ఇద్దరూ రిక్షా ఎక్కి కూర్చున్నారు. అతని స్పర్శ ఆమెకు విపరీతమయిన ఉద్రేకం కలిగిశ్తోంది. వీపు చుట్టూ నిప్పులా తాకుతోన్న అతని చేతిని తన చేత్తో తీసివేసింది.
అతను నవ్వుకున్నాడు.
తన ఇంటిదగ్గర ఆగింది రిక్షా.
"గుడ్ నైట్..." రిక్షా దిగి అంది సావిత్రి.
"గుడ్ నైట్..."
గేటు తీసుకొని లోపలకు నడిచిందామె.
బాలకృష్ణ గదిలో ఇంకా లైటు వెలుగుతూనే ఉంది. ఒక్కడే కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని తనలో తనే ఏదో మాట్లాడుకుంటున్నాడు.
"మళ్ళీ తాగాడన్నమాట!" అనుకుంది సావిత్రి నవ్వుకుంటూ.
తలుపు తాళం తీసి గదిలోకి నడిచింది.
గదిలోపల వెచ్చగా వుంది.
లైటార్పేసి మంచంమీద పడుకొంది. తనకీ, శంకర్ కీ వివాహం చేసుకునే రోజు ఎంతో దూరం లేదు. నిజానికి అంతా తనమీదే ఆధారపడి వుంది. తనెప్పుడంటే అప్పుడే చేసుకోడానికి సంసిద్ధంగా వున్నాడతను. ఓసారి ఇంటికెళ్ళి ఆ విషయం చూచాయగా తల్లిదండ్రులకి చెప్తేగాని బాగుండదు. ఎలాగూ పెళ్ళి రిజిష్టర్ ఆఫీస్ లోనే అవుతుంది. అందరిలాగా పెద్ద యెత్తున హంగామా చేసి పెళ్ళాడటం తనకిష్టం లేదు. తల్లిదండ్రులిద్దరకూ చెప్పాల్సిన బాధ్యత తనమీద వుంది గనుక చెప్పాలనుకుంటోంది. తండ్రి చేసే పనులకి నిజానికి తనకేమీ సంబంధం లేనట్టే తను ప్రవర్తించవచ్చు.
సాయంత్రం ఆఫీస్ బయటే నిలబడి కనిపించాడు శంకర్. తనకోసం అక్కడ ఎదుర్చూస్తుంటానని ఉదయం చెప్పాడు. ఇద్దరూ బస్ స్టాఫ్ కి వెళ్ళి నిలబడ్డారు.
రోజూ తనతోపాటు బస్సెక్కే వాళ్ళంతా తనవంక అతనివంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇన్నాళ్ళూ ఒంటరిగా బస్సెక్కే అమ్మాయి ఈరోజు జంటగా బస్సెక్కుతుంటే ఎవరికయినా ఆశ్చర్యంగానే ఉంటుంది. బస్ చేరుకుంది. ఇద్దరూ హోటల్ కి నడిచారు.
సర్వర్ కాఫీ తెచ్చి వాళ్ళ ముందుంచాడు.
"వచ్చేవారం మీరు రెండ్రోజులు శెలవుపెట్టాలి అన్నాడతను.
"ఎందుకు?"
"మాంచి ఫుట్ బాల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. రష్యన్ టీమ్ వస్తుంది. మనిద్దరికీ టికెట్స్ తీసేసుకున్నాను.
