక్తిత్వం వుండాలి. పూర్వం రోజుల్లోలా నువ్వు నన్ను పెంచినట్లు, నేను ప్రీతమ్ ని పెంచితే వాడు ఎందుకూ కొరగాకుండా పోతాడు. ఆ అవినాష్ లా తయారవుతాడు" అన్నాడు.

    అనసూయమ్మకేం అర్థంకాలేదు. పన్నెండెళ్ళ కుర్రాడికి స్కూటర్ మీద అధికారం ఇస్తే, వాడు చూసిన సినిమాల్లో గుర్రంమీద వెళ్ళేరాకుమారుడిలాగానొ, పోలీస్ ఇన్ స్పెక్టర్ లాగానో ఊహించుకుంటూ వేగంగా నడపడా? జీవితంలో ఏదో ఒక ఎదురుదెబ్బ తగిలేవరకూ మనిషి ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో తెలియడానికి తరాలు, అంతరాలు వుంటాయా? ఇంత చిన్న విషయం కొడుకు తెలుసుకోడేం? అనుకుంది మనసులో.

    నిజమే. ఇండివిడ్యుయాలిటీ అంటే ఏమిటో? తన కర్థంకాదు.

   

                                   *    *    *


    పార్టీ జోరుగా సాగుతుంది.

    "మీ అవినాష్ ఏడి?" అని అడిగింది ఊర్మిళ.

    "చదువుకుంటున్నాడు. పరీక్షలు దగ్గరకొచ్చాయిగా. ఇంక పిల్చినా బయటికి రాడు" గర్వంగా చెప్పింది పార్వతి.

    "ఈ రోజుల్లో కుర్రాడు కాదు. చాలా బుద్ధిమంతుడు" అంది రుక్మిణి. అదే రుక్మిణి మళ్ళీ పదిమందిలోకి వెళ్ళి "వాడుత్త పప్పుసుద్ద, అమ్మకూచి. ఇంట్లోంచి బయటికి రావటానికి భయం" అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    "మీ పిల్లల్ని తీసుకురాలేదేం?" అడిగింది పార్వతి.

    "వాళ్ళు నాతో వస్తారా? ప్రీతమ్ స్కూటర్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాడు. వరూధిని మాట్నీ కెళ్ళింది"గర్వంగా చెప్పింది రుక్మిణి.

    'తన పిల్లల గురించి ఎంత గర్వంగా చెప్తుందో, పాపం అసలు కంట్రోల్ లేదు. విచ్చలవిడిగా తిరుగుతారు. పైకి చెప్పుకోలేక ఈ గర్వం' అనుకున్నారు మనసులో అక్కడున్న చాలామంది. పైకి మాత్రం ఆ పిల్లల ధైర్యాన్ని పొగిడారు.

    పార్టీ మరింత జోరందుకుంది. మంగ అందరికీ మంచినీళ్ళు అందించడానికి సమతమమైపోతూ వుంది. మంగకి ఎనిమిదేళ్ళుంటాయి. పనిమనిషి కూతురు. తల్లితోపాటు ఆ ఇంట్లో చిన్న చిన్న పనులు చేస్తూ వుంటుంది. పనిమనిషికి ఆరోగ్యం బాగాలేకపోవటంతో ఆ రోజు పనంతా దాని నెత్తినేపడింది. ఉదయం నుంచి ఇల్లుసర్దడం, గ్లాసులు అవీ తోమడం లాంటి పనులతో దాని వొళ్ళు హూనమైపోయింది.  ఆ పిల్లవయసెంతని? ఒకవైపు ఆకలి, మరోవైపు నిద్ర ఆపుకుంటూ మంగ పనిచేసుకుపోతూ వుంది.

    "అవును. మీ ధాత్రి డాన్స్ చేస్తుందటగా" అడిగారెవరో.

    "డాన్సేకాదు. సంగీతం కూడా. టెన్నీస్ కి కూడా పంపిస్తున్నాం".

    "ఏదమ్మా, ధాత్రీ! వరవీణా మృదుపాణి పాడి వినిపించు" చెప్పంది. తల్లి.

    ధాత్రి పాట పాడింది. తరువాత డాన్స్ చేయమని చెప్పంది తల్లి. చాలా అలసటగా వుంది ఆ పిల్లకి. నిద్రపోవాలనుంది.

    "మమ్మీ! ఇంటికి వెళ్ళిపోతాను మమ్మీ!" అంది మెల్లగా.

    "ఛ! అప్పుడే ఏం నిద్ర. పిల్లలందరూ చూడు ఎలా ఆడుకుంటున్నారో. ఇక్కడినుంచి మనం యింకో ఆంటీ వాళ్ళింటికి వెళ్ళాలి. ఇవ్వాళ వాళ్ళ మ్యారేజి డే కదా!" అంది తల్లి.

    "నేను రాను మమ్మీ. ఇంటికెళ్ళిపోతాను" గారంగా అంది ధాత్రి.

    "తప్పు అలా అనకూడదు. ఆంటీలందరూ నీ డాన్స్ చూడాలని అనుకుంటున్నారు" అంది తల్లి. నిజానికి అక్కడున్న వాళ్ళెవరూ ధాత్రి డాన్స్ చూడాలన్న ఇంట్రెస్ట్ చూపించలేదు. కొంతమంది ఒకమూల చేరి చీరల గురించి, నగల గురించి మాట్లాడుకుంటున్నారు.

    ధాత్రి మాట్లాడలేదు. ఆ రోజు సెలవయినా కూడా డాన్స్, టెన్నిస్ ప్రాక్టీస్ లతో చాలా అలసిపోయింది. నిస్సత్తువగా సోఫాలో వాలిపోయింది. అలా వాలడంలో అప్పుడే గ్లాస్ తీస్తున్న మంగ చేతికి తగలటం, ఆ గాజు గ్లాస్ కిందపడి ముక్కలవటం అంతా క్షణంలో జరిగిపోయింది.

    "అరెరె" అంటూ అందరూ లేచి జాగ్రత్తగా పక్కకి వెళ్ళిపోయారు. మంగని నమిలి తినేసేలా చూసింది పార్వతి. అందరిముందు కోపం ప్రదర్శించడం బావుండదన్నట్టు కంఠంలోకి మార్దవాన్ని తెచ్చుకొని "అంత ఓటి చేతులేమే! వెళ్ళి చీపురు తెచ్చి జాగ్రత్తగా ఆ గాజుముక్కలు ఎత్తు. అసలే చిన్న పిల్లలున్నారు" అంది.

    ఎనిమిదేళ్ళ ఆ పాప కాళ్ళకి చెప్పులైనా లేకుండా ఆ గాజు పెంకుల మధ్య కూర్చొని ఎత్తటం, ఆ ఎత్తటంలో కోసుకొని రక్తంవస్తున్న వేలుని నోట్లో పెట్టుకోవటం, అక్కడున్న ఎవరూ గమనించలేదు.

    హాల్లో ఈ విధమైన గొడవ జరుగుతూండగా అవినాష్ తనరూంలో కూర్చుని కిటికీలోంచి చీకట్లోకి చూస్తూన్నాడు. అతడికి చదువుమీద  అసలు ఏకాగ్రత కుదరడంలేదు. తన ఈడు పిల్లలంతా బయట హాల్లో కూర్చుని అల్లరి చేస్తుంటే, వాళ్ళ తల్లులు మాట్లాడుకుంటూంటే ఏ కుర్రాడికైనా చదువుమీద ఏకాగ్రత ఎలా నిలుస్తుంది?

 Previous Page Next Page