Previous Page Next Page 
ఆఖరి పోరాటం పేజి 38


    అద్భుతమైన లంచ్ అది. ఫిలిఫ్పైన్స్ కిష్టమయిన ఆస్ పెరగస్ నుంచి బోర్నెంటోల వరకూ అరవై రకాల వంటకాలు. ఋతువులతో సంబంధం లేకుండా, 'దొరకవు ... దొరుకుతాయి' అన్న ప్రశ్న లేకుండా దాదాపు ఇరవైమంది కన్యలు అధునాతనమైన బికినీలతో వడ్డన చేస్తూండగా ప్రతినిధులు భోజనం పూర్తిచేశారు. ఫెర్ఫ్యూమ్ కూల్డ్ గదుల్లో రెండు గంటలు విశ్రమించాక తన దీవి చూపించాడు స్వామి.

    పైకి మామూలుగా కనిపించే ఆ దీవిలోని భవంతి అడుగున దాదాపు పదివేల అడుగుల హాలులు అయిదారు వున్నాయి. ఫ్లెమింగ్ నవలల్లో మాదిరి పూర్తి వాటర్ ప్రూఫ్ గదుల్లో... అగ్రరాజ్యాల అధునాతన పరికరాల్ని తలదన్నే ఆయుధాలు తయారు చేయబడుతున్నాయి.

    ఆ గదిలోని కొబ్బరికాయలాంటి ఆకారంలో వున్న బాంబులు అతిధుల్ని ఆకర్షించాయి. ముందు వారు వాటిని కోకోనట్సే అనుకున్నారు. కానీ, ఆ రంగంలో ప్రవేశంవున్న వారవడంవల్ల వెంటనే తేడా గుర్తుపట్టగలిగారు. మామూలు మనుష్యులు కయితే అసలు తెలీదు.

    వారి అనుమానం గ్రహించినట్టు స్వామి అన్నాడు - "నూక్లీ-థెర్మో- ఎక్స్ ప్లోజివ్స్. దేవుడి ముందు పూజారి కొట్టగానే దాదాపు వెయ్యిగజాల దూరంలో వున్న ప్రతి వస్తువూ పేలి పొడిగా మారిపోతుంది. ఈ రకమైన విస్పోటం ఇటీవలే కనుక్కోబడింది. దాదాపు పది గ్రెనేడ్ లకి సమానమైంది" నవ్వేడు, ".... ఒకేరోజు అయిదారు పవిత్ర దేవాలయాలు, దానికి ప్రతిగా తాజ్ మహల్, దుర్గా-మరోవేపు భాక్రానంగల్, గోదావరి బ్యారేజ్- ఆ సంక్షోభాన్ని మీరే వూహించండి."

    వాళ్ళు ముందుకు సాగారు.

    ఆ తర్వాత గదిలో దృశ్యం చూసి వారి వళ్ళు అప్రయత్నంగా జలదరించింది. అందులో వరుసగా బీరువాలున్నాయి.. నలువేపులా అద్దాలు, లోపల ఏదో చిక్కటి ఆముదంలాంటి ద్రవం వుంది.

    అదికాదు వారిని భయభ్రాంతుల్ని చేసింది.

    - ఆ బీరువాల్లో సజీవ ప్రతిమల్లా శవాలున్నాయి. అచ్చంగా మనుషులు బోనుల్లో నిల్చున్నట్టే వున్నాయి. ఆ శవాల కళ్ళల్లో మాత్రం జీవంలేదు.

    "నా కెదురు తిరిగిన ప్రముఖులు, నన్ను మోసం చేద్దామనుకున్న అనుచరులు-" అన్నాడు స్వామి. ".... నా విజయానికి ప్రతీకలు... కొందరికి పూవుల్ని చూస్తే, కొందరికి చేపల్ని చూస్తే సంతృప్తి కలుగుతుంది. నేను ఈ బీరువాల్లో శవాల్ని చూస్తూ ఆనందిస్తూ వుంటాను, దీన్ని ఇంగ్లీషులో ఏమంటారు?- సాడిజమా హ్హ హ్హ..."

    ఎవరూ మాట్లాడలేదు. ఆ దృశ్యం కలిగించిన షాక్ నుంచి ఇంకా వారు తేరుకోలేదు.

    ముందుకు నడిచారు. కొన్ని బీరువాలు ఖాళీగా వున్నాయి. ఇంకా వాటిని నింపలేదు. అయితే కొత్తగా చేయించినట్టున్న ఒక బీరువా మాత్రం వారిని ఆకర్షించింది.

    "ఇదేమిటి - మిగతా వాటికన్నా ఇది వెడల్పుగా వుంది?" అని ఎవరో అడిగారు. స్వామి మళ్ళీ నవ్వేడు.

