Previous Page Next Page 
అష్టావక్ర పేజి 39


    "అక్కడ అష్టావక్ర పుట్టే సమయం ఆసన్నమైంది- ఇక్కడ నిన్ను చంపే సమయం ఆసన్నమైంది. రాకేష్! ఉస్సోక్ సభ్యుడిని చంపేటప్పుడు పంచభూతముల ఛాయలూ వుండాలి. కానీ అవి ప్రత్యక్షంగా వుండకూడదు. భూమి చాయ వుండాలి. భూమి వుండకూడదు. అందుకే మంచుమీదకు తీసుకొచ్చాను. ఆకాశం వుండి. కానీ మేఘావృతమై వుంది. అగ్ని మెరుపునందు, గాలి మంచునందు, జలం ఘనీభవించటం ద్వారానూ కేవలం ఛాయా మాత్రంగానే వున్నాయి. ఉస్సోక్ ఆజ్ఞ ననుసరించి నిన్ను చంపబోతున్నాను".

    అతడు అంత స్పష్టమైన తెలుగులో మాట్లాడుతున్నందుకు కాదు రాకేష్ ఆశ్చర్యపోతున్నది. అతడు చెప్పినది విని రాకేష్ మెదడు ఆలోచించటానికి కూడా వీలులేనంతగా మొద్దుబారిపోయింది. మహాద్రష్టతో ఆడిన చదరంగంలో అతడు ఆఖరి ఎత్తువేసి, తనని గుక్క తిప్పుకోనివ్వనంతగా దెబ్బకొట్టాడని అర్ధమైంది.

    "ను...నువ్వెవరు?"

    షెర్పా నవ్వి "చూడు" అన్నాడు.

    రాకేష్ అతడివైపు చూసి ఆశ్చర్యపడ్డాడు.

    అతడు తన సమానస్థాయి రెడ్ స్కెలిటన్!!!

    రాకేష్ అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. అది చూసి షెర్పా మళ్ళీ నవ్వాడు.

    "ఎక్కడికి వెళతావ్ రాకేష్? మైళ్ళు పరుగెత్తినా ఈ మంచులో నీకు మనుష్య సంచారం కనపడదు. అంతదూరం తీసుకొచ్చాను మిమ్మల్ని. అష్టావక్రుడు పుట్టటం కోసం కేదారగౌరి చేత అన్ని తంతులూ చేయించినందుకు ఉస్సోక్ తరఫున కృతజ్ఞతలు స్వీకరించు. పోతే మహాదష్టకే అపచారం తలపెట్టినందుకు ఈ శిక్షను కూడా స్వీకరించు" అంటూ పిస్తోలు గురిపెడుతూ, సిద్ధార్థవైపు తిరిగి, "కేవలం నిన్ను ఇక్కడికి తీసుకురావటం కోసమే మహాదష్ట నీ ఇంటికి వచ్చి సిద్ధుడి రూపంలో బిచ్చమడిగాడు. మా వలలో పడి నువ్వు ఇంతదూరం వచ్చావు సిద్ధార్థా! నిన్ను రక్షించగలిగే శివానంద ఎప్పుడో మరణించాడు. అష్టావక్రుడి జననాన్ని ఇంకెవరూ ఆపలేరు. నువ్వూ మరణాన్ని ఆహ్వానించటానికి సిద్ధంగా వుండు" అంటూ పిస్తోలు గురిపెట్టాడు.

    సిద్దార్థ రాకేష్ వైపు చూశాడు.

    ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోనట్టు అతడి మొహం తెల్లగా పాలిపోయి వుంది. ముఖ్యంగా తనింతకాలం చేసింది సిద్ధార్థకి తెలిసిపోయిందన్న భావమేమో అది.

    సిద్ధార్థ కళ్ళు మూసుకున్నాడు.

    అతడి కళ్ళముందు కేదారగౌరి కదలాడింది. ఎందుకో తెలియదు కానీ పళ్ళ భారంతో వంగిన అరటిచెట్టు గుర్తొచ్చింది.

    ఉన్నట్టుండి గాలి ఉధృతం మరింత ఎక్కువైంది. మూసుకున్న కంటినుంచి కూడా ఆ గాలి వేగానికి నీటిచుక్క మొహం మీదకి జారుతూంది. అతడు చేయి ఎత్తబోయాడు.

    ఢామ్మని రివాల్వర్ పేలిన చప్పుడు వినిపించింది.

