Previous Page Next Page 
మౌనం పేజి 37

    రెండు వైపులనుండి  సపోర్ట్  లేని  లైఫ్ అయిపోయింది.

    ప్రతి క్షణం  ఆమెకు తల్లిదండ్రులు గుర్తువస్తున్నారు.

    అతను ఊరు వెళ్ళాక  తల్లిదండ్రుల  తలంపు  మరింత  రాసాగింది. ఉండబట్టలేక  బయటకు  వెళ్ళి పబ్లిక్  టెలిఫోన్ బూత్ నుండి  ఒకసారి ఇంటికి ఫోన్ చేసింది.

    తన తల్లి ఫోన్ లిఫ్ట్ చేసింది.

    "అమ్మా....నేనమ్మా....అర్చనని....ఎలా వున్నావు?" ఉద్వేగంతో పొంగి వస్తున్న దుఃఖం కంట్రోల్ చేసుకుంటూ  అడిగింది ఆమె.

    అవతలివైపు లైన్ డిస్కనెక్ట్  అయింది.

    తనతో  మాట్లాడటం  ఇష్టంలేక తల్లి  ఫోను  పెట్టేసింది  అన్న నిజం నమ్మబుద్ధికాలేదు. పొరపాటుగా లైన్ కట్ అయిందనుకుంది.

    మరోసారి  డయల్ చేసింది.

    ఈసారి కూడా  అవతలినుండి  'మౌనమే' సమాధానంగా వచ్చింది.

    ఇంటికి  తిరిగి వచ్చి చిన్న పిల్లలా  ఏడ్చింది.

    ఏమిటీ జీవితం? ఇటు తన తల్లి దండ్రులు....అటు చంద్రకాంత్ తల్లిదండ్రులు....ఎవరూ  దగ్గరకు రానివ్వటంలేదు.

    ఆలోచనల్లో  నిమగ్నమయిన  ఆమె కళ్ళనుండి  నీళ్ళు  చెక్కిళ్ళ మీదుగా  జాలుకారాయి.

    కాలింగ్ బెల్ మోగింది.

    ఏకాంత నిశ్శబ్దంలో  బెల్ మ్రోగడంతో ఉలిక్కిపడింది.

    చీకటి  పడుతోంది.

    సమయం  ఆరు అవుతోంది.

    ఎవరు వచ్చుంటారు....?

    ఆమె చైర్లో లో  నుండి  లేచేలోగానే  మరోసారి  బెల్ మోగింది.

    "వస్తున్నా" అంటూనే  గబగబా వచ్చి  తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయింది.

    కారణం....

    చంద్రకాంత్ వచ్చాడు!

    "అరె....చంద్ర....మీరు  ఎప్పుడు  వచ్చారు?" అతన్ని  చూస్తూనే ఆనందంతో  ఆమె కళ్ళు మెరిశాయి.

    లోపలికి వచ్చాడు  చంద్రకాంత్.

    "మీరు రావలసింది  ఎల్లుండి కదా....? అంత త్వరగా షూటింగ్ అయిపోయిందా?" అతనితోపాటే  వచ్చి సోఫాలో  కూర్చుంటూ అంది.

    సమాధానం చెప్పలేదు అతను.

    ఒక్కక్షణం  అతని ముఖంలోకి  చూసింది.

    అతని పెదవుల మీద ఏ మాత్రం  చిరునవ్వు లేదు. చాలా సీరియస్ గా వున్నాడు.

    ఒకింత  భయంగా  అనిపించింది ఆమెకు.

    అతని ముఖంలో  అంతటి సీరియస్ నెస్  ఆమె ఎప్పుడూ  చూడలేదు.

    "చంద్రకాంత్....ఏమయింది?" ఏదో కీడును  శంకించిన స్వరంతో అందామె.

    సమాధానం చెప్పలేదు అతను.

    ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది.

    "టెల్ మి చంద్రకాంత్....వాట్ హేపెండ్?"ఒకరకమైన భయం నిండిన గొంతుతో ప్రశ్నించింది.

    సోఫాలో  వెల్లకిలా  పడుకున్నాడు  అతను.

    ముఖంలో  రక్తం లేనట్లుగా  తెల్లగా  పాలిపోయి వుంది.