    "మా హిందూ ధర్మం ప్రకారం కొన్ని ప్రదేశాల్లో భర్తతో పాటు భార్యనిగూడ చితిలో కాలుస్తారు. నేను కాస్త ముందుకెళ్ళి ప్రేయసీ ప్రియుల్ని కూడా మరణానంతరం ఒకేచోట వుంచడం కోసం యిది స్పెషల్ గా తయారు చేయించాను. ఇంకో రెండు మూడు రోజుల్లో ఆ శవాలు వస్తాయి ఇక్కడికి?"

    "ఎవరా ప్రియుడు?"

    "నికుంజ్ విహారి అని...."


                              17


    రాత్రి ఒంటిగంట కావొస్తూండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చింది విహారికి.

    కొద్దిసేపు పాటు తనెక్కడ వున్నాడో అర్ధంకాలేదు. తలతిప్పి చూస్తే పక్కనే సునాదమాల పాత పత్రికలతో విసురుతూ కనిపించింది.

    అతడు చప్పునలేచి కూర్చుని "ఏమిటిది మాలా?" అని అడిగాడు.

    ఆమె నవ్వింది.

    "మీకు ఫ్యాను బాగా అలవాటు అనుకుంటాను. చాలా సేపట్నుంచీ అటూ ఇటూ కదులుతున్నారు. ఇటు పడుకుంటే ఇటో దోమ చెంపమీద వాలుతోంది. అటు పడుకుంటే అటో దోమ బుగ్గని ముద్దు పెట్టుకుంటూంది."

    "అందుకని? దోమనైనా కాకపోతిని ప్రియుని బుగ్గను కొరకగా! అని పాడుకుంటూ వూపుతున్నావా విసనకర్ర... చాల్చాల్లే" అంటూ ఆమె చేతిలో పుస్తకం లాక్కొని లేచి కూర్చున్నాడు. "ఇప్పటికే ఇలా మీ దగ్గిరకి వచ్చేసినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను." 

    "అంతమాట అనకండీ! నాకీ రోజు ఎంత సంతోషంగా వుందో చెప్పలేను."

    "నాకు మాత్రం చాలా గిల్టీగా వుంది."

    అంతలో బయట పెద్ద శబ్దం వినిపించింది. "ఏమిటది?" అని అడిగాడు.

    "వర్షం వచ్చినప్పుడు మా ఇంటి బంగాళా పెంకులు చేసే శబ్దం," మళ్ళీ నవ్వింది. "చెప్పండి, ఎందుకు గిల్టీగా వుంది?"

    "ఒక పెద్ద ఆస్తికి వారసుడిగా నిన్ను ప్రేమించాను. ఇప్పుడు ఏమీలేని బికారిగా నీ ఇంటిలోనే వుంటున్నాను."

    ఆమె ముఖంలో నవ్వు మాయమైంది. సాలోచనగా అంది. "అలా అనకండి. నాకిలాగే చాలా బావుంది. నేను మీకో విషయం చెప్పనా! అందరూ నన్ను భయస్తురాలు, పిరికి అనుకుంటారు. కానీ నేను అలాంటి బలహీనతలు వున్నదాన్ని కాదు. ప్రేమన్నా, మొగవారన్నా నాకు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ప్రేమ అన్నది ఒకరిపట్ల జీవితంలో ఒకే ఒకసారి ఏర్పడే అత్యంత అపురూపమైన అనుభవం అని నా నమ్మకం. "నేను ఒక్కరికే, నా ప్రేమ ఒక్కరికే" అని నేను అనుకుంటూ వుంటాను. మీరు మా బామ్మతో నవ్వుతూ మాట్లాడినా నాకు ఏడుపొస్తుంది. దయచేసి నా అభిప్రాయాలు విని నవ్వుకోకండి. నేను లేనప్పుడు కూడా మీరు నవ్వుతూ వుండగలరన్న ఆలోచన కూడా నన్ను బాధపెడుతుంది. ప్రేమకు సంబంధించినంతవరకూ నేనంత స్వార్ధపరురాల్ని. అంత బలంగా లేకపోతే అది ప్రేమ కాదు అని నా ఉద్దేశ్యం."

    విహారి ఆమెవైపు విభ్రముడై చూశాడు. ఒక గొప్ప చిత్రాన్ని చూస్తున్నట్టు అనిపించింది అతడికి. ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని "నేను అదృష్టవంతుడిని" అని మాత్రం అనగలిగాడు.

    అంతలో ఒక చుక్క అతడి వంటిమీద పడింది. ఇద్దరూ తలెత్తి చూశారు.

    "మీరు అక్కడనుంచి లేవాలి" అంది మాల. "... వర్షం వస్తే అక్కడ కురుస్తుంది" అంటూ లోపలికి వెళ్ళి ఒక గిన్నె తీసుకువచ్చి అక్కడ పెట్టింది. ఇద్దరూ పక్కకి జరిగి నిలబడ్డారు. అక్కడ కూడా కురవడం మొదలైంది.

