చుట్టూ స్టేజి హడావుడిగా, గందరగోళంగా వుంది. దాదాపు అందరూ గుమ్మం దగ్గర తోసుకుంటున్నారు. మైకులో 'వెకేట్ ది స్టేజ్' అని ఎవరో సి.బి.ఐ. ఆఫీసరు అరుస్తున్నాడు. A-3 ని విలన్లు చంపినట్టు డిప్యూటీ చీఫ్ కి తెలిసిపోయింది. అతడిని చంపినవాడిని పట్టుకోకపోతే ఇక సి.బి.ఐ.కి ఇంత ప్రయత్నం చేసీ ఏ ఆధారమూ దొరకనట్టే.
విహారీ ఆలోచనలో వుండగానే కాల్పులు ఆగిపోయాయి. ఎప్పుడయితే జనం తగ్గిపోయి, తాము గుర్తించబడతామన్న అనుమానం కలిగిందో, రామ్ లాల్ అనుచరులకి సైగచేశాడు. కనుచూపు కదిలే సమయంలో అందరూ అదృశ్యమయ్యారు. ఇప్పుడు జనం గోల తప్ప మరేమీ లేదక్కడ. కానీ డిప్యూటీ కమీషనర్ కి తెలుసు - ప్రమాదం వచ్చినప్పుడు తమతో రాలేని పక్షిని వదిలి మిగతావి వెళ్ళిపోయినట్టు, తమ మనిషిని వదిలేసి వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళిపోయారని!
ఆ మనిషి గ్రీన్ రూమ్ లో వున్నాడని!!
..... హడావుడి చేస్తే అతడు లోపల్నుంచి కాల్పులు సాగించవచ్చు!!
ప్రభుత్వం సరఫరా చేసే ఆయుధాలకన్నా ఆధునాతమైన ఆయుధాలు వారి దగ్గర వుంటాయి. జాగ్రత్తగా హాండిల్ చేయాలి. లేకపోతే మరికొంత ప్రాణనష్టం తప్పదు.
* * *
తన తోటి నటులెవరూ కనపడలేదు విహారికి. స్టేజి అంతా అస్తవ్యస్తంగా వుంది. కాళ్ళకి అడ్డంగా వున్న సామానులు తోసుకుంటూ గ్రీన్ రూమ్ వైపు వెళ్ళాడు.
పులికన్నా ప్రమాదమయిన మనిషి లోపలున్నాడని తెలీదు.... అతడు లోపలికి నడవబోతూంటే మెడ దగ్గిర పిస్తోలు ఆన్చి "చేతులు పైకెత్తు" అన్నాడు A-2.
విహారి చప్పున వెనుదిరిగాడు. సాధారణంగా అలా జరగదెప్పుడూ! ఎంతటి వాడయినా భయపడతాడు. నిజానికి విహారి కూడ భయపడ్డాడు. కాని అతడి చెవులు విన్న మాటలకన్నా సబ్ కాన్షస్ రియాక్షన్ ఎక్కువ తొందరగా జరగటంతో అతడు వెనుదిరిగాడు. A-2 పిస్తోలు పేల్చాడు. మెడ చర్మాన్ని కాలుస్తూ అది పక్కగా దూసుకుపోయింది. కాల్చిన ఇనుపకడ్డీని మెడమీద పెట్టినట్టు అనిపించింది.
అంతలో మరోసారి పిస్టల్ శబ్దం వినిపించింది.
ప్రాణం పోయిందనుకున్నాడు విహారి.
అయితే ఈసారి వచ్చిన శబ్దం శత్రువు పిస్టల్ నుంచి కాదు.... గుమ్మం దగ్గిర నుంచి ఒకమ్మాయి పిస్టల్ తో నిలబడి వుంది అక్కడ.
తను బయటకు రాబోతూంటే "పరమేశ్వరాన్ని కవర్ చేయండి" అని హడావుడిగా వెళ్ళిపోయిన అమ్మాయి!! ఆమె పేల్చిన పిస్టల్ ఆగంతకుడి చేతికి తగలటం, అతడి చేతిలో ఆయుధం జారిపోవటం ఒకేసారి జరిగాయి. కానీ అతడు ప్రొఫెషనల్. క్షణంలో సర్దుకుని ఆమెవైపుకి దూకబోయాడు. ఆమె మరోసారి పిస్టల్ పేల్చింది. అయితే గుళ్ళు అయిపోయినట్టు అందులోంచి శబ్దం రాలేదు.
