Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 38


                    రైలు ప్రయాణీకులకు శిక్షణ!
    కొత్తగా రైళ్ళలో ప్రయాణం చేసేవారి సౌకర్యం కోసం రైల్వే మినిష్టరుగారు ఒక ట్రైనింగ్ కాంప్ ప్రారంభోత్సవం చేశారని, నెలరోజులు అద్భుతమయిన శిక్షణ తర్వాత వారు మనదేశంలో ఏ రైల్లోనయినా చాలా సునాయాసంగా ప్రయాణం చేయగలరనీ న్యూస్ పేపర్లలో చదివాము మేము.
    శిక్షణ ఆఖరిరోజున ఆ మొదటి బాచ్ ప్రయాణీకులకు తాము ఎంత అద్భుతంగా శిక్షణ ఇచ్చింది ప్రజలు చూడవచ్చని విని మా కాలనీవాళ్ళంతా ఆ కాంప్ కి బయల్దేరాం. అప్పటికే ఆ ప్రయాణీకుల్ని చూడ్డానికి జంట నగరాల జనం కిక్కిరిసిపోయారు. ఓ రైల్వే అధికారి హడావుడిగా గ్రౌండ్ లో కొచ్చి కొద్ది నిమిషాల్లో మొదటి బాచ్ ప్రయాణీకులు అందరిముందుకు వచ్చి తాము రైల్వే అధికారుల ఆధ్వర్యంలో నేర్చుకున్న అనేక సాంకేతిక ప్రయాణపుటలవాట్లు ప్రదర్శించబోతున్నారని ఎనౌన్స్ చేశాడు.
    అతను విజిల్ ఊదడంతోనే ఒక పెద్ద బోనులోనుంచి కొన్ని వేలమంది ప్రయాణీకులు తమ తమ సామాన్లతో గ్రౌండ్ లోకొచ్చి అమాంతం కర్రలు, కత్తులు తీసి ఒకరితో ఒకరు భీకరంగా తలపడి గొంతులు పిసుక్కుంటూ, కిందపడేసి తొక్కుతూ కర్రలతో తలలు పగలగొడుతూ వీరవిహారం చేయసాగారు.
    మేమంతా నిశ్చేష్టులమైపోయాం. "ఈ ఫైటింగ్ సీన్లేమిటి? మీరు ముష్టియుద్ధాల ట్రైనింగ్ ఇస్తున్నారా లేక ప్రయాణం చేసే పద్ధతులు నేర్పిస్తున్నారా?" అడిగాడు రంగారెడ్డి ఓ రైల్వే అధికారిని.
    "అబ్బే - ఇవి యుద్ధాలు కాదండీ! ప్రయాణం చేయటానికి అవసరమైన మొదటి అర్హత ఇదే! ఉదాహరణకి చార్మినార్ ఎక్స్ ప్రెస్ తీసుకోండి! అందులో రిజర్వేషన్ లేని ప్రయాణీకుల కోసం ఒకటే జనరల్ కోచ్ ఉంటుంది. మరి ఆ ఒక్క కోచ్ లో రెండు వేలమందిలో ఏ రెండు వందల మంది ఆ కోచ్ ఎక్కాలో తేల్చుకోవాలంటే మిగతా వారందరికీ అంగవైకల్యం కలిగేంతవరకూ చావబాదాలి. అదే వీరికి మేమిచ్చిన అద్భుత శిక్షణ చూశారా! కేవలం రెండువందల మంది మాత్రమే మిగిలారు. వాళ్ళను రైల్వేశాఖ విజేతలుగా ప్రకటించి ప్రోత్సాహం కలిగిస్తుందన్నమాట."
    మేమ్నఃతా ఆనందం పట్టలేక చప్పట్లుకొట్టాం. ప్రయాణీకులందరూ లేచి మళ్ళీ బోనులోకి పరుగెత్తారు. క్షణంలో ఆ గ్రౌండ్ అంతా డైనింగ్ టేబుల్స్ చేసేశారు. మరుక్షణంలో బఫే డిన్నర్ స్టార్టయింది. బోనులో నుంచి పరుగెత్తుకొచ్చిన కొంతమంది ప్రయాణీకులకు అక్కడ వుంచిన భోజనం కాసరోల్స్ తీసుకుని ఆత్రుతగా తినసాగారు. వాళ్ళు స్క్రూ డ్రైవర్లు, రెంచ్ లు బోల్టులు, నట్లు కరకర నముల్తూ తినేయడం చూసేసరికి మాకు ఒళ్ళు జలదరించినట్లయింది.
