Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 39

 
    అతనింతసేపు ఇంత నెమ్మదిగా, స్పుటంగా మాట్లాడటం ఆమెకి ధైర్యాన్నిచ్చింది. ఏదో దురుద్దేశంతో అతడు తనని కిడ్నాప చేసినట్లు అనిపించలేదు. పైగా అతడిలో విలనీ కన్నా, కళ్ళల్లో పట్టుదల కనిపిస్తోంది. దాంతో ఆమెలో భయంపోయి, ఆ స్థానే కుతూహలం చోటు చేసుకుంది.

    "ఇదంతా నాకెందుకు చెపుతున్నారు?" అనడిగింది.

    "మొన్న కొంతకాలం క్రితం అమాయకుడైన ఒక చిన్న కుర్రవాడ్ని, అభం శుభం తెలియని పసివాడ్ని చంపి అసెంబ్లీ ముందు పడేశారు గుర్తుందా?"

    "పేపర్ లో చూశాను."

    "అలా చంపిన వాడిమీద మీ ఉద్దేశ్యం ఏమిటి?"

    "ఆ కిరాతకుల్ని పట్టుకుని బుద్ధి వచ్చేలా శిక్షించాలి. మళ్ళీ ఆ పని చేయకుండా బుద్ధి చెప్పాలి. ఉరిశిక్ష విధించాలి."

    విహారి నవ్వేడు. "సరిగ్గా రెండు నిముషాల క్రితం నేనన్న మాటలే మీరూ అంటున్నారు."

    "నేను మామూలుగా అనడంలేదు. మనస్పూర్తిగా అంటున్నాను."

    "వాళ్ళు మీ దగ్గర వాళ్ళయితే?"

    "ఎవరయినా సరే...." స్వరం హెచ్చింది అంది.

    అతడు తాపీగా "మీ తండ్రే అయితే?" అన్నాడు.  

    ఆమె పిడుగు పడ్డట్టు చూసింది. "ఏమన్నారు?"

    ఆ పిల్లవాడు చనిపోవడానికి కారణం మీ తండ్రే అయితే- అని అడుగుతున్నాను."

    ఆమె అతడివేపు అనుమానంగా చూసింది. "మీరు నేనెవరని అనుకుంటున్నారో- నేను మినిష్టర్ సూర్యారావుగారి అమ్మాయిని."

    "చీఫ్ మినిష్టర్ అవటానికి మీ తండ్రి ఆడిన నాటకమే ఇదంతా మిస్ వరలక్ష్మీ! రాష్ట్రంలో అది కుదరకపోవటంతో సెంటర్ లో మినిష్టరయ్యాడు."

    "నో... నేను నమ్మను" అని అరిచింది.

    "ఇదంతా నేను మీకు చెప్పనవసరం లేదు. మామూలుగా ఒకటి రెండు రోజులు మిమ్మల్ని కిడ్నాప్ చేసి నాపని నేను పూర్తికావించవచ్చు. కానీ మీకీ విషయం అంతా చెప్పడంలో నా ఉద్దేశ్యం మిమ్మల్ని మాలో కలుపుకోవాలని! వయసు పెరిగేకొలదీ వ్యామోహం పెరుగుతుంది. స్వార్ధం హెచ్చుతుంది. యువతలో ఆ రెండూ వుండవు. కాబట్టే దేశాన్ని బాగుచెయ్యాలన్నా- పాడుచెయ్యాలన్నా అది యువతవల్లే సాధ్యం అంటారు అనుభవజ్ఞులు. మీ తండ్రి గురించి చెప్పాలంటే చాలా వుంది. అంతటి దుర్మార్గుడు, క్రూరుడు మరొకరు వుంటారని నేను అనుకోను. అయితే అతడు స్వయంగా మర్డర్లు చేయడు. పదవికోసం ఏమయినా చేస్తాడు. సిసలయిన రాజకీయ నాయకుడు." అంటూ స్వామి పిల్లల్ని కిడ్నాప్ చేయటం నుంచి, తమని చంపే ప్రయత్నం వరకూ అంతా చెప్పాడు. అసెంబ్లీ ముందు పిల్లవాడిని పడెయ్యటం గురించి కూడా చెప్పాడు.

    ఆమె పెదవులు వణుకుతున్నాయి. అది ఆవేశమో తెలీదు, ఉద్విగ్నతో తెలీదు. "ఇది ...ఇదంతా నిజమా? నేను నమ్మను... నమ్మలేను" అంది.

