Previous Page Next Page 
అశ్వభారతం పేజి 4


    అటూ ఇటూ ఓసారి చూసి అక్కడే ఆపి ఉన్న తన కారెక్కాడు. అంతే మరునిముషంలో కారు వేగాన్నందుకుంది.

    అతని పేరు సుదర్శన్.

    తేజ తనను ఎప్పుడైనా ఎక్కడైనా గుర్తు పట్టగలడు. అతన్ని చంపేస్తే బావుండేదేమో.... అనుకున్నాడు సుదర్శన్ మనస్సులో.

    కాని__అదే సమయంలో, అక్కడ తేజ బాధతో లేచేందుకు ప్రయత్నిస్తుండగా అసలు వ్యక్తి ఎంటర్ అయ్యాడు.

    ఇక్కడ తేజ శ్వాస ఆగిన గంటకు హైదరాబాద్ గాంధీ హాస్పిటలో ఓ యుఅతి ఆవేశంగా, కసితో, పగతో, ఓ శ్వాస బలంగా తీసుకొంది.

    "ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు దివ్యతేజ దారుణ హత్య...."

    హోటల్ గదిలో కాపీ తాగుతూ యధాలాపంగా పేపర్ వేపు చూసిన సుదర్శన్ ఆ వార్తకు ముందు ఆశ్చర్యపోయాడు, ఆ తరువాత సంతోష పడ్డాడు, కొద్దిగా ఫీల్ అయ్యాడు కూడా.

    తన ప్రొఫెషనల్ లో సాధ్యమైనంత వరకు ఎవర్ని చంపకూడదనే ఒక నియమం పెట్టుకున్నందువల్లే ఆ ఫీలింగ్.

    కాఫీ కప్పు గబుక్కున పక్కన పెట్టేసి రెండు నిముషాలు సేపు ఏదో ఆలోచించాడు. ఎవరికో ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరకు వెళ్తుండగా ఫోన్ రింగయ్యింది.

    గబుక్కున రిసీవర్ తీసాడు.

    "పేపర్ చూసావా....? అవతల వ్యక్తి గొంతెవరిదో సుదర్శన్ కు తెలుసు.

    "ఎస్....సర్ ....ఇప్పుడే...."

    "ఎప్పుడు టైమ్ ఎంత__?"

    "ఉదయం 8 గంటలు...."

    "ప్రొఫెషన్ కిల్లర్స్ ఎప్పుడూ అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా వెదవపని చేసిన మరుసటిరోజు పేపర్స్ చూడాలి. అప్పటికి పోలీసులకు ఏవైనా ఆధారాలు దొరికింది లేంది, ఎలా ప్రొసీడ్ అవుతుంది, ఎవర్ని అనుమానిస్తుంది, ఎవర్ని ఇంటరాగేట్ చేసింది తెలుస్తుంది. దాన్నిబట్టి తప్పించుకొనేందుకు మార్గాలు అన్వేషించుకోడానికి.... అర్ధమైందా? నాకీ జాగ్రత్త ఎందుకంటే నువ్వు బయటకొస్తే నేను బయటకొస్తానని.... నీలాంటి క్రిమినల్ కి కండ ఉంటే చాలదు. బుర్రలో గుజ్జుండాలి. ఇదే అజాగ్రత్తను భవిష్యత్ లో కూడా చూపిస్తే నేనే వేరే మనిషిని చూసుకోవాల్సి వస్తుంది" కఠినంగా మాట్లాడాడు.

    "సారీ సార్...." అన్నాడు నెమ్మదిగా సుదర్శన్.

    "నేచెప్పిందేమిటి...." నువ్వు చేసిందేమిటి....? ఇంతకీ డిటైల్స్ దొరికాయా....?"

    సుదర్శన్ మాట్లాడలేదు.

    ఫోన్ లో వ్యక్తి గద్దించాడు.

    "ఆ గుర్రం ఫోటో సంపాదించాను. కానీ దానిమీద డిటైల్స్ లేవు...."

    "యూ ఫూల్ .... దీని కోసమేనా దివ్యతేజను చంపింది." అవతల కంఠం సీరియస్ గా మారింది.

    "నో....సార్....ప్రమాదవశాత్తు చనిపోయాడు. అసలు బెదిరించే తెద్దామనుకున్నాను. అతను మొండిగా ఎదురుతిరిగాడు. పై పెచ్చు ఆ వర్క్ ఇచ్చిన వ్యక్తి తాలూకు మనిషి వచ్చే టైమైంది. ఆలస్యం చేస్తే అతని దృష్టిలో పడాల్సి వస్తుందని చిన్న ఎటాక్ ఇచ్చాను....అంతే సార్...." సంజాయిషీగా అన్నాడు.

