Previous Page Next Page 
అష్టావక్ర పేజి 38


    రంగప్రసాద్ ఆలోచనలోపడ్డాడు. కొంచెం సేపయ్యాక అడిగాడు. "ప్రతిమకి రెండోసారి ఎందుకు మతిస్థిమితం తప్పింది?"

    "నేనింత దూరం ఆలోచించలేదు. మెంటల్ హాస్పిటల్ లో ప్రతిమ అన్న మాటలకీ, అగర్వాల్ కీ ఏదైనా సంబంధం వుందేమో అన్న అనుమానం వచ్చింది. ఎదురుగా వెళ్ళి అడగటానికి భయంవేసి ఫోన్ చేశాను. చేసి, "ఎస్సెస్సే గురించి మీకేం తెలుసు?" అని అడిగాను" అంది.

    "ఏమిటీ?" ఆశ్చర్యపోతూ అన్నాడు రంగప్రసాద్.

    "అవును" అంది నివేదిత నవ్వుతూ. "చాలా వెధవాలోచన. కానీ ఎందుకో అడగాలనిపించింది".

    "ఏమన్నాడు అతడు?"

    "ఫోన్ కట్ చేశాడు. కాబట్టి ఇందులో నిశ్చయంగా ఏదో మెలిక వుండే వుంటుంది".

    "మళ్ళీ ఇంకొకసారి అగర్వాల్ కి ఫోన్ చేద్దామా?"

    "ట్రంక్ కాలా?"

    "కాదు. ఎస్.టి.డి".

    అతడు అగర్వాల్ నెంబరు తిప్పాడు. పదిహేను నిముషాల తరువాత బొంబాయి లైను కలిసింది.

    "హలో అగర్వాల్" అన్నాడు.

    "స్పీకింగ్".

    "యస్సెస్సే".

    "ఏమిటీ?"

    ఇంకో మాట తెలీక, "యస్సెస్సే" అన్నాడు. లైన్లు చాలా ఘోరంగా వున్నాయి. అవతల్నుంచి కంఠం ఎక్కడో నూతిలోంచి వచ్చినట్టు వస్తూంది. అదో విధంగా సాయం చేసింది.

    "మొన్న ఫోన్ చేసింది మీరేనా?"

    అతడు అడుగుతున్నది నివేదిత చేసిన ఫోన్ గురించి అని అర్ధంచేసుకుని, "అవును మావాళ్ళే" అన్నాడు. 

     "చెప్పండి, ఏం కావాలి" అవతల్నించి విసుగ్గా వినిపించింది. ఆ కంఠంలో 'భయం' లేకపోవటాన్ని గుర్తించాడు రంగప్రసాద్. ఇంకేం అడగాలో అర్ధంకాలేదు. "మీతో మాట్లాడాలి" అన్నాడు.

    "మిస్టర్ మీరెవరో నాకు తెలీదు. ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం కాంట్రాక్టు అది. మీరు చేసిన మోసానికి ఇంకెవరైనా అయితే కటకటాల వెనుక పెట్టించి వుండేవారు. కేవలం పరువు ప్రతిష్టల దృష్ట్యా నేను వూరుకున్నాను! మీకేమాత్రం నీతీ నిజాయితీ వున్నా నా రెండు లక్షలూ నాకు తిరిగి ఇవ్వండి-" 

    "రెండు లక్షలా"

    "అవును! కేవలం నాభార్య జగదీష్ చంద్ర మీద మనసు పడిందన్న విషయాన్ని మీరింత బాగా కేష్ చేసుకుని మోసం చేస్తారనుకోలేదు. అసలు నాకిప్పుడు అనుమానం వస్తూంది".

    "ఏమని?"

    "అది తన స్పెర్మే అని జగదీష్ చంద్ర ఇచ్చిన 'బాండ్' నిజమైనదా కాదా అని! నా ఉద్దేశ్యం దాన్ని కూడా మీరు ఫోర్జరీ చేసే వుంటారని...." కోపంగా అట్నుంచి ఫోన్ కట్ చేసిన చప్పుడు వినిపించింది.

    రంగప్రసాద్ నిశ్చేష్టుడయ్యాడు.

