"మిస్టర్ తేజా! ఇక మోసగించటం అనవసరం. సూటిగయే విషయంలోకి వచ్చేస్తాను. మీరూహించిన వ్యక్తిని కాను నేను. గత రెండు రోజుల నుంచి మీరు ఒక గుర్రం బొమ్మని గీయటంలో నిమగ్నమయి వున్నారు. అవునా....?" నవ్వుతూ ప్రశ్నించాడతడు.
దివ్యతేజ ఆశ్చర్యపోతూ "అవును కానీ దానికి మీకు ఎలాంటి సంబంధం లేదనుకుంటాను. మీరొచ్చిన పనేమిటో చెప్పండి" తన అనుమానం నిజం కావటంతో కర్కశంగా అడిగాడు తేజ.
"దానికి నాకు సంబంధం వుంది. నేనొచ్చిన పని దాని గురించే ఆ బొమ్మ గీయడానికి మీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తున్నారు.... అవునా....?"
తేజ మౌనంగా వుండి పోయాడు.
అవతల వ్యక్తి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ "నాక్కొన్ని వివరాలు కావాలి మీరు చెప్తే.... ఇప్పటికిప్పుడే మూడు లక్షలిస్తాను" అన్నాడా వ్యక్తి తాపీగా.
అతను అడిగిన వివరాలు చెప్పాల్సిన అవసరం తేజకు లేకపోయినా కేవలం విషయాసక్తితో "ఏమిటా వివరాలు?" తేజ అడిగాడు.
"మొదటిది ఆ వర్కుని మీకు ఎవరప్పజెప్పారు ....? ఆ గుర్రం ఇప్పుడెక్కడ ఉంది"
తేజ ఆశ్చర్యపోయాడే తప్ప పెదవి విప్పలేదు.
"ఆ గుర్రం ఒరిజనల్ ఫోటో నాక్కావాలి...." అప్పుడు తేరుకున్నాడు తేజ.
"ఆ వివరాలు మీకెందుకు....? అయినా మీరు అందించే వివరాలు నాకనవసరం. ఆ వర్కు నాకు ఫోన్ ద్వారా వచ్చింది. ఎవరిచ్చారో తెలియదు. ఒక వ్యక్తి మీలాగే వచ్చి ఒక ఫోటో ఇచ్చి వెళ్ళాడు. ఆ ఒరిజినల్ ఫోటో మీకివ్వటం కుదరదు. ఆ వ్యక్తి పంపించే మనిషి మరికాసేపట్లో వస్తాడు. బొమ్మతోపాటు ఫోటో కూడా ఇవ్వాలి...." అన్నాడు తేజా.
అసలీ వివరాలు చెప్పేవాడు కాదు. చెప్పాల్సిన అవసరం లేదని నిర్భయంగా భావించిన తేజాకు అతని చేతిలో మెరుపులా మెరిసిన పిస్టల్ చూచి చెప్పక తప్పింది కాదు.
"మిస్టర్ తేజా! నీ మాటలు నేనమ్మడంలేదు. ఎందుకంటే ఎంతో ముఖ్యమైన ఇలాంటి పనిని, పెద్ద మొత్తం ఇస్తూ కేవలం ఫోన్ ద్వారా అప్పజెప్పారంటే నేన్నమ్మను. ఎవరు అప్పజెప్పారో మీకు తెలుసు. తెల్సినా మీరు చెప్పడం లేదని నా అనుమానం...." అతని గొంతులో క్రమంగా కోపం పెరుగుతోంది.
"నాకు నిజంగానే తెలియదు...." దివ్యతేజ ఆందోళనగా అన్నాడు.
"ఆ వివరాలు ఎలా తెల్సుకోవాలి నాకు తెల్సు. ఫోటో మాత్రం మీరు నాకివ్వాలి. తప్పదు...." ఇవ్వకున్నా తీసుకుంటానన్నట్లుగా మాట్లాడిన అతని ధీమా తేజకి కోపం తెప్పించింది.
ఈ విషయం ఇందాక మీకు చెప్పాననుకుంటాను...." అంతే ధీమాగా అన్నాడు తేజ.
ఈ పనిలో ఇంత రిస్కుంటుందని ముందే తెలిస్తే ఒప్పుకునేవాడు కాదు? తీరా ఒప్పుకొని పూర్తిచేసి ఇవ్వపోయేలోపు కేవలం దౌర్జన్యంతో దాన్ని పొందాలనుకొనే ఎదుటి వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరించాలనే స్థిర నిశ్చయానికి వచ్చాడు తేజ. గుర్రాల చిత్రాలన్నా వాటిపై మక్కువ చూపించే వారన్నా తేజకు గొప్ప అభిమానం. వర్క్ అప్పజెప్పిన వ్యక్తి పట్ల కూడా.