    "ఇదంతా నాకనవసరం. పది రోజుల్లో ఆ గుర్రం ఎక్కడుందో తెలియాలి తెల్సా.... నువ్వేం చేస్తావన్నది నాకవసరం. నాకు పనికావటం నీకు డబ్బు ముఖ్యం అనుకుంటాను...."

    ఫోన్ టక్కున కట్టయిపోయింది.

    రిసీవర్ హుక్ మీద పెట్టేసి సుదర్శన్ కుర్చీలో కూలబడ్డాడు. అతని బుర్రనిండా ఆలోచనలు.... ఆలోచనలు.... వేగంగా.

    వెంటనే ఫోటోని చేతుల్లోకి తీసుకున్నాడు పరీక్షగా మరోసారి చూసాడు వెనక్కు తిప్పాడు.

    "రాయల్ కింగ్, కెనడా....15 లక్షలు" అని బోల్ట్ అక్షరాలని మరింత పరీక్షగా చూసాడు. దాన్ని క్రింద అస్పష్టంగా అతి చిన్న అక్షరాల్లో ఏదో పేరుంది. చాలాసేపు ట్రై చేసాడు' లాభం లేక పోయింది.

    వెంటనే బూతద్దం తెప్పించాడు.

    అప్పుడు కనిపించాయి ఆ చిన్న అక్షరాలు.

    "అనురాగ్ గోవా" అని మ్యౌనూట్ స్టిక్కర్.

    సుదర్శన్ కళ్ళు మెరిసాయి. చాలు ఆ మాత్రం ఆధారం అనుకున్నాడు.

    గోవాలోని "అనురాగ్" అన్న ఫోటోగ్రాఫర్ కాని, స్టూడియోకాని ఆ ఫోటో తీసివుండాలి. దీన్నిబట్టి ఆ గుర్రం ఎక్కడుందో కూడా తెలుసుండాలి.

    వెంటనే రూం ఖాళీ చేసాడు.

    గోవా వెళ్ళేందుకు ఎయిర్ పోర్టుకి బయలుదేరాడు హడావుడిగా.

    సుదర్శన్ గోవా వెళ్ళే వాయుదూత్ ఎక్కటం_ హైద్రాబాద్ నుంచి వచ్చిన ఫ్లయిట్ నుండి దివ్యతేజ కూతురు డాక్టర్ ఆషా దిగటం ఒకేసారి జరిగింది.


                               *    *    *


    గోవాలోని కేలంగ్యూట్ బీచ్ ఒడ్డు.

    ఎదురుగా నీలి సముద్రం.

    ఎండలో సంపెంగ రేకుల్లా మెరుస్తున్న ఇసుక.

    ఆ ఇసుక దిబ్బల్లా వున్నచోట వంగిన కొబ్బరిచెట్లు_ అందమైన సముద్రపు అంచును ఆర్తిగా చుంబిస్తున్నట్లుగా__

    విశాలంగా విస్తరించి వున్న ఆ బీచ్, ఆ చివర ఏకాంతమైన ప్రదేశం. ఆ ప్రదేశాన్ని "బాగా" బీచ్ అంటారు. విదేశీ టూరిస్టులు ఆ బీచ్ లోనే అర్ధనగ్నంగా విహరిస్తుంటారు.

    ఏ చెట్టుకింద, ఏ గట్టుమీద, ఏ కాటేజ్ వరండా, ఎటువేపున చూస్తే అటు విదేశీ నగ్నత్వం కనిపిస్తుంటుంది.

    బాగా తీరం వెన్నెల రాత్రులలో "భూలోక నగ్న స్వర్గంలా" వుంటుంది.

    ప్రస్తుతం ఆ బాగా తీరంలో మధ్యాహ్నం సాయంత్రంలా మారుతోంది. 

    ఎటుచూస్తే అటు విదేశీ జంటలు చెట్టాపట్టాలేసుకొని కలకల్లాడుతూ హుషారుగా తిరుగుతున్నారు. కొంతమంది ఈత కొడుతున్నారు. మరికొంతమంది పడవ ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.

    ఇంకొంతమంది అక్కడక్కడా జట్లు జట్లుగా కూర్చుని హేపీగా, తాపీగా గంజాయి సిగరెట్లు కాలుస్తున్నారు.

    వరుసగావున్న కొబ్బరిచెట్ల మధ్య పొట్టిగావున్న ఓ చెట్టు క్రింద ఓ కెనడా జంట కూర్చునుంది.

    అతను ఆల్బర్టు. వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. అతని భార్య సిల్వియా చీరకడితే అందమైన ఇండియన్ గర్ల్ లా వుంటుంది సిల్వయా.

