"అప్పుడప్పుడు ఇలాంటి నీలి వార్తలు పుట్టి, ప్రచారం అవుతూనే వుంటాయి. మనం పట్టించుకోకూడదు. కొందరు స్వార్దపరులు తమ పనులకు ఎవరూ అడ్డురాకూడదన్న వుద్దేశ్యంతో ఇలాంటి కథలు అల్లి ప్రచారం చేస్తుంటారు" అన్నాడు యోగానందం.
"అప్పుడప్పుడు కొన్ని నిజాలు కూడా అబద్దాలు అవుతుంటాయి." అనుకొన్నాడు మారుతీరావు. సుబ్రహ్మణ్యస్వామి మాటలు గుర్తువచ్చి. "ప్రచారం అంటే గుర్తుకొచ్చింది. బెంగాల్లోనో ఎక్కడో ఒకాయనకి పక్షవాతం వస్తే మెడలో గాంధీజీ బొమ్మగల లాకెట్ వేసుకొని, కొన్ని సంవత్సరాలపాటుగా గాంధీజీ నామజపం చేశాడట. ఆశ్చర్యంగా ఆయన పక్షవాతం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడట. తను మహిమాన్వితుడినంటే గాంధీజీ ఒప్పుకోరు, దానికేమంటారు?"
"దేనికయినా మనిషి నమ్మకమే ముఖ్యమంటాను. ఒక వైద్యుడు మందిస్తే రోగికి అతడిపట్ల నమ్మకముండాలి. పూజ చేస్తే భక్తుడికి భగవంతుడిపట్ల నమ్మకముండాలి. నమ్మకమే ఎన్ని అధ్బుతాలైనా సృష్టిస్తుంది. ఇప్పుడు మన కళ్లెదురుగా అవతార పురుషులని చెప్పబడే బాబాలు, స్వాములు ఎంతోమంది వున్నారు. వాళ్ళని నమ్మేవాళ్లున్నారు. నమ్మనివాళ్లున్నారు. నమ్మినవాళ్లు అద్బుతాలు దర్శిస్తారు. నమ్మనివాళ్లకి లేదు" అన్నాడు యోగానందం.
"పత్రికల్లో వచ్చిన వార్త నిజమో కాదో దేవుడికి తెలుసుగాని నువ్వు మాత్రం మా ఇంటి మహలక్ష్మివైరా, తల్లీ" నవ్వుతూ కౌస్తుభ చెంపమీద తట్టింది పద్మావతి.
* * * * *
ట్రింగ్.. ట్రింగ్... ట్రింగ్....
ఫోన్ రింగవుతుంటే రిసీవరెత్తిన దిగంబరరావు "హలో!" అన్నాడు.
నిమిషం తరువాత రిసీవరు హుక్ మీద పెట్టేసి అరుస్తున్నట్టుగా అన్నాడు. "ఎంత దుస్సాహసం? నిజంగా వీడికి పోయేకాలం వచ్చింది. లేకపోతే నా కూతుర్ని కాదన్నవాడు మరో దాన్ని వలచి వరమాల వేస్తుంటే చూసి తరించమన్నట్టు ఎంగేజ్ మెంట్ కి రమ్మని పిలుస్తాడా?"
"ఫోన్ చేసింది ఎవరు డాడీ?" వినోదిని అడిగింది విషయం కొంత అర్దమైనా.
"మారుతీరావు. వాడినెప్పుడో సజీవదహనం చేయిస్తాను చూడు. రేపు కొడుక్కీ ఆ పిల్లకి హోటల్ అప్సరాలో ఎంగేజ్ మెంట్ ప్రోగ్రాం వుందట. సకుటుంబసపరివారంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించి పొమ్మంటూ ఫోన్. పనిగట్టుకొని నన్నిలా అవమానిస్తాడా? పోనీలే అని నువ్వు చెప్పినందుకు ఊరుకున్నానుగాని లేకపోతే ఎప్పుడో వాడినీ, వాడి కొడుకునీ లేపేద్దును" మంట మండుతున్నట్టుగా అన్నాడు దిగంబరరావు.
"నీకు బిజినెస్ లో పార్టనర్ , స్నేహితుడు, బంధుమిత్రులందరికీ చెప్పినట్టే నీకూ చెప్పాడు తన కొడుకు ఎంగేజ్ మెంటుకు రమ్మని. ఇందులో నిన్ను కావాలని అవమానించింది ఏముంది?" నెమ్మదిగా అంది వినోదిని.
ఆశ్చర్యంగా చూశాడు కూతురి ముఖంలోకి దిగంబరరావు. ఇలా మాట్లాడుతున్నది తన గారాల కూతురు విన్నూ ఏనా? చిన్నప్పటినుంచి ఏదడిగినా నిమిషాలమీద తెప్పించి ఇచ్చి ఆమె ముఖంలో కదిలే ఆనందంలో తృప్తిలో ఆనందాన్ని వెదుక్కొనేవాళ్లు.
అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతురు... యవ్వనంలోకి అడుగుపెట్టి ఎవరినైతే వరించి అతడి చిటికెనవ్రేలు పట్టుకుని జంటగా సాగిపోవాలని కలలు కందో... ఆ కలని నిజం చేయలేకపోయాడు. ఆమెకు కోరుకున్నవాడిని ఆమెకు భర్తగా ఇవ్వలేకపోయాడు.
తనకున్న ఈ ఆస్తీ, ఐశ్వర్యం... ఇదంతా దేనికి? తగలేసుకోనా?
శ్రీచక్ర తనవాడు కాదనుకున్న క్షణంనుండి ఆమె ముఖంలో అలుముకున్న నైరాశ్యం, బ్రతుక్కి అర్దం కోల్పోయినట్టుగా వున్న ఆ చూపులు... తన దృష్టినుండి తప్పుకుపోలేదు. మునుపటి ఆనందం తన వినూ ముఖంలో ఎలా చూడగలనా అని సతమతమౌతున్న తరుణంలో మారుతీరావు చేసిన ఫోను అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది.
ఆగ్రహంతో భగ్గున మండిపోయాడు దిగంబరరావు. గుండెలో దావానలం చెలరేగుతున్నా ఏమీ జరుగనట్టుగా సహనమన్న ముసుగు ముఖానికి కప్పేసుకుని తనను సముదాయిస్తున్న కూతుర్ని ఆశ్చర్యంతో కాక ఇంకెలా చూస్తాడు?
అప్పుడే అంత పెద్దతనం వచ్చేసిందా తన వినూకి. నిన్న మొన్న ఇంకా బొమ్మలతో ఆడుకుంటున్నట్టుగానే వుంది. జీవితంలో తగిలే ప్రతి ఎదురుదెబ్బా మనసుకి వయసు పెంచుతుందేమో!
శ్రీచక్ర ఎంగేజ్ మెంట్ కి మనం వెడదాం, డాడీ!"
ఆశ్చర్యం మీద ఆశ్చర్యం.
"తమాషా అంటున్నావా?"
"తమాషాకి ఏంకాదు. నిజంగానే అంటున్నా."
ఇందాకటి నుండి తండ్రీకూతుళ్లని నిశ్సబ్దంగా గమనిస్తున్న వినూ తల్లి ఛీత్కారం చేస్తన్నట్టుగా అంది. "ఛీ నీకు సిగ్గులేదూ? నువ్వుండాల్సిన చోటు మరో ఆడది దక్కించుకుంటే ఆ ఉత్సవం కన్నులపండువగా తిలకించడానికి వెడతావా?"
"దురదృ-ష్టకరమైన పరిస్థితులు అతడిని నాకు భర్తకాకుండా చేశాయి. భక్తకాకపోతేనేం? మేం స్నేహితులుగా కొనసాగాలని నిర్ణయించుకున్నాం. అలా అని అతడినుండి మాట కూడా తీసుకొన్నాను. నా స్నేహితుడికి తను ప్రేమించిన అమ్మాయితో ప్రదానం జరుగుతుంటే వెళ్ళకుండా ఎలా వుంటాను? దయచేసి నన్నువారించే ప్రయత్నం చేయకండి. మమ్మీ, డాడీ మీరు కూడా వస్తే మంచిది. మీకు ప్రెండేగా మారుతీరావు?"
"అతడితో స్నేహం ఎప్పుడో తెగతెంపులయిపోయింది. బిజినెస్ లో పార్టనర్ షిప్ కూడా రద్దు చేసేయాలనుకుంటున్నాను" కోపంతో దవడలు బిగించి అన్నాడు.
"పాపం అతడేం చేసాడు? అతడు మన ఆస్తీ చూసేననుకో నన్ను కొడుక్కి చేసుకోవాలనుకున్నాడు. ఆలోచించి చూస్తే శ్రీచక్రది కూడా తప్పులేదు. అతడు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించాడు."
"నీ మనసులో మంటలు రేపినవాడిపట్ల నీకింకా ఈ అభిమానం ఏమిటి?" తల్లి అసహనంతో అంది.
"నా మనసులో మంటలు రేగినమాట వాస్తవం. అతడు కావాలని రేపలేదు. నేను ప్రేమించి, ప్రేమభిక్షకై చేతులు జాచేసరికే, అతడు తన మనసును మరో అమ్మాయికి ఇచ్చివేశాడు."
"ఏమిటే నీ తిక్క? నీ జీవితం చీకటి చేసినవాడిని నువ్వు సమర్దించటం ఏమిటి? నీ ముఖంమీద కొట్టినట్టుగా వాడు మరోదాన్ని కట్టుకొంటుంటే వెళ్లడానికి సిగ్గులేకపోతేసరి."
వినోదినిలో ఆవేశం తొంగిచూసింది. "వెళతాను! నా అదృష్టాన్ని కొల్లగొట్టిన ఆవిడ ఎంత అందగత్తో నేను చూడడానికైనా వెళ్ళాలి. ఆవిడలో వున్న ప్రత్యేకత ఏమిటో చూడాలి!"
