Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 3


    "ఎందుకట?"

    "మీకన్నా, పోలీసులకన్నా నా భార్యల బాధే ఎక్కువ. వారితో మీరు పోటీ పడలేరు".

    వర్ధనమ్మ నవ్వుకుని వాడికి డబ్బు ఇచ్చి పంపించి వేసింది.

    "నువ్విచ్చిన అలుసేనమ్మా ఇది. ఉద్యోగంలోంచి తీసెయ్యక, పైగా యింకా డబ్బులిస్తావా?"

    "పోనీలేరా. కావలసినంత డబ్బే తీసుకున్నాడు. ఆ భయంలో బంగారు పాము అడిగినా ఇచ్చి ఉండేదానిని. అందులోనయినా వాడి నిజాయితీ కనబడుతూంది కదా" నవ్వేసింది ఆవిడ.

    .................

    "ఇంకా మంత్రిగారు రాలేదుట్రా" పద్మాకర్ మాటలకి ఆలోచనల్నుంచి తేరుకుని చూశాడు విహారి.

    "హాలు నిండిపోయింది. జనంలో విసుగు కూడా ఎక్కువైనట్టు ఈలలు, చప్పట్లు వినిపిస్తున్నాయి చూశావా-"

    "ఏం చేద్దాం?"

    "అదే ఆలోచిస్తున్నాను."

    పద్మాకర్ విసుగ్గా గ్రీన్ రూమ్ లోకి వెళ్ళాడు. విహారి తెరకాస్త పక్కకు తప్పించి ఆడిటోరియంలోకి చూశాడు. కిటకిటలాడుతున్నారు జనం. నిజమైన ఆర్టిస్టులకి అంతకన్నా సంతోషం ఏముంటుంది.

    అతడు వాచీ చూసుకున్నాడు. ఏడున్నరయింది. మంత్రిగారి కోసం ఇంకా ఎంతసేపు వేచిచూడాలో తెలీదు.

    అలా అతడు బయటకు చూస్తున్న సమయాన- గుమ్మం దగ్గర నిలబడిన అమ్మాయి మీద అతనిదృష్టి పడింది. ముందు ఆ సునాదమాలణి చూసి, రవీంద్ర కళాక్షేత్ర గుమ్మం దగ్గిర నిలబెట్టబడిన ప్రతిమ అనుకున్నాడు. పూలగుచ్చం భయం భయంగా పట్టుకుని నేలకి కాళ్ళు అంటుకుపోయినట్టు నిలబడివుంది ఆమె. కానీ అంతలోనే ఆ ప్రతిమ కదలటం చూసి- తన భ్రమకి నవ్వు రాకపోగా, అంత అందమయిన అమ్మాయిలుంటారా అని అతడికి ఆశ్చర్యం వేసింది. ఆమె వెన్ను గాండీవాన్ని, వక్షం కురుక్షేత్రాన్నీ, కనుబొమ్మ విల్లునీ, కంఠం పాంచజన్యాన్నీ, కళ్ళు రథచక్రాల్ని గుర్తుతెచ్చాయి. వంట్లో యుద్ధం ప్రారంభమయింది. స్త్రీల కళాశాల వారు ఈ నాటిక ఏర్పాటు చేశారని తెలుసు కానీ, ఆ కళాశాలలో ఇంత అందమైన అమ్మాయిలుంటారని తెలీదు.

    నికుంజ విహారి ఆ అమ్మాయికేసి చూస్తూ అలా ఎంతసేపు వున్నాడో తెలీదు. "ఏం చేద్దాం గురూ!" అని వెనుకనుంచి అంటున్న పద్మాకర్ దృష్టి కూడా ఆ అమ్మాయిమీద పడింది. "మైగాడ్" అన్నాడు ఆమె అందానికి విస్తుబోయి. "-ఏం గురూ! లవ్ ఎట్ ఫస్టు సైటా?"

    "నీ మొహం. నాకిటువంటి ఫస్టు సైట్ లమీద నమ్మకం లేదుగానీ, అమ్మాయి చాలా అందంగా వుంది కదూ-"

    "ఆ విషయం ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టినా ప్రతిపక్షం కూడా వప్పుకుంటుంది."

    "కానీ సాధారణంగా ఇంత అందమైన అమ్మాయిల మెదళ్ళలో అమూల మిల్క్ పౌడర్ తప్ప మరేమీ వుండదు.

