"పాపం శ్రమ ఇచ్చాననుకుంటాను" ఆమె పక్కనుంచి నడుస్తూ వెళ్ళి తలుపులు గడియవేశాడు.
కొంచం పరిశీలనగా అతని ముఖంలోకి చూసింది. నడకలో తడబాటు, నుదుట పడుతున్న చెమటలు, గొంతులో వణుకు పసిగట్టింది.
ఎందుకనో...కొంచం ఆశ్చర్యమే, భయం వెయ్యటం లేదు.
"తలుపెందుకు వేస్తున్నారు?" అనడిగింది అమాయకంగా ముఖం పెట్టి.
"మన ఇద్దరిమధ్యా డిస్ట్రబెన్స్ గా వుంటుందని..."
"మనవడి పుట్టినరోజన్నారు. ఇంట్లో ఎవరూ కనబడటం లేదేమిటి?"
"ఊరికినే...నిన్నిక్కడికి రప్పించుకోవాలని అబద్ధం చెప్పాను. ఇంట్లో వాళ్ళంతా వూరెళ్ళారు. ప్రస్తుతానికి ఒక్కడ్నే వున్నాను. యిహెహీ..." అన్నాడు.
"అమ్మో నీకు డేరింగ్ ఎక్కువే"
"చిన్నప్పట్నుంచీ నాకు ఎడ్వెంచరస్ నేచర్. ఫంక్షన్ లేదని స్వీటూ, హాటూ లేదనుకోకు, రెడీ చేసి వుంచాను"
"మీరే వండారేమిటి? మీ వాలకమూ, అదీ చూస్తోంటే వంట బాగా వచ్చినవారిలా కనిపిస్తున్నారు"
తననలా వంటవాడిగా జమకట్టటం అవమానంగా ఫీలయ్యాడు.
"నాకసలు వంటరాదు. నేనెప్పుడూ హీరోలా బ్రతికాను గాని వంటలూ గింటలూ ఎప్పుడూ చెయ్యలేదు. బజార్నుంచి తెప్పించాను" అన్నాడు గర్వంగా.
"అవును. ఇలా అబద్ధం చెప్పి నన్నెందుకు రప్పించారు?"
"చూడు నీరజా! అన్నాడు. తన కంఠంలోకి, ప్రవర్తనలోకీ, పురుషత్వం తెచ్చుకుంటున్నాడు.
"నీ అందం, పర్సనాలిటీ నన్ను చాలా ఆకర్షించాయి. అసలు నేను ఆడవాళ్ళని చూసి టెంప్ట్ అవ్వను. అలాంటిది నిన్ను చూసి ప్రేమించకుండా ఉండలేకపోయాను"
"ప్రేమా?"
"అవును ప్రేమ. అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు. ఆఫీసులో వున్నంతసేపూ నీవంక చూస్తూ పనిమీద ధ్యాస నిలపలేకుండా వున్నాను"
"వయసుకీ, ప్రేమకీ సంబంధమేమిటి చెప్పు. వయసు కొంచం మీదపడినా నా మనసుకి మాత్రం వృద్ధాప్యం రాలేదు. అది నిత్యయవ్వనంతో చాలా ఉల్లాసంగా వుంటుంది"
"ఆహా" అంటూ ఆశ్చర్యంగా చూసింది.
అతనికి మాటలతో టైము వేస్టు చెయ్యట మిష్టంలేదని, అందులో అంత దగ్గరలో, అందుబాటులో వున్న వయసు సొగసులతో వువ్విళ్ళురిస్తోన్న ఆ పిల్ల అందచందాలు అతని ముసలి నరాలను వెర్రెక్కిస్తున్నాయి. ప్రతి మొగాడికి, వాడెంత చవటయినాగానీ తనేం చేసినా ఆడది వూరుకుంటుందన్న అంధవిశ్వాసముంటుంది. కాస్త ముందుకు జరిగి "నీరజా" అని పిలుస్తూ ఆమె వక్షస్థలంమీద చెయ్యి వెయ్యబోయాడు. నీరజ మెరుపులా వెనక్కి జరిగింది. మరుక్షణంలో అతని చెంప ఛెళ్ళుమంది.
కళ్ళముందు నక్షత్రాలు మెరిశాయి. అందులోంచి కోలుకుంటూ ఆమె ముఖంలోకి చూశాడు.
ఆమె కళ్ళు నిప్పులు క్రక్కుతున్నాయి.
"బాస్టర్డ్, మనవల్నెత్తుకున్న ముసలి పీనుగవి నీకు అనుభవించటానికి అమ్మాయిలు కావల్సి వచ్చారా? నీ సోడాబుడ్డి కళ్ళద్దాలూ, కట్టుడుపళ్ళు, చప్ప దవడలూ, మురికి చొక్కా నీ బతుక్కు శృంగారమా?"
ఎడమకాలి చెప్పు తీసి మొహంమీద ధెడీ ధెడీమని బాదిపారేసింది.
ఆ దెబ్బలకు అతని కట్టుడు పళ్ళు నెట్లు రెండూ ఊడి క్రింద పడ్డాయి.
ఒకవైపు అవమానం, మరోవైపు కసి, ఒకరకమైన ఉన్మాదంలో ఆమె మీద ఎదురుదెబ్బ తియ్యటానికి అన్నట్లు ముందుకు వొంగిపోయాడు.
అతని ఉద్దేశం గ్రహించి, గుండెమీద చెయ్యవేసి బలమంతా ఉపయోగించి, ఒక్క తోపు తోసింది. బ్యాలెన్స్ నిలద్రొక్కుకోలేక వెనక్కి తూలి క్రిందపడ్డాడు.


