16
రంజిత మరునాడంతా ఊటీలోనే వుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎస్.ఐ.ని కలుసుకుంది. ఊటీలోగాని, దగ్గర వూళ్ళోగాని, ఏ హాస్పటలుకిగాని బులెట్ వూండ్ తగిలిన పేషెంటెవరూ రాలేదని ఎస్.ఐ. చెప్పాడు. చీకటిపడేదాకా స్టేషన్లోనే కూర్చుని చెయ్యవలసిన ప్రయత్నమంతా చేసి రాత్రికి హోటల్ కు చేరుకుంది.
ఆకలి అనిపించలేదు. తేలిగ్గా టిఫిన్ తెప్పించుకుని తిని బెడ్ మీదకు చేరింది. చాలాసేపు నిద్రపట్టలేదు. తనతోబాటు తెచ్చుకున్న ఇర్విన్ వాలెస్ నవల చదువుకుంటూ వుంటే అప్రయత్నంగా ఎప్పటికో కళ్ళు మూతలు పడిపోయాయి.
టెలిఫోన్ రింగవుతూంటే మెలకువ వచ్చింది. చెయ్యిజాచి రిసీవర్ చేతిలోకి తీసుకుంది.
ఆమె 'హలో' అనగానే అవతల నుంచి "నేను... అని వినిపించింది.
అదే గొంతు... ఏదో అడ్డుపెట్టుకుని మాట్లాడుతూన్నట్లు.
"ఏమిటి?" అంది విసుగ్గా.
"ఊటీలో ఇంకా వుండి ఏం సాధించదలుచుకున్నట్లు?"
"నిన్ను పట్టుకుందామని..."
"ఇంకా రెండురోజులు టైమిస్తున్నాను. ఇక్కడ్నుంచి వెళ్ళకపోతే నేనే నిన్ను పట్టుకు వెళ్ళిపోతాను."
"రెండురోజులదాకా టైమెందుకు? ఆ పని ఇప్పుడే చెయ్యవచ్చుగా."
"ఎరవేస్తున్నావా రంజితా."
ఆమె ఏమీ మాట్లాడలేదు.
"నువ్వు సామాన్య స్త్రీవి కావని నాకు తెలుసు. అందుకే నీతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను."
రంజిత మళ్ళీ మౌనంగా ఊరుకుంది.
"రంజితా! నన్ను కలుసుకుందామని ఉందా?"
"ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాను" అంది రంజిత. ఆమె మాటల్లో కసి ధ్వనిస్తోంది.
"అయితే ఇక్కడకాదు. వెలింగ్ టన్ ఇక్కడకు దగ్గరగానే వుందని తెలుసుగా? రేపు సాయంత్రం ఐదున్నరకు అక్కడున్న క్వీన్ గార్డెన్స్ లో వుంటాను."
ఫోన్ పెట్టేసిన చప్పుడైంది. రంజిత రిసీవర్ రెస్ట్ మీద ఉంచుతూ, ఏ మాత్రం అలికిడి కాకుండా బెడ్ మీద నుంచి లేచింది. గది బయట డోర్ ప్రక్కన ఎవరో నిల్చునివున్నట్లు ఆమె సిక్స్ త్ సెన్స్ పసిగట్టింది. పరుపు క్రిందే పెట్టి ఉంచిన రివాల్వర్ తీసుకుని ఏమాత్రం శబ్దం చేయకుండా డోర్ దగ్గరకు నడిచింది. ఒక్క క్షణం మెదలకుండా నిలబడి ఒక్క ఉదుటున తలుపు తెరిచింది.
* * *
గది బయట మరుగుజ్జువాడు నిలబడివున్నాడు. ఇద్దరూ షాక్ లో ఉన్నట్లు రెండు సెకన్లు అలా నిలబడిపోయారు. చాలా దగ్గరగా ఆమె నడుముకన్నా కొంచెం ఎత్తులో నిలబడి వున్నాడు. అతని చేతిలో చిన్న ఆయుధంలాంటిది ఉండటం గమనించింది.
"కదలకు" అంది రివాల్వర్ క్రిందకు వంచి అతని తలకి గురిపెడుతూ.
అతను నోరు తెరిచి 'ఇహిహి' అని నవ్వాడు.
ఆమె ఎంత మెలకువతో ఉందామన్నా వీల్లేకపోయింది. ఆమె కర్థంకానంత, ఊహకు కూడా అందనంత వేగంగా ఏదో జరిగింది. చెయ్యి చచ్చుపడినట్లయి పోయి, రివాల్వర్ జారి నేలమీద పడిపోయింది. కళ్ళముందు ఏదో చీకటి, ఒక్కక్షణం అంతే. తేరుకుని చూసేసరికి మరుగుజ్జు వాడక్కడ లేడు.
అతనికోసం వెదికి ప్రయోజనం లేదని తెలుసు. అతని చేతిలో భంగపడటం ఇది రెండవసారి. డోర్ లాక్ చేసి వెనక్కి వచ్చి బెడ్ మీద కూర్చుంది. ఇంతలో ఏదో ఆలోచన వచ్చి రిసీవర్ చేతిలోకి తీసుకుంది.
అవతల్నుంచి ఆపరేటర్ పలికాడు.
"ఈ టైములో ట్రంక్ కాల్ చెయ్యటానికి వీలుంటుందా?"
"యస్ మేడమ్. ఎక్కడికి చెయ్యాలో చెప్పండి."
ఆమె ఊరు, ఫోన్ నంబరు వివరాలిచ్చింది.
"పి.పి. నా?"
"అక్కర్లేదు. నంబరు కాలివ్వండి."
ఓ గంట పోయాక ఫోన్ మ్రోగింది.
"మాట్లాడండి" అంటున్నాడు ఆపరేటర్.
"హలో" అంటోంది అవతల్నుంచి ఓ మొగగొంతు. గుర్తుపట్టింది ప్రఫుల్లకుమార్.
రంజిత మాట్లాడుతూ వింటోంది.
"హలో హలో" అంటున్నాడు అతను గట్టిగా.
రంజిత మౌనంగా వూరుకుంది.
"హాయిగా డ్రింక్ తీసుకుని, కమ్మగా నిద్రపోతుంటే ఊటీ నుంచి ట్రంక్ కాలని డిస్టర్బ్ చేశారు. ఊటీలో నాకెవరూ స్నేహితులుగాని, స్నేహితురాళ్ళుగానీ లేరే... హలో... హలో" అని అరుస్తున్నాడతను.
రంజిత ఫోన్ పెట్టేసింది.
ఓ నిమిషం గడిచాక ఆపరేటర్ మళ్ళీ రింగ్ చేసి "మాట్లాడతారా?" అనడిగాడు.
"మాట్లాడాను."
రంజిత బెడ్ మీద వ్రాలి కళ్ళు మూసుకుంది. తన అనుమానం తప్పయింది. అతనిక్కడికి కొన్ని వందల మైళ్ళదూరంలో వున్నాడు. మరి...?
ఆమె ఆలోచనల్లో అలిసిపోయి చివరకు నిద్రపోయింది.
* * *
సరిగ్గా ఐదుగంటల ఇరవై నిమిషాలకు రంజిత వెల్లింగ్ టన్ లోని క్వీన్ గార్డెన్స్ లోకి అడుగుపెట్టింది. మబ్బుమబ్బుగా ఉండి, చలిగాలి శరీరాలను వణికిస్తోంది.


