రామ్ లాల్ అతడికి ప్రత్యేకమయిన సూచనలు కొన్ని ఇచ్చాడు. స్టేజి వెనకనుంచి ఈ ఆపరేషన్ అంతా అతడు చూసి ఏదైనా పరిస్థితి విషమిస్తే రంగంలోకి ప్రవేశించాలి.
అతడు నెమ్మదిగా రంగస్థలం వెనక్కి బయల్దేరాడు.
ఆ జనంలోనే కలిసిపోయి దాదాపు వందమంది సి.బి.ఐ. ఆఫీసర్లు వున్నారు. ఎలాగో ఒక టెర్రరిస్టుని పట్టుకోవాలి. మొత్తం అంతా బయటకు లాగొచ్చు. ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అయితే ఇదంతా మంత్రికి ఏ మాత్రం అపాయం లేకుండా జరగాలి.
డిప్యూటీ కమీషనర్ మనసులో పరమేశ్వరమే కదులుతున్నాడు.
ఆడిటోరియంలో రామ్ లాల్ వున్నాడు. పరమేశ్వరం వున్నాడు. ఇది సులభమైన ప్లాన్ అయివుండదు. ఏదో జరగబోతూంది.
ఆలోచిస్తూ వుండగా డిప్యూటీ దృష్టి - స్టేజి వెనక్కి నక్కి వెళుతున్న A-2 మీద పడింది. ఆ నడకలో తేడాని చీఫ్ కళ్ళు వెంటనే పసిగట్టాయి.
* * *
తన మినిష్టర్ వేషాన్ని అద్దంలో చూసుకుంటూ కాలర్ పైకి లేపుకున్నాడు విహారి. టోపీ పెట్టుకుని బయటకు వస్తూ పద్మాకర్ కేసి చూసి నవ్వేడు. అప్పటికే వెనుకవైపు విహారి వెళ్ళటానికి పద్మాకర్ ఏర్పాటు చేశాడు. అతడి కిదంతా థ్రిల్లింగ్ గా వుంది.
విహారి గ్రీన్ రూమ్ మలుపు తిరగబోతూంటే ఒక యువతి అటునుంచి పరుగున వస్తూ అతడిని ఢీకొంది. అయితే ఆమె దాన్ని పట్టించుకోకుండా కంగారుగా "లాయరు పరమేశ్వరం 'పి' వరుసలో కూర్చున్నాడు. కవర్ చేయండి" అని వేగంగా వెళ్ళిపోయింది. కనురెప్పపాటు కాలంలో జరిగిన ఈ సంఘటన విహారికి ఏమీ అర్ధంకాలేదు.
కాలేజీ ఫంక్షన్ లో ప్రతివాళ్ళూ తమదే ఈ ఫంక్షన్ అన్నట్టు హడావుడి పడటం మామూలే. అందులోనూ కళాశాల!!!
అతడు మరిక దాన్ని పట్టించుకోకుండా, వెనుకనుంచి ఆడిటోరియం బయటకు వచ్చి, ముఖద్వారం దగ్గరకు వచ్చాడు. అప్పటికే పద్మాకర్, అక్కడ మరో ఇద్దరు స్నేహితుల్ని ఏర్పాటు చేసినట్టున్నాడు. వాళ్ళూ నటులే కాబట్టి, సీరియస్ గా విహారి మెడలో దండవేశారు. అదృష్టవశాత్తు ప్రిన్సిపాల్ అక్కడ లేదు. విహారి మరింత హుందాతనం తెచ్చుకుని చుట్టూ వున్న వాళ్ళ నమస్కారాలు అందుకుంటూ పూలదండతోనే ద్వారం దగ్గిరకు సమీపించాడు.
సునాదమాల వళ్ళంతా చెమట్లు పడుతున్నాయి. చేతిలో పుష్పగుచ్ఛం వణుకుతోంది. మంత్రిగారంటే ఏ ఏభై ఏళ్ళవాడో అనుకుంది. ఇలా యువకుడు అనుకోలేదు. ఎలా పట్టుకుని అందిస్తే ఆ మంత్రిగారి వేళ్ళు తనకి తగలకుండా వుంటాయా అని మధన పడుతూంది.
విహారి దగ్గిరకు వచ్చేస్తున్నాడు.
స్పృహతప్పి తూలి పడిపోతానేమో అన్నట్లుగా వుంది మాలకి.
గుచ్చాన్ని ఎలాగో ఒకలాగా అందించి 'హమ్మయ్య' అన్నట్టు వూపిరి పీల్చుకోబోయింది. విహారి విశాలమైన చిరునవ్వుతో దాన్ని అందుకని ఆమెతోపాటే వదిలేశాడు.
