క్షణం ఆగి -
"ఓకే! అర్దమైందిగా?" అంటూ చెప్పి ఆ తరువాత ఫోన్ క్రెడిల్ చేసింది.
అప్పుడు తన ముందున్న ఇద్దరమ్మాయిల్ని నిశ్చలంగా చూసి మృదువుగా నవ్వింది.
"చెప్పండి అంటూ."
ముందు పెదవి విప్పింది స్పూర్తి.
"మేం మీ అభిమానులం మేడమ్! నా పేరు స్పూర్తి దీని పేరు విజూష."
అసలు ప్రసక్తిని ఎలా తీసుకురావాలో ముందే ప్రిపేరై వుండడంతో వివరంగా చెప్పింది స్పూర్తి.
"మా ఫ్రెండ్స్ మధ్య చిన్న ఛాలెంజ్ లాంటిది వచ్చింది దాని ప్రకారం వాళ్లు చెప్పిన నాలుగు పంక్తులు ఏ కవితలోవో చెబితే మేం గెలిచినట్టు.
లైబ్రరీలో కనుక్కోవడం మాకు అసాధ్యమైపోయింది కాబట్టీ మీ సహాయం కోసం వచ్చాం."
అనూరాధాదేవి సాలోచనగా చూసింది.
విజూష వెంటనే వాలెట్ లో నుండి ఓ కాగితం తీసింది.
"హృదయమను పుట్టలోన నిద్రించుచున్న
పలపనెడి నాగకన్యను వెలికి దెచ్చి"
విజూష చెబుతున్నది ఇంకా పూర్తికాకముందే ఆర్దోక్తిగా అందుకుంది అనూరాధాదేవి.
"ఇచ్చవచ్చినయట్టు లాడించుచుండె నాటి
యుపదేశమనియెడి నాగసరము.... ఇదేగా?"
"గాడ్!"
అప్రతిభురాలిలా అంది విజూష.
"మీకా కవిత కంఠస్థం కూడా వచ్చన్నమాట. "
"ఎందుకు రాదూ. అదెవరు రాసిందీ నేను కూడా వెరిఫై చేసి తెలుసుకున్నది యిప్పుడేగా."
"అంటే?" విస్మయంగా చూసింది స్పూర్తి.
"అవునమ్మా! సరిగ్గా గంట క్రితం ఓ స్నేహితురాలు అమెరికా నుంచి ఫోన్ చేసి ఈ వాక్యాలు ఏ కవితలోవో రిఫర్ చేయమంటే ఇప్పుడే వాళ్ళమ్మాయికి చెప్పాను. కవిత పేరు ప్రణయ లేకలు, రాసింది పింగళి, కాటూరు జంటకవులు. మీరు వచ్చేసరికి మాటాడుతున్నది ఆ అమ్మాయితోనే. "
విజూష తడబడుతున్నట్టుగా అడిగింది "ఆ అమ్మాయి పేరు?"
"సశ్య"
అదిరిపడింది విజూష. రెండు నిముషాలముందు జవాబు తెలుసుకున్న సశ్యకన్నా ముందు రుత్విని కలుసుకోవాలనుకుందేమో అసహనంగా పైకి లేచి బయటికి పరిగెత్తింది విజూష.
కారులో నుంచి దూకుడుగా విజూష పది సెకెండ్ల వ్యవధిలో రుత్వి ఇంటిలో అడుగుపెట్టి షాక్ తిన్నట్లు నిలబడిపోయింది.
హాల్లో నిలబడివుంది సశ్య అప్పటికే.
అంటే...........
తనకన్నా ముందు వచ్చిన సశ్య రుత్వికి జవాబు చెప్పేసిందా?
ఎందుకో అలా అనిపించలేదు సశ్య మొహం చూస్తుంటే.
అయినా రుత్వి కనిపించడేం?
"నీకన్నా ముందు నేను వచ్చాను" అంది సశ్య అణువంత వుక్రోషంతో.
"ముందు రావడం కాదు. రుత్వికి ముందు చెప్పగలగాలి."
అప్పటికి రుత్విని సశ్య కలుసుకోలేదన్న విషయం స్పురించినట్లుగా అంది విజూష.
"చెప్పేదాన్నే"
వ్యంగ్యంగా అంది సశ్య -
"కానీ రుత్విక్ బాత్ రూం లో వున్నాడు."
"బెడ్ రూం దాకా వెళ్లే చనువున్న దానిలా మాటాడతావ్ గా - లోపలికి వెళ్ళాల్సింది"
విజూష కూడా సర్కాస్టిక్ గా అనడంతో సశ్య రెండడుగులు ముందుకేసింది కోపంగా.
"ఏం ..... నువ్వేమిటీ అన్నది నేను తెలుసుకోగలగినందుకు కంగారుగా వుందా?"మరింత ఎగతాళి చేసింది విజూష.
"పిచ్చి పిచ్చిగా మాటాడకు."
"ఏయ్"
నిప్పులు మింగిన చకోరంలా మీదకి దూసుకువెళ్లింది విజూష కూడా.
"నన్ను రెచ్చగొట్టకు."
అంతకన్నా ఆవేశాన్ని ప్రదర్శించింది సశ్య -
"రెచ్చగొట్టడం మాత్రమేకాదు విజూషా... రుత్విని నాకు దూరం చేస్తే నీ అంతు చూస్తాను"
ఫకాల్న నవ్వింది విజూష అంత కోపంలోనూ.
సశ్య బెదిరిస్తున్నట్టు లేదు.
బెదిరి మాటాడుతున్నట్టుగా వుంది.
"సో.. రుత్విని నీకు దూరం చేసే సక్తిగలదాన్నని నమ్ముతున్నావ్"
సశ్య తడబడింది ముందు.
వెంటనే సర్దుకుని-
"ఇక్కడే పుట్టి పెరిగిన ఆడపిల్లవి కాబట్టి నా భాషలో స్లిప్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని మాటాడుతున్నావ్ విజూషా.
అసలు రుత్వి నిన్ను అంగీకరిస్తాడని ఎలా అనుకుంటున్నావ్?"అంది హేళనగా.
"సీ మిస్ సశ్యా" కాన్ఫిడెంట్ గా అంది విజూష -
"నీకు ప్రత్యర్దిగా పరీక్షలో నన్ను రుత్వి నిలబెట్టినప్పుడే రుత్వి నన్ను సగం అంగీకరించాడని నువ్వు తెలుసుకుని వుండాలి."
సశ్య మొహంలో రంగులు మారటాన్ని గమనిస్తూ మళ్లీ విజూషే అంది.
"ఈ చిన్న అనాల్సిస్ తెలీని నువ్వు మరో దేశంలో పుట్టి పెరిగానని సగర్వంగా చెప్పుకోడానికి సిగ్గుపడాలి."