"దీన్ని చూస్తే నాకంతా అయోమయంగా వుంది. దీన్నిలా వదిలితే లాభం లేదండీ! వాడిని తలదన్నిన సంబంధం తెచ్చి చేస్తే అంతా మామూలైపోతుంది."
"మమ్మీ" బిగ్గరగా అరిచింది వినూ. "అలాంటి ప్రయత్నాలేమైనా చేశారంటే నా శవాన్నే మీరు చూస్తారు. ఈ జన్మలో నాకు పెళ్లి లేదు... గుర్తుపెట్టుకోండి."
హఠాత్తుగా నెత్తిన పిడుగేదో పడ్డట్టుగా దిగ్ర్బాంతిగా చూశారు కూతురి ముఖంలోకి.
పచ్చగా కళకళలాడాల్సిన కూతురి జీవితం పెళ్లి పెటాకులు లేకుండా మోడువారిపోవడం, వాళ్లకి ఆ జీవితం వూహించుకోవడానికే భయం వేసింది.
"వినూ!" ఇద్దరూ ఒకేసారి ఆర్తనాదం చేస్తున్నట్లుగా అరిచారు.
"దయచేసి అలాంటి భీష్మ ప్రతిజ్ఞ లేమీ చేసి మమ్మల్ని క్షోభ పెట్టకమ్మా. పెళ్లి చేసుకోనన్న మాట నీ నోటివెంట రానీయకు. వాడి తాతలాంటి సంబంధం తెచ్చిచేస్తామే నీకు తల్లీ!"
"నా మనసుకు నచ్చినవాడు శ్రీచక్ర. అతడిని మించినవాడు ఈ ప్రపంచంలోనే లేడు. నా పెళ్లి జరగాలనే మీరనుకుంటే శ్రీచక్రతోటే జరుగుతుంది. ఇంకెవరితోటీ జరగదు" ఒక విధమయిన స్థిర నిశ్చయానికి అప్పటికే వచ్చేసినట్లుగా ధృఢంగా అంది వినూ.
"ఏమిటే ఈ మతిలేని మాటలు? నీ పెళ్లి వాడితో ఎలా జరుగుతుంది? వాడు రేపో మాపో మరోదాని మెడలో తాళి కడుతుంటే, నీ పెళ్లి వాడితో ఎలా జరుగుతుంది?" ఆమె కోపంతో ఎగరసాగింది.
"నా పెళ్లి శ్రీచక్రతో జరగదు. అందుకే నన్నిలా వదిలేయండి. పెళ్లి మాటెత్తి మళ్లీ మళ్లీ నన్ను బాధపెట్టకండి. "
"ఏదో ఉప్పలం పుట్టినట్టుందే ఇంట్లో" ఆవిడ నెత్తీ నోరు బాదుకున్నట్లుగా అంది. "నువ్వు పెళ్లీ పెటాకులు లేకుండా, ఇంట్లో వుండిపోతే నిన్ను చూస్తూ మేమెలా బ్రతికి వుంటామనుకున్నావు?"
"ఎవరు బ్రతుకుతారో, ఎవరు చస్తారో అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను. నా నిర్ణయం ఇది. నేను ప్రాణంతో వున్నంతవరకూ నా నిర్ణయానికి తిరుగులేదు."
తల్లీ కూతుళ్ల వాగ్వివాదం వింటూ మౌనంగా వున్న దిగంబరరావు అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా మఖం కరుగుగా మార్చుకున్నాడు గబగబా ఫోన్ దగ్గరికి వెళ్లి రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేసి "హలో!" అన్నాడు.
"................"
"నేను భాస్కర్! డానీ వున్నాడా?"
"............"
"ఒకడికీ చావు ముహూర్తం పెట్టాను. డానీని తక్షణం నా దగ్గరకు పంపు" రిసీవర్ క్రెడిల్ చేశాడు.
వినోదిని పరుగెత్తుకుంటూ వచ్చింది.
"ఎవరిని ...ఎవరిని చంపించాలనుకుంటున్నావు? శ్రీచక్రనేనా....?" అడుగుతున్న ఆమె గొంతు కంపించింది.
"అవును! నీ ముఖంలో నవ్వునీ, నీ బ్రతుకులో ఆనందాన్నీ ఆర్పేసిన ఆ చక్రిగాడిని ఇక బ్రతకనిన్వకూడదు. వాడు బ్రతికుండగా వాడిని నువ్వు మర్చిపోలేవు. అందుకే వాడికి చావు ముహూర్తం పెట్టాను."
"నేను బ్రతికి వుండాలంటే శ్రీచక్రని చంపించే పని ఎప్పటికీ చెయ్యకు. అతడు చనిపోయాడని తెలిసిన క్షణమే నా ప్రాణాన్ని వదిలేస్తాను. అతడు చస్తే నేను బ్రతికి వుంటానని ఎలా అనుకున్నావు డాడీ?మాంత్రికుడి ప్రాణం చిలుకలో వున్నట్లు, నా ప్రాణం శ్రీచక్రలో వుంది."