Previous Page Next Page 
మౌనం పేజి 40

    "నేను నిన్ను వ్యభిచారం చేయమనటం  లేదు. కేవలం  హెయిర్ ఆయిల్ కి మోడలింగ్ చేయమంటున్నాను. నా అభ్యర్ధన నీకు అభ్యంతరకరంగా  వుంటే  నీ ఇష్టం."

    "ప్లీజ్ చంద్రా....! అటువంటి  మాటలు  అనొద్దు." దాదాపు అరిచినట్లు  అని గిర్రున వెనక్కి  తిరిగి బెడ్ రూమ్ లోకి వెళ్ళి మంచం మీద పడుకుని  వెక్కి వెక్కి ఏడ్చిందామె.

    పెళ్ళయితే  మోడలింగ్ వైపు  కన్నెత్తి  చూడకూడదనుకుంది.

    కానీ....మోడలింగ్  చేయాల్సిన  పరిస్థితి  కనిపిస్తోంది.

    ఇందులో  చంద్ర తప్పు ఏముంది?

    మోడలింగ్  చేయమన్నాడు.

    అది తనకు కొత్త కాదు. హెయిర్ ఆయిల్ కి మోడలింగ్ అంటే అసభ్యత లేదు.

    ప్రస్తుతం డబ్బు  అవసరం  అలా వుంది.

    పదివేలు  అంటే మాటలు  కాదు.

    రెండు మూడు నెలలు దైర్యంగా  బ్రతికేయ్యచ్చు.

    ఈలోపు  చంద్రకాంత్ కి కెమెరాలు  దొరికితే....ఇక ఏ ఇబ్బందీ వుండదు.

    ఆలోచించిన కొద్ది  ఆ పనిలో  తప్పు  లేదనిపించింది.

    ఇంత  మంచి అవకాశం  వదులుకోవటం  అవివేకం అని కూడా  అనిపించింది.

    వాకిట్లోకి  వచ్చిన  లక్ష్మిని  కాలతన్నినట్లవుతుంది.

    ఆ నిర్ణయానికి  వచ్చిన ఆమె మనస్సు తేలిక అయింది.

    బెడ్ మీద నుండి లేచి వాష్  బేసిన్ దగ్గరకు వెళ్ళి మఖం  కడుక్కుంది.

    బీరువా దగ్గరకు నడిచి  పింక్ కలరు షిఫాన్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్ తీసి ధరించింది.

    వెలైనర్, మస్కరా  అప్లై చేసి బ్లష్ అవుట్ చేసింది.

    హెయిర్ ని బ్రష్ చేసి  ఫ్రీగా వదిలేసింది.

    క్షణాల్లో  ఆమె రూపు అందంగా మారింది.

    తృప్తిగా  ఒకసారి  అద్దంలో  చూసుకుంది.

    హాలులోకి నడిచిందామె.

    సోఫాలో కూర్చుని  కాళ్ళు  రెండూ  టీపాయ్ మీద ఉంచి  కళ్ళు మూసుకుని వున్నాడు చంద్రకాంత్.

    "చంద్రా!" చూపుడు వేలితో అతని  బుగ్గమీద  చిన్నగా తట్టి పిలిచిందామె.

    కళ్ళు  తెరిచాడతను.

    "అయామ్ రెడీ"

    అర్ధంకానట్లు  చూశాడతను.

    "పద....వెళ్ళి ఈ మోడలింగ్ ఎసైన్ మెంట్ గురించిన పూర్తి వివరాలు మాట్లాడదాం."

    నమ్మలేనట్లు  చూస్తున్నాడతను.

    "నిజం  చంద్రా! అయామ్ రెడీ ఫర్ మోడలింగ్"

    "థాంక్యూ అర్చనా! థాంక్యూ సోమచ్! నీకు ఇష్టం లేకపోయినా నా కోసం  ఒప్పుకున్నావు. నీవు ఇష్టంలేని  పని చేయిస్తున్నాను. నన్ను క్షమించు...." అన్నాడు.

    అతని  కంటిలో  సన్నని  నీటిపొర  కదలాడింది.


                     *    *    *    *

    "మన ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నాను"

    ఉలిక్కి పడిందామె ఆ మాటకి.

    "అవును అర్చనా....! ఇట్స్ కాంట్  బట్....తప్పనిసరి కాబట్టే ఆమ్మేయాలన్న ఆలోచన వచ్చింది."

    తినబోతున్న  అన్నం  ముద్ద తిరిగి ప్లేట్లోనే  పడేసిందామె.

    "ఏం?" తేరుకుని  అడిగింది.

    "గత్యంతరం లేక"

    "బ్యాంక్ లోన్ కట్టాలా?" ఆమెకు గుండె  దడదడలాడుతోంది.

    "అవును! ఐదు నెలల ఇన్ స్టాల్ మెంట్ కట్టాలి. వచ్చే నెలలోగా కట్టకపోతే నోటీసు వస్తుంది."

    "కానీ....ఇల్లు ఆమ్మేస్తే  మనం....ఎక్కడ  వుండాలి?"

    "ఎక్కడేముంది? అద్దె ఇంట్లో"

    అదిరిపడింది  ఆమె.

    రోజు రోజుకీ  పరిస్థితి దిగజారుతోంది.

    హెయిర్ ఆయిల్ మోడలింగ్ డబ్బులతో  రెండు నెలల నుంచి కొంచెం టెన్షన్ లేకుండానే  గడిచింది.

