"అసలీ సినిమాలే మనలాంటి యువతీ యువకులకు నిగ్రహాన్ని పోగొడుతున్నాయి" అన్నాడతను. తన చేతికి అతని చేయి వెచ్చగా తగులుతోంది. రక్తం ఎదురు ప్రవహిస్తున్నట్లుంది. అతి కష్టంమీద నెమ్మదిగా తన చేతిని లాక్కుంది. ఇంటర్వల్ అయింది.
"పదండి బయటికెళ్ళి టీ తాగివద్దాం" అన్నాడతను.
ఇద్దరూ బయటికి నడిచి టీ తాగారు.
ఆ తరువాత సినిమా సరిగ్గా చూడనేలేదు సావిత్రి. అతని మాటలు వింటూ కూర్చుంది. మధ్య మధ్యలో తనూ ఏవో మాట్లాడింది. సినిమా ఏమి చూసిందో, ఇద్దరూ మాటలేం మాట్లాడుకున్నారో ఏమాత్రం గుర్తులేదు.
సినిమా వదిలేసరికి చీకటి పడుతోంది.
మళ్ళీ కోఠీ చేరుకొని హోటల్లోకి నడిచారిద్దరూ.
"ఈ హోటల్ వాడికి మన మూలానే సగం లాభం వస్తుందనుకొంటాను" అన్నాడు శంకర్.
కాఫీ, టిఫినూ తీసుకొచ్చారిద్దరూ.
"పబ్లిక్ గార్డెన్స్ లో కాసేపు కూర్చుందామా?" అడిగాడతను.
"కాని...చీకటి పడుతోందిగా!"
"సరే_పోనీ టాంక్ బండ్ కెళ్దాం పదండి..."
ఆటో టాంక్ బండ్ చేరుకొంది. చివర్లో ఉన్న పార్కులో కెళ్ళి ఓ మూలగా ఉన్న బెంచీమీద కూర్చున్నారు. గీజురుమంటోందక్కడ. చీకటి దానికి తోడయిన కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయారు.
"సావిత్రిగారూ..." నెమ్మదిగా పిలిచాడతను.
"ఊ!"
ఆమెవైపు తిరిగి కూర్చున్నాడతను. అతని చేయి ఆమె భుజం వెనుక బెంచీమీద ఉంచాడు.
"మీకు ... నేనంటే... ఎలాంటి అభిప్రాయం ఉంది?"
సావిత్రి తలెత్తి అతని ముఖంలోకి చూసింది.
"అంటే?"
"అలా అడిగితే ఏం చెప్పను? మిమ్మల్ని మొదటిసారి బాలకృష్ణగారు పరిచయం చేశారు గుర్తుందా?"
సావిత్రి తలూపింది.
"నిజంగా చెప్తున్నాను. మీ రూపం అలాగే ముద్రించుకుపోయింది. ఆ క్షణం నుంచీ మీతో పరిచయం కలగటం ఎంతో అదృష్టంగా భావించుకొన్నాను__ ఆరోజునుంచే మిమ్మల్ని ఓ దేవతగా ఆరాధిస్తున్నాను. మీరు నమ్మరు రోజూ సాయంత్రం ఓసారి వచ్చి మీరు డాబామీద కూర్చోవడం ఓసారయినా చూడందే నాకు ఏమీ తోచేదికాదు...నన్ను నేను అదుపులో పెట్టుకోలేక మీ ఆఫీస్ కి కూడా వచ్చేశాను. నాకు తెలుసు అది మీకు ఇబ్బంది కలిగిస్తుందని__అయినా మీమీద ఏర్పడ్డ అనుబంధం అలాంటిది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఇలా మీకు దూరంగా ఉండటం నావల్ల కాదు. మీరు అంగీకరిస్తే మనం ఒకటవుదాం...నాకెలాగూ ఏదొక ఉద్యోగం దొరుకుతుంది మరో రెండు నెలల్లో. అప్పుడు మనకిక ఏ అడ్డూ ఉండదు. మన ఇళ్ళల్లో పెద్దాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను మిమ్మల్ని పెళ్ళాడ్డానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాలను ఎప్పట్నుంచో చెప్పాలని ప్రయత్నం. కానీ మీ ఎదుట వచ్చేసరికి ఏదో భయం."
