"బాబుగారూ!" అంటూ గోపయ్య అతనికి అడ్డు తగలబోయాడు.
"గోపయ్యా! నువ్వుకూడా నన్ను దారుణంగా వంచించావు. మీరంతా నన్ను వెర్రివాణ్ణి చేసి ఆడించారు. నువ్వుకూడా వెళ్ళిపో యిక్కడ్నుంచి" అని శేఖర్ గట్టిగా అరిచాడు.
మాలతి నిబ్బరంగా వుంది. ఆమెకు ఆశ్చర్యంగాలేదు. ఇలాంటిది జరగబోతుందని ముందుగానే ఊహించినట్లు అనిపిస్తోంది.
"దయవుంచి గోపయ్యను వెళ్ళగొట్టకండి. అతనంతటి నిస్వార్ధజీవి ప్రపంచంలో వుండరు....గోపయ్యా! ఆయనను విడిచిపెట్టకు."
చేతులెత్తి నమస్కారం చేసి ఆక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
గోపయ్య కళ్ళప్పగించి చూడటం మినహాయిస్తే ఏమీ చెయ్యలేకపోయాడు. అంతా కలలోలాగా జరిగిపోయింది.
17
భానుమతి, రామ్మోహన్ ల పెళ్ళిజరిగి కొన్నినెలలు దాటింది. పెళ్ళంటే - అది మంత్రాల పెళ్ళి కాదు. రిజిస్టర్ మేరేజ్ అంతకన్నా కాదు. ఇద్దరుముగ్గురు స్నేహితుల ఎదుట దండలు మార్చుకున్నారు. ఈ పద్ధతి రామ్మోహన్ కి ఇష్టంలేదు. మామూలుగా శాస్త్రోక్తంగా జరగాల్సిందే అని పట్టుపట్టాడు. కానీ భానుమతి ఒప్పుకోలేదు. ఈ పద్ధతులమీద తనకు నమ్మకంలేదనీ, మనస్సులమీదే నమ్మకం వుండటం శ్రేయస్కరమనీ చెప్పింది.
"అయితే దండలు మార్చుకోవటం మాత్రమెందుకు? మనసుల్నే నమ్ముకుని మనమిద్దరం భార్యాభర్తలం అనుకుంటే సరిపోతుందిగా?" అన్నాడు రామ్మోహన్ కొంచెం కోపంగా.
"ఫస్టుగా సరిపోతుంది. ఈ ఏర్పాటయినా నీ తృప్తికోసమే. నాకోసం కాదు."
ఆమెతో వాదించటం ఇష్టంలేక అతను ఊరుకున్నాడు.
మొదట సంసారజీవితం చాలా గొప్పగా సాగింది. భానుమతి అతన్ని అది కావాలనీ, ఇది కావాలనీ అడగదు . అతను ఎక్కడికైనా వెడుతున్నప్పుడు ఎక్కడికి వెడుతున్నారని అడగదు. ఆలస్యంగా ఇంటికివస్తే ఎందుకింత ఆలస్యమయిందని అడగదు.
ఒకసారి స్నేహితులతో ఏదో పార్టీ చేసుకుని, త్రాగి తూలుకుంటూ వచ్చాడు. అతన్ని మామూలుగానే ఆదరించి పలకరించింది గానీ ఇలా ఎందుకు చేశావని అడగలేదు.
"నేను త్రాగివస్తే ఎందుకు త్రాగావని అడగవేం?" అన్నాడు రామ్మోహన్ మర్నాడు.
"నువ్వు త్రాగితే ఎందుకు త్రాగానని నిలదీసి అడిగేహక్కు నాకుందని అనుకోవటంలేదు. అలా అడగటంవల్ల ఒకరు ఏమయినా సాధించగలరని కూడా నేను అనుకోవటంలేదు."
"అయితే భార్యాభర్తల్లో ఒకరు చెడిపోతే పట్టించుకోవలసిన అవసరం మరొకరికి లేదా?"
"అవసరం విషయమలావుంచి దానివల్ల ప్రయోజనంమాత్రం లేదని తెలుసు. "చెడు" అని తెలిసీ ఒకరు చేస్తున్నప్పుడు దాన్నిగురించి రాభసలేకానీ జీవితం రసమయం కాదని నేనర్ధం చేసుకున్నాను."
"అంటే, ఒకరి స్వంతజీవితంలో ఒకరు ప్రమేయం పెట్టుకోకుండా యాంత్రికంగా బ్రతకటం మంచిదంటావా?"
"అది యాంత్రికత్వం కాదు పరిపక్వత. జీవితంలో పరిపక్వత సాధించి ఒక స్థాయికి చేరుకున్నవాళ్ళు మాత్రమే అలా వుండగలరు."
"ఒకరితో ఒకరు సంవత్సరాల తరబడి జీవిస్తూ ఆలాంటి ప్రమేయం పెట్టుకోకుండా వుండటం ఎలా సాధ్యమంటావు?"
