Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 38


    "అబ్బా! ఎలా ఈ సమస్య సాల్వ్ అయ్యేది?" దిగంబరరావు తలపట్టుకు కూర్చున్నాడు.

     "ఈ సమస్యకి పరిష్కారం వుంది. రేపా పిల్లతో శ్రీచక్రకి ఎంగేజ్ మెంట్ జరక్కూడదు." దీనికింత తల బద్దలు కొట్టుకోవడం ఎందుకన్నట్లుగా తేలిగ్గా  సలహా ఇచ్చింది భార్య.
   
    "రేపు కాదు, ఎప్పటికీ జరగకూడదు. మన వినూకి, అతడికీ మధ్య వున్న ఆ పిల్లను తప్పించడమే. అదీ శాశ్వతంగా."

     తల్లి ఏం మాట్లాడుతుందో అర్దంకాగానే వినోదిని ముఖం నల్లబడ్డట్టుగా అయింది.

     "వద్దొద్దు! ఒకరి రక్తాన్ని చిందించి కట్టుకునే ఆ వివాహబంధం నాకొద్దు."

    అందేగానీ వినోదిని వారింపులో అంత బలం కనిపించలేదు.

     "ఇక ఈ విషయంలో నోరు మూసుకో. నువ్వు కోరుకున్నట్లుగా నీ పెళ్లి శ్రీచక్రతో జరుగుతుంది. శ్రీచక్రతోనే నీ పెళ్ళి నేను జరిపిస్తాను" ధృఢంగా అన్నాడు దిగంబరరావు.
 
    సుతిమెత్తని మనసు వినోదినిది . కానీ ఈ విషయంలో  రాయిలా గట్టిపడిపోవడం మొదలుపెట్టింది ప్రేమ త్యాగాన్ని కోరినట్టే బలినీ కోరుతుందేమో!


                       *    *    *    *    *

       
    "అక్కా! కారొచ్చేసిందే" పరుగెత్తుకు చెప్పింది మందాకిని.

     "ఇంకా అలంకరణ పూర్తి అయిందా లేదా?" అంటూ హడావుడి పడుతూ వచ్చాడు యోగానందం.

     "అయిపోయినట్టే" కోడలికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ అంది అనసూయ.

    "అబ్బా! మరీ గంగిరెద్దులా తయారు చేసేరేమిటి? సింపుల్ గా వుంచకూడదూ?"

    "ఈ కాస్త అలంకరణే గంగిరెద్దు అంటారేమిటి? ఇలాంటి సందర్బాలలో  సింపుల్ గా తయారయితే చూసేవాళ్లకి పరిమదరిద్రంగా కన్పిస్తుంది. పెళ్లిళ్లకీ, ప్రదానాలకీ సింపుల్ గా వుంటే ఏం బాగుంటుంది? అది వక్షాధికార్ల ఇంటికి కోడలిగా వెడుతున్న పిల్ల. ఈ రోజు దాని పెళ్లికి ప్రదానం జరుగుతోంది. ఓ రెండు మట్టిగాజులు, ఓ వాయిల్ చీర కట్టబెడితే ఏంబాగుంటుంది?"

    "ఈ అలంకరణంతా  మీ అత్తదేనా మణీ?"

    "అవున మామయ్యా!"

    ఎక్కడెక్కడ నుండి సేకరించిందో వళ్లంతా నగలు  అలంకరించింది. బూటా వున్న కంచి పట్టుచీర కట్టించింది. ఆ చీర, ఆ నగలు మోయలేని భారంగా వున్నాయి కౌస్తుభకు. ఊపిరాడనట్లుగా, ఎప్పుడెప్పుడు వీటిని వదిలించుకుంటానా అన్నట్లుగా అసౌకర్యంగా వుంది. కానీ తప్పదు, భరించాలి. అత్త నొచ్చుకుంటుంది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుని, తండ్రి ప్రేమకు దూరమైన తమకు అన్నీ తామై పెంచిన ఈ అత్తమామల దగ్గరికి  వచ్చేసరికి తన స్వంత అభిప్రాయాలేవీ పనిచేయవు కౌస్తుభకు.

     "బ్యూటీషియన్ని తలదన్నిందే మీ అత్త.  అసలు మా మణేనా అన్నంత ఇదిగా మార్చేసింది. నా కళ్లనే తిప్పుకోలేకపోతున్నాను. ముందు మణికి దిష్టి తియ్యి. ఆ..... ఆ తర్వాత తెమలండి. అవతల కారొచ్చేసింది" అంటూ అక్కడి నుండి కదిలాడు యోగానందం.