    పక్కనే వున్న నివేదిత వైపు తిరిగి "నివేదితా, నీకు తెలిసిన కమ్మకమైన స్నేహితురాలు బొంబాయిలో ఎవరైనా వున్నారా?" అని అడిగాడు.

    ఆమె అర్ధంకానట్టూ "ఎందుకు?" అంది.

    "చెపుతాను. మనకి కొంచెం సాయం చేసిపెట్టాలి. క్విక్ గా ఆలోచించు" అన్నాడు.


                          29


    నేలమీద దూది అద్దినట్లు చుట్టూ మంచు పర్వతాల కనుచూపు మేరలో ఎక్కడా తెలుపు తప్ప మరోరంగు లేదు. మధ్యలో రోడ్డు మాత్రం తను వున్నానన్నట్టు అక్కడక్కడా మరకలుగా నల్లగా కనపడుతూంది.

    బస్సు ఆగింది.

    వాళ్ళు ముగ్గురూ దిగారు. నిజానికి అది బస్సు ఆగవలసిన స్టేజికాదు. బదరీనాథ్ వెళ్ళే బస్సు అది. వాళ్ళ కోరిక మీద అక్కడ ఆపాడు. తిరిగి వచ్చేసరికి మళ్ళీ అక్కడే ఎదురుచూస్తూ వుంటామని అతడికి కొంత డబ్బు బహుమతిగా ఇస్తే, అప్పుడు వప్పుకున్నాడు డ్రైవరు. అక్కడ నుంచి బదరీనాథ్ మరో పన్నెండు గంటలు ప్రయాణం. వెళ్ళి ఆయన దగ్గిర ఏం చెయ్యాలో తెలుసుకుని తిరిగి వచ్చి బస్సు అందుకుంటే, కృష్ణాపురం చేరేసరికి సరిగ్గా కేదారగౌరి ప్రసవం జరిగే సమయం ఆసన్నమవుతుంది. అష్టావక్రని చంపే మార్గమే ఉపదేశిస్తాడో, అష్టావక్రుడు పుట్టే మార్గమే నిరోధిస్తాడో ఆయన్నే అడగాలి.

    శబ్దం చేసుకుంటూ, బస్సు వెళ్ళిపోయింది. ఎటూ దారిలేకుండా, మంచుకొండల మధ్య దిగిన ఆ ముగ్గురి వైపూ మిగతా ప్రయాణీకులు చిత్రంగా చూస్తూ వుండగా బస్సు కొండల మధ్య మలుపు తిరిగింది. గుండెల్నిండా ఊపిరి పీల్చుకున్నాడు సిద్ధార్థ. అతడికి పర్వతాల గురించి కాస్త తెలుసు. మౌంటనీరింగ్ గురించి ఎప్పుడో చదువుకున్నాడు. రాకేష్ కి అసలేమీ తెలీదు.

    తూర్పు నుంచి వస్తూన్న చలిగాలి ఎముకలు కొరికేస్తూంది. వేసుకున్న స్వెట్టర్లు చలిని ఆపలేక పోతున్నాయి. ఒకసారి తలెత్తి ఎదురుగా వున్న శిఖరాన్ని చూసి, ముందుకు నడవడం ప్రారంభించారు ముగ్గురూ. ముందు షెర్పా 'యాక్స్' తో మంచులో గుచ్చుకుంటూ నడుస్తున్నాడు. కాలు బూటు వరకూ లోపలికి దిగిపోతోంది. అడుగు తీసి అడుగు వేయటానికి అర నిముషం పడుతుంది.

    కొండల మీద పడుతున్న తెల్లటి వెలుగుని చూపించి, "మనం అటు కదా వెళ్ళవలసింది" అని అడిగాడు సిద్ధార్థ. షెర్పా నవ్వి, "మంచులో తూర్పు వెలుగుపడే దిక్కుకి వ్యతిరేకంగా వుంటుంది" అన్నాడు. సిద్ధార్థకి గుర్తొచ్చింది. నిజమే సూర్యుడు మంచు పర్వతాల్లో పడమటి కొండల వెనుక నుంచి వస్తున్నట్టు కనపడి యాంత్రికుల్ని మోసం చేస్తాడు.

