Previous Page Next Page 
మౌనం పేజి 38

    ఇంటి తలుపు వేసి  వుంది.

    కాలింగ్ బెల్ నొక్కాడు ఉపేంద్ర.

    "ఇప్పుడు  మనం  కలవబోయే  వ్యక్తి  నీకు చాలా విషయాలు చెబుతాడు. నువ్వు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి .అప్పుడే నువ్వు ఈ మర్డర్స్ పెర్ ఫెక్ట్ గా చేయగలుగుతావు" అన్నాడు పాల్ తో.

    సరేనన్నట్లుగా  తల వూపాడు పాల్.

    నిమిషం  తర్వాత  తలుపు  తెరుచుకుంది.

    దాదాపు  డెబ్భై  ఏళ్ళ వయసున్న  వ్యక్తి  ఒకతను  తలుపు తెరిచాడు.

    తెల్లగా  నెరిసిన  జుట్టు, ముడతలు  పడిన చర్మం. సన్నని ఫ్రేమ్ కళ్ళజోడు....కొంచెం మాసినట్లున్న లాల్చీ, షర్టు.

    కళ్ళు చిట్లించి వచ్చిన వ్యక్తుల వైపు  చూశాడు  ఆ వ్యక్తి.

    "నేను తాతా....ఉపేంద్రని" కళ్ళకు అడ్డంగా  వున్న కూలింగ్ గ్లాసెస్ తొలగిస్తూ అన్నాడు.

    ఓ క్షణం పరికించి చూసి  "ఆ.... రా.... లోపలికి" అన్నాడు అతని కంఠం వణుకుతోంది.

    మొదటి గది  దాటి లోపలికి  వెళ్ళారు.

    ఆ గదిలో నేల మీద రెండు పరుపులు  పరిచి  వున్నాయి.

    కూర్చోమన్నట్లుగా  సైగ చేశాడు.

    చుట్టూ  పరిశీలనగా  చూశాడు  పాల్.

    దాదాపు  ఖాళీగా  వుందా గది. గదిలో  ఒక మూలగా  ఒక చెక్క బీరువా  వుంది ఆ బీరువా  మీద కొన్ని పుస్తకాలు  పేర్చి  వున్నాయి.

    "ఈ కుర్రాడి పేరు పాల్. ఇతనే డి జి పి ని, హోంమినిస్టర్ని చంపేది" చెప్పాడు తాతాతో.

    "హలో  చైల్డ్....నైస్ టు మీట్" అంటూ  చేయి  ముందుకు చాపాడు తాత.

    అతని  గొంతుతోపాటే  చేయి కూడా వణుకుతోంది.

    తన చేయి  ముందుకు  చాపి  అతని చేతిని  అందుకుని  వదిలేశాడు పాల్.

    "పిల్లవాడు....కష్టమైన పని....బెదురుతాడేమో?"

    నవ్వాడు  ఉపేంద్ర."వయసు  తక్కువే తాతా! కానీ గుండెధైర్యం  ఎక్కువ. కరీంనగర్ ఫారెస్ట్ లో  ఒక సర్కిల్ ఇన్స్ పెక్టర్ని  ఇద్దరు  సబ్  ఇన్స్ పెక్టర్లని, ఐదుగురు స్పెషల్ బెటాలియన్ మనుషుల్ని  ఒంటరిగా  వెళ్ళి మందు పాతర పెట్టి చంపాడు. చావుకి  కూడా  భయపడడు."

    "కీప్ ఇట్ అప్ మై చైల్డ్" అన్నాడు తాత ఒకింత  ఆనందంగా.

    "సరే....అసలు  విషయానికి వద్దామా!" ఇంక ఆలస్యం చేయటం ఇష్టం లేన్నట్లుగా  అన్నాడు ఉపేంద్ర.

    అలాగే  అన్నట్లుగా  తల ఊపి  బీరువా  వైపు  కదిలాడు.

    జేబులోంచి  'కీ' ఒకటి తీసి బీరువా  తాళం  తెరిచాడు  తాత.

    కన్ను  ఆర్పకుండా  అటువైపు  చూడసాగారు  యిద్దరూ.

    కిర్రుమని శబ్దం  చేస్తూ  తెరుచుకుంది ఆ బీరువా.

    నల్లని  నలుపు  రంగులో  ఉన్న  ఆ బీరువాలో  ఏముందో వాళ్ళకి  సరిగ్గా  కనపడటం లేదు.

    ఆ బీరువాలోంచి  ఒక అట్ట పెట్టెను  బయటికి  తీశాడు  తాత.

    దానిని  తెచ్చి  ఉపేంద్ర, పాల్ ల ముందుంచాడు.

    తానూ కూర్చున్నాడు.

    ఆసక్తిగా  అటువైపు  చూశాడు  పాల్.

    పెట్టె మూత  తెరిచాడు  తాత.

    అందులో  నుండి  ఒక సోనీ వీడియో కెమెరా  బయటపడింది.

    దానిని  పరుపు  మీద వుంచి  పెట్టెని అవతలకి  జరిపాడు.

