Previous Page Next Page 
అష్టావక్ర పేజి 40


    రాకేష్ బూట్లు తొడుకున్నాక తిరిగి నడవటం ప్రారంభించారు ఇద్దరూ. మళ్ళీ అంతులేని ప్రయాణం- సాయంత్రమైనట్టుంది. మేఘాల వెనుక సూర్యుడు కనపడటంలేదు. అయినా దాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకో పావుగంటలో శిఖరం చేరుకుంటామని ఇద్దరికీ నమ్మకం కుదిరింది. అక్కడ నుంచి దిగి గమ్యం చేరుకోవటం చాలా సులభం.

    మరింత చీకటి పడింది.

    మరో పది గజాల్లో శిఖరం వుందనగా ఆతృత ఆపుకోలేక సిద్ధార్థని దాటి రాకేష్ ముందుగా అక్కడికి చేరుకున్నాడు. ఆ తరువాత మరో పదినిముషాలకి సిద్దార్థ కూడా వెళ్ళాడు. అదే సమయానికి కృంగిపోతున్న సూర్యుడు ఆఖరిసారి దర్శనమిచ్చాడు. చుట్టూ వున్న పరిసరాల్నీ, క్రింద కనపడుతున్న దృశ్యాల్నీ చూసి, ఇద్దరి మొహాల్లోను కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు.

    కృంగిపోతున్న సూర్యుణ్ణి చూస్తే అర్ధమయింది తాము చేసిన తప్పు. మంచు పర్వతాల్లో వెలుతురు వ్యతిరేక దిక్కువ పడుతుంది. అందువల్ల పడమరని తూర్పు అనుకున్నారు. దక్షిణం అనుకుని ఉత్తరం దిక్కుగా మరికొన్ని కొండలపై పయనించారు!

    చుట్టూ కొండలు, మంచుపర్వత శిఖరాలు.

    ఎటు వెళ్ళాలో తోచని విధంగా దారి తప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా ముంచుకొచ్చే చీకటి. దానితో పాటే చ..లి!

    వాళ్ళు చూస్తూ వుండగానే చీకటి పడింది. నిశ్శబ్దం భయంకరంగా అక్కడ సంతరించుకుంది. మంచుకొండల్లో నివసించే జంతువేదో అరవటం ప్రారంభించింది.

    ఆ అరుపు ముఖద్వారం దగ్గర మృత్యువు నిలబడి తలుపు తడుతున్నట్టు వుంది.


                   *    *    *    *


    వెనుక అలికిడి అవటంతో స్థంభానికి ఆనుకుని నిలబడ్డ రంగప్రసాద్ తలతిప్పి చూశాడు. పార్వతమ్మ...! సిద్దార్థ తల్లి.

    "ఇంతరాత్రి ఎక్కడికి వెళుతున్నారమ్మా?" అని అడిగాడు. ఆగి, చీకట్లోకి చూస్తూ "నువ్వా బాబూ" అంది. "బట్టలు మర్చిపోయాను. ఇంటికి వెళ్ళి తీసుకువస్తాను" అంటూ. అతడూ మెట్లు దిగటం చూసి, "ఇంతరాత్రి నువ్వూ ఎందుకు బాబూ" అంది.

    "ఫర్లేదండి. బాగా చీకటిగా వుంది కదా" అంటూ ఆమెతో పాటూ నడవసాగాడు. 

    అయిదు నిమిషాల్లో వాళ్ళ ఇల్లు వచ్చింది.

    "అలా కూర్చో బాబూ, రెండు నిమిషాల్లో వచ్చేస్తాను" అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. అతడు కూర్చోకుండా గుమ్మం దగ్గిర పైకిపాకిన లతల్నీ, వెన్నెల్లో మెరిసే చెట్లనీ చూస్తూ వుండిపోయాడు.