    "చంద్రా! అలా వుండొద్దు. నాకెందుకో భయంగా  వుంది" వణికే స్వరంతో అంది.

    "మన టైం....బాగోలేదు...." నూతిలో  నుండి  వచ్చినట్లుగా ఉంది అతని మాట.

    "మన టైం....బాగోలేదు...." నూతిలో  నుండి  వచ్చినట్లుగా  ఉంది అతని మాట.

    "ఏం....జ.....రి....గిం....ది?"

    "మన వీడియో కెమెరా, లెన్సెస్, ఎక్విప్ మెంట్....అన్నీ....పోయాయి...."

    అదిరిపడింది ఆమె.

    "వాట్...."

    "అవును! సర్వస్వం పోగొట్టుకున్నాం. దాదాపు  నాలుగు లక్షల రూపాయల ఎక్విప్ మెంట్.దానికోసం  తీసుకున్న బ్యాంక్ లోన్ కూడా పూర్తిగా  తిరిగి కట్టలేదు...." అతని గొంతు గద్గదమైంది. కళ్ళు ఆర్ద్రములయ్యాయి.

    "బట్....ఎలా? ఏమయింది?" అతని భుజాలు  పట్టుకొని కుదిపేస్తూ అందామె.

    "నిన్నటివరకు  షూటింగ్ బాగానే జరిగింది. నిన్న సాయంకాలం దాదాపుగా ఐదు గంటల వరకు షూట్ చేశాము. ఆ సమయంలో  చాలా లోపలికి....దట్టమైన అడవిలో వున్నాము మేము  ఆరుగురం వున్నాము. మా జీపు డ్రైవర్ తో  కలిపి  ఏడుగురం వున్నాము. నిన్నటికి  షూటింగ్ పూర్తి అయింది. చీకటి పడుతోంది కదా అని యింక ఆపివేశాము. ఈ రోజు మళ్ళీ అదే స్పాట్ కి వెళ్ళి షూట్ చేయాలి. మా కెమెరా కిట్ అంతా ప్యాక్ చేస్తున్నాం. ఆ సమయంలో...."

    ఊపిరి పీల్చటం  మర్చిపోయి  వింటోందామె.

    "ఐదుగురు మనుషులు  హఠాత్తుగా  పొదల చాటు నుండి బయటికి వచ్చారు. వాళ్ళ దగ్గర గన్స్ వున్నాయి. మాలో ఒకరిని  కొట్టి గాయపరిచారు. మమ్మల్ని  తాళ్ళతో కట్టి పడవేశారు. నోరు ఎత్తితే కాల్చి చంపుతాం అన్నారు. మేము చూస్తుండగా కెమెరా కిటి  మొత్తం  ఎత్తుకొని  పారిపోయారు" దాదాపుగా ఏడుస్తున్నట్లుగా వుంది అతని గొంతు.

    గుండెలు  అదిరిపోయాయి ఆమెకు. కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి ఆమెకు.

    "మా జీప్ డ్రైవరుకి  కట్టిన  తాళ్ళు  వూడిపోవటంతో అతను  అందరినీ  విడిపించాడు. అదృష్టవశాత్తు  ప్రాణాలతో  బయటపడ్డాడు. మాలో ఏ ఒక్కరు  ప్రతిఘటించే  ప్రయత్నం  చేసినా  నిర్ధాక్షిణ్యంగా  అందర్నీ చంపేవారు. పోలీస్ కంప్లైంట్ యిచ్చాము. పోయిన వస్తువులు  దొరుకుతాయో లేదో చెప్పలేము. మన అదృష్టం ఎలా వుందో" ఇంక మాట్లాడలేకపోయాడతను.

    అచేతనంగా  వుండిపోయిందామె.

    "ఏమిటీ సంఘటనలు?....అసలీ జీవితం  ఏం కాబోతోంది? పదిలక్షల రూపాయలకు మేజర్ ఎసైన్ మెంట్ దొరికిందని  ఆనందపడి  కొద్దిరోజులు కూడా కాలేదు. ఇంతలోనే  ఈ సంఘటన. భగవాన్....ఏమిటీ పరీక్ష....అని తలచుకున్న  ఆమెకు  భయంతో  గుండెలు  అదిరిపోతున్నాయి.