సావిత్రి మంత్రించినట్లు వింటోందతని మాటలు. తను కావాలని కోరుకుంటున్న మాటలన్నీ అతనినుంచి వింటోంది. అతనికి ఏం జవాబివ్వాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియటం లేదు.
"అయితేనా మనస్సు ఇంకా గ్రహించనేలేదన్న మాట మీరు" తలొంచుకొంటూ అంది నిష్టూరంగా.
"సావిత్రీ అలా ఎందుకనుకుంటున్నారు? మీరు నన్ను అభిమానిస్తున్నారని నాకు తెలుసు. కాని మీ మనస్సులో ఏమన్నానో లేదో ఇంత తక్కువ వ్యవధిలో ఎలా తెలుసుకోను? అదీగాక నాలాంటి అడ్రస్ తెలీని వాడిని, నిరుద్యోగిని ప్రేమిస్తారని ఎలా అనుకోను? అందుకే సంశయంతో నా మనస్సు మీ ముందుంచాను."
"నాకు కావలసింది ఉద్యోగం చేసే వ్యక్తికాదు శంకర్ గారూ! నన్ను అర్ధం చేసుకొని ఆరాధించే వ్యక్తి అంతే__ఇన్నాళ్ళకు మీరు నా మనస్సుని ఆకర్షించారు... నేను బ్రతుకుతుంది కేవలం మీకోసం అనుకొనేలా చేశారు. అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? మీరు పరిచయమయిన మరుక్షణం నుంచే నేను మన భవిష్యత్తు గురించి కలలు కంటున్నాను. మనిద్దరం తప్పక ఒకటవుతామన్న ఆలోచన రోజు రోజుకీ ఎక్కువవుతూ వచ్చింది కానీ..." ఇంత త్వరగా మనం దగ్గరవుతామని నేను అనుకోలేదు.
"సావిత్రీ!" రెండు చేతులతో ఆమెను చుట్టేసి మీదకు లాక్కున్నాడతను. అతని గుండెల మీద తల వాల్చింది సావిత్రి.
అంతకు ముందెన్నడూ అనుభవించని ఆనందం ఇద్దరినీ అల్లుకుపోయింది. అలా ఎంతసేపు గడిచిందో తెలీలేదు. వెనుక టాంక్ బండ్ రోడ్డు మీద పెద్దగా శబ్దం రావడంతో ఆ తన్మయత్వం నుంచి బయటపడ్డారు. చెట్లు అడ్డు ఉంచడం మూలానా ఏమీ కనిపించలేదు. టైము చూసుకుంది సావిత్రి. రాత్రి తొమ్మిది దాటుతోంది.
"ఇంక వెళదాం__" అంది పైట సర్దుకుంటూ.
"పదండి..." అంటూ పార్కులోనుండి రోడ్డుమీద ఆమె చేయి పట్టుకుని నడిచాడతను.
రోడ్డుమీద జనం మూగి వున్నారు. ఒక ఆటో స్కూటరూ డాష్ ఇచ్చుకున్నాయట. దెబ్బలు తగిలి వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళుతున్నారు.
చేతులు పట్టుకుని నెమ్మదిగా నడువ సాగారిద్దరూ. దూరంగా హుసేన్ సాగర్ అవతలివైపు లైట్లు తోరణాలు కట్టినట్లుగా వెలుగుతున్నాయ్.
టాంక్ బండ్ చివరికొచ్చేశారిద్దరూ.
ఆటో రిక్షాలేమీ కనిపించలేదక్కడ. ఒకే రిక్షా నిలబడి వుంది.