    "పోలీసుల్లాగా మీరుకూడా సాక్ష్యాలు అడిగితే నేనేమీ చెప్పలేను. నిరూపించలేని నిజాలు ఇవి. కానీ మీ మనస్సాక్షికి నిజం తెలియాలంటే నేను చెప్పినట్లు చెయ్యండి" అంటూ ఆమెకు వివరించాడు. ఐదు నిముషాల తరువాత ఆమె ఢిల్లీ ఫోన్ చేసింది. అతను పక్కనే వున్నాడు.

    "నాన్నా!"

    "ఓ! నువ్వా తల్లీ! ఎలా ఉన్నావు, ఏమిటి విశేషాలు? ఎక్కడి నుంచి చేస్తున్నావు? ఇంటి దగ్గర్నుంచేనా?" ప్రశ్నల వర్షం కురిపించాడు. సూర్యారావు కూతురంటే వల్లమాలిన ప్రేమ.

    "ఇంటి దగ్గర్నించే నాన్నా!"

    "బాగా చదువుతున్నావా?"

    "చదువుతున్నాను... నాన్నా!"

    "ఏమిటి?"

    "నిన్న అనంతానంతస్వామి దర్శనానికి వెళ్ళాను."

    "ఎందుకు?"

    "ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాను. నన్ను ఆయన గుర్తుపట్టాడు. 'సూర్యారావు కూతురివి కదూ' అంటూ పలకరించాడు' అని ఆగింది. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా "నాన్నా..." అంది.

    "ఏమిటమ్మా... ఏదో అడుగుదామనుకుంటున్నట్టున్నావు."

    "మీ నాన్నకి మంత్రి పదవి నేనే ఇప్పించానన్నారు ఆయన" అని పూర్తిచేసింది. అట్నుంచి సూర్యారావు నవ్వేడు. "అననీ. ఆయన గురువులాంటివాడు. ఆయన ప్రసాదమే అనుకో ఇది" అతడి మాటలు పూర్తికాలేదు.

    "యజ్ఞంలో బలి ఇచ్చినట్టు మీ నాన్న పదవికి పసిపిల్లాడిని బలి ఇవ్వవలసి వచ్చింది- అని కూడా నవ్వేడు నాన్నా."

    అటు సూర్యారావు మొహంలో నవ్వు మాయమైంది. ఇరిటేషన్ నిండిన కంఠంతో - "వాడి మొహం" అన్నాడు.

    ఆమె నెమ్మదిగా "...నిజమా నాన్నా" అనడిగింది.

    "లేదమ్మా! ఎవడో కుర్రవాడు అసెంబ్లీ ముందు ఛస్తే అది నా మంత్రి పదవి కోసం అని ఎలా అంటాడు? నేను కనుక్కుంటాలే."

    "యజ్ఞంలో కుర్రవాడి 'బలి' నేను అన్నప్పుడు ఆ కుర్రవాడు 'అసెంబ్లీ ముందు చనిపోయిన వాడే' అని నేను చెప్పకుండానే నీకెలా తెలిసింది నాన్నా!" అడగాలనుకుంది. అడగలేదు. అర్ధమయిపోయింది. ఒక్కసారిగా వేయి లంఖణాలు చేసినట్టు నిస్సత్తువగా, నెమ్మదిగా ఫోన్ పెట్టేసింది. విహారితోపాటు వెళ్ళి కారులో కూచుంది.

    "ఇప్పుడు చెప్పండి. అలాంటి దుర్మార్గుడిని ఖండ ఖండాలుగా చీల్చినా పాపం వుందా?"

    ఆమె మాట్లాడలేదు.

    "మామూలుగా కిడ్నాప్ చేసి నా పనులు చేసుకోగలను. కానీ ముందే చెప్పినట్టు యువతమీద నా నమ్మకాన్ని పెంచుకోవడం కోసం ఇదంతా చేశాను. చెప్పు. నువ్వు నాతో కలుస్తావా?"

    ఆమె వెంటనే జవాబు చెప్పకుండా ఆగి, "...నేనేం చెయ్యాలి?" అనడిగింది.

    "ఏమీ చెయ్యనవసరం లేదు. వేగంగా తిరిగే మోసపు చక్రం యిది. అనంతానంతస్వామి అనంతమైన వేగంతో దీన్ని తిప్పుతున్నాడు. ఈ చక్రంలో ఆకులు నీ తండ్రి, నా తండ్రి యింకా కొందరున్నారు. ఈ చక్రాన్ని ఆపుచేయాలనుకున్నాను. అంత వేగంగా తిరిగే చక్రం ఒక్కసారి ఆగిపోతే ఆ ఊపుకి ఎన్నో ఆకులు రాలిపోవచ్చు. నా తండ్రిని రక్షించుకోవడం కోసం నీ తండ్రిని బలిపెట్టవలసి వస్తే ఆ తర్వాత నాకు బాధ కలగకుండా వుండడం కోసం నీ కిదంతా ముందే చెప్పేశాను. నీ మూలానే ఇదంతా జరగబోతూంది. అందువల్ల నీకు చెప్పవల్సిన నైతికమైన బాధ్యత కూడా నామీద వున్నదని భావిస్తున్నాను" అంటూ కారు స్టార్ట్ చేశాడు.

