Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 37

   
    వెనకా ముందూ చూసుకోకుండా ఏదేదో మాట్లాడి ఇప్పుడు పట్టుబడిపోయినందుకు కించిత్తు తొట్రుపడినా.......

 

    వెంటనే కవర్ చేసుకున్నట్లు "అదేనమ్మా!  ఓ ఫ్రెండ్ ఫోను చేసి రోజూ వాకింగ్ చేస్తే కుర్రాడ్నయిపోతానంటాడు. దానికి నేనేమో రామా, కృష్ణా అనుకునే ఈ వయసులో కుర్రాడ్ని అవ్వాల్సిన అవసరమేంటీ అని నేను చెడామడా తిట్టేశాను"

 

    "అలా నువ్వేం తిట్టలేదు గ్రాండ్ పా...."

 

    చిరుకోపంగా  అంది విజూష.

 

    "ఏదో ఓ రూట్ లో దూసుకుపోతానంటున్నావ్."

 

    "అబ్బా..... వదిలేయమ్మా" విజూష వేపు నుంచి దృష్టి మరల్చుకుని -
 


    "ఏంటమ్మా అలా వున్నావ్? కాలేజీ లేదా? కారు ట్రబులిచ్చిందా? మీ ఫ్రెండు పుట్టిన రోజా... చూశావా నాకు ప్రతి క్షణమూ నీ ధ్యాసేనమమ్మా!"

 

    కంగారుతో అక్కడినుంచి తప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే.......

 

    అడ్డంగా నిలబడింది విజూష.

 

    "సాల్మన్ రష్దీ నీకు తెలుసుగా. ఓ ఇంగ్లీషు నవలా రచయిత."

 

    "అవును..."

 

    హఠాత్తుగా అతడి ప్రసక్తి ఎందుకు తెచ్చిందో అర్దం కానట్టు చూశాడు.

 

    "సాటనిక్ సర్సెస్ లాంటి గొప్ప కాంట్రావర్షిలయల్ నవల రాశాడు.

 

    అతని భార్యకి భర్తంటే చాలా ప్రేమట. ఎప్పుడూ రచన వ్యాసంగంలో మునిగివుండే రష్దీని పట్టుకుని నేను మీ నవల ఇతివృత్తానైతే జీవితంలోనేకాక కాగితం మీద కూడా ఎప్పుడూ మీతోనే వుండే అదృష్టం దక్కేది అందిట.

 

    దానికి రష్దీ "అంతకన్నా నువ్వు కేలెండరువైతే బాగుండేది. ప్రతినెలా మార్చుకుంటూ పోయేవాడ్ని అన్నాడట."

 

    ఫకాల్న నవ్వేసిన గౌరీనాధంగారు  -

 

    "బాగుందమ్మా జోక్" అన్నాడు.

 

    "ఒకప్పుడు నువ్వు చెప్పిందే"

 

    మళ్లా షాకై.....

 

    "అయితే ఇప్పుడెందుకు గుర్తుచేసినట్లు?"

 

    "ప్రతి క్షణమూ నా ధ్యాసే అంటూ ఓ వాక్యం ప్రయోగించావుగా. అందులో రష్ది కేరెక్టర్ కనిపించింది"

 

    అవాక్కయిపోయాడు.

 

    ఇంకా లోతుగా వెళ్లి చెడామడా వాయించేదే.

 

    కానీ గౌరీనాధంగార్ని కాపాడింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన సూర్తి.


 
     "ఈ మాత్రం దానికి అంత టెన్షన్ ఫీలవ్వాల్సిన అవసరంలేదు విజూష. రుత్వికి సంబంధించే ఏ పోటీలో అయినా నిన్ను గెలిపించడానికి నేను సహకరిస్తాను" ఉత్సాహంగా అంది స్పూర్తి.

 

    ఆమె ఇచ్చిన హామీతో సంతృప్తి పడలేకపోయింది విజూష.

 

    అది కాదు....

 

     సశ్య ఈపాటికే రుత్వి అడిగిన ప్రశ్నకి జవాబు తెలుసుకునివుంటుందేమో అన్న బెంగగా వుంది.

 

    "నువ్వు ఏ ఘోస్ట్ రైటర్ సహాయం కోసమో ఎదురుచూడాల్సిన అవసరం లేదు విజూష.

 

    నువ్వు సరేనంటే ఏ ప్రముఖ రచయిత్రిని వెంటనే కలుసుకుందాం."

