Previous Page Next Page 
మౌనం పేజి 39

    కెమెరాని  చేతిలోకి  అందుకుని  ఒకసారి ఇటూ అటూ తిప్పిచూసి 'అవసరం లేదు. మీరు దీనిని ఎలా వాడాలో చెప్పారు కదా! నేను హేండిల్ చెయ్యగలను" అని కెమెరాని తిరిగి క్రింద వుంచాడు పాల్.

    "గుడ్" అని అభినందనగా  భుజం  తట్టాడు  తాత.

    "ఇంకా ఏమయినా  జాగ్రత్తలు  వున్నాయా?" అడిగాడు ఉపేంద్ర.

    "ఇంకేమీ లేవు" అంటూ తిరిగి లెన్స్, సెల్, క్యాసెట్ అన్నీ ఫిట్ చేసేయసాగాడు తాత.

    "నీకు పూర్తిగా  అర్ధమైందా?" పాల్ ని అడిగాడు.

    అయిందన్నట్లు  తలూపాడతను.

    "నువ్వు  చెయ్యవలసినదల్లా  నీ చేతిలో గన్ వుందన్నట్లుగా ప్రవర్తించకుండా  వీడియో కెమెరా వున్న వ్యక్తిలా ప్రవర్తించాలి. అక్కడ సెక్యూరిటీ టైట్ గా వుంటుంది. వాళ్ళు ప్రతి మనిషి కదలకల్నీ పరిశీలనగా చూస్తుంటారు. నువ్వు ఏమాత్రం భయంగా చూసినా  నీలోని  గుండె నిబ్బరంలో  ఏ మాత్రం తేడా వచ్చినా  నువ్వు వాళ్ళకి  దొరికిపోవటం ఖాయం. చాలా కాజువల్ గా....రిలాక్స్ డ్ గా వుండాలి" చెప్పాడు తాత.

    అలాగే  అన్నట్లు  తలూపాడతను.

    "ఇందులో  50 బుల్లెట్లు  మ్యాగజైన్ లోడ్ చేశాను. అది నీ పనికి సరిపోతుందనుకుంటాను. నా అంచనా ప్రకారం నువ్వు  ధైర్యంగా  చేస్తే ఆ ముగ్గుర్నీ  ఫెర్ ఫెక్ట్ గా మర్డర్ చేసి మామూలుగా  బయటికి  రాగలుగుతావు. ఈ గన్ నుంచి శబ్దం కూడా వెలువడదు కాబట్టి  వాళ్ళను ఎవరు కాల్చుతున్నారో  ఎవరూ  అర్ధం చేసుకోలేరు.బుల్లెట్ డైరెక్షన్  కూడా అర్ధం కాదు. సో....సేఫ్టీ వే ఆఫ్ కిల్లింగ్."

    తేలిగ్గా  ఊపిరి పీల్చుకున్నాడు ఉపేంద్ర.

    శరీరమంతా  వణుకుతున్న  ముసలాడు యింత  అద్భుతంగా గన్ ని కెమెరాలో ఫిట్ చేయగలుగుతాడని పాల్  వూహించలేదు. ఈ గన్ సహాయంతో  వాళ్ళ  ముగ్గుర్నీ  తేలిగ్గా  చంపవచ్చు.

    కెమెరాని  అట్టపెట్టెలో  తిరిగి  వుంచాడు తాత.

    మూత మూసేశాడు.

    ఆ పెట్టెను  ఉపేంద్ర చేతిలో  వుంచాడు తాత.

    "థాంక్యూ వెరీమచ్? అన్నాడు ఒకింత  ఆనందంగా  ఉపేంద్ర.

    "విష్ మి ఆల్ ది బెస్ట్" అంటూ  తాత పాదాలను చేతులతో  ముట్టుకుని  శిరస్సు మీద  వుంచుకున్నాడు పాల్.

    "ఆల్ ది బెస్ట్ మై చైల్డ్" అన్నాడు గొణిగినట్లుగా  తాత.

    "మేం వెళతాం" లేచి నిలబడుతూ  అన్నాడు ఉపేంద్ర.

    అలాగే  అని తలూపాడు  తాత.

    ముందుకు కదిలారు యిద్దరూ.

    "ఒక్క నిమిషం" తాత పిలుపు వినపడటంతో  తల తిప్పారు యిద్దరూ.

    "ఒక ముఖ్య  విషయం చెప్పలేదు. కెమెరా పనిచేయటానికి వైర్ ఒకటి కరెంటుకి కనెక్టు చేస్తావుకదా?" అన్నాడు.

    అవును అన్నట్లు  తలలూపారిద్దరూ.