    "ఏమిటది? వాళ్ళలా ఇనుప వస్తువులు తినేస్తున్నారు?" అడిగాను నేను ఓ రైల్వే అధికారిని. ఇది ప్రయాణీకుల కోసం రైల్వేమంత్రిగారు ప్రత్యేకంగా ఇస్తోన్న శిక్షణ. ఎందుకంటే మా రైల్వే డిపార్టుమెంట్ కాంటీన్స్ అన్నింట్లో మెకానిక్ లు వంట చేయాల్సి వస్తోంది. అలాంటప్పుడు అలవాటు చొప్పున వారు పనిముట్లు భోజనంలో వదలి మర్చిపోక తప్పదు కదా! అలాంటప్పుడు శుభ్రంగా నమిలివేస్తారన్నమాట. ఇలాంటి శిక్షణ విదేశాలలో కూడా ఇంతవరకూ ఎవరూ ఇవ్వలేదు. మన భారతదేశమే ప్రప్రధమంగా అమలు పరుస్తోంది."
    మేమంతా మళ్ళీ చప్పట్లు కొట్టాం. ఆ తర్వాత మరో బాచ్ ప్రయాణీకులు పరుగున బోనులోంచి వచ్చారు. ఆ ప్రయాణీకుల కోసం ఆముదం, సున్నపు నీళ్ళు, కొంచెం మురికినీళ్ళూ కలిపి వేడిచేసి అందులో కొంచెం పంచదార వేసి అందరికీ తలో కప్పు తాగించారు. అందరూ చిరునవ్వుతో తాగేశారు.
    "అదేమిటి? ఆ నీళ్ళు తాగేస్తున్నారు? జబ్బులు రావూ?" అడిగాడు సాయిరామ్ అమాయకంగా.
    "పిచ్చివాడా! అవి నీళ్ళు కాదు. రైల్వేలో దొరికే కాఫీ, టీ అన్నమాట. అవి తాగిన వెంటనే అందరికీ వాంతి అవుతూంటుంది సాధారణంగా. అలా వాంతులవడం, ఆరోగ్యం పాడవడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రోజూ ట్రైనింగులో చాలాసార్లు ఆ నీళ్ళు తాగించి అలవాటు చేస్తామన్నమాట! ఆ తర్వాత వాళ్ళు రైలు ప్రయాణంలో ఎన్ని కాఫీ, టీలు తాగినా వారికేమీ కాదు."
    మళ్ళీ ఆనందంకొద్దీ చప్పట్లుకొట్టి ఈలలు వేశాం. ఆ బ్యాచ్ వాళ్ళు బోనులోకి పరిగెత్తగానే చలాకీగా ఎగురుతూ పిల్లిమొగ్గలు వేస్తూ గ్రౌండ్ లోకి మరో బాచ్ ప్రయాణీకులొచ్చారు.
    "వీళ్ళలా నిలబడ్డారేమిటి మీ చేయకుండా?" అడిగాము మేము.
    "వీళ్ళు 72 గంటలపాటు ఏ ఆహారం, పానీయం లేకుండా కూడా చెలాకీగా వుండగలిగే శిక్షణ ఇచ్చాం! మా రైళ్ళు 72 గంటలు లేటైనా వీళ్ళు ఏమాత్రం చలించకుండా చలాకీగా వుంటారు" చెప్పాడు ఆ అధికారి.
    ఆ తర్వాత వారలా సూట్ కేసులతో నిలబడి ఉండగానే కొంతమంది దోపిడీ దొంగలు పరుగున వచ్చి వారందర్నీ చావగొట్టి సామానులు తీసుకొని పారిపోయారు.
    "ఇది సాధారణంగా రైళ్ళలో జరిగే దోపిడీల గురించి ఇచ్చిన ట్రైనింగు అన్నమాట" చెప్పాడా అధికారి. అందరం మళ్ళీ చప్పట్లు కొట్టాం! ఆ తర్వాత మరో బ్యాచ్ ప్రయాణీకులొచ్చారు గ్రౌండ్ లోకి. వారందరినీ గ్రౌండ్ లో వున్న క్రేనులు అమాంతం పైకిలేపి క్రిందకు విసిరేసినాయ్. కింద పడుతూనే కాళ్ళు విరగడం, తల పగలడం, చేయి విరగడం లాంటివి జరిగిపోయినయ్.
