Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 38


    ఆవేశంగా దగ్గరకు వచ్చి ఆమె భుజాలచుట్టూ చేతులువేసి దగ్గరకు లాక్కున్నాడు.

    "నా దుర్గ నన్నర్ధం చేసుకుంటుంది కదూ?"

    మాలతి అతని హృదయంమీద తలవాల్చి నిశ్శబ్దంగా ఏడుస్తోంది.

    "నిన్ను నేనర్ధం చేసుకున్నాను దుర్గా! నీ మనసు నాకు తెలుసు" ఆమె తల నిమురుతూ ప్రేమగా అన్నాడు.

    ఇద్దరూ ఆ దశలో కొంతసేపు వుండిపోయారు. అడుగులు చప్పుడయేసరికి ఆమెను వదిలి దూరంగా జరిగాడు.

    "గోపయ్యా!"

    "అవునయ్యగారూ!"

    "లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొస్తాను" అంటూ శేఖర్ తడుముకుంటూ లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు.

    "అలా వున్నారేం అమ్మగారూ?" అనడిగాడు గోపయ్య శిలా విగ్రహంలా నిలబడ్డ మాలతి దగ్గరకు వెళ్ళి.

    మాలతి లోపల్నుంచి పొర్లుకొస్తున్న బాధను దు;ఖాన్ని ఆపుకోలేకపోయింది. మూగదానిలా వుండలేకపోయింది.

    గోపయ్యా! అంది డగ్గుత్తికతో "మళ్ళీ నా జీవితానికి ఓ పరీక్ష తప్పలేదు."

    "ఏమిటమ్మగారూ?"

    "ఆ శంకర్ పీడ మళ్ళీ మొదలయింది. నా ఉనికిని పసిగట్టి వెంటబడుతున్నాడు. అదలావుంచి ఈయనకి తిరిగి చూపు వస్తుంది. కళ్ళకి ఆపరేషన్ చేస్తానని ఆ స్పెషలిస్టు ఎవరో చెప్పారట. రెండుమూడు రోజుల్లో ఆపరేషన్ చేయించుకుంటానంటూ పట్టుబట్టారు. ఆయనకి కళ్ళు వస్తాయన్న ఆనందంలో వారున్నారు. కళ్ళువస్తే తిరిగి వెలుగుని చూడగలనని అనుకుంటున్నారు. జీవితం మరింత చీకటవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. ఈ పరిస్ధితిల్లో నాకు ఒకటే మార్గం కనిపిస్తోంది గోపయ్యా!"

    "ఏం చేద్దామనుకుంటున్నారమ్మగారూ?"

    "ఆయన ఆపరేషన్ జరక్కముందే నేనీ ఇంటినుంచి వెళ్ళిపోవాలి."

    "అమ్మగారూ!"

    "అవును గోపయ్యా! అంతకంటే వేరేమార్గం కనబడటంలేదు. ఏదో ఒకటి జరగాలి. ఆయన కళ్ళయినా రాకూడదు, నేనీ ఇంట్లోనన్నా ఉండకూడదు...."

    గోపయ్యకి ఏడుపువస్తోంది. ఆవేశంలో పరిసరాలను కూడా మరచిపోయాడు.

    "అమ్మగారూ! ఎంతో కష్టపడి మళ్ళీ ఈ సంసారాన్ని సంపాదించింది, ఇంత తేలిగ్గా వదిలిపెట్టేయడానికేనా? వీల్లేదమ్మగారూ! వీల్లేదు. దీనికి మరో ఉపాయం ఏదన్నా ఆలోచించాలిగానీ, మీరు మాత్రం ఇల్లు విడిచి వెళ్ళకూడదు."

    ప్రక్కనుంచి నీడలా పడింది. గోపయ్య అటుకేసి చూసి తృళ్ళిపడ్డాడు. నారా నరాల్లోనూ వణుకు వ్యాపించింది.

    మాలతి ఇదంతా గమనించలేదు.