అప్పటివరకూ ప్రేక్షకుడిలా చూస్తున్న విహారి చప్పున తేరుకుని వెనుకనుంచి శత్రువుమీదకు లంఘించాడు. అతడికి కరాటే కాదు కదా, బాక్సింగ్ కూడా తెలీదు. మెడ దగ్గర మంట పెడుతున్న గాయంతో కసి రేగింది. అంతే! అతడి మనస్తత్వమే అటువంటిది. రెచ్చగొడితే శత్రువు ఎంత బలవంతుడు అన్న విషయం కూడా ఆలోచించడు. అదే అతడిని భవిష్యత్తులో చాలా కష్టాల్లో పడేసింది.
వెనుకనుంచి తనని పట్టుకున్న విహారిని ఒక్క విదిలింపుతో దూరం చేశాడు A-2. ప్రొద్దున్న లేస్తే ఇటువంటివి అతడికి సర్వసాధారణం! విహారి లాంటివాళ్ళు ఒక లెక్కకాదు. ఆ ఊపుకి విహారి క్రిందపడి, అదే ఊపులో పైకి లేచాడు. చిన్నప్పుడు ఆడిన ఫుట్ బాల్ ఆట గుర్తు వచ్చింది. ప్రత్యర్ధి మోకాలుని బంతిగా, ఎదురుగా తెరచి వున్న ద్వారాన్ని గోలుగా ఊహించుకుని లాగిపెట్టి కొట్టాడు. ఆ కిక్ అవతలి వ్యక్తికి కళ్ళు తిరిగేలా చేసింది. ఏ పోరాటానికయినా ఒక సైన్సు ఉంటుందిగానీ, ప్రాణాలకి తెగించి అదే ఆఖరి పోరాటం అనుకున్న దానికి సైన్స్ ఏముంటుంది?
క్రిందపడబోయిన A-2 అతికష్టం మీద నిలదొక్కుకున్నాడు. రెండు చేతుల్తో కుర్చీ ఎత్తి విహారి మొహంమీదకు విసిరేడు. అదిగానీ తగిలివుంటే విహారిని ఏ ప్లాస్టిక్ సర్జెనూ బాగు చేయలేకపోయేవాడే. కానీ దానికి అరక్షణం ముందే పిస్తోలు పేలింది. వీరి ఘర్షణని ఆధారంగా చేసుకుని ఆ మధ్య సమయంలో గుళ్ళు నింపుకున్న ఆమె ఆయుధాన్ని ఎంత గురిగా ఉపయోగించిందంటే, ఆ బుల్లెట్ కుర్చీకి తగిలి, అదే వూపులో అతడు వెనక్కి పడిపోయాడు. ఏ మాత్రం గాయం లేకుండా దొరికిపోయాడు. ఒక్కసారి అతడు పడిపోగానే మిగతా ఆఫీసర్లు బిలబిలమంటూ లోపలికి ప్రవేశించారు.
ఆమె విహారివైపు చెయ్యిసాచి "మీరు చేసిన సాయానికి చాలా థాంక్స్. మామూలు పౌరుల్లో మీలాంటి సివిక్ సెన్స్ వున్నవాళ్ళు అరుదు. బుల్లెట్స్ నింపుకోవటానికి నాకు కావలసిన టైమ్ ప్రాణాలకు తెగించి ఇచ్చారు. మీరు అడ్డుపడకపోయి వుంటే ఈ రోజు నా ప్రాణాలు పోయేవే" అంది.
విహారి ఆమెవైపు అప్రతిభుడై చూశాడు. ఆమె వయసు ఇరవై ఆరుకి కాస్త అటుఇటుగా వుండొచ్చు. ఆమె పిస్తోలు పట్టుకున్న తీరు ఆమెకున్న కమాండ్ ని తెలుపుతోంది. అయినా అతడు చూస్తున్నది ఆమె భంగిమని కాదు. ఆమె మొహాన్ని!! అందులో అదోలాంటి హుందాతనం వుంది. మామూలుగా చూసేవాళ్ళకి అందంమాత్రం కనిపిస్తుంది. లోతుగా చూడగలిగితే ఆ కళ్ళలో ఒక విధమైన పట్టుదల-కసి కనిపిస్తాయి. రాధ కృష్ణుడికి ఒక కోణంలో సత్యభామ గాను, మరో కోణంలో రుక్మిణీగాను కనపడి వుంటుంది. అందుకే ఆమె అంటే అంత ప్రేమ. ఈ పర్సనాలిటీ అనేది చాలామంది అమ్మాయిలకి వుండదు. అందుకే 'కార్యేషు..... దాసి' స్టేజ్ వరకే వచ్చి ఆగిపోతారు.