    "వర్షం తగ్గేవరకూ మనం ఇలా ఈ గదిలో ఇటూ అటూ చదరంగం ఆడుకోవాల్సిందే"- మరో బాల్చీ తీసుకువచ్చి అక్కడ పెడుతూ అంది. విహారి కిదంతా గమ్మత్తుగా వుంది. అతడి మొహంలో మారే భావాల్ని గమనిస్తూ, "హాయిగా ఎయిర్ కండిషన్ గదిలో పడుకోవాల్సిన వాళ్ళు, ఇలా నీటిమధ్య పడవలా తిరుగుతున్నారు. బామ్మ వుంటే నన్ను తిట్టేది."

    "ఎందుకు?"

    "మిమ్మల్ని ఇలా తడుపుతున్నందుకు-"

    అప్పటికి వాళ్ళు గదిలో ఒక మూలకి చేరుకున్నారు. గదినిండా తప్పేళాలు, బాల్చీలు, గిన్నెలు...

    ఆమె సామీప్యం, ఇంట్లో కురుస్తున్న వర్షం. అతడికి ఎంతో థ్రిల్లింగ్ గా వున్నాయి.

    "ఈ మూల కూడా కురిస్తే ఎక్కడికి వెళతాం?" అని అడిగాడు పైకి చూస్తూ.

    "బయట వర్షంలోకి."

    "మీ బామ్మ తిడుతుందేమో?"

    "ఆ రోజు స్టేజిమీద నా మీద దూలం పడకుండా ఆపుచేశారు. ఈ రోజు మీ మీద నీటిచుక్క పడకుండా ఆపుచెయ్యలేనా?"

    అతడు అమితాశ్చర్యంతో, "కొంపతీసి బోర్లాపడుకుంటావా?" అని అడిగాడు. పైకి నెమ్మదిగా కనబడే అమ్మాయిలు విజృంభిస్తే తుఫానులవుతారని అతనెక్కడో చదివాడు.

    ఆమె నవ్వు ఆపుకుంటూ, "ఛా! అదికాదు. పైట కప్పుతాన్లెండి" అంది.

    ఎందుకో తెలీదు- అతడికి సడెన్ గా ప్రవల్లిక గుర్తుకొచ్చింది. ఏం చేస్తూ వుండి వుంటుందామె? బహుశా స్వామిని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ వుండి వుంటుంది. తనేమో ఇక్కడ కర్తవ్యం మర్చిపోయి ఇలా రొమాంటిక్ మూడ్ లో...

    "ఏమిటి అలా అయిపోయారు...."

    "చాలా దుర్భేద్యమయిన కోట అది. ఏ మార్గం నుంచి లోపలికి ప్రవేశించాలా అని ఆలోచిస్తున్నాను. సూర్యారావు, రామ్ లాల్, పరమేశ్వరం.... చాలా పెద్ద పెద్ద వాళ్ళు కాపలా కాస్తున్నారు దాన్ని."

    "మీరు చెప్పేది నాకు అర్ధం కావడంలేదు."

    అతడు మాట్లాడలేదు. వర్షం చప్పుడు వింటూ ఇద్దరూ మౌనంగా వుండిపోయారు, దాన్ని భంగపరుస్తూ ఆమె అంది. "సూర్యారావు అంటే మినిష్టర్ సూర్యారావేగా?"

    "అవును. ఏం?"

    "ఏం లేదు. ఆయన కూతురు మా కాలేజే."

    అతడు తిరిగి ఆలోచనల్లో మునిగిపోయాడు. మరో రెండు నిమిషాలు గడిచాయి. ఒక చిన్న మెరుపు- ఆకాశంలో- అతడి మెదడులో.

    అది తట్టగానే అతడు నిటారుగా అయ్యాడు. ఆమె అతడివైపే చూస్తూంది.

    "మాలా! ఆ అమ్మాయిని నువ్వు నాకు చూపించగలవా?" అని అడిగాడు.


                       *    *    *


    ఇందిరాగాంధీ మహిళా కళాశాలలోంచి అమ్మాయిలు గుంపులు గుంపులుగా బయటకు వస్తున్నారు. అందులో ఒక అమ్మాయి కాస్త విడిగా వస్తూంది.

    విహారి కారు దిగి ఆమె దగ్గరకు వెళ్ళాడు.

    "మాడమ్! మీ నాన్నగారికి హార్టు అటాక్ వచ్చింది. ఇప్పుడే ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు."

    ఆ అమ్మాయి బిత్తరపోయింది. భయం కొట్టొచ్చినట్లు కనపడింది. ఆందోళనగా "ఎక్కడున్నారు?" అనడిగింది.