    "కాస్త మజ్జిగ తాగుతావా నాయనా" లోపల్నుంచి వినిపించింది. ఆ మాటలకి వెనుదిరిగి-

    "అబ్బే, వద్దండి" అన్నాడు. అంతలో అతడి దృష్టి గుమ్మంమీద వున్న పెద్ద ఫోటో మీద పడింది. ముందు చిన్న అనుమానం క్షణాల్లో అది పెరిగి, దగ్గిరగా వెళ్ళి పరీక్షగా చూసి ఉలిక్కిపడ్డాడు.

    ఆ ఫోటో...

    ... విలియమ్స్ ది!

    బహుశా అతడు తన జీవితంలో అంత ఆశ్చర్యం ఎప్పుడూ అనుభవించి వుండడు. అతడి దృష్టిపధంలో చేతికర్ర సాయంతో తన దగ్గరకి కుంటుకుంటూ వచ్చి, 'నేనే నీ తండ్రిని' అని చెప్పిన విలియమ్స్ కదలాడాడు. అవే పోలికలు. అదే ఫోటో... ఇక్కడికెలా వచ్చింది ఆ ఫోటో?

    ఈ లోపులో, లోపల్నుంచి బట్టలతో పార్వతమ్మ బయటకు వచ్చింది. అతడామెకు ఆ ఫోటోని చూపిస్తూ, "ఇది- ఇదెవరి ఫోటో?" అని అడిగాడు.

    "అమ్మాయివాళ్ళ నాన్నగారిది బాబూ! మొన్నే పోయారు. భవానీ శంకరం అని..."

    'ఇంపాజిబుల్' అనుకున్నాడు మనసులో. భవానీశంకరం కుంటివాడు కాదు. కనీసం డాక్టర్ కూడా కాదు.

    అతడి మనసంతా ఎవరో నొక్కిపెట్టినట్లయింది. ఆస్పత్రికి వెళ్తూనే గౌరి వున్న గదిలోకి వెళ్ళాడు.

    అప్పటికే ఆమె నిద్రపోతూ వుంది. ఆమెని లేపి అడగటం బావోదు అనిపించింది. కానీ ఉత్సుకత ప్రొద్దున్నవరకూ అతడిని ఆగనిచ్చేలా లేదు.

    అంతలో, అతడి మనసులో మాట తెలుసుకున్నట్టు ఆమె కాస్త కదిలి కనులు విప్పింది. గుమ్మం దగ్గిర నిలబడిన రంగప్రసాద్ ని ఆ చీకటిలో గుర్తు పట్టలేక "ఎవరదీ" అంది.

    "నేనే".

    ఆమె పక్కమీద లేచి కూర్చోబోతూ వుంటే అతడు వారిస్తూ "నిద్రాభంగం చేశానా?" అని అడిగాడు.

    "లేదు చెప్పండి" ఆమె కంఠంలో విస్మయం కొట్టొచ్చినట్టు కనబడింది- అతడు ఇలా రావటంతో.

    "ఏమీలేదు. ఇప్పుడే మీ అత్తగారితో కలిసి మీ ఇంటికి వెళ్ళాను. అక్కడ మీ నాన్నగారి ఫోటో చూశాను. మా నాన్నగారి దగ్గిర అసిస్టెంట్ గా ఒక డాక్టర్ పనిచేసేవాడు. పేరు విలియమ్స్. ఆయనకీ, మీ నాన్నగారికీ దగ్గిర పోలికలున్నాయి. ఎంత దగ్గిర పోలికలున్నాయంటే, అసలిద్దరూ ఒకరేనా అనికూడా అనుకున్నాను. ఇదెలా సంభవమో నాకు అర్ధంకావటంలేదు.

    "...విలియమ్సా?"

    "అవును".

    కేదారగౌరి "...ఆయన మా పెదనాన్న" అన్నది.

    రంగప్రసాద్ నిశ్చేష్టుడయ్యాడు. అంతలోనే అనుమానం వచ్చి "మీరు క్రిస్టియన్సా...." అని అడిగాడు.

    "కాదు".

    "మరి?"

