"అన్నీ వుడికిపోవటమంటే? నేనేమన్నా ముసలిదాన్ననుకున్నావా?"
"ముసలివారు కాదులెండి పడుచువారు. ఆమాటకొస్తే మా అందరికంటే పడుచువారు. ఇంకా చెప్పాలంటే మా అందరికన్నా మంచి యవ్వనవంతులు."
అయిదోవాడు కొంచం చిలిపివాడు. వ్యవహారమొచ్చేసరికి ఎందులోనూ రాజీపడే ప్రసక్తిలేకున్నా మాటల్లో చిలిపితనం చూపిస్తూ ఉంటాడు.
ఆపండాపండి. ఆస్తి పంపకాల టాపిక్ లోంచి సెక్స్ టాపిక్ లోకెళ్ళిపోతున్నారు" అన్నాడు.
అతనప్పుడప్పుడూ రాత్రిపూట భార్య అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక మారుపేర్లతో సెక్స్ పేజీలో ప్రశ్నలు వేస్తూ వుంటాడు.
"అసలు విషయానికొద్దాం"
"ఎప్పటికప్పుడు వస్తూనే వున్నాం."
అక్కడ్నుంచీ అదుపులేకుండా అందరూ కలగాపులగంగా మాట్లాడేసుకుంటున్నారు.
"ముందు భాగం నీకిస్తే మేమంతా ఏం కావాలి?"
"దానికి ప్రత్యమ్నాయంగా మీకు ఎక్కువ జాగా వచ్చేటట్లు చేస్తాను."
"ఆ పని నువ్వే చెయ్యవచ్చుగా"
"ఎవరో ఒకరు రాజీ పడాలి."
"నువ్వే రాజీ పడవచ్చుగా."
"నేను పెద్దవాడ్ని."
"నేను చిన్నవాడ్ని. ఉద్యోగంకూడా చిన్నదే. సంపాదన తక్కువ"
"ముందుముందుగా పెరగవచ్చుగా. నేనాడ పిల్లల్ని కలవాడ్ని"
"పోనీ...అలాగే అనుకుంటే...అని అందరూ రకరకాలుగా భాగాలువేసి చూశారు.
ఆ ఇంటికో మేడవుంది. మేడమీద మూడు నాలుగు గదులున్నాయి.
ఎంత ప్రయత్నించినా క్రింద నలుగురికీ, పైన ఒకరు తప్పటం లేదు.
"మేడమీద ఎవరుంటారు? అయినా క్రింది భాగంకూడా పోతే పైన ఏ ఆధారంమీద నిలబడుతుంది? ఇల్లంతా పాతదై పోయింది. ఎప్పటికైనా కూలిపోక తప్పదు. అప్పుడు కనీసం క్రింద నేలయినా మిగులుతుంది. పైన గాలి తప్ప ఏదీ మిగలదు." అంటూ మేడమీద వుండటానికెవరూ ఇష్టపడటం లేదు.
మూడోవాడు అప్పుల్లో వున్నాడు. ఏదోలా పంపకాలు చేసుకుంటే తన వాటా అమ్మేసుకుందామని అతని ఉద్దేశం. అందుకని కొంచం మెత్తబడుతున్నాడు. "మీరూరుకోండి మీకు తెలీదు" అని అతని భార్య అడ్డు తగులుతోంది.
ఒకవేళ భాగాలు పంచుకున్నా, ఎవరికివాళ్ళు ఇష్టమొచ్చినట్లు చేసుకునే ఉపాయం కనబడటంలేదు. అలా చేసుకోవాలంటే పకడ్బందీగా దస్తావేజులు రాసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికో యాభయి అరవై వేలదాకా ఖర్చవుతుంది. అంత డబ్బు ఖర్చు పెట్టటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఎవరిదగ్గరా డబ్బు లేదు కూడా.
నాలుగోవాడో ప్రపోజల్ పెట్టాడు. ఇల్లంతా ఆమ్మేద్దాం. ప్రస్తుతం వున్న రేట్ల ప్రకారం చాలా వస్తుంది. ఆ డబ్బు అందరం సమంగా పంచుకుని ఎవరిష్టమొచ్చినట్లు వాళ్ళు చేసుకుందాం" అన్నాడు.
"అమ్మెయ్యటమా" అని వెధవ సెంట్ మెంట్.
ఈ ఆలోచన కొంతమంది త్రోసిపుచ్చారు.
వాదించుకున్నారు. అరుచుకున్నారు...తిట్టుకున్నారు. ఆడవాళ్ళు కూడా తోడయి హోరాహరీ కొట్లాడుకున్నారు. వారితో ప్రతి ఆడదీ తన మొగుడు అమాయకుడూ, పక్కవాడు స్వార్థపరుడూ అని నిరూపించటానికి ప్రయత్నించింది.
ఎంతకీ తెగలేదు.
పరిష్కారం మళ్ళీ నిరవధికంగా వాయిదా పడిపోయింది.