    అంతలో కాళ్ళక్రింద నేల కదులుతున్న భావన కలిగింది. అతడు కళ్ళు విప్పాడు.

    అవలాంచి!!!

    ఆ దృశ్యాన్ని చూసి సిద్ధార్థ దిగ్భ్రమ చెందాడు. ఎన్నడూ ఊహించని దృశ్యం అది. భూమి రెండుగా చీలిపోతున్నట్లు మంచు మధ్యగా విడిపోతూంది. ఆ విడిన కందకంలోకి రెండు వైపుల్నుంచీ పెళ్ళలుగా జారిపోతూంది.

    అంతలో మళ్ళీ రివాల్వర్ పేలిన చప్పుడు వినిపించింది. ఆ శబ్దానికి సిద్ధార్థ తల తిప్పాడు.

    షెర్పా చెయ్యి మాత్రమే కనపడుతూంది. ఆ చేతిలో నల్లటి రివాల్వర్. తెల్లటి మంచు మధ్యలో మరింత నల్లగా కనపడుతూంది. కానీ అప్పటికే అతడు మొహం వరకూ కప్పబడిపోయాడు. మరణం అనివార్యం అని తెలిసిన స్థితిలో అతడి చూపుడువేలు స్థిమితం తప్పినట్టు ట్రిగ్గర్ ని నొక్కుతూంది. ఆరుసార్లు మ్రోగి రివాల్వర్ ఆగిపోయింది.

    ఈ లోపులో మంచు అతడి చేతిని కూడా కప్పేసింది.

    ప్రాణం పోతున్నప్పుడు పాము కొట్టుకున్నట్టు అతడి చెయ్యి మంచుక్రింద కొంచెం కదిలి ఆగిపోయింది. మరింత మంచు జారింది అతడున్న స్థలం పైకి.

    సిద్ధార్థ ఇంకా కోలుకోలేదు.

    తనకి రెండు అడుగుల దూరంలో ఒక మనిషి సజీవ సమాధి కాబడ్డాడంటే అతడికి తన కళ్ళనే నమ్మశక్యం కావటంలేదు.

    అంతలో కాళ్ళక్రింద భూమి తిరిగి కంపించింది.

    దూరంగా ఆకాశం, భూమి కలిసేచోట ఒక ఎత్తయిన శిఖరం మీద నుంచి మంచి పెళ్ళ జారుతూంది.

    అప్పుడు కనపడ్డాడు రాకేష్. మంచులో గుచ్చుకుని వున్న యాక్స్ ని పట్టుకుని గాలిలో వేలాడుతూ వున్నాడు!!

    అతడి బరువుకి ఒకవైపు, ఊగే భూమి కదలికకి ఒకవైపు ఆ 'యాక్స్' ఏ క్షణమైనా పడిపోయేటట్టు వుంది. అది ఏమాత్రం సడలినా అతడు కొన్నివేల అడుగుల లోతులోకి పడిపోవటం ఖాయం.

    సిద్ధార్థ దృష్టి కాళ్ళ దగ్గిరున్న తాడుమీద పడింది.

    వీపుకి తగిలించుకునే రెండు సంచూలూ, తాడూ... ఇవే మిగిలినవి. వంగి వాటిని అందుకోబోయాడు.

    అప్పుడు వినిపించింది సన్నటికేక రాకేష్ ది!

    ఎక్కడో నూతిలోంచి వచ్చినట్లు వుంది అది. సిద్ధార్థ తలతిప్పి అటు చూశాడు. రాకేష్ మరోసారి కేక పెట్టాడు. చావబోతూ ప్రాణభయంతో ఏ జంతువో పెట్టినట్టుంది ఆ కేక!

    సిద్ధార్థ పది అడుగులు వేసి కందకంలోకి తొంగిచూశాడు. యాక్స్ పట్టుకుని వేలాడుతున్నాడు అతడు. ఏ క్షణమయినా పట్టు వదిలేసేటట్టూ వుంది ఆ యాక్స్.

    సిద్ధార్థ మళ్ళీ వెనక్కి వచ్చి తాడు అందుకున్నాడు.