    ఈ జీవితానికి ఆయానకు దుర్గేగానీ మాలతిలేదు. దుర్గ ఆయనకు మధుర స్మృతిగా నిలిచిపోవాలిగానీ మరో పీడగా మారకూడదు. దుర్గేదని అడిగితే నీకు తెలియదని చెప్పు."

    వెనుదిరిగి వెళ్ళిపోబోయిన మాలతి అక్కడ శేఖర్ ని చూసి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది.

    "ఆపేశావేం? నే కనిపించానా?"

    "భయంగా వుందా? నీకు భయమా? నిన్ను అసహ్యించుకుని, భరించలేక వదిలేసిన వ్యక్తిని అతనికి తెలీకుండా మళ్ళీ పెళ్ళి చేసుకున్నదానివి, నీకు భయమా? మూగదానిలా నటిస్తూ ఈ ఇంట్లో నెలల తరబడి తిరిగి, కళ్ళులేని నాతో నిర్దాక్షిణ్యంగా ఆడుకున్న నీకు భయమా?"

    అయిపొయింది - ఎంతో కష్టపడి నిర్మించుకున్న సౌధం ఒక్కక్షణలో క్రూరంగా మారిపోయింది.

    కానీ మాలతికేం భయం వెయ్యటంలేదు. నిజం చెప్పాల్సిన ఆరాటంతోనే ఆమె అలమటించిపోతుంది.

    "ఏమండీ! నేనేం చేసినా, ఏం నటించినా అదంతా మీకోసమే చేశానండీ, కానీ అది మిమ్మల్ని మోసం చెయ్యటంకోసం కాదు. మిమ్మల్ని దక్కించుకోవటం కోసం."

    "అలానా?" అన్నాడు శేఖర్ హేళనగా. "నిన్నీ త్యాగం చెయ్యమని ఎవరు అడిగారు?"

    "ఒకరు అడిగారని కాదండీ! ఇదంతా త్యాగమని కూడా నేననుకోవటం లేదు. ఏమండీ! పొరపాటు చేయటం మానవసహజం. అలాంటి పొరపాటే నావల్ల జరిగింది.......మీ అనుభవంలో ఎంతోమంది మగవాళ్ళను పరిశీలించి వుంటారు. బయట అనేక తప్పులు వారి ఆనందంకోసం, అవసరాలకోసం, లేక ఏవో పరిస్ధితులకి లొంగిపోయి చేసినా, వారి గార్హస్ధ్య జీవితంలో భార్యకిచ్చే విలువ యిస్తూనేవుంటారు. అది సంసార జీవితంలో స్థాయి. అలా ఓ ఆడదాని గురించికూడా ఓ క్షణం ఆలోచించి చూడండి. అనుకోని పరిస్ధితుల్లో జరిగిన పొరపాటు జీవితాంతం ఆమెకి శాపంగా పరిణమించాలా? మీరిది త్యాగమని ఎత్తి పొడుస్తున్నారుగానీ - ఇందులో నా స్వార్ధం చాలా వుందండీ. మీరంటే నాకున్న ప్రేమే ఆ స్వార్ధం. మీరు చిరకాలం ఆరోగ్యంగా వుండాలన్నదే ఆ స్వార్ధం. ఈ పరిస్ధితుల్లో నేను మూగదానిలా మీముందు నిలబడితే అది నటనా? నేరమా?"

    శేఖర్ మరింత కటువుగా అయ్యాడు. అర్ధంలేని కసిలాంటిదేదో అతన్ని దాహించివేస్తోంది.

    అవును, నేరమే. నాకు ఇష్టంలేని బ్రతుకు పెంచే అధికారం నీకెవరిచ్చారు? ఇష్టంలేని నీతో గడిపేటట్టు చేసే అధికారం నీకెవరిచ్చారు మాలాతీ? నీకూ నాకూ మధ్య దుర్గరూపంలో కొన్ని నెలలపాటు గడిచిన ఈ నాటకం ఇవాల్టితో సమాప్తి. కమాన్ గెటౌట్.                   

 Previous Page Next Page