విహారికి కవిత్వం రాదు. వస్తే అనుకునే వాడు- ముద్దుపళని ఈమెని చూసే రాధికా స్వాంతనంలో, ".....మేను మేనానిన మేను సోకి దటంచు- గల్లపంబు లొల్లడో కలువ గంటి" అని వ్రాసి వుండవచ్చు. ఆమె చెలరేగిన విధానం గాని తిక్కన సోమయాజి కంటబడివుంటే తన నిర్వచనోత్తర రామాయణంలో "చెలగి, చెలగి, మలగి, మలగి, యల్ల యల్లన క్రాలి క్రాలి, బిట్టు తూలి తూలి...." అని వుంటాడు. ఆమె రివాల్వర్ పట్టుకున్న భంగిమే బాల గంగాధర తిలక్ చేత "నా బ్రతుకు కొసల నువ్వు, నీ బ్రతుకు మొదల నేను"అనిపించి వుంటుంది. ఆమె విగ్రహాన్ని చూస్తే యెల్లండ రఘుమారెడ్డి "నిమ్మ బెట్టుకు నిచ్చెనేస్తే- నిమ్మముల్లు రొమ్ము నాటెరోయ్ ఓ రందకాడ" అని వ్రాసి వుంటాడు.
విహారి అమ్మాయిల వెంట తిరిగే రకం కాదు. అలా అని పూర్తి ఇంట్రావర్ట్ కాదు. ఒకేరోజు కనబడిన ఇద్దరమ్మాయిలు ఒకరికన్నా ఒకరు వేర్వేరు కోణాల్లో అపురూప సౌందర్య భంగిమల్లో, అపురూప సంఘటనల్లో పరిచయమై ఆ యువకుడిని అల్లరిపెట్టారు.
"మీ పేరేమిటో తెలుసుకోవచ్చా?"
"నికుంజ్ విహారి".
"థాంక్స్. నా పేరు ప్రవల్లిక. డిప్యూటీ కమీషనర్ సి.బి.ఐ....."
3
"ఏమిటే ఈ అర్దరాత్రి పూట స్నానం" ధియేటర్ నుంచి రాగానే బాత్ రూమ్ లో చేరి, అరగంటయినా బయటకు రాని సునాదమాలతో బామ్మ బయట్నుంచి అరిచింది. ఇటుకపొడి, సీకాయ కలిపి రుద్దుతోంది మాల. చన్నీళ్ళు మీద పడుతున్నా మంట తగ్గలేదు మాలకి.
"మావాడూ నేనూ పందెం వేసుకున్నామండీ. మంత్రి వేషంలో మిమ్మల్ని ఫూల్ చేశాడు" వెళుతూంటే పద్మాకర్ అన్న మాటలు.. విహారి మీద పడుకోవటం కన్నా ఈ మాటలు ఎక్కువ అవమానకరంగా వున్నాయి. మరీ తనంత పిడత క్రింద పప్పులా కనపడుతూందా?
సునాదమాల అక్కని పక్కింటి స్టూడెంట్ మోసంచేసి వెళ్ళిపోయాడు. 'విష్ణు' ని కన్నాక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తండ్రికి గుర్రప్పందేల పిచ్చి వుంది. ఒకరోజు ఇంటి దస్తావేజులు తాకట్టుపెట్టి డబ్బు తీసుకెళ్ళబోయేడు. తల్లి వద్దని బ్రతిమాలింది. ఘర్షణలో తల్లి మరణించింది. తండ్రిని పోలీసులు తీసుకుపోయారు. ఆ తరువాతెప్పుడో అతడు జైలునుంచి విడుదలయి, ఇంటికి రాకుండా దేశాలు పట్టి పోయాడు. మాల, బామ్మ, విష్ణు మిగిలారు.