    "సారీ ఉపేంద్ర! నువ్వు అడిగినట్లుగా  గన్ ని ఇందులో  ఫిట్ చేయాలని ప్రయత్నించాను కానీ ఆ గన్ సైజు చాలా పెద్దది కావటంతో ఇందులో  ఫిట్ అవటం లేదు" సంజాయిషీగా అన్నాడు తాత.

    అదే సమయంలో  "తాతా" అన్న  స్త్రీ కంఠం ఒకటి  లోపలి నుంచి వినిపించింది.

    "వస్తున్నా" అంటూ  లేచి  "ఇప్పుడే వస్తా" అని లోపలికి వెళ్ళాడు తాత.

    అతను  కూర్చునేటప్పుడు, తిరిగి నిలబడేటప్పుడు  రెండు చేతులతో  మోకాళ్ళు పట్టుకోవడం  గమనించాడు పాల్.

    వార్ధక్యంలో వచ్చే కీళ్ళ నొప్పులు అయి వుండచ్చు  అనుకున్నాడతను.

    "ఈయన గురించి  నీకు తెలియదు కదా!" అన్నాడు ఉపేంద్ర.

    తెలియదన్నట్లు  తల వూపాడు పాల్.

    'ఇతను ఒక ఎలక్ట్రానిక్స్  ఇంజనీర్. అమోఘమైన  తెలివితేటలు  వున్నవాడు. ఇతనికి భారత ప్రభుత్వం అన్నా, ప్రభుత్వ విదానాలన్నా విముఖత .అందుకే  ప్రభుత్వం మీద తిరుగుబాటు  చేసే వ్యక్తులకు తన సహాయం  అందచేస్తుంటాడు. దాదాపు  పదేళ్ళపాటు  కెనడాలోని టెర్రరిస్ట్ క్యాంప్స్ లో తిరిగాడు. ఇంగ్లండ్ లో రెండేళ్ళపాటు  టెర్రరిస్ట్ క్యాంప్స్ లో వుండి ఖలిస్తాన్ ఏర్పాటు  వాదులకు  ట్రైనింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ లోని కరాచి, రావాల్సిండిల మధ్య దగ్గరున్న  టెర్రరిస్ట్ స్కూల్స్ లో  వుండి కాశ్మీర్ మిలిటెంట్స్ తయారవటంతో  సహాయపడ్డాడు. ఇప్పుడు  వయస్సు పైబడటంతో ఇక్కడే వుంటున్నాడు. ఇతని మీద ఏ పోలీసులకి  అనుమానం లేదు. ఇప్పుడు మనకి చాలా సహాయపడుతుంటాడు. ఎ.కె.47, ఎ.కె.56 గన్స్  మొదటగా  మనకి  తెచ్చి  ఇచ్చింది  ఈయనే.

    దానిని  వుపయోగించడం  నేర్పింది  ఈయనే. దానిని రిపేరు చేయగలిగింది  ఈయనే. ఎ.కె 47 గన్ ని రివాల్వరు సైజులో తయారుచేయగలడు. రివాల్వర్ ని ఎ.కె 47 లాగ కూడా చేయగలడు. హి ఈజ్ ది మ్,మాస్టర్ ఇన్ దిస్" ఇంకా ఏదో అనబోతున్న  ఉపేంద్ర తాత  రావటంతో  సైలెంట్ అయ్యాడు.

    తాత  వెనుకగా  ఒక అమ్మాయి వచ్చింది. ఆమెకు  సుమారు పదిహేడేళ్ళు వుండి నల్లగా ,పొడవుగా వుంది. ఉంగరాల జుట్టు....వదులు జడ....నుదుట అడ్డంగా చిన్న విభూది బొట్టు, లంగా జాకెట్ ధరించి ఉంది. చూడగానే  ఆమె మళయాళీ  అని చెప్పవచ్చు.

    ఆమె చేతిలో  ట్రే అందులో  మూడు కప్స్ వున్నాయి.

    వాటిని  అక్కడుంచి  వెళ్ళిపోయిందామె.

    తీసుకోమన్నట్లు  సైగ చేశాడు తాత.

    వాటిని  అందుకున్నారు ఇద్దరూ.

    "ఇప్పుడు  మరి దీనిలో  గన్ ఫిట్ చేయలేదా?" అడిగాడు ఉపేంద్ర.

    "చేశాను. కానీ ఎ.కె 47 వుంది. మీరు చెప్పింది  ఇందులో  ఫిట్ చేయటం  అసంభవం" అని పాల్ వైపు తిరిగి "నీకు  ఈ గన్ గురించి  తెలుసా?" అని ఉపేంద్ర  చెప్పిన  గన్ గురించి  అడిగాడు.

    తెలియదన్నట్లు  తల వూపాడు  పాల్.

    నవ్వాడు  తాత.

    "అటువంటి  ఒక వంద గన్స్ ఉంటే చాలు. గంటల్లో ప్రభుత్వాన్ని మార్చెయ్యవచ్చు. అది అంత పవర్ ఫుల్ గన్. దాని కెపాసిటీ ఎంతో తెలుసా?"

