Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 3


    నవ్వులు.

    "గుడ్ నైట్"

    ........... !

    చంద్రాన్ని ఇంటిదగ్గర దిగబెట్టాడు.

    "ఐయామ్ సారీ" లోపలికి వెళ్ళబోతూ చంద్రం అన్నాడు.

    "ఎందుకు?"

    "వాళ్ళ మాటలు నిన్ను హర్ట్ చేస్తే."

    "లేదు లేదు" అన్నాడు మిత్ర. "నిజానికి మీలా హుషారుగా వుండాలని నాకూ వుంటుంది. కానీ ఎందుకో కలవలేను. అది నా బలహీనత. గుడ్ నైట్ బ్రదర్".

    అతనింటికి చేరుకునేసరికి ఒంటిగంట అవుతూంది. ఎంత రాత్రయినా పడుకోబోయేముందు స్నానం చెయ్యటం అలవాటు. హరిదా హీటరు వేసే వుంచాడు.

    స్నానం చేసి ఫ్లాస్క్ లో నుంచి కాఫీ వంపుకుని తాగి, కప్పు పెట్టేసి- గది మధ్యలో చాలాసేపు నిలబడిపోయాడు. అయిదు నిముషాల తరువాత ఆ గదిలో విషాదం, ఆర్తి మిళితమైన దర్బార్ రాగం గంభీరంగా వినిపించసాగింది.


                        *    *    *


    "అబు యూసఫ్ యాకుబ్ బిన్ ఇషాక్ ఆల్ కిండీ ఏమన్నాడు? ఆధ్యాత్మికమైన బుద్ధి నాలుగు రూపాల్లో మనిషికి స్వర్గాన్ని చూపిస్తుందన్నాడు. ఈ ఆరెస్బా ఆ స్వర్గాన్ని 'డబ్బు- తిండి- మందు- ఆడదిలు'గా భావిస్తున్నాడు. మహమ్మద్ బీన్ మహమ్మద్ అబన్ హమీన్ ఆల్ ఘజలీ ఏమన్నాడు-" ఆరెస్బా మందుకొడితే మనిషి కాదు. ఇక ఆ టేప్ రికార్డర్ ఆగదని, శంభు లేచాడు.

    "వెళ్ళిపోతున్నావా మిత్రమా?" వెనుకనుంచి ఆరెస్బా అడుగుతున్నాడు.

    మిత్ర బయటకొస్తూంటే చంద్రం లోపలికి వస్తున్నాడు.

    శంభుని చూసి "అరె - ప్రొద్దున్నించి నేను నీ కోసం వెతుకుతున్నాను" అన్నాడు.

    "ఎందుకు?"

    "మరి" తటపటాయించేడు.

    "చెప్పు- ఆగేవేం"

    "నువ్వు- ఏమీ అనుకోకపోతే.... నీ రూం ఒకసారి కావాలి. ఒక్క.... సాయంత్రమే" అని, అది చెప్పేశాక పెద్ద బరువు దిగిపోయినట్టూ తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు.

    మిత్ర ఇరుకున పడ్డాడు. చంద్రంకి కూడా అదే అవసరం వస్తుందనుకోలేదు.

    నిజానికి తన ఇల్లు అలా ఇవ్వటం అతనికి ఇష్టంలేదు. అందుకే ఆరెస్బా అడిగితే కాదన్నాడు. కానీ యిప్పుడు అడుగుతున్నది చంద్రం. ప్రాణస్నేహితుడు. ఎలా కాదనగలడు? మరి ప్రిన్స్ పుల్స్?

    తల అడ్డంగా వూపి "సారీ" అన్నాడు.

    చంద్రం మొహం వాడిపోయింది. "సర్లే" అన్నాడు- "ఇస్తావని నేనూ అనుకోలేదు. కానీ నేను అడిగింది ఆరెస్బాలా కాదు. ప్రేమించిన అమ్మాయితో-"

    "వద్దు ప్లీజ్" వెళ్ళిపోతూ శంభూ అన్నాడు- "తరువాతెప్పుడైనా చూద్దాంలే-"

    ఇంటికొచ్చేసరికి ఎనిమిదిన్నర.

    లోపలికి వస్తూంటే హరిదా హడావుడిగా వస్తూ "మీ గురించి ఎవరో వచ్చారు బాబూ" అన్నాడు. మసక చీకట్లో సరిగ్గా కనపడలేదు గానీ లేకపోతే ఆ వంటవాడి మొహంలో కెలీడియోస్కోప్ లో వెలువడ్తూన్న భావాన్ని అతడు గమనించగలిగి వుండేవాడు.