    "నువ్వు వీడియో షూట్ చేసినప్పుడు  ఫరవాలేదు. బట్ ఎప్పుడయితే దానిని గన్ గా వుపయోగించాలనుకుంటావో....అప్పుడు  దాంట్లోకి కరెంటు రావడానికి వీల్లేదు. అలా వస్తే ఒక్కోసారి బుల్లెట్స్ అక్కడికక్కడే పేలిపోవచ్చు. అది నీ ప్రాణానికి ప్రమాదం. అందువల్ల నువ్వు గన్ గా వుపయోగించేప్పుడు  కరెంటు ప్లగ్ కెమెరా నుంచి నీకెయ్యి. అది పీకిన  మరుక్షణం  రెడ్ బటన్ ప్రెస్ చెయ్యి. మోడ్ ఆన్ చెయ్యి....చాలు. బుల్లెట్స్ వరుసగా రిలీజవుతాయి" చెప్పాడు వెనక నుండి తాత.

    "థాంక్ గాడ్. చాలా ముఖ్యమయిన విషయం చెప్పాడు" అన్నాడు ఉపేంద్ర.

    "జాగ్రత్త....గన్ లాగ  పెల్చేటప్పుడు  కరెంటు వైరు కెమెరానుండి నీకెయ్యటం మరవద్దు" మరోసారి చివరగా హెచ్చరించాడు  తాత.

    "అలాగే" అంటూ  బయటికి  వచ్చి వ్యాన్ వైపు నడిచారు.

    ఆ పెట్టెను  వ్యాన్ సీటు మీద వుంచి వాళ్ళిద్దరూ  కూడా వ్యాన్ లోకి ఎక్కారు.

    దుమ్ము రేపుకుంటూ  కదిలింది  వ్యాను.


                    *    *    *    *    *


    జనవరి :3

    "మేరీ ప్యారీ బెహనియా బనేగీ  దుల్హనియా" శ్రావ్యంగా  వినిపిస్తోంది  పెళ్ళి బ్యాండ్ వాళ్ళ పాట.

    ఊరేగింపుగా  వెళుతున్నారు  పెళ్ళి బృందం.

    కొందరు కుర్రాళ్ళు పాటకు  అనుగుణంగా  డ్యాన్స్  చేస్తున్నారు. మరికొందరు ఈలలతో, క్లాప్స్ తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు.

    అలా వచ్చిన వూరేగింపు వీధి మలుపు  తిరిగి వెళ్ళిపోయింది.

    ఆ దృశ్యాన్ని  అంతసేపూ  కిటికీలోంచి  చూసి నిట్టూర్చాడు  చంద్రకాంత్.

    "ఛ....కనీసం  ఇలాంటి  పెళ్ళిళ్ళు  తీయటానికి కూడా వీడియో కెమెరా లేదు" స్వగతాన్ని పైకి  అన్నట్లుగా అన్నాడు.

    అతని మాట విన్న  అర్చన  కళ్ళల్లో  నీళ్ళు గిర్రున తిరిగాయి.

    అప్పటికి  చంద్రకాంత్  కెమెరా పోయి  దాదాపు రెండు నెలలు  అవుతోంది.

    పోలీస్ రిపోర్ట్  యిచ్చాడు. దొరకలేదు.

    మానసికంగా  కృంగిపోయాడతను.

    ఖర్చు తప్ప  సంపాదన  లేదు.

    చెప్పులు  తొడుక్కుని బయటకు  కదలబోయాడు  చంద్రకాంత్.

    "ఎక్కడికి చంద్రా?" అడిగింది అర్చన.

    "మనసేం  బాగోలేదు. కాసేపు  అలా బయటకు  వెళ్ళివస్తాను" అంటూ ఆమె సమాధానం కోసం  ఎదురుచూడకుండా  బయటికి వెళ్ళిపోయాడు.

    బుగ్గ మీదుగా  క్రిందికి  జాలువారుతున్న  అశ్రుబిందువును  కొనగోటితో తుడిచి వేసిందామె.

    రోజులు  గడుస్తున్నాయి. కానీ  సమస్యకు పరిష్కారం  దొరకటం లేదు.

    ఒక దశలో  ఉద్యోగం  చేయాలని నిశ్చయించుకుంది. కానీ....డిగ్రీ కూడా పూర్తిచేయని ఆమెకు వుద్యోగం ఎవరిస్తారు?

    ఆ ప్రయత్నం వృధా అయింది.

    కొద్ది రోజులు  గడిస్తే  వుంటున్న  ఇల్లు అమ్మి బ్యాంక్ లోన్ కట్టేయాల్సిన  పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్ అగమ్యగోచరంగా వుంది.

    పోనీ తన తల్లిదండ్రులని  సహాయం అర్ధిస్తే....కనీసం  ఫోన్ లో అయినా మాట్లాడని వాళ్ళని తాను ఏమడుగుతుంది?

