"సార్! ఎంతోసేపు వెదికాను. ఆ ఫోటో అంటించిన పుస్తకం కనబడటంలేదు" అన్నాడు. అతని గొంతుకూడా వణుకుతోంది.
మేనేజర్నీ, మిగతా సిబ్బందినీ పంపించేసి రంజిత గదిలో ఒంటరిగా వుంది.
తానేమన్నా పొరపాటు చేసిందా? ఆ వ్యక్తిని వెంటబడి తరిమితే ఎలా వుండేది?
అతన్ని గురించి అక్కడున్న వారందర్నీ ప్రశ్నించింది. రివాల్వర్ మోత విని అందరి దృష్టి పైకే మళ్ళిందనీ, లిఫ్ట్ లో పారిపోతూన్న వ్యక్తిని పట్టించుకోలేదనీ చెప్పారు. కాలినుంచి కారిన రక్తపుచుక్కలు లిఫ్ట్ లో, క్రింది అంతస్థులో, అక్కడ్నుంచి కార్ పార్కింగ్ చేసే స్థలం వరకూ కనిపించి అక్కడితో ఆగిపోయాయి.
ఏదో గుర్తు వచ్చినట్లు రంజిత ఫోన్ తీసి ఆపరేటర్ ని స్థానిక పోలీస్ స్టేషన్ కు కనెక్షన్ ఇవ్వమని అడిగింది.
అవతల్నుంచి స్టేషన్ లోని ఎస్.ఐ. రిసీవరందుకున్నాడు.
రంజిత తన ఐడెంటిటీ చెప్పి, ఆ వ్యక్తి ఆనవాళ్ళు తెలియజేసి, అలాంటి మనిషి ఎక్కడైనా కనిపించినా, కాలికి గాయంతోవున్న మనిషిలా ఎవరైనా కనిపించినా వెంటనే అరెస్టు చెయ్యమనీ, అలాగే స్థానికంగా గాని, దగ్గర్లోవున్న వూళ్ళలోగాని, గవర్నమెంట్ లేక ప్రైవేట్ హాస్పటల్స్ లో కాలికి బులెట్ తగిలి ట్రీట్ మెంట్ కోసం ఎవరైనా వచ్చారేమో ఎంక్వయిరీ చెయ్యమనీ, అలాంటి మనిషి తటస్థపడితే వెంటనే కస్టడీలోకి తీసుకొమ్మని కోరింది.
అప్పటికే చీకటి పడిపోయింది. ఆకాశమమతా మేఘావృతమై, చలి మరింతగా సాగి శరీరాన్ని వణికింపజేస్తున్నాయి.
రంజిత అలసటగా ఫీలై కొంతసేపు రిలాక్స్ అవుదామని బెడ్ మీదకు వాలింది. ఇంతలో ఫోన్ మ్రోగింది. రిసీవర్ చేతిలోకి తీసుకుని 'హలో' అంది.
"నేను..." అంది అవతల్నుంచి ఓ గొంతు. గుర్తుపట్టడం కష్టంగా వుంది.
రంజిత మౌనంగా వూరుకుంది.
"నేనంటే మాట్లాడరేం?"
"చెప్పదలుచుకుంది చెప్పు" అంది రంజిత విసుగ్గా.
"సరే. రెండు పాయింట్లు చెప్పి పెట్టేస్తాను."
రంజిత వింటుంది.
"ఒకటి. మీ విషయంలో నా కోరిక తీరనందుకు బాధపడుతున్నాను. ఎప్పటికైనా తీర్చుకుని తీరతాను."
మినీ టేపురికార్డర్ లో అతని గొంతు రికార్డ్ చేద్దామా అనుకుంది. కాని అది చేతికందే మార్గంలో లేదు. లేచి వెళ్ళి తీసుకొచ్చే లోపల ఫోన్ పెట్టేస్తాడు. ఐనా దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అతను గొంతుకు వాయిస్ ఛేంజ్ కోసం ఏదో అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్నాడు.
"రెండు. ఈ ఊరు నుంచి వెంటనే వెళ్ళిపోండి."
"వెళ్ళకపోతే?"
"ఫలితమనుభవిస్తావు."
ఫోన్ డిస్ కనెక్టయిపోయింది.