    "నేనొప్పుకోను. అందమైన వాళ్ళలో తెలివితేటలున్నవాళ్ళు కూడా వుంటారు."

    "పందెం కాస్తావా?"

    "పందెం... నువ్వోడిపోతే ఆ అమ్మాయితో 'ఐ లవ్యూ' అనిపించుకోవాలి."

    "నిజంగా అంత అందమైన అమ్మాయికి అందంతోపాటు తెలివి కూడా వుండి, నేనీ పందెం ఓడిపోతే 'ఐ లవ్యూ' అనిపించుకోవటం ఏమిటి ఖర్మ- పెళ్ళే చేసుకుంటాను. పందెం".

    "పందెం ఓడిపోతే చాలా చిక్కుల్లో పడతావ్ గురూ!"

    "ఓడిపోను. ఆ టోపీ ఇలా ఇవ్వు".

    పద్మాకర్ తెల్లబోయి "ఎందుకు?" అన్నాడు.

    "ఆ మంత్రిగారు రావటానికి ఇంక ఎంతసేపు పడుతుందో ఏమిటో! నేనే టోపీ పెట్టుకుని ఆ ముఖద్వారంనుంచి లోపలికి వచ్చేస్తాను. మీరీలోపల నిజంగానే మంత్రిగారు వచ్చారన్న ఉద్దేశ్యంతో తీసినట్టు తెర తీయండి, నాటకం ప్రారంభిద్దాం. తెర లేచాక ఈ పట్టుచీరె ప్రిన్సిపాల్ మాత్రం ఏం చేస్తుంది?" సునాదమాల చేతిలో పుష్పగుచ్చం కేసి చూస్తూ అన్నాడు విహారి.

    ఆ గుచ్చాన్ని ఆ అమ్మాయి మంత్రిగారి కోసమే పట్టుకొని వున్నదని అతడికి తెలుసు.


                                                              *    *    *


    ఆ రోజు రవీంద్ర కళాక్షేత్రంలో మినిష్టర్ సూర్యారావుని హత్యచేసే ప్లానూ, దాన్ని ఎలా అమలు జరపాలో అన్న వ్యూహం రచించింది లాయర్ పరమేశ్వరం.

    అనంతానంతస్వామికి పరమేశ్వరం మెదడు లాంటివాడు.

    ప్రధానమంత్రిని నలుగురి మధ్యా చంపిన హంతకుడిని కూడా కోర్టులో వాదించి బయటకు తీసుకురాగల సమర్ధుడు. అంత తెలివైనవాడు మంచికి అవతలివైపు వుండటం దేశం చేసుకున్న దురదృష్టం. అతడు ప్రధానమంత్రిని కూడా ప్రశ్నించగల లాయరు. తన తెలివితేటల్తో సుప్రీంకోర్టుల జడ్జీలని తికమక పెట్టగల సమర్ధుడు.

    సి.బి.ఐ. డిప్యూటీ కమీషనర్ దృష్టి లాయరు పరమేశ్వరం మీద కూడా వుంది. అనంతానంతస్వామి 'తన విజయమంతా నాలుగు స్తంభాలమీద వుంది' అని అంతరంగికులతో అంటూ వుంటాడు. అందులో ఒక స్తంభం లాయర్ పరమేశ్వరం (తెలివి). మరొక స్తంభం రామ్ లాల్ (బలం). మూడో స్తంభం ఒక రాజకీయ నాయకుడు (అధికారం). నాలుగో స్తంభం ఏమిటో ఎవరో, డిప్యూటీ కమీషనర్ ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. అనంతానంతస్వామి నవ్వులాటకు ఈ ఉదాహరణ ఇచ్చినా, ఆ మాటల్లో నిజం వుందని డి.సి...... సి.బి.ఐ. కి తెలుసు. పరమేశ్వరానికి అమెరికన్ గూఢచారి సంస్థ సి.ఐ.ఎ., రష్యన్ గూఢచారి సంస్థ కె.జి.బి. లతో కూడా సమానమయిన సంబంధాలున్నాయని వినికిడి. అతడి తెలివితేటలు అపురూపం. అనిర్వచనీయం. అతడికి యాభై ఏళ్ళు వుండవచ్చు. భారతంలో శకుని, ద్రోణుడు మొదలయిన వారి అంశతో, ఆ తెలివితేటల్తో పుట్టాడు. ఆ లాయరు పథకం సరిగ్గా సాగితే మరో నాల్గయిదు సంవత్సరాల్లో అనంతానంతస్వామిని భారతదేశానికి నియంతని చేయబోతున్నాడు అతడు. దాదాపు పది సంవత్సరాల కృషి వుంది దీని వెనుక. ఈ రోజు జరగబోతూన్న హత్యాప్రయత్నం దానికి మెట్టు. అటువంటి లాయరు పరమేశ్వరం ఎక్కిన కారు అప్పుడే రవీంద్ర కళాక్షేత్రంలో ప్రవేశిస్తూంది. అతడు తలెత్తి పైగుడ్డని చూసి నవ్వుకున్నాడు.

