ఒకసారి ఆమె ఇంట్లో లేనప్పుడు ఏదో పాతరసీదుకోసం అల్మారా వెదుకుతూంటే ఒక ఉత్తరం బయటపడింది. ఆ ఉత్తరం చదవాలన్న కోరిక కలిగింది. మనసులో ఏమూలో భయం, సభ్యత అడ్డువస్తున్నా కోరికను జయించలేక చదివేశాడు.
అది భానుమతికి ఆమె భర్త మునుపెన్నడో రాసిన ఉత్తరం. చదువుతుంటే అతని చేతులు వణికాయి. ముఖమంతా కందగడ్డలా తయారయింది. కళ్ళు ఎర్రబడ్డాయి.
ఆమె ఇంటికివచ్చేదాకా ఆవేశంతో దహించుకుపోతూ, ఉద్రేకంతో ఊగిపోతూ గడిపాడు.
భానుమతి రిక్షాదిగి లోపలకు వస్తూ "ఏమిటి అలా బిగుసుకుపోయివున్నావు?" అంది.
"నిన్నో ముఖ్యమైన ప్రశ్న అడగాలి."
"అడుగు."
"నీకు ఇదివరకు పెళ్ళయిందా?"
"అయింది."
"మరి నాకెందుకు చెప్పలేదు?"
"అనవసరమనుకున్నాను."
"ఏమిటి? ఇదివరకు పెళ్ళయిన సంగతి, మళ్ళీ పెళ్ళాడబోయేవాడికి అనవసరమనుకున్నావా?"
"అదెప్పుడో జరిగిపోయింది. ఇద్దరం ఒకరినొకరు వదిలేసుకున్నాం. నా దృష్టిలో దానికి ప్రాధాన్యత లేదు."
రామ్మోహన్ కి లోపల్నుంచి పొంగుకువస్తున్న ఉద్రేకానికి పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి.
"నా దృష్టిలో ప్రాధాన్యత ఉండొచ్చుగా?"
"ఉండవచ్చు. అందుకని నీకు చెప్పాలనిపించలేదు."
"అంటే? నన్ను మోసం చేసినట్లేగా?"
భానుమతి అతనివంక అసహ్యంగా చూసింది. "నువ్వు నా వెంటపడ్డావో, నేను నీ వెంటపడ్డానో ఒకసారి గుర్తుతెచ్చుకో" అంది.
"నిజం తెలియక నేను వెంటపడితే, నీకు సంబంధించిన నిజం దాచటం మోసంకాదా?"
భానుమతి "ఏమిటి నేను చేసిన మోసం?" అని గట్టిగా అరవాలనిపించిందికానీ ధోరణికి కలిగిన విముఖత అణచుకోలేక అతన్ని రెచ్చగోడదామని "అసలు నా గతాన్నిగురించి నీకు చెప్పాల్సిన అవసరం ఏమిటి?"
రామ్మోహన్ ఉలిక్కిపడ్డాడు.
"నాపెళ్ళికి ముందు - నా జీవితం ఏమిటో, గతం ఏమిటో, నా నిర్మలత్వం ఏమిటో - ఆ వివరాలు, వ్యాఖ్యానాలు నేను విపులీకరించిన అవసరం ఇప్పుడు లేదు. నాతో సహచర్యం ప్రారంభించేముందు నీకేమయినా అనుమానాలుంటే, అడిగితే జవాబులు చెప్పి వుండేదాన్ని. ఆ ప్రస్తావన నువ్వు తీసుకురాలేదు. దానికి ప్రాముఖ్యత ఇచ్చే అవసరం నాక్కనిపించలేదు."
"మధ్యలో కొన్ని విషయాలు తెలిస్తే అడిగే హక్కు లేదా?"
"నేనెప్పుదయినా నీ గతాన్నిగురించి అడిగానా?"
అతను విస్తుపోయి చూస్తున్నాడు.
"గతంలో అనుభవాలేమిటో - ఎవరితో, ఏమి కార్యకలాపాలు సాగించావో ఎప్పుడయినా అడిగానా?"
అతడామెకు సమాధానం చెప్పలేకపోయాడు. కసిగా చూసి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి ప్రొద్దుపోయి వచ్చాడు. త్రాగినట్లు తెలుస్తుంది.
"రా, భోంచేద్దువు గానీ!"
"నాకు ఆకలిగా లేదు."
"సరే!"
భానుమతి వెళ్ళి ప్రక్కమీద పడుకుంది. పదినిముషాలు గడిచాక అతను సంకోచిస్తూ వెళ్ళి ఆమెప్రక్కన కూర్చున్నాడు. ఆమె అటువైపు తిరిగి పడుకుని వుంది. ఆమె శరీరం, ఆమె చేష్టలు, ఆమె సౌష్టవం అతనికి చాలా ఇష్టం. వీపు నిమరాలనిపించింది, కోరికను చంపుకున్నాడు.
"అతన్తో నువ్వు కాపురం చేశావా?"
భానుమతి ఇటుకేసి తిరిగి అతని ముఖంలోకి చూసింది. ఆమె పెదవులు నవ్వినట్లయినాయి.
"పెళ్ళయితే - కాపురం చెయ్యరూ?"
"అదికాదు, అందరిలా....."
"ఆహా, అందరిలోనూ అంటే మనమిద్దరం కాపురం చేసినట్లుగానే....."
".....ఇంత ఫ్రీగానా?"
"ఇంతకన్నా ఫ్రీగా కూడా."
అతని గుండెల్లో సమ్మెట్లు దిగినట్లయినాయి. ఏడుపు వచ్చినంతపనయింది. పిచ్చివాడిలా అయిపోయాడు. తన ప్రక్కమీదకు వెళ్ళి పడుకున్నాడు.
రాత్రంతా నిద్రలేదు. నరకయాతన పడుతూ అటూఇటూ పొర్లుతున్నాడు.
అతని అవస్థ ఆమె గమనిస్తూనే వుంది. ఓదార్చి లాభంలేదని తెలుసు. పలకరించలేదు. కొంతసేపటికి ఆమెకు నిద్రపట్టేసింది.
మరునాడంతా ఆమెను తప్పించుకుని దూర దూరంగా తిరిగాడు. అసలింట్లో ఎక్కువసేపు లేడు. సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చాడు. జుట్టు రేగివుంది. కళ్ళు లోతుకుపోయాయి. మనిషి పిచ్చివాడిలా కనిపిస్తున్నాడు.
"నేనాలోచించుకుని, నిర్ణయించుకున్నాను."
ఆమె తలెత్తి అతని ముఖంలోకిచూసింది.
"నేను నీతో కాపురం చెయ్యలేను. నీనుంచి దూరంగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను."
"నాకు తెలుసు, ఇలా జరగుతుందని."
ఇద్దరూ విడిపోయారు.
* * *
రాత్రంతా భానుమతి బాగా నిద్రపోయింది. మనసుని కదిలించే సంఘటన ఏదయినా జరిగినప్పుడు ఆమెకు గాఢంగా నిద్రపడుతుంది.
తలుపు చప్పుడయితే మెలుకువ వచ్చింది.
"ఎవరూ?" అంది
"నేను భానూ!" చాలా పరిచితమైన కంఠం.
ఛంగున లేచికూర్చుంది. వెళ్ళి తలుపుతీసింది.
"ఏమిటిది? మళ్ళీ మెలోడ్రామానా?"
మాలతి నవ్వింది. "మొహంలోకి చూస్తూనే అంతా కనిపెట్టేస్తావు. మరో అధ్యాయంకూడా ముగిసిపోయింది. లోపలకు రానియ్యి."