    "ఈ చిత్రహింసలేమిటి? వాళ్ళను ప్రయాణీకులనుకుంటున్నారా లేక పాకిస్థాన్ తాలూకూ టెర్రరిస్టు ఏజంట్లనుకుంటున్నారా?" అడిగాడు రంగారెడ్డి రైల్వే అధికారులను. చిత్రహింసలు కాదయ్యా! ఈ మధ్య రైలు ప్రమాదాలు ఎక్కువైపోయాయ్ కదా! ఎంత పెద్ద ప్రమాదం జరిగినా వారు మానసికంగా తట్టుకోడానికి ఈ శిక్షణ ఇస్తున్నారన్న మాట!"
    అంతలోనే కొంతమంది డాక్టర్లు, నర్సులు, వార్డు బోయ్ లు కర్రలు కత్తులు తీసుకుని పరుగున రావడం కనిపించింది. గ్రౌండ్ లో వున్న ప్రయాణీకులందరూ ఆ గాయాలతోనే చెల్లాచెదురయి పరుగు ప్రారంభించారు.
    పాపం వాళ్ళను చూస్తుంటే మాకు కళ్ళవెంట నీళ్ళు తిరగసాగినయ్. కొంతమంది పరిగెత్తలేని ప్రయాణీకులను పట్టుకుని బలవంతంగా నీళ్ళు తాగించసాగారు. ఖాళీగా వున్న సిరంజితో ఇంజెక్షన్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ తాళ్ళతో కట్టేసి తీసుకెళ్ళి పోస్టుమార్టం రూమ్ అనే బోనులోకి తోసేసారు. వాళ్ళంతా భయంకరంగా అరుస్తూ, ఏడుస్తూంటే డాక్టర్లూ, నర్సులూ అందరూ కలసి బ్రేక్ డాన్సు వేయసాగారు ఆనందంతో.
    "ఈ ఘోరం ఏమిటి?" అడిగాడు గోపాల్రావ్ అయోమయంగా.
    "రైలు ప్రమాదం జరిగాక ప్రయాణీకులను నిమ్స్, అపోలో, మెడ్విన్, సిడిఆర్ లాంటి మంచి హాస్పిటల్స్ లో చేర్చించడానికి మా రూల్స్ ఒప్పుకోవు కదా! అందుకని చచ్చినట్టు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోగానీ, రైల్వే హాస్పిటల్స్ లోగానీ చేరాల్సిందే! మరి ఆ హాస్పిటల్లో చేరినప్పుడు అక్కడ ట్రీట్ మెంటుని చూసి భయపడకుండా శిక్షణ అన్నమాట!
    ఏమాత్రం కొంచెం పెద్ద గాయం తగిలినా ప్రభుత్వ హాస్పిటల్స్ లో వాళ్ళని చచ్చినవాళ్ళక్రింద జమకట్టి పోస్ట్ మార్టమ్ రూములో వేసేస్తారు కదా! మరి ప్రాణంతో వుంటే శవాల గదిలో ప్రాణం పోయేవరకూ గడపాలంటే బాగా గుండె ధైర్యం, జీవితం మీద విరక్తి, తెగింపూ కలగాలి కదా! ఇవన్నీ ఆ రూమ్ లో వాళ్ళకి అలవడతాయన్నమాట"
    మాకు భయం వేసింది. అమాంతం అక్కడినుంచి పరిగెత్తడం ప్రారంభించాం. రైల్వే అధికారులు మా వెంటపడ్డారు.
    "అప్పుడే వెళ్ళిపోతారేమిటి? ప్రయాణీకులు ప్రమాదంలో చనిపోయాక స్వర్గంలో వేసే డాన్సు ప్రోగ్రామ్ చాలా వుంది. అదిచూసి వెళ్ళండి"
    మేము వినిపించుకోలేదు. ఇళ్ళు చేరుకునేవరకూ వెనక్కి తిరిగి కూడా చూడలేదు.
                         *    *    *

 Previous Page Next Page