    అతడు తలూపుతూ మెట్లెక్కాడు. కర్టెన్ ప్రక్కకి తొలగిస్తూ లోపలికి చూసి నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయేడు.

    లోపల డ్రాయింగ్ రూమ్ లో రేడియోగ్రాం ప్రక్క గోద్రేజ్ చెయిర్ లో ఒక అమ్మాయి, ఓణీ పరికిణి వేసుకొన్నది- కూర్చొని, అతని పుస్తకాల్ని కెలుకుతున్నది.


                                                                         2


    "అమ్మాయీ అబ్బాయీ కలుసుకొన్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? మొదటిసారి ఏం మాట్లాడుకుంటారు?" చంద్రం అడిగేడు.

    "స్వీట్స్ నథింగ్స్."

    "టెర్మినాలజీ కాదు నేనడుగుతున్నది. గంటల తరబడి మాట్లాడేసుకొంటారే అదేమిటని? నా ఉద్దేశ్యం టాపిక్."

    చంద్రం అడుగుతున్నది అక్కడెవరూ పట్టించుకోవటం లేదు. ఒకరు సోడా కార్కు తీయటంలోనూ, ఇంకొకరు చిప్స్ పాకెట్ విప్పటంలోనూ నిమగ్నమై వున్నారు.

    తన ప్రశ్న వాళ్ళలో ఏ కదలికా కల్గించలేదని చంద్రం గ్రహించి, వాళ్ళని ఇంప్రెస్ చేయటానికి- "ఈ అనుమానం వచ్చింది నాకు కాదు. మన శంభుకి అన్నాడు.

    అందరి మత్తూ చప్పున దిగిపోయింది.

    "ఉన్న ఒక మంచివాడూ మనలో కలిసిపోతున్నాడన్న మాట" అన్నాడు కార్కు తీస్తున్నవాడు.

    "సానుభూతిగా మరో పెగ్గు పొయ్యి గురూ" అన్నాడు చిప్స్ పాకెట్ విప్పినవాడు.

    "ఇరవై నాలుగేళ్ళ వయసులో ఆ అనుమానం రావటం తప్పుకాదు అన్నాడు చంద్రం.

    "ఆ వయస్సులో రావల్సినవి అనుమానాలు కావు నాయనా! కావల్సిన అనుభవాలు" అన్నాడు సీలు విప్పేసిన జ్ఞానానందస్వామి "ఇంతకీ ఆరెస్బా ఏడి-?"

    "ఎనిమిదింటికి ఎవరితోనో అప్పాయింట్ మెంటుందని వెళ్లిపోయాడు."

    "ఎవరితో-"


                         *    *    *


    "మంగతాయారు అన్న పేరంటే నాకెంతో ఇష్టం. అసలు 'మ' అనే అక్షరంలోనే శుభమున్నదని వాల్మీకి అన్నాడు. రా....మ అంటే అన్ని పాపాలూ పోతాయట. నేనెప్పుడు మీ పేరే తలుస్తూ వుంటాను కాబట్టి ఇక నా దగ్గరికి పాపం అన్నదే చేరనే లేదన్నమాట. మీరన్నారు.... పెళ్ళి కాకుండా ముద్దు పెట్టుకోవటం పాపం అని. ఒప్పుకొంటాను- కానీ ఆ పాపం పోయే మార్గం కనుక్కున్న ఈ శుభసందర్భంలో ఒక్కసారి-" అంటూ అదే స్పీడ్ తో ముందుకు వంగేడు ఆరెస్బా.   

    "వద్దు" అంది మంగతాయారు భయంగా. రూంలో మసక చీకటి పేరుకుని వుంది. కిటికీ అద్దాలకి మసిపట్టి వుంది. గోడలకి బూజు వేలాడుతోంది.

    "ఎందుకొద్దు?"

    "నాకు భయం."

    "కార్ల్ రోజర్స్ అనే సైకియాట్రిస్ట్ ఏమన్నాడు? భయాన్ని ఎదుర్కొనే వరకూ దాంతో పోరాడాలన్నాడు. ఓ.కే. దాన్నొదిలెయ్యండి. మీ ఇంట్రస్టింగ్ గేమ్ ఏమిటి-"

    "మా తమ్ముడు క్రికెట్ ఆడతాడు."   

    "క్రికెట్?" అన్నాడు ఆరెస్బా. తన చేతిని ముందుకు జరిపి "ఇదిగో ఈ ఉంగరం ఎవరిదో తెలుసా" అడిగేడు. తల అడ్డంగా వూపింది.

