Previous Page Next Page 
కళ్ళు పేజి 39


    క్షణక్షణానికి పిల్లాడి స్థితి సీరియసైపోతుంది. సెలైన్ లోపలికి పోవటం లేదు. "లాభం లేదు. ఓపెన్ డ్రిప్ పెడదాం. వెంటనే ఏర్పాట్లు చెయ్యండి, కమాన్. క్విక్" అన్నది సంకేతిని ఆందోళనగా.

 

    రెండు నిమిషాల్లో చకచక ఏర్పాట్లు చెయ్యబడ్డాయి. సంకేతిని హాండ్ వాష్ చేసుకువచ్చింది. ఎక్కువటైమ్ లేదు. సాధ్యమైనంత తొందరగా ఫ్లూయిడ్స్ లోపలికి పోయేలా చెయ్యాలి.

 

    కొన్నివందల, వేల కేసులను అవలీలగా ఓపెన్ డ్రిప్ పెట్టిన చేతులవి. వేరే కాంప్లికేషన్సేమైనా వచ్చి అప్పుడప్పుడూ కొన్ని కేసులు ఫెయిలవుతుంటే వుండవచ్చుగానీ, ఆమె పొరపాటువల్ల ఏ కేసూ ఫెయిల్ కాలేదు. అంత ఆత్మవిశ్వాసంతో చెక్కు చెదరని నిగ్రహంతో, వెయిన్ ఎంత చిన్నగావున్నా, కనిపించకుండా వున్నా, అతి నేర్పుగా కట్ చేసి అందులోని పాలిథిన్ ట్యూబ్ జొనిపేది. అంత చిన్నగా కనిపించీ కనిపించనట్లుగా వెయిన్ లోకి పాలిథిన్ ట్యూబ్ వెళ్ళగానే గొప్ప రిలీఫ్. మిగతా కార్యక్రమమంతా చాలా తేలిక.

 

    సెఫనెస్ వెయిన్ కేచ్ చెయ్యటానికి కాలిమడమ దగ్గర చిన్న ఇన్ సిషన్ ఇచ్చింది.

 

    ఇప్పుడు స్కిన్ కట్ చేసిన చోట వెడల్పుచేసి పెయిన్ ఎక్కడుందో లొకేట్ చెయ్యగలిగిందిగాని, వెలాతెలాపోతున్నట్లు ఉండీ ఉండనట్లు కనిపించింది. పిల్లాడు కొలాప్స్ అవుతున్న కండిషన్ లో ఉండబట్టి అలా కనబడుతోందా? లేక తన కళ్ళలోని దోషాన్నిబట్టి అలా గోచరిస్తున్నదా?

 

    "పెయిన్ బాగానే వుందా?" అనడిగింది తనకు అసిస్ట్ చేస్తోన్న సిస్టర్ని.

 

    "చక్కగా కనబడుతోంది. అదిగో నీలంగా నిగనిగలాడుతూ."

 

    నీలం రంగు వెలసిపోయినట్లు, ఉనికి వుండీ వుండనట్లు... సిస్టర్ నిజమే చెబుతోందా? తనని వెక్కిరిస్తూందా? ఆమెకు పట్టుదల పెరిగింది. వెయిన్ ని టిష్యూనుంచి విడదీసి థ్రెండ్ ని రెండు భాగాలుగా అడుగునుంచి పోనిచ్చి వెయిన్ దిగువభాగం ముడివేసింది. చిన్న సిజర్స్ చేతిలోకి తీసుకుంది.

 

    డీ హైడ్రేషన్ వల్ల విపరీతంగా రెస్ట్ లెస్ గా వున్న పిల్లాడు, అంత ఓపికలేని స్థితిలోకూడా గింజుకుంటున్నాడు.

 

    వెయిన్ కట్ చెయ్యాలి. సిస్టర్ కదపకుండా గట్టిగా పట్టుకుంది. ఇదే కష్టమైన ఘట్టం. కనిపించీ కనిపించనట్లు ఉండే వెయిన్ ను పాలిథిన్ ట్యూబ్ పట్టే పరిమాణంలో చిన్న రంధ్రం పడేటట్లు కట్ చెయ్యాలి. ఏమాత్రం దూకుడుగా కట్ చేసినా వెయిన్ మొత్తం తెగిపోయి పైముక్కు లోపలికి ముడుచుకుపోతుంది. క్రిందిభాగం ముడివేసి ఉండటంవల్ల బ్లీడింగ్ ఉండదుగాని అనుకున్నపని నెరవేరదు.

 

    సిజర్స్ ని జాగ్రత్తగా ముందుకు పోనిచ్చి వెయిన్ కట్ చేసింది.

 

    "కట్ అవలేదు" అంది సిస్టర్.