    తాడు పక్కగా వచ్చిపడటంతో రాకేష్ తలెత్తి చూసేడు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. రాకేష్ కళ్ళలో కృతజ్ఞత కనపడింది. "నీతోపాటూ యాక్స్ తీసుకురా" అని అరిచాడు సిద్ధార్థ! ఆ పది అడుగులు పైకి రావడానికి అరగంట పట్టింది. చేతికి గ్లౌవ్స్ వున్నా వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. రాపిడికి చర్మం అక్కడక్కడా లేచిపోయింది. పైకి వస్తూన్న రాకేష్ కి చేయి అందించి పైకి లాగాడు సిద్ధార్థ. రొప్పుతూ నిలబడ్డాడు అతడు. అతడికి సిద్ధార్థ వైపు చూడాలంటేనే భయంగా వుంది. షెర్పా మాట్లాడిన ప్రతి మాటా సిద్ధార్థకి అర్ధమైందని అతడికి తెలుసు. అసలు అలా సిద్ధార్థ చెయ్యి అందించటమే అతడికి ఆశ్చర్యంగా వుంది.

    కానీ సిద్ధార్థ ఇది పట్టించుకోలేదు. ఒకసారి రాకేష్ పైకి రాగానే తాడు కట్టిన యాక్స్ ని కందకం అవతలివైపుకి విసిరాడు. నాలుగైదుసార్లు అలా విసిరాక ఒక ఒకచోట స్థిరంగా ఇరుక్కుంది అని నిశ్చయించుకుని తాడుతో అవతలి పక్కకు ఉయ్యాలలాగా వెళ్ళాడు. అత్యంత ప్రమాదకరమైన ఫీట్ అది. కానీ దాని అవసరం సరిగ్గా నాలుగు నిముషాల తరువాత తెలిసింది. తను వెళ్ళగానే రాకేష్ విఅపు తాడు విసిరాడు.

    రాకేష్ ఆలోచించాడు. 

    విడిపోవడానికి అదే సరియైన సమయం! అంతా తెలిసిన సిద్దార్థ నుంచి పారిపోవాలనుకుంటే అదే అవకాశం!!!

    "యూ ఫూల్. తొందరగా" అని అట్నుంచి వినిపించింది. అనాలోచితంగా అతడూ దాన్ని పట్టుకొని అటు వెళ్ళాడు. అతడి చేతిలో బ్యాగ్ పెడుతూ "పరుగెత్తు - క్విక్" అని అరిచాడు.

    రెండు నిముషాలపాటు ఇద్దరూ వింటినుంచి వెలువడిన బాణాల్లా వెనక్కి చూడకుండా పరుగెత్తారు. ఆ తరువాత వినిపించింది ఫెళ ఫెళా రావం.

    దాదాపు అయిదు తాటిచెట్ల ఎత్తున శిఖరం నిలువునా విరిగి, అంతకుముందు వాళ్ళున ప్రదేశంమీదుగా జారి, కందకాన్ని నింపేసింది.

    వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోయారు. పదినిముషాల సమయంలో ఒక కందకం ఏర్పడటం- ఒక శిఖరం విరిగిపడి దాన్ని పూడ్చి అంతా మైదానంగా మార్చటం... అంతా చూస్తూ వుండగానే జరిగిపోయింది.

    పైన వున్న నల్లటి ఆకాశాన్నీ, క్రింద వున్న తెల్లటి మంచునీ చూస్తూ అచేతనులై వాళ్ళు చాలాసేపు అలానే వుండిపోయారు. ఇద్దరిలోనూ ఒకటే ప్రశ్న ఎటు వెళ్ళాలి అని, మేఘాలమధ్య ఏది తూర్పో తెలియటం లేదు.

    దాదాపు అయిదు నిముషాల తర్వాత మేఘాలమధ్య నుంచి వెలుగు రేఖ ఉదయించింది. అస్పష్టంగా సూర్యుడు దర్శనమిచ్చాడు. వాళ్ళలో రవ్వంత సంతోషం కనబడింది. దక్షిణ దిక్కుగా బయల్దేరారు. రోడ్డు కనపడినా, కనీసం గ్లాసియర్ (నెమ్మదిగా కదిలే మంచు నదిని గ్లాసియర్ అంటారు. అదే చివరికి అలక్ నంద, గంగ అవుతుంది) కనబడినా అక్కణ్ణుంచి సులభంగా మనుష్య ప్రపంచాన్ని చేరుకోవచ్చు. 