    దాదాపు మూడు గంటలు నడిచాక వాళ్ళు ఆ చిన్న శిఖరం వెనుకవైపుకి చేరుకున్నారు. నాగరిక ప్రపంచానికి చాలా దూరం వచ్చేసిన భావం కలిగింది. అక్కడ అరిచి గీపెట్టినా ఎవరికీ తెలీదు. మరణించినా శవాన్ని కాల్చేవారు వుండరు. మంచు కాబట్టి శవం శిథిలమవటం అన్న ప్రశ్నేలేదు. ఈ ఆలోచన రాగానే రాకేష్ శరీరం అప్రయత్నంగా కంపించింది.

    షెర్పా అక్కడ ఆగుతూ "మరో మూడు గంటలు అంతే" అన్నాడు. సిద్ధార్థ సంతోషంగా వున్నాడు. అనుకున్న దానికన్నా ముందు అయిపోతూంది ప్రయాణం. ఈ లెక్కన ఒకరోజు ముందే చేరుకోవచ్చు.

    తూర్పునుంచి వస్తూన్న గాలి మరింత ఎక్కువైంది. దాని తాకిడికి మంచు ఎగరటంతో, అంతా తెల్లగా మారి, కనీసం ఒక్క అడుగు దూరంలో వున్న వస్తువు కూడా కనపడటంలేదు. చెవులు చుట్టూ హోరు.

    'అవాలంచీ' అనుకున్నాడు సిద్ధార్థ. పర్వతాల మధ్య వచ్చే మంచు తుఫానుని అవలాంచీ అంటారు. అదృష్టవశాత్తు పెద్దది కాదది. రెండు నిముషాల్లో ఉధృతం తగ్గింది. ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా పోయింది.

    కానీ ఆ రెండు నిముషాల్లోనే అక్కడి పరిస్థితి ఘోరంగా మారింది. అవలాంచీ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా కళ్ళకి చాలా ప్రమాదం. ఆ విషయం రాకేష్ కి తెలియదు. అవలాంచీకి ఎప్పుడూ వాలుగా నిలబడాలి. అతడి కెవరూ చెప్పలేదు. తను శాశ్వతంగా గుడ్డివాడి నయ్యాననే అనుకున్నాడు. వెన్నులో నుంచి భయం పాములా వళ్ళంతా పాకింది. సూదుల్తో కళ్ళని గుచ్చుతున్న భావన. చిన్న చిన్న ఇసుక రేణువులు కనుగుడ్లని తొలుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నట్టు అపరిమితమైన బాధ కలిగింది. రెండు చేతుల్తోనూ కళ్ళని నులుముకోబోయాడు. అతడేగానీ ఆ పని చేసివుంటే శాశ్వతంగా అంధుడయ్యేవాడు. అంతలో 'ఆగు' అని వినిపించింది. అది సిద్దార్థ కంఠం.

    పర్వాతరోహకులకి చెప్పే మొట్టమొదటి పాఠం అది. చలివల్ల స్పర్శజ్ఞానం కోల్పోయిన కనుగుడ్లమీద గట్టిగా వత్తితే, ఇసుక రేణువులు వాటిని నిలువుగా చీల్చేసినా, రక్తం బయటపడి వచ్చేదాకా ఆ సగంతి తెలీదు. చలివల్ల రక్తం అంత తొందరగా బయటికి రాదు కూడా. మొత్తం మీద కళ్ళు పూర్తిగా పోవటం ఖాయం. అందుకే సిద్ధార్థ 'ఆగు' అని అరిచాడు. రాకేష్ కి అతడు ఎందుకు అరిచాడో తెలియక అలాగే వుండిపోయాడు! అంతలో అతడి కనురెప్పలమీద ఏదో రాయబడటాన్ని గమనించాడు అతడు.

    "ఏమిటది" అని అడిగాడు.

    "చెక్క తాలూకు బూడిద" సిద్ధార్థ కంఠం వినిపించింది. "ఎస్కిమోలు అవలాంచీ సమయంలో ఇలాగే చేస్తారట. ఎక్కడో చదివాను చెక్క మసి కళ్ళని మంచుకు దూరంగా వుంచుతుందని".