ఎదుటి వ్యక్తి అసలు విషయం చెప్పుకున్నా, ఆ ఫోటోలోని గురాన్ని చూస్తుంటే, దాన్ని దాని యజమాని రేస్ కి సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రేస్ హార్సెస్ అంటే వాటివెనుక గ్రేట్ గేబ్లింగ్ ఉంటుందని, మోసాలు, దారుణాలు హత్యలు కూడా వుంటాయని తేజకు తెల్సు.
ఆ గుర్రం ఎలాంటిదైనా, ఆ పని అప్పగించిన వ్యక్తి ఎలాంటి వాడైనా తన వృత్తి ధర్మం ప్రకారం చిత్రం పూర్తి చేసి అసలు వ్యక్తికే అందించాలి.
తేజ ఈ నిర్ణయానికి రాగానే ధైర్యాన్ని కూడదీసుకున్నాడు. అతన్ని ఎదుర్కొనేందుకు.
ఆ వ్యక్తి కోపంగా నేలను తన్నుతూ లేచి నిలబడ్డాడు. సూటిగా దివ్యతేజ వేపు చూశాడు. ఓ క్షణం ఆ చూపులో తనను బెదిరించే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది తేజకు.
"ఒక ప్రఖ్యాత భారతీయ చిత్రకారుణ్ణి చంపటం నాకిష్టంలేదు" హఠాత్తుగా అన్నాడు అతను.
సంభాషణ కాస్త చావుదాకా వెళ్ళటం__అదీ అంత త్వరగా, ఆ నిర్ణయానికొస్తాడని ఊహించని తేజ ఓ క్షణం కలవరపడ్డాడు.
"మర్యాదగా ఆ ఫోటో నాకప్పగించు" అన్నాడు కఠినంగా.
దివ్యతేజకు మాట్లాడటం ఇష్టంలేకపోయినా ఎదుటి వ్యక్తి చేతిలో తమాషాగా కదిలే పిస్టల్ ఆ అయిష్టాన్ని మార్చి వేసింది.
తేజ మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగానే అతనే మరలా మాట్లాడాడు.
"నేనో ప్రొఫెషనల్ కిల్లర్ ని. నాకు పని కావటం ముఖ్యం. ఆ సందర్భంలో నాకు దయాదాక్షిణ్యాలుండవు. నీ వృత్తి ఆ ఫోటో నాకివ్వద్దని హెచ్చరిస్తుంది. పాపం బుజ్జిముండ. నా ప్రొఫెషన్ కూడా నన్ను ఒప్పుకున్న పని ఎలాగైనా పూర్తి చేయాలంటుంది. ఇప్పుడిక బలవంతులదే కదా టైమ్ నిన్ను చంపైనా ఆ ఫోటో తీసుకెళ్తాను. వచ్చే ముందు నాకీ ఐడియా లేకున్నా నీ మొండితనం చూసాక అది తప్పేట్లుగా లేదు మరి. నా పని చేసుకునేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో నేను చాలా మంచివాడిని. నేనడిగిన వివరాలు, వస్తువు, కరెక్ట్ గా అందించినా మంచివాడ్నే. నా ఉద్దేశ్యం పూర్తిగా అర్ధమయిందనుకుంటాను...." ఎంతో నిర్భయంగా ధీమాగా అన్నాడు.
"ఆ గుర్రం ఫోటోకి అంత విలువుందా...." తేజ అడిగాడు ఆశ్చర్యం నటిస్తూ.
ఎలాగైనా కొంత కాలాన్ని అతన్ని సంభాషణలో పెట్టి ఆపగలిగితే ఈలోపు అసలు వ్యక్తి రావచ్చు. అప్పుడు ఎలాగైనా అతన్ని ఎదుర్కోవచ్చని వుంది తేజకు.
అక్కడే ఎదుటి వ్యక్తి తెలివి తేటల్ని తక్కువగా అంచనా వేసాడు తేజ.
ఆ వ్యక్తి పెద్దగా నవ్వాడు.
మిస్టర్ తేజ....ఇక్కడదాకా వచ్చాక నిజాలు నువ్వు చెప్పకున్నా నేను చెబుతాను....విను కోటి రూపాయల వ్యాపారం ఆ గుర్రం కేంద్రంగా నడుస్తోంది. అందుకే"
"కోటిరూపాయలా....?" అదిరిపోయాడు దివ్యతేజ. నీకు ఐదు నిమిషాలే టైం ఇస్తున్నాను నిర్ణయించుకో.... ఫోటో ఎక్కడ దాచావో చెప్పు లేకుంటే నేను గాలించి తీసుకెళ్ళాల్సి వస్తుంది...."