ఈ సంఘటనలన్నీ సునాదమాల మీద గొప్ప ప్రభావాన్ని చూపినాయి. భయం...... బెరుకు.... జంకు..... ఇవన్నీ పైకి కనిపించేవి. అంతర్గతంగా ఆమె హృదయం నిండా స్ట్రాంగ్ సెన్సాఫ్ లవ్ వుంది. గుండె గది ఇనప్పెట్టెలో ప్రేమ అనేది అపూర్వమైన ఆభరణం. అది అంత తొందరగా ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం మనసా, వాచా, కర్మేణా దగ్గిరవ్వాలి. ఇలాంటి భావాలు పునాదిగా సునాదమాల పెరిగింది. ఆ అమ్మాయికన్నా ఆమె బామ్మే నయం. "ఇంకా ఆ పాతకాలం బాడీ లేమిటే.... బ్రాలు వేసుకో- అందులోనూ న్యూలుక్ బావుంటుందట" అని బామ్మే సలహా ఇస్తూ వుంటుంది. చదివింది ఎనిమిదో క్లాసయినా పాతకాలం చదువు అవటంవల్ల ఇంగ్లీష్ లో కూడా బామ్మ పెరఫెక్షనిస్ట్. ఏ కంటిలాష్ కి ఏ చీర మ్యాచింగ్ అవుతుందో కూడా ఆవిడ సరిగ్గా చెప్పగలదు. ఆవిడకన్నా నలభై ఏళ్ళు చిన్నదయినా సునాదమాల దానికి పూర్తిగా వ్యతిరేకం. ఆ అమ్మాయికి ఎప్పుడు కల వచ్చినా ఓ తులసిచెట్టు, దానిచుట్టూ తను ప్రదక్షిణ చేయటమే కలగా వస్తుంది.
స్నానం చేస్తున్నంత సేపూ గంట క్రితం జరిగిన సంఘటనే గుర్తువచ్చి కళ్ళవెంట నీళ్ళు ధారాపాతంగా కారుతూనే వున్నాయి ఆమెకి. చాలాసేపు ఏడ్చి, స్నానం పూర్తిచేసి బయటకొచ్చింది.
చాలా కాంప్లెక్స్ మెంటాలిటీ సునామాలది. లేకపోతే ఆ రోజు డైరీలో ఆ రెండు వాక్యాలు ఏ సందర్భమూ లేకుండా వ్రాసుకోదు.
"I should like him not only for what he is
But also what I am in his presence :
Who is He?"
* * *
ఆగష్టు 13, క్వెజాన్ సిటీ, ఫిలిఫ్పైన్స్.
"తియెర్రా అదో రాద, వాజాదెవ్ - సోవ్ డె ఓరియంటే..." పిల్లలు జాతీయగీతం పాడుతున్నారు. త్రిభుజం మధ్యలో ఎనిమిది కిరణాల సూర్యుడు గల జాతీయ జెండా రెపరెపలాడుతూంది. అయిదుకోట్ల జనాభా గల దీవులు మొత్తం దాదాపు ఏడువేలు. ఒక పక్క చీనా సముద్రం. మరో ప్రక్క పసిఫిక్... ఒకప్పుడు ఈ దీవులన్నీ అగ్ని పర్వతాలు. అవి చల్లారినా అక్కడ అగ్ని చల్లారలేదు. బానిసత్వం- విప్లవం - ప్రజాస్వామ్యం - తిరుగుబాటు - మిలటరీ పాలన. చక్రం తిరుగుతూనే వుంది.
క్రీస్తుశకం 1500 నుంచి నాలుగువందల సంవత్సరాలు స్పెయిన్ దేశపు బందిఖానాలో, తరువాత అరవై సంవత్సరాలు అమెరికా అధికారంలో ఆపై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వశములో వుండి ఇన్నాళ్ళకి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకున్న దీవులు.... అయినా అగ్ని పర్వతంలాగే అవి అక్కడా పైకి మామూలుగా కనపడుతున్నాయి. లోపల ఉద్రిక్తంగా వుడికిపోతూ వుంటాయి.
ఈ దేశంలో చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటంతో అమెరికా అధికారంలో ఆపై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వశములో వుండి ఇన్నాళ్ళకి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకున్న దీవులు.... అయినా అగ్ని పర్వతంలాగే అవి అక్కడా పైకి మామూలుగా కనపడుతున్నాయి. లోపల ఉద్రిక్తంగా వుడికిపోతూ వుంటాయి.
ఈ దేశంలో చైనాతో దౌత్య సంబంధాలు పెట్టుకోవటంతో అమెరికాకు కాస్త దూరమైంది. అయినా ఈ దీవుల రక్షణ భారం అంతా అమెరికాయే కాస్త దూరమైంది. అయినా ఈ దీవుల రక్షణ భారం అంతా అమెరికాయే చూస్తుంది. చైనా పక్కగా వున్న ఈ దీవులమీద అమెరికా ఆధిపత్యం మరొక అగ్ర రాజ్యానికి నచ్చలేదు.
ప్రధాని సైనిక వందనం స్వీకరిస్తున్నాడు. సైన్యాధ్యక్షుడు రామోన్ హర్సాసే ప్రధానివైపు చూశాడు.
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంకో ఆరు నెలలకి ఆ స్థానంలో తను నిలబడి సైనిక వందనం స్వీకరిస్తాడు.