    దాదాపు నాలుగు గంటల పాటు నడక సాగించారు. ఎక్కువగా మాట్లాడుకోలేదు. ఇద్దరిలోనూ ఒకటే ఆలోచన- ఎంత తొందరగా వెనక్కి వెళతామా అని. రాకేష్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. అతడి కిప్పుడిప్పుడే మరొక అనుమానం కలుగుతూంది. షెర్పా మాటలు ఆ గాలిలో సిద్ధార్థ వినలేదేమో అని. తొందర్లోనే అది బలపడింది.

    "ఇంకా తొందరగా నడవాలి. సాయంత్రం అయ్యేలోపులో ఆ శిఖరం దాటి అవతలివైపుకి వెళ్ళిపోవాలి. లేకపోతే ఈ మంచులో రాత్రి గడపటం కష్టం" అన్నాడు సిద్ధార్థ.

    రాకేష్ అంతదూరం ఆలోచించలేదు. సాయంత్రం అయ్యేసరికి రోడ్డు చేరుకుంటామనీ, వేడి వేడి టీ తాగుతూ బస్ లో వెనక్కి వెళ్ళిపోవచ్చుననీ ఆలోచిస్తున్నాడు. ఎదురుగా మరో శిఖరం కనపడేసరికి నిస్సత్తువ ఆవరించింది. చేసేదేమీ లేనట్టు సిద్ధార్థతో పాటు దాన్ని ఎక్కటం ప్రారంభించాడు.

    అతడికి సిద్దార్థని చూస్తే ఆశ్చర్యంగా వుంది. ప్రమాదానికి వెంట్రుకవాసి దూరంలోకి వచ్చికూడా అతడి మొహంలో ఏ తొందరపాటూ కనిపించలేదు. అంతేకాదు, రాబోయే ప్రమాదాన్ని క్షణాలముందే పసిగట్టగలగటం అతడిలో మరో విశేషం.

    ఎందుకో తెలీదు కానీ రాకేష్ వళ్ళు జలదరించింది. నిశ్చయంగా అది చలివల్ల మాత్రం కాదు.

    అంతలో నడుస్తూన్న అతడు ఆగిపోవలసి వచ్చింది. కాళ్ళు కదలటానికి నిరాకరించాయి.

    "ఒక అయిదు నిముషాలపాటు రెస్ట్ తీసుకుని వెళ్దాం" అన్నాడు. ముందుకు నడుస్తూన్న సిద్ధార్థ ఆగి 'ఎందుకు' అన్నట్టు చూశాడు.

    "కాళ్ళు తిమ్మిరెక్కినయ్".

    సిద్ధార్థ మొహంలో అనూహ్యమైన మార్పు కనపడింది. వేగంగా వెనక్కి వచ్చి పక్కనే కూర్చుంటూ "బూట్లు విప్పు. క్విక్" అన్నాడు.

    అతడి అనుమానం నిజమే అయింది.

    రాకేష్ పాదాలు తెల్లగా పాలిపోయి వున్నాయి. వేళ్ళయితే చివర ఎముక బయటకు వచ్చినంత తెల్లగా వున్నాయి.

    "ఫ్రాస్ట్ బైట్" అన్నాడు సిద్దార్థ. "...రుద్దు. బాగా రుద్దు" అంటూ ఒక పాదాన్ని తన చేతుల్లోకి తీసుకుని 'రబ్' చేయసాగాడు. అరగంట తరువాత రక్తం ప్రవహించసాగింది. చచ్చుబడిన వేళ్ళ చివర్లలోకి రక్తం ప్రవహించటం ప్రారంభించగానే వేయి సూదులు ఒక్కసారిగా గుచ్చినట్టు నొప్పి పెట్టి బాధతో దాదాపు ఆర్తనాదం చేశాడు.

    సిద్ధార్థ దాన్ని పట్టించుకోలేదు. వేగంగా చేతుల్తో అతడి కాళ్ళని రుద్దుతూనే వున్నాడు. ఇక ఫర్వాలేదని అనిపించాక, లేస్తూ అన్నాడు- "పాదాలతో నడవకు. ఈ విషయం చెప్పటం మర్చిపోయాను. మంచులో నడిచేటప్పుడు వేళ్ళతో నడవాలి. వేళ్ళు, ముక్కు చివర్లూ, చెవి కొసలు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనం బయటపడేసరికి ఇవి పూర్తిగా చచ్చుబడిపోతాయి. మాంసం చెడిపోయినా ఈ చలిలో ఆ విషయం మనకి తెలియదు".

 Previous Page Next Page