    "మనం ఎక్కడికి వెళుతున్నాం?"

    "సి.బి.ఐ. డిప్యూటీ చీఫ్- ప్రవల్లిక ఇంటికి."


                       *    *    *


    సూర్యారావుకి చాలా కోపం వచ్చింది. స్వామిలాంటివాడు అంత బాధ్యతా రహితంగా ఎలా ప్రవర్తించాడు- అని అనుకున్నాడు.

    పి.య్యే.కి చెప్పి స్వామికి కనెక్షన్ యిమ్మన్నాడు. ఐదు నిముషాల్లో ఎస్.టి.డి. వచ్చింది.

    "స్వామి లేరు" అని అట్నుంచి వినిపించింది.

    "ఎవరు మాట్లాడుతున్నది?"

    "రామ్ లాల్."

    "స్వామిని వెంటనే నాతో మాట్లాడమను."

    "అలాగే!"

    "అసలాయనకేమైనా బుద్ధి వుందా? చిన్నపిల్లల్తో అలా మాట్లాడతాడా?"

    "ఏం మాట్లాడాడు?" అని అడగలేదు రామ్ లాల్. "సరే... అది కూడా చెపుతాను" అన్నాడు క్లుప్తంగా. సూర్యారావు నాలుక కరుచుకుని "వద్దులే" అన్నాడు.

    "అలాగే" రామ్ లాల్ ఫోన్ పెట్టేశాడు. సూర్యారావు మీటింగ్ కి బయలుదేరాడు. ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి విహారి విమానంలో ఢిల్లీ వస్తున్నాడు.


                       *    *    *


    మంత్రి సూర్యారావుకీ, జపాన్ విదేశాంగ మంత్రికీ మధ్య అగ్రిమెంట్ జరిగే హాల్ అది.

    ప్రభుత్వాధికారులతో హడావుడిగా వుంది.

    జపాన్ నుంచి నౌక వస్తోంది. దాని తాలూకు కాగితాలపై పరస్పరం సంతకం పెట్టుకోవాలి.

    "మీరు జపాన్ రావాలి" ఆహ్వానించాడు జపాన్ విదేశాంగమంత్రి. "ష్యూర్ ష్యూర్" అంటున్నాడు సూర్యారావు. అదే సమయానికి సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు "సార్! ఎవరో స్వామి తాలూకు మనిషట! కుదరదని ఎంత చెప్పినా వినటం లేదు. వెంటనే మిమ్మల్ని చూడాలని అడుగుతున్నాడు" అన్నాడు.

    సూర్యారావు భృకుటి ముడిపడింది. "ఇప్పుడే వస్తున్నాను" అంటూ పక్క ఛాంబర్ లోకి వెళ్ళాడు.

    చాలా చిన్న గది అది. కిటికీలకు పరదాలు వేలాడుతున్నాయి. ఎయిర్ కండిషనరు వల్ల చల్లగా వున్నదా గది. ఒక గోడకు నెహ్రూ, మరొక గోడకు ఇందిరాగాంధీ పటాలు వేలాడుతున్నాయి. బయట హడావుడి లీలగా లోపలికి వినిపిస్తూంది.

    విహారి గది మధ్యలో కూర్చుని ఉన్నాడు.


                      *    *    *


    "నువ్వా" అన్నాడు సూర్యారావు కోపంగా.

    జవాబుగా విహారి నవ్వేడు.

    "స్వామి పేరెందుకు చెప్పావు? అసలెందుకు వచ్చావు?"

    "ఇంత హడావుడి టైంలో నిన్ను బయటకి రప్పించాలంటే స్వామి పేరు ఉపయోగించక తప్పలేదు. ఇంకెందుకొచ్చానంటే..." అంటూ చేతిలో ప్యాకెట్ టేబుల్ మీదకు విసిరేశాడు.

    "ఏమిటది?"

    "నీ కూతురు ఈ రోజు కట్టుకున్న చీరె..."

    "వ్హాట్..."    

 Previous Page Next Page