అనుకున్నంతా అయింది.
సునాదమాల గుండె ఆగిపోయింది. ఒక స్వేదబిందువు మెడ మీదనుంచి గుండెల మధ్యకి చేరింది. వంగి దాన్ని తీసుకోబోయాడు. అదే సమయానికి ఆమె కూడా వంగింది. దాన్ని అతడే ముందు అందుకుంటూ "సాధారణంగా ఇటువంటి సమయాల్లోనే తలలు తగిలేది" అన్నాడు. ఆమెకది సరిగ్గా వినిపించలేదు. లేడిలా బెదురుతూ చూస్తోంది. ఈ లోపులో ప్రిన్సిపాల్ కీ వార్త తెలిసి, భారీకాయంతో రొప్పుతూ పరిగెత్తుకు వచ్చింది. సూర్యారావు బదులు మరో మంత్రిని చూసి విస్తుబోయింది. ఈ లోపులో అసలు మంత్రి దూరంగా దిగుతూ కనపడ్డాడు. ఆవిడ అటు పరుగెత్తింది.
"మీ పేరు" అన్నాడు విహారి.
"సు...సు...సునాదమాల".
"సుసుస్సునాదమాలా?"
ఆమె మరింత కంగారుపడి "ఒక్క సు యే" అంది గాబరాగా.
"ఒక్క సుయేనా? మూసు సు లు లేవా?" అని అడుగు ముందుకేసి, "నా పేరు నీకు తెలుసా?" అని అడిగాడు. ఆమె అతడిని ఫాలో కాక తప్పలేదు.
"సు...... సు... సూర్యారావుగారు".
"మూడు సు లు లేవు ఒక్క సుయే" భావరహితంగా అన్నాడు. ఆమె నోటి తడి ఆరిపోతూంది. ఈసారి స్వేదపు చుక్క పొత్తికడుపు మీదనుంచి మోకాలి మీదకు జారింది. చుట్టూ అసెంబ్లీలా జనం. ఒక్క స్నేహితురాలు కూడా కనపడలేదు.
"ఏం చదువుతున్నావమ్మాయ్ నువ్వు?" ఆమె ఆగిపోతే వెనక్కి చూస్తూ అడిగాడు.
ఆమె చెప్పింది.
ఈ లోపులో నెమ్మదిగా రంగస్థలం మీద కర్టెన్ తెరుచుకుంది. అతడామెని మరో ప్రశ్న అడగబోతూంటే అప్పుడు వినిపించింది పిస్తోలు శబ్దం....... వెంటనే మరోసారి......
విహారి సునాదమాల చేతిని పట్టుకుని స్టేజీ మీదకు పరిగెత్తాడు. అప్పటికే తెర పూర్తిగా తెరుచుకుని సెట్టు పూర్తిగా కనబడుతూంది.
A-3, విహారినే మంత్రి అనుకున్నాడు.
స్టేజి మీదకు మంత్రిగారిని తీసుకు వెళుతున్న వారిని కూడా చంపెయ్యమని అతడికి ఇన్ స్ట్రక్షన్స్. A-3 పేల్చిన గుళ్ళు స్టేజీని ఛిన్నాభిన్నం చేశాయి. ఈ లోపులో డిప్యూటీ చీఫ్ పిస్టల్ తీయటం, A-3 ని కాల్చటం జరిగిపోయాయి. ఆ గురి ఎంత సూటిగా వెళ్ళిందంటే A-3 చేతిలోకి నిలువునా దూసుకుపోయి మోచేతిని విరగ్గొట్టింది. అతడు పెట్టిన కేక హాల్లో ప్రతిధ్వనించింది.
డిప్యూటీ చీఫ్ చర్యలకన్నా వేగంగా ఆలోచించకలవారు ఆ హాల్లోనే మరొకరు వున్నారు- లాయర్ పరమేశ్వరం.
A-3 దొరికిపోయాడని అతడికీ తెలుసు. ప్రాణాలతో దొరక్కూడదు అనికూడా తెలుసు. వెనుక బాల్కనీలోకి చూసి సైగచేశాడు. రామ్ లాల్ వెనుకనుంచి A-3 ని కాల్చాడు, అతడి మెదడు పేలిపోయి ముక్కలు గాలిలోకి లేచాయి. హాలంతా విభ్రాంతి చెందింది. కానీ అది క్షణంసేపు మాత్రమే. కెవ్వు కెవ్వున అరుపులు - హాహాకారాలు.... సాక్ష్యం మిగల్లేదు.