     పిడికిట్లో ఉప్పు తెచ్చి కౌస్తుభ చుట్టూ  మూడుసార్లు గిరగిరా తిప్పి పొయ్యిలో పోసొచ్చింది అనసూయ.

     వీళ్ల కోసం అంబాసిడర్ కారు, ఇరుగుపొరుగు కోసం మారుతీ వ్యాను పంపించాడు మారుతీరావు.

     వీళ్లని ఎక్కించుకుని రెండు వాహనాలు  బయల్దేరాయి హోటల్ అప్సరాకు.

     పది నిముషాల తరువాత ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది అంబాసిడర్. దాని వెనుక మారుతీ వ్యాన్.

     అంతవరకూ అంబాసిడర్ ను ఫాలో అవుతూ వచ్చిన లారీ కూడా ఆగిపోయింది.

     అందులోంచి నలభయ్యేళ్ళ వయసుండే ఒకతను దిగి గబగబా పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరకు వెళ్లి - "కారులో ఆమె ఒక్కతేలేదు. వాళ్ల ఫామిలీ మొత్తం వున్నారు. ఒక్కదానికోసం అంతమందినీ.... "అని ఆగాడు.

     అతడు డానీ.

     "అరే ఫూల్ ఆమె ఒక్కతే మనకు దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది?  లేపేయ్! అందరినీ లేపేయ్" కూతుర్ని తీసుకుని హోటల్ అప్సరాకు బయల్దేరబోతున్న దిగంబరరావు అసహనంగా అరిచాడు. ఫోన్ పెట్టేసి కూతుర్ని తీసుకుని కారులో బయల్దేరాడు.

     మరో పదినిమిషాల్లో అక్కడుంటాడు. అక్కడే వింటాడు ఆక్సిడెంట్ వార్త. ప్రదానానికి వెళుతున్న పెళ్లి కూతురు, బంధువులు రక్తపు మడుగులో పీనుగులై పడిన ఆ సన్నివేశాన్ని వూహించుకుంటుంటే దిగంబరరావు ముఖంలో వికృతమైన నవ్వు కదలాడింది.

     గ్రీన్ సిగ్నల్ పడుతూనే వాహనాలన్నీ  హడావుడిగా కదిలాయి. డానీ లారీ కూడా   కదిలిందిగానీ అంబాసిడర్ వెనుక కాకుండా మరో రూట్ లో వెళ్లి అంబాసిడర్ కి ఎదురొచ్చింది.

    కారు ఓ యాభై గజాల దూరంలో వుండగానే. యాక్సిలేటర్ మీద బూటు కాలుంచి  బలంగా అదిమాడు డానీ. కనుమూసి తెలిచేలోగా ఏడెనిమిది గజాల దూరంలోకి  వచ్చేసింది అంబాసిడర్.
 
     ఇంకెంత?

    కొద్ది సెకనులు మాత్రమే!

    అంబాసిడర్ ని బలంగా గుద్దేసి కనుమూసి తెరిచేలోగా మాయమై పోవడమే.

    భూతంలా మీదకి వచ్చేస్తున్న లారీని చూసి కారులో వున్న వాళ్లంతా హాహాకారాలు చేశారు.

     డ్రైవర్ పక్కకి కోయాలని చూస్తుండగానే అది మరింత దగ్గరగా వచ్చేసింది.

    అయిపోయిందనే అనుకున్నారంతా.

     అప్పుడు జరిగింది వూహించని సంఘటన ఒకటి.

     రోడ్డువారగా దిక్కులు వూహించని సంఘటన ఒకటి.

     రోడ్డువారగా దిక్కులు చూస్తూ నడుస్తున్న ఒక కోయ యువతి  ఎదురుగా వస్తున్న స్కూటర్ ని చూసి బెదిరిపోయినట్లుగా ఎటుపోవాలో తెలియక  సర్రున రోడ్డు మధ్యకు వచ్చేసింది.

     లారీకి, కారుకు మధ్యన ఆమె.

    సడెన్ గా బ్రేక్ కొట్టాడు  డానీ.

     అంబాసిడర్ కూడా సడెన్ బ్రేక్ తో ఆగిపోయింది.

