కొన్ని పుకార్లు ఇలా నగరాన్ని చుట్టుముడుతుంటే...
మరికొందరు నిన్నగాక మొన్న జరిగిన సంఘటనలు పునరావృతమైనట్టు నిర్ధారించుకున్నారు...
ఏ బస్సులో ఏ పాముందో ఏ కారుడిక్కీలో ఏ పామునక్కిందో ఏ ఇంట ఏ పాముని విడిచిపెట్టారో ఏ చూరుపైనుంచి ఏనాగు పైనబడుతుందో అని...
జనం గుసగుసల్లో పాము బుసబుసలు...అనుమానం అసహనం అసురసంధ్యవేళకల్లా వార్త నగర పొలిమేరల్నిదాటి రాష్ట్రం సరిహద్దుదాకా చేరిపోయింది.
ఇదమిద్దరంగా అది ఏ జాతి సర్పమో తేల్చలేని ప్రభుత్వం ప్రజారక్షణ కార్యక్రమానికి నడుంకడుతూ రంగంలోకి దిగింది. హైద్రాబాద్ సికింద్రాబాద్ నగరాలలో ఎక్కడచూసినా సాయుదులైన పోలీసులు, డాక్టర్లు, స్నేక్ స్క్వేడ్స్...
మంత్రిమండలి సమావేశంలో తీర్మానించిన ప్రకారం ప్రధాన వీధుల్లో పోలీసుజీపులు ప్రత్యేక ప్రకటనలు చేస్తూ గస్తీ తిరుగుతున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో.
డి.సి.పి. ప్రసన్నతోసహా డిజిపి ఉస్మానియా మార్చ్యురీలో అడుగుపెట్టాడు.
విషప్రభంజన గర్జనలకు ఆహుతైన పసిపిల్లల కళేబరాల్ని చూస్తుంటే మూగబోయిన శంఖధ్వనుల్లా అనిపించి క్షణంపాటు శ్వాసని మర్చిపోయాడాయన.
స్థంభించిన కాలసర్పపు ఫణుల ప్రేతకాంతులు మనసు మండిస్తూంటే రాలిన ఒక్కో లేతకుసుమాన్ని చూస్తూ ముందుకు కదులుతున్నాడు.
నగరమంతా మరణయాతనతో మనోవేదనతో కంపించిపోతున్న ఆ తరుణంలోనే.
ఇందిరాపార్కు చీకటిపొదల్లోనుంచి విషపుగొంతుక తెరిచిన 'మాంబా' చప్పుడు కాకుండా నిర్మానుష్యంగావున్న రోడ్డుని చేరుకుంది.
మరో అరనిముషంలో దోమలగూడాలోని ఓ ఇంటి ప్రాంగణంలో అడుగుపెట్టింది.
అక్కడ తెల్లవారుఝామున కాబోయే ఒక వివాహం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చీకటిలో కాంపౌండ్ వాల్ సమీపంలోని ఓ పొదమాటున నక్కిన మాంబా సుమారు రెండుగంటలసేపు అక్కడ క్రమంగా ఎక్కువవుతున్న అలికిడి గమనిస్తూంది.
అప్పుడు సమయం రాత్రి పదిగంటలు కావస్తూంది.
ఆ పెళ్ళికి మరో నాలుగుగంటల తర్వాత వస్తున్న ముఖ్య అతిథి ఆర్ధికశాఖ మంత్రి నాగరాజు.
"...ఒక ప్రత్యక్షసాక్షి కధనం ప్రకారం ఈ మారణహోమానికి కారణమైన సర్పం సుమారు పదహారు అడుగుల పొడవుంటుందని డేఫొడిల్స్ పాఠశాలలో పసిపిల్లల్ని కాటేసిన మరుక్షణం మెరుపువేగంతో..."
అలవోకగా రేడియో ఆన్ చేసిన డాక్టర్ శృతి క్షణంపాటు తత్తరపడి వెంటనే వాల్యూమ్ ని ఎక్కువ చేసింది.
"అది ఏ జాతికి చెందిన సర్పమో ఇదమిద్దంగా ఎవరూ గుర్తించకపోయినా మరణించిన పదకొండుమంది పసిపిల్లలకి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి తన సంతాపాన్ని..."
"గా...డ్" అంతవరకూ తను విన్నది స్పెషల్ బులెటెన్ గా గ్రహించిన శృతి రేడియో ఆఫ్ చేసి కొన్ని లిప్తలపాటు చేష్టలుడిగినట్టు నిలబడిపోయింది. అనంతందాకా వ్యాపించిన చీకటి గెస్ట్ హౌస్ కి సమీపంలో కీచురాళ్ళ రొద.
అప్పటికే ఆమె శరీరం స్వేదంతో తడిసిపోయింది.
ఇంతవరకూ విన్న వివరాలు చేజారిన 'బ్లాక్ మాంబా' కి సంబంధించినవేనని గుర్తించడానికి ఆమెకు అట్టే వ్యవధి అవసరం లేకపోయింది.
కేవలం తన అలసత్వం అనాలోచితంగా జరిగిన పొరపాటు కొందరి ప్రాణాలు కోల్పోటానికి కారణమైంది.
'మాంబా' ప్రత్యర్ధుల ఆధీనంలో వుందన్న ఆలోచన ఇన్ని అనర్ధాలకు దారితీసింది.
'మాంబా' పార్శిల్ తనదగ్గర లేనికారణంగానే కోట్ల ఖరీదుచేసే హెరాయిన్ కోసం బేరం పెట్టికూడా మాటతప్పాడు బ్లాక్ మాంబా...
ఇప్పుడెలా నగరంలో అడుగుపెట్టిన మాంబా మూలంగా ఇంకా ఎందరి ప్రాణాలికి హాని జరగబోతూంది.