రామ్ లాల్, అతడి అనుచరులు ప్రొఫెషనల్స్! తమ పనులు ఈ గొడవతో సంబంధం లేకుండా చేసుకుపోతున్నారు. A-3 ని చంపింది సి.బి.ఐ. వాళ్ళు అనుకుంటారని రామ్ లాల్ కి తెలుసు.
స్టేజి వెనుక వుండి ఇదంతా చూస్తూన్న A-2 విహారి, సునాదమాల మీదికి A-3 పిస్తోలు పేల్చటం, తరువాత అతడు మరణించటం- అంతా చూశాడు. A-3 మరణం అతన్ని కదల్చలేదు. అతడికి అప్పచెప్పిన పని మంత్రి మరణించేవరకూ సూపర్ వైజ్ చేయటం, అంతే! తన వంతు బాధ్యతగా వెనుకనుంచి వారిమీదకు కాల్పులు కొనసాగించాడు. అతడి మొదటి బుల్లెట్ వెళ్ళి 'రాడ్' కి కట్టిన తాడుకి తగిలింది. అది తెగి పొడవయిన దూలం అంత ఎత్తునుంచి నిలువునా స్టేజీ మధ్యకు జారింది.
విహారి ముందు చూసుకోలేదు. ఆకాశంలోంచి నక్షత్రం జారినట్టు పడుతున్న తెరని ఆఖరి నిముషంలో చూశాడు. అప్పటికే ఆలస్యమైంది.
అతడుగానీ తొయ్యకపోతే అది ఆమె తలమీదపడేదే! అసలు మొదటి బుల్లెట్ చెవి పక్కగా దూసుకుపోయినప్పుడు అతడికి ఏం జరిగిందో అర్ధంకాలేదు. ఆ తరువాత పిస్తోలు శబ్దం వినిపిస్తూంటే సునాదమాల చెయ్యి పట్టుకుని పరుగెత్తాడు. ఈ దూలంపడే సమయానికి వారిద్దరూ స్టేజీమధ్య వుండటం, దూలం ఆమెమీద పడకుండా ఆపబోయి, దాని బరువుకి ఆగలేక అతడూ జారి పడిపోవడం ఒకేసారి జరిగాయి.
వెల్లకిలా ఆమె, ఆమెమీద అతడు, అతడిమీద స్టేజి వెనుక వైపు కట్టిన తడిక, దానిమీద దూలం, పేకలో ముక్కలు పడ్డట్టు వరుసగా పడ్డాయి.
మొదట పిస్తోలు చప్పుడు, తరువాత A-3 పెట్టిన ఆర్తనాదం, ఆపైన స్టేజి కూలిపోవడం వరుసగా జరగటంతో ప్రేక్షకులు భయభ్రాంతులై గుమ్మంనుంచి ఒక్కసారిగా బయట పడటానికి ప్రయత్నించారు. అక్కడ కుమ్ములాట మొదలయింది.
మంత్రిగార్ని రక్షించే ప్రయత్నంలో పోలీసులు, వలయంలా ఏర్పడ్డారు. పట్టుచీర సగం జారుతూ వుండగా ప్రిన్సిపాల్ కుర్చీ వరుసల మధ్య కూలిపోయింది. జనం ఆవిడ పక్కనుంచి పరుగెడుతున్నారు. అంత హడావుడిలోనూ కర్తవ్యాన్ని మర్చిపోనిది డిప్యూటీ చీఫ్ ఒక్కరే. గాంగ్ లో కనీసం ఒక్కరినయినా పట్టుకుని అనంతానంతస్వామికి ఈ సంఘటనతో సంబంధం వుందని నిరూపించటానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు.
` విహారికి ఈ గొడవ ఏమీ పట్టలేదు. సునాదమాల మీద బోర్లాపడుకుని కబుర్లు చెప్పటానికి ప్రయత్నించాడు. ఆడియెన్స్ కి దూలపు తెర అడ్డుగా వుండటంతో స్టేజిమీద ఏం జరుగుతూ వుందో కనపడటంలేదు. దూలపు బరువు, తన బరువూ ఆమె మీద పడకుండా రెండు చేతులూ స్టేజిమీద బలంగా ఆన్చి, తీరిగ్గా అడిగాడు.
"ఏం చదువుతున్నానన్నారు మీరు?"