 

    "రచయిత్రి అయినంత మాత్రాన ఆ కవిత రాసిందెవరో చెప్పడం అంత సులభం కాదనుకుంటాను."

 

    విజూష అపనమ్మకంగా అంది.

 

    "నేను  చెప్పే రచయిత్రి కేవలం రాసే వ్యక్తి మాత్రమే కాదు యూనివర్శిటీలో తెలుగు ప్రొఫెసర్. ఆధునిక తెలుగు సాహిత్యంపై పి. హెచ్. డి. చేసి డాక్టరేట్ తీసుకుంది."

 

    ఉద్విగ్నంగా చూసిన విజూష  వెంటనే పైకి లేచింది వెళ్లడానికి ఉద్యుక్తురాలవుతూ.

 

    మరో రెండు నిముషాలలో కారులో వున్నారిద్దరూ.

 

    కారు నడుపుతున్న విజూషని ఓరకంట గమనించింది స్పూర్తి.

 

    విజూషలో స్వాతిశయం సన్నగా కరిగి ఏ ఆశల కొసకొమ్మలనో పట్టుకుని  అనుకున్న మనిషి దగ్గర కావాలనే ఆరాటం...

 

    మాట మాటకి మధ్య విజూష మౌనం చీలిపోయిన ఆమె మనసు గోడల నుంచి పుట్టుకొస్తున్న పూలతీగల్ని గుర్తుచేస్తూ మాటేసిన సిపాయి ల్లాంటి కలలు కదిలి అలసటగా వలసపోతున్నట్టుగానో లేక నిన్నటి శూన్యపు కాన్వాసుపై చెప్పకుండా రవివర్మ గీసిన చిత్రలేఖనానికి అబ్బురపడుతున్నట్టుగానో ఆమె కనుపాపలు బెదురుతున్నాయి.

 

    కాళ్లు తడవకుండా ప్రవాసం బాట లేనట్టు ప్రేమజల్లుతో మనసు తడపనిదే మనిషికి బ్రతుకే లేదనే  నిన్నటి సత్యానికి విజూష ఇప్పటి సాక్ష్యంలా వుంది.

 

    పదిహేను నిముషాలలో కారు సంజీవ రెడ్డినగర్ లోని ఓ అధునాతనమయిన ఇంటి ముందు ఆగింది.

 

    ప్రహరీ దాటి లోపలికి వెళుతున్న విజూష 'శ్రీమతి అనురాధాదేవి' అన్న నేమ్ ప్లేట్ చూసింది.

 

    "గుడ్ మార్నింగ్ మేడమ్!"

 

    హాల్లోకి అడుగుపెట్టగానే అక్కడ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న అనురాధాదేవిని విష్ చేసింది.


 
    ఆమె కూర్చోమన్నట్లుగదా సంజ్ఞ చేసింది తన ఫోన్ సంభాషణని కొనసాగిస్తూ.

 

    విజూషకిప్పుడు ఆనందంగా వుంది.

 

    సుమారు అయిదు పదుల వయసున్న అనురాధాదేవి తన సమస్యని పరిష్కరించగల వ్యక్తిగానే కాక ఎందుకో అమ్మ లా అనిపించింది.

 

    ఫోన్లో మాట్లాడే ఆమె గొంతులోని మార్దవం గుండె అలల ఆవిరుల్ని చల్లార్చగల సంగీతంలా వినిపిస్తూంది.


 
    "పింగళి లక్ష్మీకాంతం గారు క్రీ. శ. 1894 లో బందరు తాలూకా ఆర్తమూరులో జన్మిస్తే, కాటూరి వెంకటేశ్వరరావుగారు క్రీ. శ. 1895లో కృష్ణాజిల్లాలో పుట్టారు."

 

    ఫోన్లో ఎవరికో వివరంగా చెబుతోంది అనూరాధాదేవి.

 

    "సాహిత్యంలో నూతనాలంకారాల్ని సమకాలీన పాత తరం పరిహసిస్తుంటే  అందరూ జంకుతున్నా భయపడకుండా తమ కొత్త పంధాను అనుసరించిన గొప్ప కవులు పింగళి, కాటూరి జంట తెలుగునాట కనుల పండువగా  కనిపించే సంక్రాంతి దృశ్యాలకి శాశ్వతత్వాన్ని ఆపాదించడంలో ఈ జంట మాటల్ని రంగులుగా కలాన్ని కుంచెగా వాడారు అంటే అతిశయోక్తి కాదు."

 Previous Page Next Page