    "సునీల్ గవాస్కర్ ది. యూ నో.... ఒకసారి ఇద్దరం కూపేలో ప్రయాణం చేస్తున్నాం. 'మీరు టెస్ట్ క్రికెట్ ఆడటం గొప్పకాదు. నాతో బుక్ క్రికెట్ ఆడండి చూద్దాం' అన్నాను. ఆడేడు- వోడిపోయాడు. ఉంగరం, అఫ్ కోర్స్ రోల్డుగోల్డె, ఇచ్చేసేడు."

    మంగతాయారు ఆడ్మైరింగ్ లా చూచింది.

    "తీసుకోండి- మీ తమ్ముడికి నే నిచ్చేనని చెప్పి ఇవ్వండి" అంటూ ఉంగరం తీసి ఇచ్చేడు.

    "నిజంగానా?"

    "నిజంగానా?"

    ఆ అమ్మాయి కళ్ళు ఆనందంతో వెలిగాయి. ఇది ఇస్తున్నప్పుడు తమ్ముడి మొహం ఎలా వుంటుందో వూహించుకొంటేనే భలే థ్రిల్. అందులో ఇంకెవరిదో కాదు - సునీల్ గవాస్కర్ ది.

    "అన్నట్టు బుక్ క్రికెట్ అంటే ఏమిటి-"

    "అదో గేమ్. ఆట ఆడాలంటే పుస్తకం ఒకటి వుండాలి"

    "ఉందా?"

    "ఉహు లేదు. కానీ నాకింకో గేమ్ తెలుసు. భలే ఇంట్రస్టుగా వుంటుంది. దానికి బుక్కూ గిక్కూ అక్కర్లేదు."

    "ఏమిటది-"   

    "టైమ్ సెన్సింగ్ గేమ్!"

    ఆమెకు అర్ధం కాలేదు. 'అంటే' ? అంది.

    "అంటే టైముని గుర్తుపట్టటం, కళ్ళు మూసుకొని సరీగ్గా టైమ్ చెప్పగలగటం. ఉదాహరణకి ఇప్పుడు టైమ్ ఎనిమిదింపావు అయింది. సెకన్ల ముల్లు పన్నెండు మీదుంది. అవునా. ఇప్పుడు కళ్ళు మూసుకొని సరీగ్గా నిముషానికి కళ్ళు తెరిచి "నిముషమైంది" అని చెప్పాలి. అలా చెప్పేసరికి మళ్ళీ సెకన్ల ముల్లు పన్నెండు మీదుండాలి అన్నమాట. రెండు సెకన్లు అటూ ఇటూ అయినా ఫర్లేదు. అంతకన్నా ఎక్కువ తేడా వస్తే మాత్రం వోడిపోయినట్టు అన్నమాట. అదీ ఆట."

    ఆ అమ్మాయి హుషారుగా ముందుకు వంగి, "వో! నేను చెప్పగలను అంది.

    "ఏదీ చెప్పు" అని వాచీ పట్టుకొని, సెకన్ల ముల్లు పన్నెండు మీదకు రాగానే "స్టార్ట్" అన్నాడు.

    మంగతాయారు కళ్ళు మూసుకుంది.

    "ఒకటి .... ఐదు.... ఇరవై.... నలభై.... అరవై"

    కళ్ళు తెరిచి "సరిపోయిందా" అని అడిగింది. ఆ అమ్మాయి కళ్ళల్లో థ్రిల్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

    ఆరెస్బా వాచీ చూపించి, ఓడిపోయినట్టూ "సరీగ్గా సరిపోయింది అన్నాడు. ఆ అమ్మాయి గర్వంగా చూసింది. "ఈసారి మీరు" అంది.

    ఆరెస్బా తల అడ్డంగా వూపుతూ ".... ఉహు అసలు గేమ్ ఇదికాదు" అన్నాడు.

    "మరేది?"

    "ముందీ ప్రశ్నకు సమాధానం చెప్పు, ముద్దు పెట్టుకొంటూంటే కళ్ళెందుకు మూసుకొంటామూ?"

    "నాకు తెలీదు బాబూ"

    "నే చెప్తా విను.... ఏకాగ్రతంతా పెదవుల్లోకి తెచ్చుకోవాలని." ఆరెస్బా ఏకవచంలోకి ఎప్పుడు దిగుతాడో ఎవరికీ తెలీదు.

    "అయితే?"

    "ఈ టైమ్ ని గుర్తించటం అనేది ఏకాగ్రత వేరేచోట వున్నప్పుడు చేయగలగాలి అదీ గేమ్ - అర్ధమైందా?"

 Previous Page Next Page