     "దెయ్యం! రోడ్డుమీద నడవడం రాకపోతే ఎట్లా? ఉత్తపుణ్యానికి మమ్మల్ని జైల్లో కూర్చోబెడదామా?" తిట్టుకుంటూ లారీ దిగాడు డానీ.

     ఆమె లారీక్రింద పడిందనే అనుకున్నాడు.

     ముందు అతడు చక్రాలకింద చూశాడు - గిలగిల్లాడుతూ ఆమె రక్తపు మడుగులో కనిపిస్తుందేమోనని. రక్తపుమడుగులేదు, ఆమేలేదు.

     బాగా వంగి లారీ కిందకి చూసాడు.

     దేక్కుంటూ లారీ ముందుకు వస్తోందామే.

     "ధూత్తేరీ! ఏమొచ్చిందే నీకు? చావాలని వచ్చినావా?' కోపంతో నమిలి మింగేసేలా వున్నాడు డానీ.

     "నాకు గీపట్నం కొత్తన్నా. సైకిల్ మోటార్ని చూసి భయపడ్డా!"

    అప్పటికే ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయి ట్రాఫిక్ జాం అయిపోయింది.

     అందరూ క్రిందికి దిగి గుమిగూడారు.

     అంబాసిడర్ లో వున్నవారంతా తేలిగ్గా నిట్టూర్పు విడిచారు లారీ సడెన్ బ్రేక్ తో ఆగిపోవడంతో.

     మృత్యుకెరటం తమమీద నుండి పోయే  బదులు ఆ అమ్మాయిమీద పోయిందేమో  అనుకుంటూ కారులోంచి దిగారంతా.

     ఆమె లారీ క్రింద నుండి నెమ్మదిగా పాక్కుంటూ బయటకు రావడం చూసి - "అమ్మయ్య!" అంటూ తేలిగ్గా నిట్టూర్పు విడిచారు.

     ఆమె లారీ క్రింద పడి కూడా బ్రతికి పువ్వులా బయటకి రావడం ఒక అధ్బుతంగా చెప్పుకుంటూ తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లిపోసాగారు.

     "దెబ్బలు తగిలాయా?" కౌస్తుభ ఆ యువతి భుజంతట్టి ఆత్మీయంగా అడిగింది.

     "ఊహూ! దెబ్బలు తగల్లే."

    "నువ్వు లారీకి అడ్డం రావడంవల్లే మేం బ్రతికిపోయాం. ఆ లారీ వాడు త్రాగి నడుపుతున్నాడో ఏమో!  అదుపు తప్పిన ఏనుగులా మా మీదకి వచ్చేసిందనే అనుకున్నాం. మృత్యువును చూసి వెనక్కి వచ్చినట్లుగా వుంది మాకు."

    "కళ్లు మూసుకుని నడుపుతున్నావా? లేక తప్పతాగి నడుపుతున్నావా? ఏమైందిరా నీకు?"అప్పటికే అంబాసిడర్ కారు డ్రైవర్ డానీని చెడామడా తిడుతున్నాడు.

     ఓ వైపు నుండి ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పరుగెత్తుకు వస్తున్నాడు.

     డానీ దున్నపోతులా ఆ మాటలేవీ పట్టించుకోకుండా మౌనంగా లారీ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు.

     "బాగా ట్రాఫిక్ వుండే రోడ్లమీద చాలా జాగ్రత్తగా నడవాలమ్మా.  చూడు ఎంత ప్రమాదం తప్పిందో?" అన్నాడు యోగానందం. ఆమెవల్ల  కదా తమకీరోజు చావు గండం తప్పిపోయిందన్న కృతజ్ఞత మనసునిండా నిండిపోయింది.

     "నీ పేరేమిటమ్మా? ఎక్కడుంటావు?"

    "సిరి నా పేరు. ఎక్కడంటే ఏం చెప్పను. ఏడకెళ్లాలో ఎరికైతలేదు. కష్టాలొచ్చినాయ్ సామీ! ఉన్నూరిడిసినా" కన్నీళ్ల పక్యంతంగా  అంది సిరి.

     అప్పుడే విచ్చిన పువ్వులా యవ్వన  సుగంధాలను వెదజల్లుతున్నట్లుగా వుంది.

     ఆమె కట్టుకున్న తెల్లచీర మోకాళ్లకి కొంచెం దిగువగా  వుంది.  రవికలేని ఆమె భుజం అనాచ్చాదితంగా యువకులకి గాలం వేస్తున్నట్లుగా వుంది.    

 Previous Page Next Page