"ఎందుకు సాధ్యంకాదు? అసలు ఒకరి ఆంతరంగిక విషయాలు మరొకరికి ఎందుకు? ఒకరి మనసు మీద అధికారాన్ని సంపాదించాలన్న తాపత్రయం మరొకరికి ఎందుకు? అది సాధ్యమా? ఆత్మవంచన చేసుకుంటూ, నటిస్తూ రోజులు దొర్లించేస్తే సరిపోతుందా? ప్రతి వ్యక్తికి పుట్టుకనుంచి వచ్చిన అలవాట్లు కొన్ని వుంటాయి. ప్రత్యేకమైన జీవనవిధానం వుంటుంది. వాటికి తీవ్ర విఘాతం ఏర్పడేలా ఆత్మవంచన చేసుకుని మానసిక సంక్షోభం, శారీరక దాస్యం....యివి మంచివంటావా? వీటికన్నా వ్యక్తిత్వానికి భంగం లేకుండా, అల్పత్వానికి చోటులేకుండా వుంటే స్వేచ్ఛా ప్రియత్వం శ్రేయస్కరం కాదా? ఒకవేళ చిన్న చిన్న లోటుపాట్లు వున్నప్పుడు అవి రెండవవారికి బాధ కలిగించే అవకాశం వున్నప్పుడు వాటినిగురించి చర్చల్లోకి తీసుకురాకుండా వుండటం వాంఛనీయం కాదా? ఎన్నో సంసారాలు చూశాను. పెళ్ళవంగానే స్త్రీ, పురుషులు - ఇంత దారుణమైన ప్రలోభంలో పడిపోవటమెందుకు? ఒకరికొకరు గుప్పిట్లో చేజిక్కుంచుకుందామని తీవ్ర ప్రయత్నమెందుకు? భర్త ఇంటికి ఆలశ్యంగా వస్తే భార్యకి అలుక. అతని స్నేహితులతో అతను స్వేచ్ఛగా వుంటే దుగ్ధ, అతని తల్లిదండ్రులతో లేక బంధువులతో ఆపేక్షగా వుంటే అసూయ. ఇతర ఆడవాళ్ళతో చనువుగా వుంటే అనుమానం. ప్రతిదానికీ టైము, నిర్ణీతవేళలు రొటీన్ దీనికి ఏరోజు ఏమాత్రం భిన్నంగా జరిగినా జీవితమంతా దగాపడినట్లుగా కృంగిపోవటం. ఇద్దరు ప్రాణస్నేహితుల మధ్య ఎప్పుడో గానీ స్పర్ధలు రావు. భార్యాభర్తల మధ్యే నిరంతరం చెలరేగుతూ వుంటాయేం? పెళ్ళంటే ఓ భయంకరమైన లేక విస్తృతమైన పంజరంగా మారాలా? పెళ్లంటే ఓ గుదిబండా? ఓ శాసనమా? ఎంతమంది చిన్నచిన్న పిల్లలు, ముక్కుపచ్చలారనివాళ్ళు, అభమూశుభమూ తెలియనివాళ్ళూ, అమాయకులు - పెళ్ళనే ప్రాంగణంలోకి అడుగుపెట్టాక అమాంతంగా ఊపిరాడనంత బరువయిన వాతావరణంలో ఇరుక్కుపోవటం చూశాను. ఆ కొత్తచోట, అక్కడి ఆంక్షలు, విపరీతాలు, దారుణమైన ఆర్ధిక ఇబ్బందులు, అక్కడి అసహ్యాలు - వేటితో అర్ధంలేకుండా భాగం పంచుకుని, అదే జీవితం కాబోలనుకుని తమని తాము మభ్యపరుచుకుంటూ ఆ బాధ్యతల్లో, ఆ నష్టాల్లో కృంగిపోయి,వాటినే సహజమని అనుకుంటూ భ్రమపడేవాళ్ళని చూశాను. పెళ్ళంటే ఇంత జటిలమా? ఇంత బందిఖానా? ఇంత బరువైన మలుపా? పెళ్లంటే అనుమానాల, అసూయల, స్వార్ధాల సమ్మేళనమా? వీటిని మార్చుకునే ప్రయత్నం, అవసరం మనిషికి అక్కర్లేదా?"
ఆమెను చూస్తోంటే రామ్మోహన్ కి భయంవేసింది. ఆమె అలా మాట్లాడుతుంటే కొంచెం చిరాకుకూడా పుట్టింది. ఈమెతో కాపురం చెయ్యటం కష్టమేమో అనిపించింది. తాను తొందరపడ్డానేమో అనికూడా అనిపించింది.
అప్పట్నుంచీ అలాంటి చర్చలు వచ్చినప్పుడు మొదట్లోనే త్రుంచేసి అక్కడ్నుంచి లేచిపోతూ వుండేవాడు. ఆమెపట్ల గల ప్రేమా, అభిమానాలు కూడా మొదట్లోలా బహిరంగపరచక యాంత్రికంగావుండటానికిప్రయత్నిస్తూవచ్చాడు.