"జాకెట్ కూడా వుంది..."
"నీకేమయినా మతిపోయిందా? ... పోలీస్ ...పోలీస్... పోలీస్..."
"అరవకు. బయట పత్రికా విలేఖరులు కూడా వున్నారు. మంత్రిగారి కూతురి చీరె ఎవరి దగ్గరో దొరికిందంటే పాఠకులకు కావలసినంత మేత."
సూర్యారావు సర్దుకున్నాడు. "...ఈచీరె, జాకెట్ నీ దగ్గిరకెలా వచ్చాయి?"
"నిన్నటినుంచీ నీ కూతురు ఏదో బాధతో వుంది. ఈ రోజు నా దగ్గరకు వచ్చింది. నువ్వే ముఖ్యమంత్రి పదవికోసం చేసిన ఘాతుకాన్ని ఎవరో ఆమెకు చెప్పినట్లున్నారు. ఆ పిల్లల్ని రక్షించింది నేనే అని, ఆ వివరాలు నాకు తెలుస్తాయేమోనని కనుక్కోవటానికి వచ్చింది."
సూర్యారావు పళ్ళు బిగించి, "చెప్పేశావా?" అన్నాడు.
విహారి నవ్వేడు. "శత్రువు కూతురి అభినందనలు నాకు అవసరంలేదు. నేనేం చెప్పలేదు. చెప్పే టైం కూడా లేదు."
"మరేం చేశావు?"
"పులి బోనులోకి అడుగుపెట్టిన కుందేల్ని ఎవరయినా వదిలేస్తారా?..... దాన్ని అక్కడే బంధించి, వెంటనే విమానంలో నీ దగ్గరకు వచ్చాను."
"దేనికి?"
"నీతో ఒక పని చేయించుకునే షరతు మీద నీ కూతుర్ని వదిలి పెడతాను అని బేరం పెట్టటానికి."
"కిడ్నాపింగ్ కి ఎన్ని సంవత్సరాల శిక్షో తెల్సా?"
"నీ కూతురంటే నీకెంత ప్రేమో కూడా తెల్సు." విహారి మొహంలో నవ్వు మాయమైంది- "నేను ఇంకో అరగంటలో ఇక్కడి నుంచి ఫోన్ చెయ్యకపోతే అక్కడ నీ కూతురు రేప్ చెయ్యబడుతుంది. నేను ఎంత ప్రాక్టికల్ మనిషినో చెప్పటంకోసం ఆవిడ్ని కేవలం అంగా, బ్రాలతో ఉంచి, నీకోసం ఈ రుజువులు తెచ్చాను. నీలాంటి రాక్షసుడు ఇంత దారుణమైన రుజువులు చూస్తే తప్ప నమ్మడని నాకు తెలుసు. నేను నీకన్నా పెద్ద రాక్షసుడ్ననీ, అన్నింటికీ తెగించానని చెప్పడం కోసమే ఇవి తెచ్చాను. ఇప్పుడు పిలుపు పోలీసుల్ని కావలిస్తే".
సూర్యారావు చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత హీనమయిన కంఠంతో, "నీకేం కావాలి?" అనడిగాడు.
"అలా అన్నావ్ బావుంది. నాకు కావలసింది చాలా సింపుల్."
"ఏమిటది?"
"ఈ రోజు సంతకం పెట్టవలసిన కాగితాలు- రేపు పెడతావు- అంతే!"
"వ్హాట్?"
"జపాన్ నుంచి వస్తూన్న షిప్ తాలుకు కొన్ని వివరణలు కావాలి- అని రేపటికి వాయిదా వేస్తావు. అదీ నాకు కావల్సింది."
"దానివల్ల నీకేం లాభం?"
"అది నీకు అనవసరం. నీ కూతుర్ని పువ్వుల్లో తిరిగి పొందాలంటే ఈ పని చెయ్యాలి."
"ఇంత చిన్న పనా?"
"ఔను. ఇంత చిన్న పనే!"
"తర్వాత ఇంకేం కండీషన్లు పెట్టవ్ గా?"
"పెట్టను."
"నమ్మకం ఏమిటి?"
"నీకింకో ఛాయిస్ లేదు. ఇటువంటి విషయాల్లో నమ్మకం తప్పమరేం వుంటుంది?"
సూర్యారావు తటపటాయించి "సరే అయితే" అన్నాడు.
"రేపు ఈపాటికి నీ కూతురు ఫోన్ చేస్తుంది. క్షేమంగా...మీ ఇంటి నుంచి."
విహారి వెళ్ళిపోయాడు.
సూర్యారావు అలాగే నిలబడిపోయాడు. రేపటి వరకూ ఈ సంతకాలు వాయిదా వేయడం అంత కష్టంకాదు. విహారి ఈ కోరిక ఎందుకు కోరాడో అర్ధంకాలేదు.
మహా సముద్రాల్లో బ్రహ్మాండమయిన వాయుగుండం కూడా చిన్న సుడిగాలితోనే ప్రారంభం అవుతుందని అతడికి తెలీదు.