ఒకవేళ ముందే తను పోలీసులకి తెలియచేసి వుంటే...
ఉబికిన రెండు నీటిబొట్లు మనసుపొరల్ని చీల్చి కళ్ళంచున చేరి ఘనీభవించాయి.
ఇన్ని దారుణాలకీ కేవలం తనే కారణమైనందుకు ఉద్విగ్నంతో లేక మృత్యువుని చేజేతులా మారణాస్త్రంగా మార్చి మనుషులపైకి తనే విసిరినందుకు దుఃఖమో ఇక తమాయించుకోలేకపోయింది.
"జ...యా..." ఆమె ఆర్తనాదం గొంతునుంచి వెలువడక ముందే పక్కగదిలోకి దూసుకుపోయింది.
అంతే...
నిశ్చేష్టురాలై నిలబడిపోయింది.
అక్కడ గదిలో నిన్నరాత్రిలాంటి వివశత్వంతో జయేంద్ర నలిగిపోతున్నాడు. అంతకుమించిన పెనుగులాటతో జీవితపు కొస కొమ్మలపైనుంచి లోయలోకి జారిపడే లేతశిశువులా బాధని బుసగా మార్చుకుని కుమిలిపోతున్నాడు...
తన వాడన్న భావమో లేక తనకేమీకాదన్న తలంపో తొందరపాటో అతడ్నిచేరి మెలితిరుగుతున్న జయేంద్ర భుజంపై నెమ్మదిగా చేతినుంచింది.
ముందుగదిలో గాలి తుళ్ళిపడేటంత బుసలాంటి నిట్టూర్పు... వెనువెంటనే తలతిప్పి చూశాడు.
జయేంద్ర కళ్ళు మిణుగురులా మెరుస్తున్నాయి.
భయంతో ఓ అడుగు వెనక్కి వేయబోయింది.
కానీ అప్పటికే ఆలస్యమైంది.
కాటేసే ఓ కళింగనాగులా క్షణంలో ఆమెను చేరుకుని చేతుల్తో ఒడిసిపట్టుకున్నాడు.
అప్పుడు చూసింది అతడి ఒంటిపై ఏ ఆచ్చాదనాలేదన్న సత్యాన్ని.
అది కూడా కాదు ఆమెను హత్తుకుపోయిన జయేంద్ర శరీరం సెగలుకక్కుతున్న మన్మధుడి మనోవల్మీకంలా ఉంది...
తప్పించుకోవాలన్న ఆమె పెనుగులాటలోనే చీర జారిపోయింది. ఒదిగిపోకూడదని శృతి ప్రయత్నం చేస్తుండగానే అతడి పిడికిలి ఆమె నడుంపై పియానో రీడ్స్ ని శృతి చేసినట్టు కలతగా కదిలింది.
ఆమె గొంతు శంఖంలోనుంచి ఓ ఆర్తనాదం వెలికిరాబోయింది. కాని స్పృహలేని జయేంద్ర పెదవులు ఆమె అధరాలను తాకి, కాంక్షని, కోర్కెలతీర్ధంగా మార్చాయి.
అక్కడే ఆమె ఓడింది.
నిస్సత్తువగా నేలపడిపోయింది.
కొన్ని క్షణాలపాటు...అది వివశత్వమో కోరని పరవశత్వమో పడగనీడని అనిపిస్తున్నా ఇక నిస్సత్తువనుంచి కూడగట్టుకోలేకపోయింది.
ఒక సన్నని సంధికాలం...
యవ్వన శిలాశాసనంలా తొలిసారి రాయబడిన చెరగని అక్షరాలలాంటి ఓ అపదృశమైన స్పర్శో లేక కోరకుండా వాడి కోరలతో వేసిన సిలువలాంటి అనుభూతో.
శృతి గొంతునుంచి కెవ్వుమన్న ఆర్తనాదం వెలువడింది...
* * * *
రాత్రి పదకొండు గంటలు కావస్తూంది...
ఉస్మానియా హాస్పిటల్ నిద్రలో కలవరిస్తున్న పసికందులా వుంది.
మార్చ్యురీలోని పసిపిల్లల శవాలు ఇంకా విరియకముందే రెక్కలు రాలిన మొగ్గల్లా వున్నాయి. ఏ ఇంట పారాడిన ప్రాణులివి...
ఏ దేశసంస్కృతి శరీరంపై ఇంపుగా అద్దుకోవాల్సిన చందనపు సొంపులివి...
ఇలా నిస్సహాయంగా రాలి ఎందరితల్లుల స్వప్నాల్ని కూల్చాయి.
ఎందరి తండ్రుల గుండె కవాటాలపై వ్రణాల్ని మొలకెత్తించాయి.
బాధగా కళ్ళు మూసుకుని టేబుల్ పై చేతులానించి తలను పట్టుక్కూచున్నాడు డిజిపి. ఆయన సమీపంలో చెరోపక్క పోలీసు కమీషనరూ డిసిపి ప్రసన్న కూడా కూర్చోగా వారికి అభిముఖంగా ఫోరెన్సిక్ ఎక్స్ పర్ట్ తాజుద్దీన్ ఆసీనుడై వున్నాడు.
"ఇట్స్ రేర్ టాక్సెస్..." ఇదమిత్తంగా తేల్చుకోలేకపోతున్న సర్పం విషంగురించి డిటైల్డ్ గా చెప్పుకుపోతున్నాడు... "మనదేశంలోని సర్పాల జాతికిచెందిన పాముకాటులా లేదు..."
"ఎలా చెప్పగలరు" కళ్ళు మూసుకునే యాంత్రికంగా అడిగారు డి.జి.పి.