    చంద్రకాంత్ కెమెరా కిట్ ఆచూకి  లేదు. దాని మీద ఇంక ఆశ వదులుకుంది. ఆ మాటే  అతను కూడా చాలాసార్లు  అన్నాడు. ఇంక నేను ఎడ్వటైజింగ్  వీడియోగ్రాఫర్ గా బ్రతకలేను. మరో దారి చూసుకోవలసిందే! అని కారణం....మళ్ళీ  ఎక్విప్ మెంట్  కొనాలంటే  ఐదారులక్షలు అవుతుంది. ఇప్పుడు  తీసుకున్న లోన్ డబ్బులే  కట్టేందుకు  అవకాశం లేదు. ఇంక మళ్ళీ  కొనటమా! అసంభవం....

    అర్చన పెళ్ళయి ఆర్నెల్లు  దాటింది. ఆమె తల్లిదండ్రులు  ఇంత వరకు ఆమె ముఖం చూడలేదు. అతని తల్లిదండ్రులెవరో  ఆమె ఇంతవరకు చూడలేదు. అందువల్ల  రెండు వైపుల నుంచి  ఎటువంటి  సహాయమూ రాదు అన్నది ఖచ్చితంగా నిర్ధారణ అయిపోయింది.

    "బ్యాంక్ లోన్ ఎంత మాత్రం  ఉంటుంది చంద్రా....?" అడిగిందామె.

    "మూడున్నర లక్షల  దాకా వుంది"

    "ఇల్లు అమ్మితే  ఏ మాత్రం  రావచ్చు?"

    "మూడో....మూడున్నర  లక్షలు వస్తుంది"

    "ఇల్లు అమ్మకపోతే  మరో విధంగా  బ్యాంక్ లోన్  కట్టలేమా?"

    "ఎలా కడతాము?"

    "ఉన్నదంతా  అమ్మి అప్పు తీర్చితే  వుండేదెలా?"

    "ఇంతకు ముందే  చెప్పా కదా! అద్దె ఇంట్లో వుంటాము."

    "తప్పదా!"

    "అంతకంటే  మార్గంలేదు."

    "ఆ తర్వాత తిండి గడిచే మార్గం?"

    "ఏదో ఒక వ్యాపారం  చూసుకోవటమే."

    "వ్యాపారం  అంటే?"

    "అంటే ఏముంది? ఏదో ఒక బిజినెస్"

    "బిజినెస్సా!"

    "అవును."

    "బిజినెస్ అంటే  పెట్టుబడి  కావాలి కదా!"

    "మనసుంటే మార్గం  వుంటుంది."

    "నాకు అర్ధం కాలేదు?"

    "ఇందులో  అర్ధమయ్యేందుకు  ఏముంది? మనం మనసు  పెట్టి ఆలోచించాలే కానీ మార్గాలు బోలెడు."

    "మార్గం సగంతలా  వుంచు. అసలు  ఏం వ్యాపారం  చేద్దామని?"

    "నేను  చేయదగ్గ  వ్యాపారం."

    "అంటే?"

    "అంటే  ఏముంది? ఈ ప్రక్క కాలనీలో  అపార్టుమెంట్సు వున్నాయి. దాదాపు వెయ్యి ఇళ్ళ వరకు  వున్నాయి. ఆ కాలనీలో  కేబుల్ టీ.వీ. పెట్టాం అనుకో....హాయిగా  బ్రతికెయ్యవచ్చు."

    "కేబుల్ టీవీనా! దాని గురించి  నీకేం తెలుసు?"

    "అరె....వీడియోగ్రాఫర్ని, ఆ మాత్రం  తెలీదా?"

    "నెలకి  ఎంత వస్తుంది?"

    "ఎంత తక్కువ  అనుకున్నా  పదివేలు వస్తుంది."

    "పదివేలా!"

    "అవును."

    "కానీ....పెట్టుబడి?"

    "కావాలి."

    "ఎంత?"

    "ఏభైవేల  నుండి  డెబ్భై ఐదువేల వరకూ  కావాలి."

    "అమ్మో!"

    "తప్పదు మరి. అంతయినా  లేకపోతే  స్టార్ట్ చేయటం  కుదరదు."

    "ఐడియా బానే వుంది. కానీ  అంత డబ్బు?"

    "అదే కదా సమస్య."

    "ఇంట్లో  వున్న ఫ్రిజ్, టి.వి. విసిఆర్ అవి అమ్మేస్తే?"

    "మనం చేయబోయేదే కేబుల్ టి.వి. వ్యాపారం. దానికి టి.వి, విసిఆర్ లు తప్పనిసరిగా  కావాలి."

    "మరి డబ్బు  ఎలా?"

    "నేనొక సలహా  చెప్పనా?"

    "ఏమిటది?"

    "నువ్వు కోపం  తెచ్చుకోకూడదు  మరి."

    "ఏమిటది? మళ్ళీ  మోడలింగా  ఏమిటి?"

    "ఖచ్చితంగా  చెప్పావు. అదే."

    "ఏం మోడలింగ్?"

    "ఏభై వేలు  వచ్చే మోడలింగ్."

    "ఏభై వేలా?"

    "అవును."

    "మైగాడ్! అంత పే చేసే కాంపెయిన్  ఏమిటి?"

    "సోప్స్ కి....కొత్తగా  ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి  వస్తోంది. దానికి యాడ్ ఫిల్మ్, ఫోటోలు అన్నీ కావాలట. నువ్వు చేసేటట్లయితే  యాభై వేలు  యిస్తాం అన్నారు."

    "సోప్స్ కి మోడలింగ్....అంటే  అర్ధనగ్నంగానా?"

    "ఛ....అర్ధనగ్నంగా  ఎలా తీస్తారు? కేవలం  భుజాలు చూపాలి అంతే!"

    తెల్లబోయింది ఆమె.

 Previous Page Next Page