భూమి రెండుగా చీలి తను లోపలికి ఎందుకు పోలేదా అనిపిస్తూంది సునాదమాలకి. కేవలం జలుబు చేస్తేనే నానా హడావుడి చేసే మనిషికి ఎయిడ్స్ అని తెలిస్తే ఎలా వుంటుందో అలా వుంది. పరాయి మొగవాడు తాకితేనే సర్ఫుతో కడుక్కునే ఆ అమ్మాయికి ఈ స్థితి రావటంతో ఏ క్షణమయినా వూపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. అయినా పైన వున్నది మంత్రిగారూ, పైగా తనని రక్షిస్తూన్నవాడు అవటంతో అలాగే నోరు పెగల్చుకుని "బియస్సీ-ఎం.పి.సి." అంది.
"హారిజాంటల్ కీ, పెర్పెండిక్యులర్ కీ తేడా ఏమిటి?"
ఆమె చప్పున సమాధానం చెప్పలేకపోయింది.
ఆమె మాట్లాడక పోయేసరికి "చూడండి, పైన అంత బరువుండగా మీ మీద ఇంకా బోర్లా పడుకోవటం నాకేదో ఇష్టమైన చర్యగా భావించకండి. ఐ మీన్.... బరువు లేకపోతే ఇష్టమా అని మీకు సమాధానం రావొచ్చు. అసలే మీరు చాలా అనుమానం మనిషిలా వున్నారు. ఎవరన్నా వచ్చి లేపేవరకూ మనం ఇలా వుండక తప్పదు. నేనూ మీరూ పేరలల్! మనమీద ఈ దూలం పెర్పెండిక్యులరు. ఇక హారిజంటల్ అంటే నిలువునా మరో దూలం...."
` "నాకు తెలుసు" అంది వూపిరి బిగపట్టి. దూరంగా పిస్తోళ్ళు పేలుతున్నాయి. వున్నట్టుండి ఆమె కెవ్వున అరిచింది. దానికి కారణం అతడు లయబద్ధంగా ఊగడం ప్రారంభించాడు!!? ఆమె కెవ్వున అరిచింది-
"మాడమ్. మీరు మళ్ళీ నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. పైన దూలంమీద ఎవరో పరిగెడుతున్నారు. అంతే తప్ప నేను కాదు కారణం....."
మాట్లాడే స్టేజి దాటిపోయినట్టు ఆమె కళ్ళప్పగించి చూస్తోంది. అసలే పెద్దవయిన కళ్ళు మరింత పెద్దవిగా కనిపిస్తున్నాయి. అలా ఆమెని చూస్తూంటే అతడికి మరింత ఏడిపించాలనిపిస్తోంది.
"... అన్నట్టు మీకు 'నాతిచరామి' అంటే తెలుసా? చిటికెనవేలితో పట్టుకొని కాలితో కాలిని నొక్కిస్తారు పెళ్ళిలో! 'తల నుంచి కాలి వరకూ నీ దానిని' అని అర్ధం అన్నమాట. అటువంటిది ఇలా వేలు, కాలు కాకుండా, వేలినుంచి కాలివరకూ లంకెపడిందంటే ఇది వెయ్యి నాతిచరామిలకు సమానం."
ఎలాగో గొంతు పెగల్చుకుని "చూడండి. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వుండి మీరిలా మాట్లాడటం భావ్యం కాదు" అంది. అప్పుడు గుర్తొచ్చింది అతడికి తనెవరో చెప్పలేదని. "సారీ- నేను మంత్రిని కాను. నా పేరు నికుంజ్ విహారి. ఇంత బరువుని బాధ్యతగా మోస్తున్న నేను, 'ఆఖరి పోరాటం' అనే నాటకంలో మంత్రి పాత్ర ధరిస్తున్న వాడిని."
సునాదమాల మొహం సిగ్గుతో, రోషంతో ఎర్రబడింది. కోపంగా ఏదో అనబోతూ వుండగా ఎవరో 'అరెరె' అనటం వినిపించింది. మరొకరు దూలం పైకిలేపారు. విహారి కండరాలు పట్టేసిన చేతుల్ని సవరించుకుంటూ "మీరు నాకు థాంక్స్ చె..." అంటూ వుండగానే అతడి భుజం పక్కనుంచి మరో తుపాకిగుండు దూసుకుపోయింది. స్పర్శా సుఖాన్వేషితుడైన తను బయట ప్రపంచపు భీభత్సాన్ని తాత్కాలికంగా మర్చిపోయినట్టు గ్రహించి, చుట్టూ చూశాడు. సునాదమాల అక్కణ్నుంచి ఎపుడో పారిపోయింది.