Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 39


    సశ్య ఆర్దోక్తిగా అనబోయిందో......

 

    "నన్ను మాట్లాడనీయ్ సశ్యా.......... నువ్వు ఎవరివయినా ఏ స్థాయిదానివయినా  నాకనవసరం.

 

    ఇంతకాలమూ నీకూ రుత్వికీ మధ్య వున్న సంబంధం ఏమిటో, ఏ పాటిదో అన్న విషయంలోనూ నీకు  పనిలేదు.

 

    ఎందుకంటే రుత్విని నా మనిషిగా నేను ఫిక్సయ్యాను కాబట్టి ఈ ప్రపంచంలో ఒక్క రుత్వి తప్ప ఏ శక్తి నన్ను ఈ ఆలోచననుంచి మళ్లించలేదు సశ్యా......"

 

    గొంతు స్థాయి పెంచింది విజూష.

 

    "నేను చెప్పేది ఇంకా పూర్తికాలేదు సశ్యా. నా గురించి నీకు తెలిసింది చాలా తక్కువ.


 
    నీ తల్లిదండ్రులు నీకోసం ఏదన్నా చేయగలరేమో?

 

    బట్......

 

    నా తండ్రి నా కోసం ఏమీ చేయకపోయినా నేను అనుకున్నది సాధిస్తాను. అది సాధించడానికే బ్రతుకుతాను. లేదూ అంటే....."

 

    "ఛస్తావా?" ఖండించింది సశ్య.


 
    "ఛఛ" నవ్వేసింది విజూష "చంపుతాను."

 

    "గుడ్" సశ్య నిశ్చలంగా చూసింది.

 

    బాధ.......

 

    ఆగ్రహం.

 

    వేదన...

 

    విషాదాల కతీతమైన ఓ స్థితిలోకి వెళ్లి సముద్రతీర విహంగాల రొదని కాలం గూడుకింద కప్పి  అరణ్యంలోనుంచో అగమ్యస్థానంనుంచో మాటాడుతున్నట్టుగా అంది.

 

    "నేను ఈ దేశానికి ఎందుకొచ్చినాగానీ ఇంతకాలం సమవుజ్జీగా వున్న ఓ వ్యక్తితో పోటీకి దిగడం నాకూ ఆనందంగా వుంది విజూషా.

 

    రైట్.

 

    ఒక మనిషికి అవసరమైనవి అవసరానికి మించి మనిద్దరికీ చాలా వున్నాయి.

 

    కాబట్టి ఇప్పుడు రుత్వి విషయంలో పోటీ పడదాం.

 

    ఒక వయసులో వున్న ఆడపిల్ల అపురూపంగా కోరుకునే ఆ కొత్త జీవితంలో  అడుగుపెట్టడానికి ఇద్దరమూ ఒక ఉద్యమంలా ముందుకు నడుద్దాం. ఈ పోరాటంలో ఎవరు మిగిలేదీ కాలానికే వదిలేద్దాం."

 

     "ఫైన్" అప్పుడు విన్పించింది దూరంగా.

 

    రుత్వి స్టెయిర్స్ మీదనుంచి కిందకు దిగుతూ అన్నాడు.

 

    "మీరిద్దరూ మాటాడుకుంటున్నది దేనిగురించో నాకు తెలీదుగాని ఏదో పోరాటం అననుకుంటున్నారు కాబట్టి నేనూ మీకో మాట చెప్పాలనుకుంటున్నాను."

 

    "వెల్ కమ్" అంది సశ్య భావరహితంగా.

 

    "God Gives Every Bird Does Not itInto The Nest అన్నది స్వీడిష్ సామెత" సశ్య, విజూషలని ఏకాగ్రతగా చూస్తూ అన్నాడు -

 

    "అంచేత గెలుపు అన్నదాన్ని మనం సాధించాలి తప్ప నన్ను సాధించండీ అంటూ అది మన ముందుకు రాదని మనం అర్దం చేసుకోవాలి.....'

 

    క్షణం ఆగి -

 

    "వెల్ ......ఇద్దరూ రెడీగా నిలబడ్డారూ అంటే ఇద్దరూ జవాబుతో వచ్చారన్నమాట" సోఫాలో కూచుంటూ.

 

    సశ్య అంది.

 

    "విజూష గురించి నాకు తెలీదు. నేను మాత్రం జవాబు చెప్పగలను."

 

    "ఆ కవిత రాసింది పింగళి, కాటూరి అనే జంట కవులని తెలుసుకునే వచ్చాను" అంది విజూష.

 

    రుత్వి విస్పారితంగా చూస్తుంటే సశ్య ఓ స్లిప్ అందించింది. "ఆ జవాబు ముందే  ఆ పేపరుమీద నేను రాసాను."

 

    "ఆ పేపర్ ని చూస్తూ అన్నాడు రుత్వి "గుడ్...... ఇద్దరూ సాధించారు. ఇట్స్ నైస్. కానీ నేను టైం స్పేర్ చేయాల్సింది ఎవరి కోసమో అన్నది నేను తేల్చుకోలేని పరిస్థితి."

 

    నిజమే .......

 

    ఆ బాధ సశ్య, విజూషలు ఇద్దరికీ వుంది.

 

    రుత్వితో ఏయే రెస్టారెంటుకి వెళ్లాలో సశ్య అంతకుముందే డిసైడ్ చేసుకుని వచ్చింది. కానీ అసలు రాగానే రుత్విని కలుసుకునే అవకాశం లేకపోయింది.

 

    "సో" రుత్వి నవ్వుతూ అన్నాడు -

 

    "మీలో ఒకరినుంచి నేను పార్టీ కొట్టేసే ఛాన్సు లేకుండా చేశారు. సరే రేపు సాయంకాలం మీలో ఒకరికి నేనే కృష్ణా ఒబెరాయ్ లో డిన్నర్ కి తీసుకువెళతాను.

 

    అయితే ఆ ఒక్కరు ఎవరన్నది నిర్ణయించుకునే ఛాన్సు నాది. దానికో చిన్న పజిల్."

 

    వయసు వీధి మొగవైపు ఆర్తిగా చూస్తున్న విచ్చిన కలువల్లాంటి నాలుగు కళ్లలో అణువంత ఆత్రుతని నింపుతూ  చెప్పాడు రుత్వి.

 

    "ఇప్పుడు నేనడగబోయేది చాలా సింపుల్. సరదాగా కాస్త ఆలోచిస్తే జవాబు దొరికిపోతుంది."

 

    విజూష, సశ్యల్లో ఉత్కంఠ పెరిగింది.

 

    "ఒకనాటి హిందీ హాస్యనటుడు ఐ ఎస్. జోహార్ Its Vertical Expression for Horizontal Desire అన్నది దేని గురించి. అది చెప్పాలి. ముందుగా ఎవరు చెబితే వాళ్లతో రేపు రాత్రికి డిన్నర్ వగైరా...."

 

    అతడి మాటల్లో నిగూఢంగా ఏ భావం స్పురించిందో విజూష క్షణంపాటు రుత్వి కళ్లలోకి చూసి వెనువెంటనే తలతిప్పుకుంది.

 

    సశ్య గెలిచి తీరాలనుకుంటుంది.

 

    విజూష ఓడిపోకూడదనుకుంటుంది.

 Previous Page Next Page