Previous Page Next Page 
కళ్ళు పేజి 38


    త్వరగా, వీలయితే రేపట్లోనే కళ్ళు పరీక్ష చేయించుకోవాలి. ఎవరయినా బాగుంటుంది? ఆమె మనస్సులో డాక్టర్ కృష్ణచైతన్య మెదిలాడు. ఆయనతో ఎగ్జామిన్ చేయించుకోవాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలి. తప్పదు. ఆలస్యమైతే అయింది. ఆయన ఎగ్జామిన్ చేస్తే ఆ దారే వేరు.

 

    సరిగ్గా ఆ సమయానికి ఆమె కారుమీదకు ఓ ఫియట్ కారు దూసుకొచ్చింది- పదిగజాల దూరంలోకి వస్తేనేగాని ఏం జరుగుతున్నదీ తెలియలేదు.

 

    ఆ కారుని ప్రఫుల్లకుమార్ డ్రైవ్ చేస్తున్నాడు.

 

    కళ్ళ ఎదుట బూజుబూజుగా ఉన్న దృశ్యం ఎదుటి కారు మీదకు వస్తూ ఉండేసరికి కొంతవరకు స్పష్టంగా కనబడింది. సంకేతిని భయంతో వణికిపోయినట్లు హఠాత్తుగా కారు ప్రక్కకి తోసి, బ్రేక్ మీద కాలువేసి గట్టిగా నొక్కింది. అక్కడికి కొంచెం దూరంలో ఓ నడివయసు స్త్రీ నడుస్తోంది. కారు మీదకు వచ్చేసరికి ఓ గావుకేకపెట్టి ప్రక్కకి దూకి, షాక్ నుంచి తట్టుకున్నాక "ఏం? కళ్ళు కనిపించటం లేదా? ఏమిటా కారు తోలటం? అంత కళ్ళు మూసుకుపోయాయా?" అంటూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది.

 

    కారు ఆగిపోయాక, ఇంకా దిగ్భ్రాంతిలో వున్నట్లు కూర్చుండిపోయిన సంకేతినికి ఈ మాటలు వినిపించాయి. "కళ్ళు కనిపించటం లేదా?" ఈ మాటలు ములుకుల్లా గుండెల్లో గ్రుచ్చుకున్నాయి. ఒక మనిషి పొరపాటున ఇంకో మనిషిని గ్రుద్దుకున్నా, చీకటిగా ఉండి అవతలవారి కాలో, చెయ్యో త్రొక్కినా ఆ డైలాగ్ అనటంకోసం కాచుకు కూచున్నట్లు "ఏం? కళ్ళు కనబడటం లేదా" అనేస్తారు వెంటనే.

 

    సంకేతిని గుండె విలవిల్లాడింది. తన వయస్సు కేవలం ముప్పయి ఐదు. మానసికంగా ఎంతో ఉల్లాసంగా, ఫ్రెష్ గా ఉండి వయసుకంటే కూడా చిన్నగా ఫీలవుతూ ఉంటుంది. ఈ రోజు ఆ మాట అనిపించుకున్నాక ఆవేదన భరించలేకపోయింది. కారు దిగి తిన్నగా ఆ నడివయసు స్త్రీ దగ్గరకెళ్ళింది. అప్పటికామె లేచి నిలబడింది. "దెబ్బ తగిలిందా?" అనడిగింది. "లేదులెండి" అన్నదా స్త్రీ నిష్ఠూరంగా.

 

    "సారీ! నిజంగా మీరన్నట్లు కళ్ళు కనిపించలేదు" అన్నది సంకేతిని చాలా బాధగా.

 

    ఇంతలో అటునుంచి ప్రఫుల్లకుమార్ కారు దిగి వచ్చాడు.

 

    "ఏం జరుగుతుందో అర్థంచేసుకోలేకపోయాను. ఎంత తప్పించుకుందామని ప్రయత్నించినా మీ కారు మీదకు దూసుకొస్తోంది" అన్నాడు.

 

    "తప్పు నాదే అయివుంటుంది" అన్నది సంకేతిని.

 

    చుట్టూ జనం పోగవుతున్నారు.

 

    "నా పేరు ప్రఫుల్లకుమార్" అన్నాడతను.

 

    "ఐయామ్ డాక్టర్ సంకేతిని. పిడియాట్రీషియన్ ని."

 

    "ప్రఖ్యాత రచయిత్రి సంకేతినిగారు కదూ- నేను మీ ఫ్యాన్ ని."

 

    దూరంగా పోలీస్ విజిల్ ఊదుతున్నాడు.

 

    "మనం ఇక్కడ్నుంచి తొందరగా వెళ్ళిపోదాం. లేకపోతే సీన్ క్రియేట్ అయేటట్లుగా వుంది."

 

    "వీళ్ళు మనల్ని కదలనిస్తారా?"

 

    "డేమేజేమీ జరగలేదుకదా. ముందు మీరు వెళ్ళిపోండి."

 

    సంకేతిని కారులో ఎక్కింది.


                                     *  *  *


    తన క్లినిక్ లో ఒ.పి. చూసుకుంటోందిగాని మనసు మనసులో లేదు. ఏమాత్రం కలవరపర్చే చిన్న సంఘటన జరిగినా ఆమె అప్ సెట్ అయిపోతూ వుంటుంది. సాధ్యమైనంత త్వరత్వరగా కేసుల్ని చూసి పంపించేస్తోంది.