    కాని ప్రస్తుత సిల్వియా చీరలోనూ లేదు, గౌనులోనూ లేదు. బికినీలో వుంది. ఆల్బర్టు ఒంటిమీద అండర్ వేర్ మాత్రమే వుంది. సిల్వియా ఏదో జోకేసింది. దానికి ఆల్బర్టు నవ్వుతున్నాడు. నవ్వుతున్న ఆల్బర్టుని సిల్వియా గట్టిగా కౌగలించుకుని ఒక్కసారి ముద్దెట్టుకుంది.

    ఎంతోసేపట్నుంచి వాళ్ళకు కాస్తదూరంలో ఒక అపూర్వమైన దృశ్యం కోసం చూస్తున్న అనురాగ్ చటుక్కున ఆ ముద్దును కెమెరాలోకి ఎక్కించాడు.

    అనురాగ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్__ఫ్రీలాస్పర్. అందమైన సాయంత్రాలు, అపూర్వ దృశ్యాలను, అత్యద్భుతమైన ఉషోదయాలూ అందానికి మెరుగులు పెట్టే ఆడపిల్లలు అతని ఫోటోగ్రాఫిక్ ఆబ్జెక్ట్సు.

    తను తీసే ఫోటోల్లో ఏదో ఒక విలక్షణత్వం వుండాలని అనురాగ్ తపన. అందుకోసమే సంవత్సరంలో మూడు నెలలు గోవా, కులుమనాలి, వారణాసి లాంటి ప్రదేశాలకు వెళ్ళొస్తుంటాడు.

    అనురాగ్ కొన్ని దిగ్బ్రమ చెందించే ఫోటోలు కూడా తీసాడు. హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం. ఆ సందర్భంలో జరిగే అల్లర్లని, పోలీసు కాల్పుల్ని, మత కల్లోల్లాల్ని, యాక్సిడెంట్స్ ని తెలివిగా చాకచక్యంగా తన కెమెరాలోకి ఎక్కిస్తుంటాడు.

    అతని ప్రతిఫోటో రేర్ కావల్సిందే.

    అందులో భాగంగానే విదేశీ యాత్రికులు ఎక్కువగా వచ్చే మొదటివారంలో అనురాగ్ గోవాలో ప్రత్యక్షమయ్యాడు.

    ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గోవా వచ్చే కొంతమంది రెగ్యులర్ టూరిస్టులతో అనురాగ్ కి స్నేహం ఏర్పడింది.

    అందులో కెనడానుంచి వచ్చే అల్బర్టు సిల్వియా జంట ఒకటి. ఆ జంటతో అనురాగ్ కి ఐదేళ్ళ స్నేహం.

    తను వెళ్ళే సమయానికి వాళ్ళొస్తే ఆ జంటతోనే గడుపుతాడు అనురాగ్.

    పాశ్చాత్యులకి తమలో తాము తమకై తాము దాచుకోవడానికి ఏమీ లేదనే భావన వుంది. అదే భావన ఆల్బర్టు, సిల్వియాలకు కూడా ఉంది. అందుకే సిల్వియా ఫోటోలను తీసుకోగలుగుతున్నాడు అనురాగ్.

    "కిస్ ఫోటో తీసావా?" అడిగింది సిల్వియా రోమేంటిక్ గా నవ్వుతూ.

    చిరునవ్వుతో తలూపాడు అనురాగ్. మరలా పోకసింగ్ చేసుకుంటూ మరో అరగంట తర్వాత ముగ్గురూ సముద్రపు అంచువేపు నడవసాగారు. సముద్ర కెరటాలు కాళ్ళకు చల్లగా తగులుతున్నాయి.

    "ఈ బండరాయి ఎక్కి నీళ్ళలోకి గెంతు. ఒక్క స్నాప్ తీస్తా" అన్నాడు అనురాగ్.

    "గుడ్ అయిడియా" అంటూ సిల్వియా బండరాయి ఎక్కి నిలబడింది. ఆమె ముందుకు వంగి సముద్రంలోకి దూకుతుండగా అచ్చాదనలేని ఆమె బరువైన ఎదను, వంగిన కొండల శిఖరాల అంచుల్ని ప్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎక్స్ పోజ్ చేశాడు.

    అతను తన శరీరంపై ఎక్కడ ఎక్స్ పోజ్ చేశాడో తెలుసుకున్న సిల్వియా అతని రోమేంటిసిజానికి నవ్వుకుంటూ "ఎన్ని ఫోటోలు తీస్తావు?" అడిగింది.

    "మరో పదిహేనేళ్ళపాటు.... ఎన్ని ఫోటోలు తీయగలిగితే అన్ని"

    "యూ, నాటీ...." అంటూ సిల్వియా నీళ్ళలోకి గెంతింది.

    అరగంటపాటు సముద్రస్నానం చేసి బయటకు వచ్చిన ఆల్బర్టు, సిల్విదయాలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ బీచ్ లో నడుస్తుండగా__

 Previous Page Next Page