                                         "ఆఖరి పోరాటం"

    ఇంకో అరగంటలో ఇక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తుంది. రేపు పేపర్లో పెద్ద అక్షరాల్తో ఈ వార్త ప్రముఖంగా ప్రచురింపబడుతుంది. పోలీసుల అసమర్ధత గురించి వీలైతే మెజిస్టీరియల్ ఎంక్వయిరీ, తరువాత అన్ని వార్తల్లాగే ఇదీ చప్పబడిపోతుంది. స్వామి స్విస్ అకౌంట్ లో కోటి రూపాయలు క్రెడిట్.

    ఆఖరి పోరాటం!

    డబ్బున్న వాడిని డబ్బులేని వాళ్ళు అందరూ కలిసి ఎదుర్కోవటం. ఏ రంగస్థలం మీద చూసినా, ఏ నాటకం చూసినా ఇదే థీమ్. చివరికి విప్లవకారుడయిన హీరోనో, రేప్ చేయబడిన హీరోయినో స్టేజిమీద ఉపన్యాసం యిస్తూ మరణించటంతో సమాప్తం. మరుసటిరోజు అదే స్టేజిమీద మరో ఆఖరి పోరాటం! అదే ఆఖరు అనుకుంటూ ఎన్నో- ఎన్నెన్నో పోరాటాలు.

    పరమేశ్వరం గుడ్డని చూస్తూ లోపలికి ప్రవేశించాడు. లోపల ఎన్నో ఆలోచనలు..... రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రభావం చాలా లోతుగా పాతుకుపోయి వుంది. మరో పది సంవత్సరాల వరకూ దాన్ని తొలగించటం కష్టం. ఆ స్థానాన్నించి ఆయన్ని ఎవరూ కదపలేరన్నది నిర్వివాదాంశం. ఆ పరిస్థితుల్లో స్వామి దగ్గరకి ఒక ఆఫర్ వచ్చింది.

    ముఖ్యమంత్రిని గద్దె దింపితే కోటి రూపాయలు!!! చాలా రహస్యంగా సంప్రదింపులు జరిగాయి.

    ఇచ్చేవారి పేరు గోప్యంగా వుంచబడింది.

    స్వామిలో గొప్పతనం అదే! ఎవరికి ఎంతవరకూ తెలియజెయ్యాలో అంతవరకే చెప్తాడు. ఈ వ్యవహారంలో మొదటిమెట్టు సూర్యారావు అనే మంత్రిని చంపటం. దీనికీ ముఖ్యమంత్రి పదవి దిగటానికీ సంబంధం ఏమిటో స్వామికీ, పరమేశ్వరానికీ మాత్రమే తెలుసు.

    మినిష్టర్ సూర్యారావుని చంపే ప్రయత్నం చేసే బాధ్యత రామ్ లాల్ ది.

    ఆ సమయంలో అక్కడే దూరంగా వుండి, ఏదైనా గొడవ జరిగితే కోర్టునుంచి తమ వాళ్ళని బయటకు తీసుకొచ్చే బాధ్యత పరమేశ్వరంది.

    ఇలా ఎవరి బాధ్యతలు వారికి అప్పజెప్పాడు స్వామి.

    ఇక్కడ రామ్ లాల్ గురించి కొంచెం చెప్పాలి. ఒక పరుగు పందెం క్రీడాకారుడు- రోజూ పరుగుని ఎలా ప్రాక్టీసు చేస్తాడో, ఒక డాన్సరు రోజూ నాట్యాన్ని ఎలా ప్రాక్టీసు చేస్తుందో- అతడు క్రైమ్ ని అలా ప్రాక్టీసు చేస్తాడు డబ్బుకోసం కాదు. ఆ ప్రాక్టీసు లేకపోతే తోచదు. ఒకరోజు ఎవరూ దొరక్కపోతే పనివాడిని పిలిచి బల్లమీద చేతులు పెట్టమంటాడు.