ఆ వ్యక్తి మళ్ళీ మరో సిగరెట్ వెలిగించాడు.
అయిదు నిమిషాలు....
ఒకటి....
రెండు....
మరో సిగరెట్ వెలిగించాడు
మూడు....
నాలుగు....
మరో సిగరెట్ ....
ఐదు ....
సిగరెట్ నేలకేసి విసిరికొట్టి దాన్ని కసిగా బూటుతో నలిపి, అప్పటి వరకు ఎంత తాపీగా మాట్లాడాడో, అంత వేగంగా ఎదురుగా వున్న తేజను పక్కకునెట్టి మేడ మెట్లెక్కి తేజ డ్రాయింగ్ హాల్ వేపు దూకాడు.
సరిగ్గా అదే సమయంలో ఆ చిత్రం కోసం బయలుదేరిన మరో ప్రొఫెషనల్ కిల్లర్ బ్రీఫ్ కేసులో క్యాష్ సర్దుకొని వచ్చి జీపులో కూర్చున్నాడు. అది మరుక్షణం తేజ ఆఫీసు వేపు రావటం ప్రారంభించింది వేగంగా.
అక్కడ నిలువెత్తు గుర్రం చిత్రం.... ఆ పక్కనే టేబుల్ మీద దాని ఫోటో కనిపించాయి. ఆ ఫోటో తీసుకున్నాడు దాన్ని అడ్డంగా మడిచి షర్టు లోపల దాస్తున్న సమయంలో__
దివ్యతేజ అతని చేయిపట్టుకున్నాడు.
ఆ చేయిని విడిపించుకుని తేజను బలంగా తోసేసాడా వ్యక్తి. తేజ ఆ విసురుకి పక్కన వున్న ఈజిల్ మీద పడ్డాడు.
ఆ వ్యక్తి గది బయటకు రావటానికి ప్రయత్నిస్తున్న సమయంలో కిందపడిన తేజ లేచి వేగంగా దొర్లుతూ వచ్చి అతని రెండు కాళ్ళూ పట్టుకున్నాడు.
అతను నడవటానికి వీలు కాలేదు. బలంగా కాలితో తన్నాడు. ఆ దెబ్బ కడుపులో తగలడంతో తేజ విలవిల్లాడాడు.
ప్రాణం పోయినా సరే....ఫోటోను దక్కించుకోవాలనే పట్టుదలతో ఆ బాధతోనే లేచి, ఆ వ్యక్తి చేతిని పట్టుకొని బలంగా లాగాడు. అతను బ్యాలన్స్ తప్పి వెనక్కిపడ్డాడు. అతని బలమైన శరీరం గోడకి బలంగా తగలడం వల్ల పెద్ద శబ్దమైంది.
"యూ బాస్టర్డ్" అని పెద్దగా రంకెవేస్తూ అతను జేబులోంచి పిస్టల్ బయటకు తీసాడు.
గురిచూసి తేజ రెండురోజులు కష్టపడి వేసిన చిత్రాన్ని కాల్చాడు రెండుసార్లు....
మూడోసారి మళ్ళీ కాల్చడానికి ప్రయత్నిస్తున్న సమయంలో దివ్యతేజ అడ్డుగా వెళ్ళాడు. అప్పుడు రిలీజ్ అయిన బుల్లెట్ తేజ భుజానికి చీల్చుకుపోయింది. చివ్వున రక్తం చిమ్మింది తేజ భుజం నుంచి.
తేజ ఆ గాయానికి తూలి గోడ పక్కనున్న టేబుల్ మీద పడ్డాడు. అప్పుడు అతని దృష్టి దానిమీదే ఉన్న ఫోన్ మీద పడింది. వెంటనే రిసీవర్ అందుకొని డయల్ చేయటానికి ప్రయత్నించాడు.
5.... 2.... 1....
ఇంకో నెంబరు తిప్పుతున్నంతలో ఆ వ్యక్తి తేజ తలపై రివాల్వర్ బట్ తో బలంగా కొట్టాడు,
తేజ నేలమీద విరుచుకొని పడిపోయాడు. అయినా లేచేందుకు బలవంతాన ప్రయత్నించాడు కాని లేవలేకపోయాడు. తేజ వేపు ఓ సారి చూసి "పూర్ ఫెలో...." అని అనుకుంటూ ఆ వ్యక్తి గది తలుపులు దగ్గరగా వేసి బయటకొచ్చాడు.