Previous Page Next Page 
తదనంతరం పేజి 38


                                           9


    నీరజకు ఆఫీసులో ప్రతిక్షణం ఓ నరకంగా వుంది. ఆఫీసు బాయ్ దగ్గర్నుంచీ హెడ్ క్లర్క్ వరకూ నిరంతరం చూసే చూపులు, ఆ చూపుల్లో ఆకలి, కసి...


    అవసరమున్నా లేకపోయినా కల్పించుకుని మాటలాడటం, ద్వందార్థాలుచ్చేటట్లు వెధవజోకులు...


    ఆడది వొంటరిగా కనిపిస్తే ఆ 'వస్తువు' పబ్లిక్ ప్రాప్రర్టీ అయినట్లు యిష్టమొచ్చినట్లు వ్యవహరించటం, ఫోజులూ, కన్ను గొట్టటం, గాల్లోకి ముద్దులు విసరటం, ప్రతి వెధవా ఓ హీరోయే.


    హెడ్ క్లర్క్ జోగారావు నీరజను 'అమ్మాయ్! అమ్మాయ్' అని సంబోధిస్తాడు. అతని ఆంతర్యం తెలిసినా, బయటికేమీ అనలేక వూరుకుంటూ వుంటుంది.


    ఓ రోజు మధ్యాహ్నం విరామసమయంలో ఎవరూ లేకుండా చూసి ఆమె దగ్గరకొచ్చాడు.


    "చూడమ్మాయ్ నీరజా"


    ఆమె తలెత్తి అతని ముఖంలోకి చూసింది.


    "ఇవేళ మా మనవడి పుట్టినరోజు. ఏదో నాశక్తి కొద్దీ చిన్న పార్టీ ఏర్పాటుచేశాను. సాయంత్రం నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి." అన్నాడు.


    "ఆఫీసులో మిగతా వాళ్ళని పిలిచారా?" అనడిగింది.


    "వాళ్ళంతా ఎందుకూ తలకు మాసిన బడుద్ధాయిలు. నువ్వంటే...నీ సంగతి వేరు" అన్నాడు. తనో బడుద్ధాయి కానట్లు.


    నీరజ సంకోచిస్తూ ఆలోచిస్తోంది.


    "ఏమిటాలోచిస్తున్నావు?"


    "ఏమీలేదు. మీ ఇంట్లో వాళ్లెవరూ తెలీకుండా..."


    "తెలిసేదేమిటి" నేను లేనూ?"  


    "సరేలెండి" అన్నాను.


    "సరేనంటే కాదు. తప్పకుండా రావాలి."


    "అలాగే లెండి"


    అతను ఆమె కర్థమయేటట్లు తన ఎడ్రెస్ వివరంగా చెప్పాడు.


    జోగారావు నాలుగు గంటలకే, ఓ గంట పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయాడు. బహుశా ఏర్పాట్లు చేసుకోటానికి కాబోలనుకుంది.


    అయిదుగంటలకు నీరజ ఆఫీసులోంచి బయటకొచ్చింది. ఏమీ ఎరగని కొత్తచోటు కెళ్ళటానికి ఆమె మనసేమాత్రం సుముఖత చూపించటం లేదు. అయినా యిలాంటి చిన్న చిన్నవే తరుముకొచ్చి తప్పించుకునేందుకు వీలులేకుండా వుంటాయి.


    హ్యాండ్ బ్యాగ్ తీసి చూసుకుంది. పదిరూపాయలున్నాయి. ఈ రోజుల్లో పదిరూపాయలకేమొస్తాయి? కొంచమాలోచించి దగ్గర్లోవున్న ఫ్యాన్సీ షాపులోకెళ్ళి ఎనిమిది రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ కొన్నది. మిగతా రెండు రూపాయలూ రానూ పోనూ బస్ ఛార్జీలకని వుంచుకుంది.


                                                            *    *    *    *


    ఆయన చెప్పిన గుర్తులనిబట్టి, ఇల్లు కనుక్కోవటం ఏమంత కష్టం కాలేదు.


    బయట నేమ్ ప్లేట్ కూడా వుంది.


    ఎంత మితంగా పిల్చినా ఇల్లంతా కొంత సందడిగా ఉంటుందనుకుంది.


    కాని అలాంటిదేమీ కనిపించలేదు.


    తలుపులు దగ్గరగానే వేసి వున్నాయి. "జోగారావు గారూ" అని పిలుస్తూ తలుపుమీద చెయ్యేసేసరికి తెరుచుకున్నాయి.


    ఎదురుగా జోగారావు నిలబడి వున్నాడు.


    "వచ్చావా అమ్మాయ్. రా" అన్నాడు సాదరంగా.


    ఒక్కొక్కప్పుడు వద్దనుకుంటూనే, మనసుకీ వ్యతిరేకంగానే పొరపాట్లు చేస్తాం. ఎందుకో తెలీదు. అలా జరిగిపోతూ వుంటుంది.


    సంకోచిస్తూనే లోపలకడుగుపెట్టింది.

 Previous Page Next Page