 

    ఒక డిహైడ్రేషన్ కేసొచ్చింది. పిల్లాడికి పది నెలలుంటాయి. అక్కడా ఇక్కడా త్రిప్పి చివరకు సీరియస్ గావున్న దశలో ఆమె దగ్గరకు తీసుకొచ్చారు. సాధారణంగా పేషెంట్లు చేసే పనే అది. పిల్లాడికి వెంటనే క్లూయిడ్స్ స్టార్ట్ చెయ్యాలి. కాని ప్రస్తుతం తానువున్న మానసిక సంక్షోభంలో సంకేతిని ఆ కేసు స్వీకరించి టెన్షన్ పెంచుకోవాలని లేదు.

 

    "సారీ. ఎక్కడికైనా తీసుకెళ్ళండి. ఈ కేసు నేను టేకప్ చెయ్యలేను" అంది.

 

    "దయవుంచి అలా అనకండి. మీమీద ఎంతో ఆశ పెట్టుకొని వచ్చాము. మా పిల్లాడ్ని మీ కాళ్ళదగ్గర పడేస్తున్నాం. ఎలాగైనా బ్రతికించండి" అని పేషెంటు తల్లిదండ్రులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కాళ్ళావేళ్ళా పడ్డారు.

 

    చివరికి సంకేతిని కాదనలేకపోయింది. ట్రీట్ స్టార్ట్ చెయ్యటానికి చకచకా ఏర్పాట్లు జరిగాయి. స్కాల్ప్ వెయిన్ నీడిల్ సహాయంతో మొదట క్లోజ్ డ్ మెథడ్ లో ట్రీట్ స్టార్ట్ చెయ్యటానికి ప్రయత్నించింది.

 

    ఐదారు సంవత్సరాల క్రితంవరకూ ట్రీట్ పెట్టాలంటే, డీ హైడ్రేషన్ తో చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడే బిడ్డను బ్రతికించటానికి వెయిన్ కట్ చేసి పెట్టే ఓపెన్ మెథడ్ ఉత్తమమైనదిగా భావించేవాళ్ళు. దానివల్ల ఆ వెయిను తర్వాత ఉపయోగపడకుండా పోతేపోతుంది. అంటే ప్రాణాన్ని కాపాడటం కోసం సేక్రిఫైజ్ చెయ్యబడుతూందన్న మాట. కాని ఒట్టి ప్రాణం కాపాడటానికి ఈ పద్ధతిలో నూటికి తొంభై వంతులు అవకాశ ముంటుంది. ఎన్ని బాటిల్స్ అవసరమైతే అన్ని సునాయాసంగా ఎక్కించుకుంటూ పోవచ్చు.

 

    కాని రానురానూ ఈ పద్ధతి మంచిదికాదనే అభిప్రాయం బలపడుతూ వచ్చి, స్కాల్స్ వెయిన్ సెట్సు ఉపయోగించటం వ్యాప్తిలోకి వచ్చింది. ఒకరకంగా ఇది సులువుగా అనిపించినా పేషెంటుకు పూర్తి న్యాయం జరగదు. ఎంత సెడేషనిచ్చానా డీ హైడ్రేషనున్న స్థితిలో సరిలేకపోవటం వల్ల, బిడ్డ అటూఇటూ తపనతో కొట్టుకుంటూ ఉండటం వల్ల ఫ్లూయిడ్స్ కొంతవరకు ఫ్లో అయ్యాక స్వెల్లింగ్ వచ్చి ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఫ్లూయిడ్స్ అవసరమైనంతగా ఇవ్వటం కుదరక ట్రీట్ మెంట్ పరిమితి పొడిగించాల్సి వస్తూ ఉంటుంది. పిల్లనో, పిల్లాడినో కదలకుండా ఉంచటంకోసం బాటిల్స్ ఎక్కుతున్నంతసేపూ గట్టిగా పట్టుకుని ఉంచటం, టోర్నిక్ తో కదలకుండా బిగించి ఉంచటం, మోతాదుకు మించి సెడేషనివ్వటం అవసరమవుతోంది. ఇంత ప్రయాసవున్నా ఓపెన్ మెథడ్ మంచిదికాదు అన్న వాదన ప్రచారంలోకి వచ్చేసరికి గత్యంతరం లేనప్పుడు తప్ప క్లోజ్ మెథడ్ నే అవలంభించాల్సి వస్తోంది. "స్కేల్స్ వెయిన్ నీడిల్ తో ఆ చైల్డ్ కి సెలైన్ పెట్టడానికి సంకేతిని ఎంతో ప్రయత్నించింది. ఓ ఐదు నిమిషాలపాటు ఫ్లో అయినట్లే అయేది. ఇంతలో స్వెల్లింగ్ వచ్చేసేది. దృష్టినంతా కేంద్రీకరించి పిన్ పాయింట్ చేస్తేనేగాని వెయిన్ లోకి నీడిల్ పోనివ్వలేకపోతోంది. ఆమె చూపులేనిదానిలా తడుముకుంటుంటే వెనకనుంచి సిస్టర్స్ నవ్వుకుంటూ వున్నట్లు అనిపించేది. వాళ్ళు నిజంగా నవ్వుకుంటున్నారా? లేక తన భ్రమా?

 Previous Page Next Page