    "మా తాతగారికి వేపకాయంత వెర్రి వుండేది. బాగా డబ్బున్న కమ్యూనిస్టు ఆయన. ఆచరణ మాత్రం శూన్యం- డబ్బు విషయంలో ...మా పెద్దనాన్నకి విలియమ్స్ అనీ, మా నాన్నగారికి శంకరశాస్త్రి అనీ పేరు పెట్టడం ద్వారా మాత్రం కమ్యూనిజం పట్ల తన గౌరవాన్ని ప్రకటించుకున్నారు. కానీ ఆ తరువాత ఇబ్బందులు వచ్చి మా నాన్నగారు 'భవానీశంకరం' గా మార్చుకున్నారు" చెప్పటం ఆపింది.

    రంగప్రసాద్ వినటంలేదు!

    గౌరీవైపే చూస్తున్నాడు.

    ఆమె తన చెల్లి!! చిన్నాన్న కూతురు.

    ఎంత మధురమైన భావన. కానీ పైకి చెప్పుకోవటానికి వీల్లేని సత్యం!

    ఎవరో చేసిన మోసానికి స్త్రీకి అక్రమ సంతానం కలగటం... ఆడది దాన్ని చెప్పుకోలేక తనలో తానే కుమిలి పోవటం... ఇవన్నీ చరిత్రలో జరిగే మామూలు విషయాలు కానీ, ఒక పురుషుడు తన తండ్రి ఎవరో పైకి చెప్పుకోలేక బాధపడటం బహుశా తన విషయంలోనే మొదటిసారి అవుతుందేమో...! ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్.... ది హెల్ విత్ ఇట్!

    "ఏమిటలా వున్నారు?"   

    "ఏమీలేదు".

    అతడి మౌనాన్ని మరోలా అర్ధం చేసుకున్న ఆమె "నాన్నగారి ఫోటో చిన్నప్పటిది. ఆయన పోయాక దాన్నే పెద్దది చేయించాను. అందుకే మీరు పొరపాటు పడి వుంటారు. నాన్నగారికీ పెద్దనాన్నకీ బాగా పోలికలుండేవి" అంది.

    "మీ పెదనాన్న గారికి కాలు లేదు కదూ?"

    "అవును. యాక్సిడెంట్ లో పోయింది. వెన్నెముకకి కూడా దెబ్బ తగిలింది. అప్పట్నుంచి ఆయన ఏదో పోగొట్టుకున్నవాడిలా వుండేవాడు. చనిపోయేవరకూ మా ఇంట్లోనే వుండేవారు".

    "చనిపోయారా...?"

    రంగప్రసాద్ కంఠంలో- ఎంత కాదనుకున్నా- అదోలాంటి విషాదం తొంగిచూసింది.

    "అవును. పిచ్చికుక్క కరిచి".

    వెళ్ళటానికి ఉద్యుక్తుడయిన రంగప్రసాద్ విద్యుద్ఘాతం తగిలిన వాడిలా ఆగిపోయాడు.

    పిచ్చికుక్క కరిచి!

    ఒక చెమట చుక్క అప్రయత్నంగా అతడి నుదుటిమీద నుంచి క్రిందికి జారింది.

    డాక్టర్ విలియమ్స్ కూడా కుక్క కాటువల్లే మరణించాడు.


                          30


    వాళ్ళని చూస్తే ఎవరూ మనుష్యులు అనుకోరు. కదులుతూన్న ఆస్థిపంజరాల్లా వున్నారు. తలమీద పడిన మంచుని తుడుచుకోవటానికి కూడా శక్తి లేనట్టు కాళ్ళు సాగిస్తున్నారు. చలిరాత్రులు వాళ్ళలో శక్తిని పీల్చేశాయి. ఆహారం అయిపోయింది. వాళ్ళూ, యాక్స్ మిగిలేయి.