    "నాలుగు లక్షల రూపాయల బ్యాంక్ లోన్ కి  వడ్డీ కట్టాలి. అసలు తీర్చాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. మనకి ఎవరిసపోర్టు లేదు. సంపాదన ఎలాగ? మనం ఏం తింటాము? ఈ ఖర్చులన్నీ ఎలా తట్టుకుంటాము?" సోఫాలో  బోర్లా  పడుకునే  అంటున్నాడతను.

    అతని కళ్ళు వర్షిస్తున్నాయన్న  విషయం  ఆమెకు తెలుసు.

    "నా ఊహలు.... ఆశలు.... అంచనాలు.... అన్నీ  తల్లక్రిందులయ్యాయి. రేపటి నుండి  ఏం చేయాలి? నేను వీడియో  గ్రాఫర్ గా తప్ప మరే వుద్యోగానికీ పనికిరాను."

    స్వగతాన్ని  పైకి  అంటున్నట్లుగా  వుంది.

    ఆమెకు  కాలూ  చేయీ ఆడటం లేదు. ఇది ఆమె వూహించని  సంఘటన. మెదడు  అంతా మొద్దుబారినట్లయిపోయింది.

    "చంద్రకాంత్!" అతని తల మీద  చేయి వేసి పిలిచింది.

    ఆమె ఒడిలో  తల పెట్టి  చిన్న పిల్లాడిలా బావురుమన్నాడు  చంద్రకాంత్.

    ధైర్యానికి, మొండితనానికి  మరో పేరు మగవాడు.

    ఎంత చిన్న కష్టమైనా, ఆడవారి కంటి వెంట  అశృబిందువుగా  వ్యక్తం అవుతుంది.

    కానీ  మగవాడు అలా కాదు.

    మనసులో  ఎంత బాధ ఉన్నా  పైకి  ధైర్యాన్ని, నిబ్బరాన్ని  ప్రదర్శిస్తాడు.

    కానీ....ఇప్పుడు  అందుకు విరుద్ధంగా  జరుగుతోంది. కారణం....అతని ఆత్మస్థయిర్యాన్ని, గుండె  నిబ్బరాన్నీ  చావుదెబ్బ తీసిన  సంఘటన అది.

    అతనిలోని  గాంభీర్యాన్ని  నీరు కార్చిన  సందర్భం అది.

    గుండెలు  పగిలేలా  రోదిస్తోంది....ఆమె  మనసు....మౌనంగా!


                     *    *    *    *


    ఇదే వీధిలో  ఉంది  అతని యిల్లు" ఇటూ అటూ చూస్తూ  అన్నాడు ఉపేంద్ర.

    ఆ వీధిలోకి  వ్యానుని  టర్న్ చేశాడు  డ్రైవరు.

    స్లోగా వెళుతోంది  వ్యాను.

    దాదాపు  పది పదిహేను  ఇళ్ళు  దాటాక  ఎడమ వైపుగా  ఉన్న ఒక డాబా దగ్గరకు రాగానే "ఇక్కడ ఆపు" అన్నాడు ఉపేంద్ర.

    "నువ్వు ఇక్కడే వుండు" అన్నాడు డ్రైవరును  వుద్దేశించి.

    అలాగే  అన్నట్లుగా  తల వూపాడు  డ్రైవరు.

    "పాల్....నువ్వు కూడా దిగు" అన్నాడు డోరు తీసుకుని  దిగుతూ ఉపేంద్ర.

    అంత వరకు  నిశ్శబ్దంగా  కళ్ళు మూసుకుని  కూర్చున్న  పాల్ కళ్ళు తెరిచి క్రిందికి దిగాడు.

    అతని ముఖం చూస్తే మనుషుల్ని  చంపేటంత  కర్కశత్వం  వుందని ఎవరూ అనుకోరు.

    అంతటి కసాయితనం  అంత చిన్న వయస్సులోనే  పాల్ కి ఎలా వచ్చిందో ఇప్పటికీ ఉపేంద్రకు అర్ధంకాదు.
    ముందుగా నడిచాడు పాల్.

    ఇంటికి  ముందు చిన్న కర్రలతో  చేసిన గేటు వుంది. ఆ గేటు తెరిచి లోపలికి వెళ్ళారు ఇద్దరూ.

    చాలా పాతబడి  వుంది ఆ యిల్లు.

 Previous Page Next Page