18
అనంతానంతస్వామి ఎక్కువగా నవ్వడు. అతడి నుదుటిమీద గీతలే అతడి మనోకాఠిన్యాన్ని సూచిస్తూ ఉంటాయి.
అతడికి నవ్వు తెప్పించిన వార్త చాలా చిన్నది. జమ్మూలో కొంతమంది జనం దూరదర్శన్ 'రామాయణ్' వస్తూన్న సమయానికి కరెంటు పోవడంతో ఉద్రిక్తులై కరెంటు ఆఫీసుని తగులబెట్టేసిన వైనం గురించిన వార్త అది.
"రామ్ లాల్! ఈ వార్త చూశావా?" అన్నాడు స్వామి.
రామ్ లాల్ పేపరు తీసుకుని చదివాడు. అతడికీ ఆశ్చర్యం వేసింది. అయితే ఆ ఆశ్చర్యం పేపర్లో వార్త చదవటంవల్ల వచ్చిందికాదు స్వామి ఆనందంగా ఉండడాన్ని... అనుచరులతో అంత చనువుగా మాట్లాడడాన్ని- మొదటిసారి చూడడంవల్ల వచ్చింది.
"ఏమున్నది స్వామీ అందులో?" అన్నాడు.
"ఏమున్నదా?... ఏమీ లేదు? ...మొన్న నువ్వెందుకు ఆ కరెంటు కాల్ ఆఫీసుని బాంబుపెట్టి పేల్చేసేటంతగా ఆవేశపడ్డావు?"
స్వామి ప్రశ్నకి రామ్ లాల్ సిగ్గుపడ్డాడు. అతడు ప్రాణాలు తీసే కిరాతకుడే. కానీ అతనిలో చిన్న బలహీనత వుంది. తన ఇద్దరు కొడుకులంటే ప్రాణం. ఆ రోజు స్వామి పిల్లల్ని కిడ్నాప్ చేసి చంపమన్నప్పుడు అతడు తటపటాయించింది అందుకే. అతడి తోటి అనుచరులు కూడా ఆ విషయమై అతడు మంచి మూడ్ లో వున్నప్పుడు జోక్ చేస్తూ వుంటారు. "అదేమిటి? ప్రొఫెషనల్స్ కి కుటుంబాలుడకూడదా?" అని అతడు తిరిగి జోక్ చేస్తూ వుంటాడు. ఆ రోజు అతడు కరెంటు కాల్ ఆఫీసుని కాల్చేసే ప్రయత్నం చేసింది కూడా అందుకే. అతడి యిద్దరి పిల్లల్లో ఒకడు ఏడో క్లాసు. రెండోవాడు ఆరోక్లాసు చదువుతున్నారు. ఒన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కరెంట్ పోయింది. పిల్లలు ఏడవటం మొదలుపెట్టారు. రామ్ లాల్ కరెంట్ కాల్ ఆఫీసుకి ఫోన్ చేసాడు.
"వచ్చినప్పుడు వస్తుంది. ఓపిక పట్టాలి" అన్నారెవరో అట్నుంచి.
"- 'ఎప్పుడొస్తుంది' అని తెలుసుకోవడానికే ఫోన్ చేసింది" అన్నాడు అసహనంగా.
"వచ్చే సంవత్సరం" అని ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి. పెట్టేసేముందు అవతల్నించి నవ్వులు కూడా వినిపించాయి. రామ్ లాల్ కార్లో రెండు బాంబులు వేసుకుని బయల్దేరాడు. అయిదు నిమిషాల తరువాత ఆ ఆఫీసు పునాదుల్తో సహా పేలిపోయింది.
ఆ విషయాన్నే రామ్ లాల్ కి ఇప్పుడు గుర్తుచేసాడు స్వామి.
"తర్కానికి అందని అతి విచిత్రమైనది మనిషి ప్రవర్తన రామ్ లాల్! క్రికెట్ చూడటానికి వీలుకాలేదని ఆవేశపడడం కల్పిత కథగా అనిపించవచ్చు. కానీ, ఇదిగో చూడు- ఉదాహరణతో సహా యిక్కడ ఒక పేపర్ న్యూస్... ఇదే... ఇదే ఆవేశం మన పనిని సానుకూలపర్చబోతూంది. ఉప్పెనలా పొంగే జన ప్రవాహం ముందు ఏ ప్రభుత్వమూ ఆగలేదు. రేపు విజయదశమికి నేను నియంతనయ్యే ముహూర్తాన్ని ఏ శక్తీ ఆపలేదు" అంటూ బిగ్గరగా నవ్వేడు.
అదే సమయానికి పక్కనున్న ఫోన్ మ్రోగింది.
"నేనూ- మహేష్ భట్ ని."
"ఏం భట్?"
భట్ మంత్రిత్వశాఖలో సెక్రటరీ, స్వామికి కావలసినవాడు.
"జపాన్ నుంచి రావలసిన షిప్ విషయమై సూర్యారావు ఒప్పమం మీద సంతకం పెట్టలేదు."
"ఏమిటీ?"
"ఏవో సాంకేతిక కారణాలంటూ రేపటికి వాయిదా వేసాడు".