15
డాక్టరు సంకేతిని కళ్ళు విప్పింది. తాను మంచంమీద పడుకుని వున్నట్లు గ్రహించింది. మెల్లగా జరిగిందంతా గుర్తుకొస్తోంది. తాను తెల్లవారుఝామునే నవలలు రాయటానికని లేచింది. మంచంమీద నుంచి దిగింది. లైటు వెయ్యడానికి స్విచ్ బోర్డ్ దగ్గర కెళ్ళింది. అక్కడ కొన్ని పొరపాట్లు చేసింది. గదంతా చీకటిమయమైపోయింది. వంటిమీదో, ప్రక్కనో ఏదో ప్రాకినట్లు స్పర్శ. స్విచ్ వెయ్యబోయి, ప్లగ్ లో చెయ్యి పెట్టింది. ఒళ్ళంతా అదిరిపోయేటట్లు షాక్ కొట్టడమూ, తాను పెద్దగా అరుస్తూ క్రింద పడిపోవటమూ...
గుర్తు తెచ్చుకుంటోంది.
తాను పడిపోతున్నప్పుడు, తన గొంతుతోపాటు ఏదో పురుషుని కంఠం అరిచినట్టు... అది నిజమేనా? లేక భ్రమా?
తెరిచివున్న కిటికీలోంచి గదిలోకి వెలుతురుపడి, క్రమంగా వ్యాపిస్తోంది. సంకేతిని తలత్రిప్పి చూసింది. బెడ్ రూం ప్రక్కనేవున్న సందులో పెరిగిన చెట్లు కనిపించాయి.
అవునూ, తాను పడిపోయింది నేలమీదకదా. బెడ్ మీదెకెలా వచ్చింది? ఉలికిపడి లేచి కూర్చుంది. శరీరమంతా వణికినట్లయింది. ఇప్పుడు బాగా జ్ఞాపకమొచ్చింది. తాను నిస్సందేహంగా నేలమీదపడిపోయింది. ఇప్పుడేమో బెడ్ మీద పడుకుని వుంది. ఇదెలా సంభవం? తనకు పూర్తిగా స్పృహరాని స్థితిలో, అంటే ఒక రకమైన అయోమయ పరిస్థితిలో లేచి, మంచంమీద పడుకుని మళ్ళీ నిద్రపోయిందా?
సహజంగా ఆమె చాలా ధైర్యస్థురాలు. కాని ఇప్పుడు తెలీని భయం ఆవహించి, ఏవేవో ఆలోచనలతో మెదడంతా మొద్దుబారిపోతోంది. బెడ్ రూం తలుపువైపు చూస్తే లోపల్నుంచి గడియవేసే వుంది. తానెప్పుడూ గడియ పెట్టుకునే పడుకుంటుంది.
బయట్నుంచెవరో బజర్ నొక్కుతున్నారు. పనిమనిషయి ఉండవచ్చు. లేచి డోర్ తీసుకొని బయటికి వచ్చి, వీధి తలుపు తీసింది.
* * *
ఉదయం తొమ్మిది గంటలవేళ డాక్టర్ సంకేతిని కారు డ్రైవ్ చేసుకుంటూ తన నర్సింగ్ హోంవైపు వెళుతోంది. ఇదివరకు డ్రైవింగ్ అంటే ఓ ప్లెజర్ గా ఉండేది. ఇటీవల కొన్ని నెలలుగా డ్రైవింగ్ ఓ టెన్షన్ గా పరిణమించింది. ఎండ కళ్ళలో పడినప్పుడు ఎదురుగా ఏం వస్తున్నదీ తెలీటంలేదు. అప్పటికీ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నది.
మనుషులు మసక మసగ్గా కనిపిస్తున్నారు. ఎదురుగా ఎవరైనా వస్తోంటే వారి ఆకారాలు నీడల్లా కనిపిస్తున్నాయి. మొహాలు కాని ఇతర వివరాలు కాని స్పష్టంగా వివరాలు తెలియటంలేదు. ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరకు వస్తేనేగాని తెలియటంలేదు. రోడ్డుమీద మూతలు తీసి, అలాగే వదిలి వెయ్యబడివున్న డ్రైనేజి గోతులు, ఇంకా అవేవో ప్రయోజనాలకోసం లోతుగా, వెడల్పుగా తవ్వేసి నిర్లక్ష్యంగా పూడ్చకుండా వదిలిపెట్టబడివున్న గోతులు, ఎంతో శ్రమపడి చూస్తేనేగాని కనబడటంలేదు. ఒక్కోసారి దగ్గరికెళ్ళి సడన్ బ్రేక్ వేసుకోవాల్సి వస్తోంది.