సావిత్రి ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది. స్త్రీ పురుషులూ, పిల్లలూ, వృద్దులూ అందరూ కలిసి గేమ్స్ చూడ్డానికెళ్ళడం సినిమా న్యూస్ రీల్స్ లో చూసింది. బాంబే, ఢిల్లీ, మద్రాస్, కలకత్తాలలో అలా ఇంటిల్లిపాది వెళతారట. హైదరాబాద్ లో కేవలం క్రికెట్ తప్పితే ఇలాంటి మ్యాచ్ కి అంత ఎక్కువమంది జనం రారు. నిజానికి క్రికెట్ కంటే పుట్ బాల్, హాకీ, వాలీబాల్ అంటే ఇష్టం. వీటిలోనే నిజమైన 'గేమ్' వుంటుంది. చూట్టానికి థ్రిల్లింగ్ గా వుంటుంది. ఆటగాడి నేర్పరితనం కనబడుతుంది. క్రికెట్ అలా కాక చిన్నపిల్లల ఆటలాగా వుంటుంది. వర్క్ కనబడదు. ఒక్కడు ఆడుతూంటే మిగతా వాళ్ళంతా కూర్చుని చూస్తుంటారు.
"వెళ్దాం" అంది సావిత్రి.
"మీరు వస్తారో రారోనని భయం వేసింది..." నవ్వుతూ అన్నాడతను.
"మీరెక్కడికి రామన్నాసరే వచ్చేస్తాను" తనూ నవ్వుతూ అంది సావిత్రి.
"థాంక్యూ."
బయటకు నడిచారు.
"చూడండి" అతన్ని పిలిచింది సావిత్రి.
"చెప్పండి"
"డబ్బు అన్నిటికీ మీరే ఖర్చు పెడుతున్నారు. అదేం బావుండలేదు నాకు" చిరుకోపంతో అంది.
"ఉంది కనుక ఖర్చు చేస్తున్నాను. లేకపోతే మీ దగ్గరే తీసుకుంటాను. సరేనా?" నవ్వుతూ అన్నాడు.
"అదేం కుదరదు. నన్ను కూడా ఖర్చు చేయనీయండి."
"సరే! అలాగే చేద్దురుగాని ముందిక్కడినుంచి నడవండి. వీళ్ళిద్దరూ పోట్లాడుకొంటున్నారల్లే ఉందనుకొంటారు జనం."
"తప్పేముంది? మీరు కాదంటే పోట్లాటే అయ్యేది మరి..." అతనితోపాటు నడుస్తూ అంది సావిత్రి.
"అంత పనిమాత్రం చేయకండి! ఏదయినా భరిస్తాను గాని మీతో పోట్లాడటం మాత్రం నావల్ల కాదు."
"ఏం?"
"పోట్లాడితే మీరు మాట్లాడటం మానివేస్తారు. మాట్లాడకపోతే యింక నా జీవితమే అనవసరం అనిపిస్తుంది..."
సావిత్రి నవ్వేసింది.
"ఎందుకు నవ్వుతారు?"
"ఏదో సినిమాలో విన్నా నీ డైలాగులు..."
"అలాగయితే అవి, ఈ సినిమాలోవేమో చూద్దాం పదండి..." పక్కనే ఉన్న థియేటర్ వైపు నడుస్తూ అన్నాడతను.
"బాబోయ్? మళ్ళీ సినిమాకా? మొన్నేగా వెళ్ళింది?"
"ఫరవాలేదండి! మనం ఇలాంటి సరదాలన్నీ ఇప్పుడే తీర్చుకోవాలి. వివాహమయితే ఈ 'థ్రిల్' ఉండదు. పెళ్ళి కాకుండా తిరిగే యువతీ యువకుల మధ్య ఉండే ఆనందం, సరదాలు వివాహితులయిన జంట దగ్గర కనబడతాయేమో చూడండి. అంచేత"
"అలా అని మీరనుకొంటున్నారు...కాని నిజానికి అంతా మన మనస్సుల్లోనే వుంది..." నవ్వుతూ అంది సావిత్రి.
"ఏమో చూద్దాంగదా!" నవ్వుతూ అని టిక్కెట్స్ తీసుకురావటానికి వెళ్ళాడతను. అది పాత హిందీ సినిమా. రష్ ఎక్కువగా లేదు.
రిజర్వ్ డ్ అంతా ఇంచుమించుగా ఖాళీగా వుంది.