స్వామి భృకుటి ముడిపడింది.- "-రేపు ఆ జపాన్ మినిష్టరు బెంగుళూరు వెళుతున్నాడు కదా!"
"అవును. అక్కడి ఉత్సవాలలో పాల్గొని ఎల్లుండి వస్తాడు. అంటే అవతల ఎల్లుండి కానీ సంతకాలు అవవు."
స్వామి ఫోన్ పెట్టేసాడు.
ఏమిటంత సాం..కే..తి..క కారణాలు?
అతడికి చిరాగ్గా అనిపించింది.
సరిగ్గా విజయదశమికి ముందురోజు ఆ ఓడ - భారతదేశం వచ్చేట్టు ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ మూడు రోజుల ఆలస్యం వల్ల గోల్డెన్ దీవి దగ్గర ఆయుధాల మార్పిడి ఒక్కరోజులో (ముందు నాలుగు అనుకున్నది) పూర్తిచేయాలి. అసాధ్యం కాదు కానీ, చాలా హడావుడి. స్వామి అసహనంగా కదిలాడు. ఏదో అపశృతి.
అంతలో పరమేశ్వరం అక్కడికి వచ్చాడు. స్వామి జరిగినదంతా చెప్పాడు. ".... ఎందుకు సూర్యారావు ఇలా చేశాడో అర్ధంకావటంలేదు."
"మూడు రోజులు ఆలస్యమా? సరిగ్గా మూడు రోజులా?" పరమేశ్వరం అన్నాడు. అతడి కంఠంలో అనూహ్యమయిన ఆందోళన గోచరించింది.
"ఎందుకు అలా అడుగుతున్నావు పరమేశ్వరం? ఇక్కడ సంతకం అయిన మరుక్షణం అక్కడ ఓడ బయల్దేరే ఏర్పాట్లు చేశాము కదా!"
"కానీ, ఆ రోజు బుద్ధుడి తాలూకు పండగ. మనకన్నా జపనీయులు ఎక్కువ సెంటిమెంటులిస్టులు. ఆ రోజు ఎటువంటి పనీ చేయరు."
"కానీ అక్కడి మాఫియా మనకి సాయం..." అతడి మాటలు పూర్తికాలేదు.
"మాఫియాకన్నా మతం గొప్పది స్వామీ."
పరమేశ్వరం మాటలు బాణాల్లో తగిలాయి. తన ఆయుధం వెనుదిరిగి వచ్చి తననే డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. అపశకునం అయిదు రంగులలో కనిపించింది. విసుగ్గా ఫోన్ లాక్కున్నాడు.
తనే స్వయంగా సూర్యారావుకి ఫోన్ చేశాడు. అటువంటి సూర్యారావు లైన్ లోకి రాగానే "ఏమిటి? ఏమైంది?" అని అరిచాడు కోపంగా.
సూర్యారావు జవాబు చెప్పడానికి కాస్త తటపటాయించాడు. కూతురి కిడ్నాప్ విషయం ఫోన్ లో చెప్పడం అనవసరం అనిపించింది. "కొంచెం ఇబ్బంది వచ్చింది స్వామీ! అందువల్ల ఆలస్యమయింది" అన్నాడు.
"ఏమిటా ఇబ్బంది?" అట్నుంచి కటువుగా వినపడింది.
సూర్యారావు క్కూడా కాస్త కోపం వచ్చింది. ఇంతకుముందు మనిషికాదు, అతడు మంత్రి!! అదీకాక- ఈ స్వామి అనవసరంగా తన కూతురితో- తను చిన్నపిల్లల్ని చంపడం ద్వారా... తనమీద తనే హత్యాప్రయత్నం చేసుకోవడం ద్వారా, మినిష్టర్ అయ్యాడన్న విషయం చెప్పాడు. ఆ కోపం కూడా వుంది.
దానితో, "ప్రభుత్వం అన్నాక చాలా ఇబ్బందులుంటాయి స్వామీ. అవన్నీ ఎలా చెప్పను?" అన్నాడు. ఈ లోపులో స్వామి దగ్గర్నుంచి పరమేశ్వరం ఫోన్ తీసుకున్నాడు.
"నువ్వు చేసిన ఈ పనివల్ల విజయదశమి నాటికి షిప్ భారతదేశం చేరుకోదు. మన ప్రోగ్రాం నాలుగు రోజులు ఆలస్యమవుతుంది."
"నేను చేసింది ఒకరోజు ఆలస్యమే."
"అవన్నీ చెప్పడానికి టైములేదు. అసలేం జరిగిందో చెప్పు."
"నా కూతుర్ని నీ కొడుకు కిడ్నాప్ చేశాడు."
"వ్వాట్?"
"అవును. ఒకరోజు టైము అడిగాడు. అంతే-"
"నువ్వేమో పూలిష్ గా బుట్టలో పడిపోయావు."
"కూతురిమీద ప్రేమ వుండడం పూలిష్ నెస్ కాదు."
"విహారి నీ కూతుర్ని ఏమీ చేసి వుండేవాడు కాదు."
"నువ్వెలా గ్యారంటీ ఇవ్వగలవు?"
"మాకు ఈ విషయమంతా చెప్పవలసింది."