    వాళ్ళతో  ఒక్క మాటయినా  చెప్పకుండా  పెళ్ళి చేసుకుని తనదారి తాను చూసుకుంది. వాళ్ళని మోసం చేసింది.

    ఇంక  ఏ ముఖం  పెట్టుకుని  వాళ్ళను  అడుగుతుంది?

    ఆలోచనలతో  సతమతవుతున్న ఆమె "అర్చనా!" అన్న పిలుపు వినపడటంతో తలతిప్పి  చూసింది.

    ఎదురుగా  నిలబడి  వున్నాడు చంద్రకాంత్.

    "చంద్రా!....ఇప్పుడేకదా  వెళ్ళావు. ఇంతలోనే  తిరిగి  వచ్చావా?" అంది చైర్లోంచి లేస్తూ.

    "ఇప్పుడేనా!....నేను వెళ్ళి దాదాపు  గంట  కావొస్తోంది  తెలుసా?"

    "అవునా?" అంటూ  క్లాక్ వైపు చూసింది  టైము  అయిదవుతోంది. నిజమే.

    నాలుగు గంటల ప్రాంతంలో  బయటికి  వెళ్ళాడు చంద్రకాంత్.

    అతని ముఖంలో  ఒకింత  ఆనందం  కనిపిస్తోంది.

    ఆమె ప్రక్కనే సోఫాలో  కూర్చున్నాడు.

    "చంద్రా! ఎనీ గుడ్ న్యూస్?" ఆమె కూడా  ఒకింత  ఉత్సాహంగా ప్రశ్నించింది.

    అవునన్నట్లు  తలూపాడు  అతను.

    "ఏమిటది?"

    "ఒక పూట  కష్టపడితే  పదివేలు  వస్తాయి. కనీసం  రెండు నెలల వరకు మనకి  ఇబ్బంది వుండదు. ఆలోపుగా  ఏదయినా  క్రొత్త  ప్రయత్నం చేయవచ్చు."

    "పదివేలా! సరిగ్గా  అర్ధమయ్యేలా  చెప్పు చంద్రా!"

    "మోడలింగ్....ఆఫర్ వచ్చింది. హెయిర్ ఆయిల్  మోడలింగ్  చేస్తే పదివేలు వస్తాయి."

    ఫక్కుమని నవ్వింది  అర్చన.

    "నవ్వులాట  కాదు....నిజం...."

    "నీకు సరైన  జుట్టే  లేదు. ఉన్న జుట్టు కూడా  ఈ మధ్య కాలంలో టెన్షన్స్ కి సగం రాలిపోయింది. నిన్ను మోడలింగ్ కి సెలక్ట్ చేసుకున్నది ఎవరు? అదీ పదివేలు ఇచ్చి."

    "మోడలింగ్ ఛాన్స్ నాకు కాదు....నీకు...."

    "నాకా!" తెల్లబోయిందామె.

    "అవును....నీకే...."

    "నేను మోడలింగ్ చేయటం  ఏమిటి?"

    "ఇందులో  ఆశ్చర్యపోయేది ఏముంది? పెళ్ళికి  ముందు  మోడలింగ్ చేయలేదా? నువ్వు  అసలు నాకు పరిచయం అయినది  మోడల్ గానే కదా!"

    "బట్....అది  వేరు. కేవలం  సరదా కోసం  చేసినది. డబ్బు కోసం కాదు నీకు ముందే చెప్పాను కదా! మోడలింగ్ కేవలం  హాబీగా  కొద్దిరోజులు  చేసానే కానీ, వృత్తిగా  చేయనని."

    "అర్చనా! నువ్వు  అపార్ధం  చేసుకున్నావు. నిన్ను వృత్తిగా మోడలింగ్ చేయమనలేదు నేను. ఈ హెయిర్ ఆయిల్ తయారుచేసే కంపెనీ  మా ఫ్రెండ్ దే. అతనే  అడిగాడు. పదివేలు  ఆఫర్  చేశాడు....నీకు మోడలింగ్ అంటే ఏమయినా  చెడు అభిప్రాయం వుందా?"

    "అలా ఏం లేదు. ఆ వృత్తిని  నేను గౌరవిస్తాను."

    "అయితే  చేయవచ్చు కదా ?"

    "కానీ....పెళ్ళయ్యాక  చేయకూడదనుకున్నాను."

    "ఇందులో  అసభ్యత  లేదు. కేవలం  హెయిర్ ఆయిల్ కి."

    "........"

    "మన పరిస్థితి బాగున్నా నిన్ను  మోడలింగ్ చేయమని అడిగేవాడిని కాదు. కేవలం నా నిస్సహాయత, చేతకానితనం వలన  ఇలా నిన్ను అర్ధించాల్సి  వస్తోంది."

    "........."    

 Previous Page Next Page