 

    సంకేతినికి కోపమొచ్చింది. "అయింది. అవలేదంటావేమిటి?" అంటూ పాలిథిన్ ట్యూబ్ చేతిలోకి తీసుకుని దూర్చటానికి ప్రయత్నిస్తూంది. పైనుంచో ప్రక్కనుంచో జారిపోతోందిగాని లోపలకు వెళ్ళటం లేదు. సిస్టర్ మొహంలోకి చూసింది. ఆమె నవ్వుకుంటూన్నట్లు కనిపించింది.

 

    "కట్ అవలేదు" అంది డాక్టర్ తనవంక చూడటం గమనించి.

 

    "అవలేదా? అవలేదా?" అంది సంకేతిని. ఒక క్షణం వెయిన్ వంక తదేకంగా చూసి మళ్ళీ సిజర్స్ చేతిలోకి తీసుకుంది. డెస్పరేటుగా కట్ చేసింది.

 

    "అయింది అయింది" అంది సిస్టర్.

 

    సంకేతిని పాలిథిన్ ట్యూబ్ మళ్ళీ లోపలకు దూర్చటానికి ప్రయత్నించింది. దూరటంలేదు.

 

    ఏం జరిగింది? రంధ్రం సరిపోవటంలేదా? తాను సరిగ్గా రంధ్రాన్ని కేచ్ చేయలేకపోతున్నదా? పిల్లాడు క్షణక్షణం సింక్ అయిపోతున్నాడు. క్రమక్రమంగా కదలటం కూడా మానేశాడు. సంకేతిని గట్టిగా ప్రయత్నించింది. వెయిన్ పాలిథిన్ ట్యూబుకంటే సరిగ్గావుంది. రెండు మూడుసార్లు గట్టిగా ప్రయత్నించేసరికి పగిలిపోయి, చివరకు తెగిపోయి వూరుకుంది.

 

    సంకేతిని నుదుట చెమటలు పట్టాయి. పిల్లాడు కొలాప్స్ అయిపోతున్నాడు. "కమాన్ క్విక్" అంటూ రెండో కాలికీ ప్రయత్నించింది. అక్కడకూడా ఫెయిలైపోయింది. ఏం చెయ్యాలి? గది బయట పిల్లాడి తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన శబ్దాలవల్ల అర్థమవుతోంది.

 

    ఎలాగైనా వెయిన్ కేచ్ చెయ్యాలి. మణికట్టు దగ్గర చూసింది. ఇదంతా స్కేల్స్ వెయిన్ ఏడిల్ తో ప్రయత్నించటంవల్ల డబుల్ పంక్చర్ అయిపోయి ఎందుకూ పనికిరాకుండా వున్నాయి.

 

    పట్టుదల పెరుగుతోంది. కాన్ ఫిడెన్స్ తరిగిపోతుంది. మోచేతి మడత దగ్గర మీడియన్ క్యూబిటల్ వెయిన్ కేచ్ చెయ్యటానికి ఇన్ సిషనిచ్చింది. మెయిన్ వెయిన్ తో బాటు ప్రక్కన ఇంకో చిన్న వెయిన్ చాలా మసగ్గా కనిపిస్తున్నాయి.

 

    ఎలాగైనా... సిజర్స్ చేతిలోకి తీసుకుంది. చెయ్యి వణుకుతోంది.

 

    కళ్ళు...

 

    ఏదో పొర క్రమ్మినట్లు, మంచుతెర అడ్డు వచ్చినట్లు... మసక ఎక్కువై పోతోంది. తన కళ్ళు తననేమిటింత దగా చేస్తున్నాయ్? ఎందుకలా... తలని క్రిందికి బాగా వంచి సిస్టర్ ని లైటు బాగా ఎడ్జస్టు చెయ్యమని చెప్పి ఒంట్లోని శక్తినంతా వ్రేళ్ళలోకి తెచ్చుకొని, ఊపిరిబిగించి, కళ్ళలోకి విశ్వంలోని వెలుగునంతా నింపుకోవటానికి ప్రయత్నిస్తూ వెయిన్ కట్ చేసింది, వెనకనుంచి సిస్టర్ మూలిగినట్లు ఏదో అంటోంది.

 

    ఎంత జాగ్రత్తగా వుందో అంత ఉపద్రవం జరిగిపోయింది. వెయిన్ పూర్తిగా తెగిపోయి రెండు ముక్కలుగా వుండిపోయింది. సంకేతిని ఈ షాక్ తట్టుకోలేక, చేతిలోని సిజర్స్ క్రిందకు విసిరేసి, ప్రక్క గదిలోకి పరిగెత్తి కుర్చీలో కూలబడిపోయింది.

 

    సిస్టర్ బయటకు వెళ్ళి ఏదో చెప్పటం, పిల్లాడి తల్లిదండ్రులు గొల్లుమనటం హృదయవిదారకంగా వినిపిస్తూంది.

 Previous Page Next Page