    పక్కనుంచి నవ్వు వినిపించింది. షెర్పా నవ్వుతూ "నీకు చాలా తెలిసే" అంటున్నాడు హిందీలో. అతడి నవ్వులో ఏదో కృత్రిమత్వం కనపడింది. సిద్ధార్థ గమనించాడు గానీ రాకేష్ గమనించలేదు.

    "ఇంకా ఎంత దూరం?"

    "ఇంకో రెండు గంటలు".

    "మరి దగ్గిరే అన్నావ్!"

    "మంచులో ఎంతో దూరం ప్రయాణం చేసినట్టు వుంటుంది. కానీ దూరం తరగదు".

    ఈ లోపులో రాకేష్ దృష్టి కాస్త సరియైంది. "కొంచెం టీ తాగుదామా" అని అడిగాడు.

    షెర్పా అడుగులోతు గొయ్యి తీసి అందులో మంట చేశాడు. ఆ చలిలో నీళ్ళు వెచ్చబడటానికి దాదాపు అరగంట పట్టింది. గొయ్యి తీసి మంట చెయ్యటం వల్ల బయటగాలి దాన్ని ఆర్పే ప్రమాదం వుండదని సిద్ధార్థ గ్రహించాడు. అతడి మనసులో యెక్కడో ఏదో అపశృతి తోస్తూంది. షెర్పా ప్రవర్తన... అతడు ముందు చెప్పిన ప్రకారం అయితే, బస్సు ఆగిన చోటునుంచి చిన్న కాలిబాట కొండ పక్కనుంచి వెనక్కి వెళుతుంది. కొండ వెనుకవైపు శివానంద ఆశ్రమం వుంటుంది. జన సంచారం వుంటుంది. అదీ అతడు చెప్పిన దృశ్యం.

    కానీ ఇక్కడ అలాటిదేమీ లేదు.

    చుట్టూ మంచు, మంచు, మంచు అంతే.

    అంతలో దూరంగా ఒక కొండ శిఖరం అంచు కదలటం కనిపించింది. చూస్తూ వుండగానే పెళ్ళ విరిగి జారింది. ఒక చిన్న పల్లెని పూర్తిగా కప్పేసేటంత పెద్ద పెళ్ళ అది. సూర్యకిరణం మరీ తీక్షణం ఐనప్పుడు ఎక్కడో లోపలి మంచుపొర కరిగి, మొత్తం అంతా క్రిందకి జారుతుంది. అడవులకి అడవులు నాశనమైనా దృష్టాంతాలున్నాయి.

    అప్రయత్నంగా సిద్ధార్థ వళ్ళు జలదరించింది. మొట్టమొదటిసారి అనిపించింది- 'ఇలా వచ్చి తప్పు చేశామా" అని.

    వాళ్ళు నడుస్తూనే వున్నారు. ముందు షెర్పా, వెనుకే ఇద్దరూ.

    "ఇంకా ఎంత దూరం?" అని అడిగాడు రాకేష్, షెర్పా మాట్లాడలేదు.

    రాకేష్ తలతిప్పి అతడివైపు చూసి స్థాణువయ్యాడు. అతడి చేతిలో రివాల్వర్ మెరుస్తూంది. బిగ్గరగా నవ్వేడు.

    "రాకేష్! ఉస్సోక్ కి నువ్వు చేయగల సహాయం అయిపోయింది. నిన్ను చంపమని ఆజ్ఞ వచ్చింది. సిద్ధంగా వుండు" అని అరిచాడు.

    మొదట కొంచెంసేపుపాటు రాకేష్ కి అర్ధం కాలేదు. హోరుమని వీచే ఆ గాలిలో- ఆ చీకట్లో 'ఉస్సోక్' పేరు సిద్ధార్థ ముందు వినబడటంతో అతడు నిర్విణ్ణుడై చూశాడు. అతడి తడబాటు గుర్తించినట్టు షెర్పా మళ్ళీ బిగ్గరగా నవ్వేడు.

 Previous Page Next Page