Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 37


    "మాలతీ!"

    ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది.

    "శంకర్!"

    గడ్డం పెరిగింది, బట్టలు నలిగి, మాసివున్నాయి. కళ్ళు ఎర్రగా వున్నాయి.

    బికారిలా, తాగుబోతులా వున్నాడు.

    "నువ్వు.....నువ్వు.....మళ్ళీ వచ్చావా? సైతాన్!"

    శంకర్ నవ్వాడు. "మనిషి సైతాన్ లా మారటానికి ఎంతసేపో పట్టదని నిన్ను చూసిన మొదటిక్షణంలోనే గుర్తించాను మాలతీ. ఇదివరకు నీ పిచ్చితో కేవలం పిచ్చివాడిని మాత్రమే. ఇప్పుడు త్రాగుబోతునూ, జూదగాడిని కూడా.....

    "ఛీ! నీకు సిగ్గులేదూ?" అంది కోపంగా మాలతి.

    "సిగ్గు - దానికీ, నాకూ ఇప్పుడు చాలాదూరం. నిన్ను మరచిపోవటంకోసంనేపడ్డ యాతనలో సిగ్గును మరిచిపోయాను...."

    "మళ్ళీ దేనికొచ్చావిక్కడికి?"

    "డబ్బుకోసం."

    అదిరిపడింది. "డబ్బుకోసమా?"

    "అవును. నాకున్న ముఖ్యావసరాల్లో డబ్బు ముఖ్యం. నువ్వూ, గోపయ్యా, డాక్టరూ కలిసి శేఖర్ ని వెర్రివాడిలా చేస్తూ ఆడిన నాటకం నాకు తెలుసు. ఒకప్పుడు దారుణంగా వెళ్ళగొట్టబడిన నువ్వు, ఇప్పుడీ ఇంట్లో ఎంత అందమైన స్ధానం సంపాదించావో కూడా తెలుసు."

    "ఆ స్ధానం నీవల్లనే పోగొట్టుకున్నాను. కానీ కష్టపడి మళ్ళీ పొందగలిగాను."

    "కానీ నావల్ల పోగొట్టుకోవటం కష్టమేం కాదుగా?"

    కోపంతో, రోషంతో, అవమానంతో మాలతి ఉరిమి చూసింది.

    "దుర్మార్గుడా!"

    శంకర్ నిర్లక్ష్యంగా నవ్వాడు. "ఈ తిట్లను లెక్కపెట్టనులే. నీమీద నాకింకా ఆశ చావకపోయినా, ఆ ఆశను ఆశగానే వుంచుకుని అలవాట్లతో ఆనందించటం నేర్చుకున్నాను. డబ్బు తే.."

    "నా దగ్గరెక్కడిది?"

    "నీ దగ్గర లేకపోవచ్చు. కానీ నీ ఇంట్లో వుందిగా! ఒకరకంగా ఈ ఇల్లు నీదే..."

    "ఇవ్వను....నీకు చిల్లిగవ్వకూడా ఇవ్వను.."

    "చూడూ! తెలివిగా ప్రవర్తించకు. నీకు శేఖర్ దక్కాడు, నాకు డబ్బు దక్కనీ. ఒక్కమాట శేఖర్ తో అన్నానంటే - నువ్వు కష్టపడి రెండోసారి నిర్మించుకున్న ఈ పేకమేడ ఫెళఫెళమని విరిగిపోతుంది."

    "ఏమయినా చేసుకో, నీకు మాత్రం డబ్బు ఇవ్వను" అన్నది మాలతి మొండిగా.

    "మాలతీ! ఆఖరుసారి చెబుతున్నాను. ఆవేశంలోపడి ఉన్మాదంగా ప్రవర్తించకు. ఇలాంటిదే పదివేలు అన్నాడు శేఖర్ ఆనందంగా సమర్పించాడు. గుర్తుందా? సందర్భం కొంచెం వేరనుకో! కానీ వ్యక్తులం మనమే. ఏమిటి ఆలోచిస్తున్నావు ఇంకా? పట్టుదలలు జీవితాలను నాశానం చేస్తాయి."

    మాలతి ఉద్రేకాన్ని అణచుకుంటూ నిస్సహాయంగా నిలబడిపోయింది.

    శంకర్ కుర్చీలో విలాసంగా కూర్చుని తాపీగా సిగరెట్ వెలిగించుకున్నాడు.

    "మాలతీ! మళ్ళీ శేఖర్ వచ్చేశాడు."

    మాలతి ఒక్కనిముషంసేపు ఆలోచిస్తూ నిలబడింది. ఆ ఒక్కనిముషంలోనూ మనస్సులో ఎన్ని ఆలోచనలు దొర్లాయో - ఎంత సంఘర్షణకు గురయిందో.......