    ఆసక్తిగా  కళ్ళు పెద్దవి చేశాడు  పాల్.

    "టూ థౌజండ్ బుల్లెట్స్ పర్ మినిట్"

    అదిరిపడ్డాడు  పాల్.

    "అవును. నిమిషానికి  రెండు వేల తూటాలు  ఆ గన్ లో నుండి  బయటికి  వస్తాయి. హైలీ సొఫెస్టికేటెడ్, హైలీ ఎడ్వాన్స్ డ్. అది తెప్పించి ఇందులో  ఫిట్ చేయాలనుకున్నాను. కానీ కుదర్లేదు. ఎనీవే....ముగ్గుర్ని చంపడానికి ఎ.కె. చాలు"

    ఖాళీ కప్పు  ప్రక్కన  పెట్టి తాత  చెప్పే విషయం  ఊపిరి  బిగపట్టి వింటున్నాడతను.

    "ఇది చూడు" అంటూ  కెమెరాలెన్స్ లో  వున్న  పార్ట్ ని పట్టుకుని స్క్రూలాగి తిప్పాడు.

    ఏడెనిమిదిసార్లు  తిప్పగానే  లెన్స్ ఊడి వచ్చింది. దాని లోపల నల్లగా నిగనిగలాడుతూ  గన్ బార్టల్ కనిపించింది.

    కేసెట్ లోడ్ చేసే పార్ట్ లో  గన్ బాడీ వుంది. 

    ట్రిగ్గర్ పార్ట్ ఛార్జ్ బుల్ సెల్ పార్ట్ లోకి వచ్చి వుంది.
   
    గన్ పై భాగంలో  టెలిస్కోప్ వుంది. ఆ టెలిస్కోప్ లోని క్రాస్ వైరుని' వీడియో కెమెరా జామ్లెన్స్ ఫోకసింగ్ తో సింక్రనైజ్ చేశాడు.

    అంటే జామ్ ని ఎవరిమీద అయితే  ఫోకస్ చేస్తామో టెలిస్కోప్ లో కూడా  ఆ మనిషి ఫోకస్ అవుతాడు. అంటే ఎయిమింగ్ ఖచ్చితంగా  వుంటుంది. అటువంటి సమయంలో  ఆ గన్ నుండి  బుల్లెట్ రిలీజయితే  అది ఖచ్చితంగా ఆ వ్యక్తిని తాకుతుంది. గురితప్పే  ఛాన్స్ లేదు.

    గన్ ట్రిగ్గర్ ని కెమెరా 'మోడ్ ఆన్ బటన్ కి కనెక్ట్ చేశాడు.

    చూపుడు వేలితో  ఆ బటన్ ని ప్రస్ చేస్తే  చాలు గన్ ఫైర్ అవుతుంది.

    చూసే వ్యక్తులకు అది మామూలు వీడియో కెమెరా మాత్రమే. అందులో  వీడియో కేసెట్ రికార్డింగ్  కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరయినా చెక్ చేయాలనుకున్నా అది వీడియో కెమెరాలాగే కనిపిస్తుంది.

    "ఈ క్రింద  ఒక బటన్ వుంది చూడు" అంటూ వీడియో కెమెరా రిస్ట్ హేండిల్ కి ప్రక్కన వున్న ఒక బటన్ చూపించాడు తాత.

    చిన్న రెడ్ బటన్ అది.

    "ఇది సేఫ్టీ బటన్. ఈ బటన్ ప్రస్ చెయ్యనంతవరకూ  యిది వీడియో కెమెరాలాగే  పని చేస్తుంది. ముందు దీనిని  వీడియో కెమెరాలాగే  ఆపరేట్ చెయ్యి. నువ్వు సూట్ చెయ్యాల్సిన సమయం రాగానే ఈ రెడ్ బటన్ నొక్కావంటే  నీకు వ్యూఫైండర్ లో క్రాస్ వైర్స్ కనిపిస్తాయి. వెంటనే  ఫోకస్ బటన్ నొక్కు. నువ్వు చంపాలనుకున్న వ్యక్తి ఫోకస్ అవుతాడు. తక్షణం మోడ్ ఆన్ బటన్ నొక్కు. బుల్లెట్స్ రిలీజ్ అవుతాయి. దీనికి  సైలెన్సర్ కూడా ఫిట్ అయ్యి వుంది. కాబట్టి  శబ్దం తక్కువగా వస్తుంది. ఒక కూల్ డ్రింక్ బాటిల్ ప్రెస్ చేసినప్పుడు  ఎంత శబ్దం వస్తుందో  అంతే శబ్దం వెలువడుతుంది.అది ఎవరూ  నోటీస్ చేయలేరు" సుదీర్ఘంగా చెప్పి  వూపిరి పీల్చుకున్నాడు తాత.

    అర్ధమైందన్నట్లుగా  తలూపాడు  పాల్.

    "ఒకసారి సిస్టమ్స్ అన్నీ చెక్ చేసుకో" చెప్పాడు తాత.

 Previous Page Next Page