    "పాసేజ్ సినిమా చూశావా?"

    వాడు వణుకుతూ "లేదు బాబూ" అంటాడు.

    "నేను నిన్నే చూశాను" అంటూ రెండు లేడీ ఫింగర్స్ (బెండకాయలు) వాడి ఫింగర్సు పక్కనే పెట్టి కత్తి తీసుకుంటాడు. "....చెప్పు బెండకాయలు తెగ్గోస్తానా? నీ వేళ్ళు తెగ్గోస్తానా? అందులో విలన్ ఇలాగే అడుగుతాడు."

    వాడు దాదాపు ఏడుస్తాడు. జవాబు చెప్పాలి. లేకపోతే పీకే తెగుతుంది. "నా వేళ్ళు తెగ్గోస్తారు బాబూ-"

    బెండకాయలు తెగుతాయి. "నీకు నిజం చెప్పటం కూడా చేత కాదురా. పోనీ అని వదిలేశా. ఈసారి నిజం చెప్పకపోతే నిజంగా వేళ్ళు తెగ్గోస్తాను చెప్పు. ఈసారి దేన్ని తెగ్గోస్తాను."

    "బెండకాయల్ని బాబూ."

    ఛాప్.......ఛాప్.....ఛాప్.... వేళ్ళు ముక్కలు ముక్కలుగా తెగుతాయి వాడి ఆక్రోశాల మధ్య. "అబద్ధం చెప్పావు. అందుకే వేళ్ళు తెగాయి. నా తప్పుకాదురా" అని నవ్వుతూ పోతాడు. అట్లాంటి క్రిమినల్ రామ్ లాల్! రాత్రికి రాత్రి ఒక ఊరుని ఖాళీ చేయించగలడు. 'జాతీయ కార్మిక సంఘా'ల్లో నాలుగు ఇతడి ఆధ్వర్యంలో వున్నాయి. పదిమంది అనుచరుల్ని వెంటేసుకుని అతడేదైనా నియోజకవర్గానికి వెళ్ళితే అక్కడ అతడు కోరుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అవవలసిందే! అతడేదైనా సమ్మె తలపెడితే, మళ్ళీ "దయ" తో అతడు ఒప్పుకునే వరకూ ఆ రాష్ట్రం పారలైజ్ అవ్వవలసిందే. అతడు స్వయంగా హత్యలు చేసే స్టేజి దాటిపోయి చాలా రోజులైంది. పాత కేసులు చూసుకోవటానికి పరమేశ్వరం ఎలాగూ వున్నాడు.

    అన్నీ కలిసి ఒక్కమాటలో చెప్పాలంటే-

    భారత సైన్యం దగ్గర వున్న ఆయుధాలకన్నా అధునాతనమైనవి అనంతానంతస్వామి దగ్గిర వున్నాయి. వాటి రక్షణ, వాటిని ఉపయోగించేదీ - రామ్ లాల్! ఆ వింగ్ కమాండర్!!

    మినిష్టర్ సూర్యారావుని చంపటం రామ్ లాల్ కి పెద్ద సమస్య కాదు. తన నలుగురు అనుచరుల్నీ నాలుగు స్థానాల్లో వుంచాడు. మినిష్టర్ సూర్యారావు మీద A-1 ఆయుధం పేలుస్తాడు. ధియేటర్ లో అతడి చుట్టూ నాలుగు వరుసల్లో వాళ్ళ అనుచరులే వుంటారు. ఆయుధం పేలగానే వాళ్ళు A-3 ని కవర్ చేసేస్తారు. ఆ అయోమయం నుంచి పోలీసులు, ప్రజలు తేరుకొనే లోపులో హంతకుడు బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ A-3 పేల్చిన దానివల్ల సూర్యారావు మరణించకపోతే వెంటనే వరుసగా A-1, A-4 లు పేలుస్తారు.

    A-2 మాత్రం వీళ్ళతో కలవకుండా విడిగా వుంటాడు.

 Previous Page Next Page