    చరచరమని లోపలకు వెళ్ళింది. తన ఇంట్లో, కొత్త స్ధానంలో నిలబడి, ఇనప్పెట్టెలోంచి డబ్బు తీస్తుంటే చేతులు వణుకుతున్నాయి. ఆలోచించటం మానేసింది.

    నోట్ల కట్టలు తీసుకొచ్చి అతనిమీదకు విసిరేసింది.

    "ఫో ఇక్కడ్నుంచి."

    శంకర్ నవ్వి వాటిని అందుకుని ఆప్యాయంగా ఆ నోట్లని ముద్దు పెట్టుకుని లేచి నిలబడ్డాడు.

    "థ్యాంక్యూ మాలతీ!"

    బయట కారాగిన చప్పుడయింది. మాలతి నిరుత్తురురాలయి చూస్తోంది. శేఖర్ గుమ్మందాకా వచ్చిన డాక్టర్ని ఉద్దేశిస్తున్నట్లుగా 'థ్యాంక్యూ డాక్టర్! థ్యాంక్యూ" అంటూ తడుముకుంటూ లోపలకు వచ్చాడు.

    శంకర్ శేఖర్ ని ఇంచుమించు ఢీ కొన్నంతపని చేశాడు. ప్రక్కకి తప్పించుకుని అతనివంక కసిగా చూసి బయటకు వెళ్ళిపోయాడు.

    "దుర్గా!"

    మాలతి తెప్పరిల్లి దగ్గరకు వెళ్ళింది.

    "ఇలారా దుర్గా!" చేతులు చాచి ఆమెను తనవైపుకి లాక్కున్నాడు.

    "ఇవేళ ఎంత శుభదినమో తెలుసా? నిన్ను పెళ్ళి చేసుకున్నాను...రేపు ఆపరేషన్ చెయ్యడానికి నిర్ణయం జరిగింది దుర్గా! నాకు కళ్ళు వస్తాయి."

    మాలతి తృళ్ళిపడింది.

    "అవును దుర్గా! ఆయన నన్ను పరీక్షచేశారు. తప్పకుండా కళ్ళు వస్తాయన్నారు. రెండుమూడు రోజుల్లో ఆపరేషన్. దుర్గా! నీకు సంతోషంగా ఉంది కదూ?"

    మాలతి దు;ఖం ఆపుకుంటూ తల అడ్డంగా ఊపింది.

    "నిజంగా దుర్గా! నీ రూపం ఎలా వుంటుందో, నువ్వేమిటో నేనింతవరకూ ఊహించటానిక్కూడా ప్రయత్నించలేదు. కానీ నేను నిన్ను చూడబోతున్నాను.

    నా కాళ్ళముందు చీకట్లు తొలగిపోబోతున్నాయి. మళ్ళీ వెలుగు రాబోతుంది. ఇది కొత్త వెలుగు. సరికొత్త వెలుగు. ఇది దుర్గనీ, నన్నూ కాంతితో నింపే వెలుగు...."

    ఆమె ముఖం చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె కాన్నీళ్ళ తడి అతనికి తెలిసింది. ఉలిక్కిపడ్డాడు.

    "దుర్గా! ఏడుస్తున్నావా?"

    అతని చేతులు అప్రయత్నంగా ఆమెను వదిలేశాయి.

    "నాకు కళ్ళు రావడం నీకు ఆనందంగా లేదా?"

    మనిషి కంపనను అణచుకుంటూ కుడిచేతిని ముందుకు జాచాడు.

    "చెప్పు, నీకానందంగా వున్నదా? లేదా?"

    ఎంత ప్రయత్నించినా వ్రేళ్ళ వణుకుని అరికట్టలేకపోతున్నాడు.

    అదిరే గుండెతో మాలతి చేతిని ముందుకు జాపింది. మనసుని దృఢం చేసుకుంది. మధ్యవ్రేలుని స్పృశించింది.
    "దుర్గా! దుర్గా!" అంటూ ఆక్రోశించాడు శేఖర్. "ఏమిటది? నాకు చూపురావటం నీకెందుకని ఇష్టంలేదు? నిజంగా నువ్వే ఇస్తున్నవా జవాబు....?అర్ధమైంది. నీ బాధ నాకు అర్ధమైంది....దుర్గా! నాకు కళ్ళు వస్తే నిన్ను చూసి నేను ఏమనుకుంటానోనని భయమా? దుర్గా! నీ అందచందాలు నాకనవసరం. నువ్వెలా అయినా వుండు - నామీద ప్రేమ తరగదు. నాకు చూపువచ్చాక గొంతు లేని నీతో ఎలా వుంటానో అని కదా నీ బాధ? నాకు కళ్ళురావటం....నిన్నింకా...ఇంకా తృప్తిగా చూడటంకోసం కాదు దుర్గా! నీ మూగతనం మన ప్రేమకు అడ్డురాదు దుర్గా! నన్ను నమ్ము."

 Previous Page Next Page