    "ఆస్పత్రిలో... మీరు అర్జంట్ గా రావాలి".

    ఇద్దరూ కారెక్కారు. కారు కదిలింది.

    "ఎక్కడ? ఏ ఆస్పత్రిలో?" అనడిగింది.

    "సారీ మాడమ్ యు ఆర్ బీయింగ్ కిడ్నాప్డ్" తాపీగా అన్నాడు.

    ఆమె ఉలిక్కిపడింది. చేతులు వణకడం స్పష్టంగా కనిపిస్తూంది.

    ఆమె దిగడానికి వీల్లేకుండా కారు వేగం హెచ్చించాడు. రెండు మూడు నిమిషాలు మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా డ్రయివ్ చేసి, ఆమె వేపు చూశాడు.

    రక్తం లేనట్లు ఆమె మొహం పాలిపోయింది. అతికష్టంమీద ఏడుపు ఆపుచేసుకుంటున్నట్లు కనిపించింది. అతడికి జాలేసింది. ఆమెతో సంభాషణ ఎలా ప్రారంభించాలో అర్ధంకాలేదు. "మిమ్మల్ని 'చెల్లీ' అని పిలవవచ్చునా?" అని అడిగాడు.

    ఆమె ఉలిక్కిపడి అయోమయంగా చూసింది. అతడు స్నేహపురస్సరంగా నవ్వేడు. ఆమె ఇంకా అలానే చూస్తూంది. "నా పేరు విహారి ...నికుంజ్ విహారి" అన్నాడు. "నేను కిడ్నాపర్ ని కాను. ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ ఎవరూ తమ పేరు చెప్పరు" అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ఇంకా బెదురునుంచి బయటపడలేదు. ఈ లోపులో అతడి కంఠం మంద్రస్థాయిలో వినిపించసాగింది.

    "ప్రతివాళ్ళు విప్లవం గురించి, నైతిక విలువల గురించి మాట్లాడతారు. అది తమనుంచే ప్రారంభం కావాలనుకోరు. రాత్రిళ్ళు రిహార్సల్స్ అయ్యాక బార్లో గొంతు దాకా మందుకొట్టి సమసమాజం గురించి మాట్లాడిన మా వాళ్ళు, ఇంటికి వెళ్ళడానికి రిక్షావాడితో ఇరవై పైసలకోసం అరగంట వాదించడం నేను స్వయంగా చూశాను. అదే అడిగితే 'కష్టపడి సంపాదించిన డబ్బు బ్రదర్స్' అనటం కూడా నేనెరుగుదును. ఎందుకు? మీ కాలేజీలోనే 'లంచగొండితనం రూపుమాపటం ఎలా?' అన్న టాపిక్ ని వక్తృత్వ పోటీల్లో పెట్టండి. సగంమందికి పైగా స్టూడెంట్స్ 'లంచగొండులను పట్టుకుని బుద్ధివచ్చేలా శిక్షించాలి. మళ్ళీ ఈ పని చేయకుండా పాఠం చెప్పాలి. వీలయితే ఉరిశిక్ష కూడా విధించాలి' అని ఆవేశంగా మాట్లాడుతారు. అందులో చాలామంది ప్రభుత్వోద్యోగుల సంతానమే! వారికి నిజంగా తెలీదా? తమింటికి వచ్చే "ప్రజంటేషన్లు", తమ తండ్రులు సంపాదించే "ఆస్థులు" వెనుక దారిగుండా వచ్చినవే అని.... అయినా ఆ సోఫాలనీ, ఫ్రిజిడేర్లనీ అనుభవిస్తూ వుంటారు. ఎవరయినా దీని గురించి అడిగితే 'మొత్తం ప్రపంచమే అలా వుంది. మా నాన్నగారు మాత్రం మడిగట్టుకు కూర్చుంటే సరిపోయిందా' అంటారు. ఈ వాదన ఎంతవరకూ నిజమో నాకు తెలీదు. బహుశా వ్యవస్థ మొత్తం కరప్ట్ అయిపోయినప్పుడు లంచం ఇవ్వటం కూడా మనిషి దినచర్యలో భాగంగా అయిపోయి వుండవచ్చు. అందుకే ఎవరూ తిరగబడటం లేదేమో! కానీ కేవలం ఒకే ఒక్క మనిషికి ఈ రకమయిన అరాచకం అంతులేని నష్టం కలుగచేస్తే అప్పుడా మనిషి ఏం చేస్తాడు? పదిమందికీ చెప్పి అందర్నీ సమకూర్చుకోడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరూ తనతో రాకపోతే, ఏమాత్రం పౌరుషం ఉన్నవాడయినా, ప్రాణాలకు తెగించి ఒక్కడే తిరగబడతాడు. ప్రస్తుతం నేను చేస్తున్న పని అదే."

 Previous Page Next Page