    దూరంగా చిన్న శిఖరం లాటిది కనబడేది. అది దాటితే అవతలి వైపు ఏదైనా సంచారం కనిపిస్తుందేమో అన్న ఆశ అక్కడివరకూ నడిపించేది. అక్కడివరకూ మినుక్కు మినుక్కుమనే ఆశతో వెళ్ళేవారు. శిఖరం ఎక్కేవారు. అవతలివైపు తిరిగి తెల్లటి మంచు, అంతులేని మంచు కనబడేది. నిరాశతో దుఃఖం వచ్చేది. మళ్ళీ నడక. చిన్న చిన్న గుట్టలు-దూది గుట్టల్లా వున్నాయి. కొన్ని దాదాపు పది అడుగుల ఎత్తువున్న మంచు గుట్టలు. వాటిమధ్య నుంచి నడుస్తూ ఒక పెద్ద గుట్ట దాటి అకస్మాత్తుగా ఒకచోట ఆగిపోయారు. దాన్ని మనోహర దృశ్యం అనాలో, భయానకం అనాలో గానీ, వాళ్ళ శరీరం కంపించింది. అంత పెద్ద గ్లాసియర్ ని వాళ్ళు ఊహించలేదు. ఒక అగ్నిపర్వతం నుంచి కరిగీ కరగని లావా ప్రయాణం చేసినట్టు నెమ్మదిగా మంచు ముందుకు సాగిపోతూంది. ఒక ఘనపదార్ధం అలా వుండలు, వుండలుగా సాగిపోవటం మత్తుగా తిన్న కొండచిలువ పాకుతున్నట్టు వుంది. సరీగ్గా చూస్తే తప్ప అక్కడ ఒక ప్రవాహం వుందని తెలీదు. అంతా మంచు అనుకుంటారు. అది మరింత ముందుకు సాగి, ఒక జలపాతంలా క్రిందికి దూకుతుంది. ఆ వేగానికి మంచు నీరుగామారి నది అవుతుంది. అదే బహుశా "అలక్ నంద్" అనుకున్నారు. దానితో పాటే ప్రయాణం చేస్తే ఎప్పటికయినా నాగరికత ప్రపంచంలో పడవచ్చు. కానీ, జలపాతం వున్నచోట దిగటం ఎలా? దాదాపు రెండు వందల అడుగులు క్రిందికి దిగాలి. ఎత్తయిన శిఖరం అది.

    "నది దాటితేనే మంచిదేమో" - తటపటాయిస్తూ అడిగాడు రాకేష్. అతడికి ఇంత మంచి అవకాశం వదులుకోవటం మూర్ఖత్వంలా కనబడుతూంది. సిద్ధార్థ రాకపోతే తను వెళ్ళిపోదామని అతని ఉద్దేశ్యం. అంతలో సిద్ధార్థ వంగి తన కాలి బూటు తీయసాగాడు. రాకేష్ కి అర్ధంకాలేదు. సిద్ధార్థా తాడుకి దాన్ని కట్టి మంచెమీద నుంచి విసిరినట్టు విసిరాడు. బూటు వెళ్ళి కదులుతున్న మంచుమీద పడింది. ఒక క్షణం అది మంచుమీదే నిలబడి అంతలోనే క్రమంగా దిగిపోయింది. అంతే! ఆ తరువాత అది ఎంత వేగంగా లోపల ప్రయాణం చేస్తూ వుందో కాళ్ళ దగ్గిర వున్న తాడు చెప్పింది. మెరుపులా వంగి దాన్ని పట్టుకోకపోతే అది కూడా ప్రవాహంలోకి వెళ్ళిపోయేది.

    రాకేష్ నిర్విణ్ణుడై చూడసాగాడు. తను ఎంత ప్రమాదంలో ఇరుక్కోబోయేవాడో తెలిసింది.

    "ఈ రకపు గ్లాసియర్స్ గురించి ఎక్కడో చదివేను" అన్నాడు సిద్ధార్థ తాడుని వెనక్కి లాగుతూ. బూటు మళ్ళీ చేతికి రావటానికి రెండు నిముషాలు పట్టింది.

    "ఇప్పుడేం చేద్దాం?"

    "ఒకసారి లోయ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అక్కణ్ణుంచి దిగటానికి ఏమాత్రం వీలున్నా అదృష్టవంతులమే" యాక్స్ పట్టుకుంటూ అన్నాడు సిద్ధార్థ. రాకేష్ తాడు చేతిలోకి తీసుకున్నాడు. ఆ రెండే మిగిలినయ్ చివరికి.

 Previous Page Next Page