షాడో తననితానే తిట్టుకున్నాడు. రంజిత విషయం ఎవరూ పట్టించుకోరనుకున్నాడు. ఉస్సోక్ ని తక్కువ అంచనా వేశాడు.
ఇంతలో మహాదష్ట అతడి దగ్గిరకి వచ్చి చేయి సాచి అన్నాడు. "డియర్ షాడో! చేతి వాచీ ఇలా ఇస్తావా దయచేసి?" మహాదష్ట కంఠం కఠినంగా మారింది. "ఉస్సోక్ ని ఇంతవరకూ ఎవరూ మోసం చేయలేదు. మొట్టమొదటిసారి మాయం చేసిన మనిషి మీద తీసుకోవలసిన దారుణాతి దారుణమైన శిక్ష, చిత్రహింస ఎలా వుండాలో నేను ఆలోచిస్తాను. అంత వరకూ మా అతిధులుగా వుండండి".
వాచీ పట్టుకుని మహాదష్ట వెళ్ళిపోయాడు. విశాలమైన హాలులో ఇద్దరే మిగిలారు.
షాడో ఆమె దగ్గరకు వెళ్ళి "రంజితా" అన్నాడు.
అప్పటివరకూ నిశ్శబ్దంగా వున్నదల్లా బావురుమంటూ "ఇదంతా నా వల్లే- నా వల్లే" అని అతడి చేతుల్లో తల దాచుకుని రోదించసాగింది.
"ఊరుకో రంజితా ఊరుకో" అని ఓదార్చసాగాడు.
హాలులో ఒక మూలగా గెలిటన్ ఆహ్వానిస్తూన్నట్టు వుంది.
రెచ్చిపోయిన క్షుద్ర మాంత్రికులు పెట్టేబాధ అనుభవించటం కన్నా ఒకేసారి దానిలో తలపెట్టి చనిపోవటం మేలు. అతడు అలా అనుకుంటున్న సమయంలో డాక్టర్ రంగప్రసాద్ ఇంట్లో టెలిఫోన్ మ్రోగింది. రిసీవర్ తీసుకుని "హల్లో" అన్నాడు.
అట్నుంచి నివేదిత కంఠం ఎగ్జయిటింగ్ వినిపించింది. "మనకొక గొప్ప క్లూ దొరికింది అనుకుంటున్నాను" అన్నది.
రంగప్రసాద్ ఆసక్తిగా ముందుకు వంగి, "ఏమిటి?" అన్నాడు.
"అగర్వాల్ నపుంసకుడు!"
"వ్వాట్?"
"అవును. ప్రతిమ డైరీలో స్పష్టంగా వుంది ఆ విషయం".
రంగప్రసాద్ రిసీవర్ పట్టుకొని అలాగే కొంచెంసేపు వుండి పోయాడు. తరువాత మన మూర్ఖత్వానికి తనే నవ్వుకుంటున్నట్లు "ఇదేనా క్లూ" అన్నాడు.
"ఇదే".
"దీనివల్ల మనం సాధించేదేమీ లేదు. కృష్ణాపురంలో పుట్టిన ఏడుగురు శిశువుల తండ్రులూ నపుంసకులు కాదు గదా? అదీ గాక భర్త నపుంసకుడైతే భార్యకి వికృత శిశువు పుడతాడని ఏ జెనెటిక్స్ శాస్త్రంలోనూ చెప్పలేదు" నిస్పృహగా అన్నాడు.
"అంతేనా?"
"అంతే నివేదితా! ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుండటం అంటే ఇదే".
"నేనింకా ఆ డైరీలు పూర్తిగా చదవలేదు. ఈ విషయం చదవగానే మీకు ఫోన్ చేసి చెప్పాలనిపించింది. సరే ఈ విషయం ఇక వదిలిపెట్టండి. ఎలా వున్నారు మీరు?" ఆమె కంఠంలో స్నేహం ధ్వనించింది.
"సిక్" అన్నాడు.
"ఏం? ఎందుకని?"
"గౌరీ ప్రసవకాలం చాలా దగ్గరకొచ్చింది. సిద్ధార్థ, రవీ ఏమయ్యారో, ఎక్కడున్నారో తెలీదు. ఊరంతా ఎందుకో ఉద్రిక్తంగా వుంది. జనం నావైపు దోషిలా చూసినట్టు చూస్తున్నారు. సిక్ కాక మరేమిటి?"
"ఒక చిన్న గేయం చెప్పనా?"
"గేయమా? ఏమిటి?"
"మనిద్దరి మధ్యే వుండాలి సుమా!"
"ఏమిటి నివేదిత?"
"DON'T FEEL "SICK"
TAKE THE LAST LETTER
KICK THE THIRD LETTER
KEEP THE SECOND LETTER
DOUBLE THE FIRST LETTER"
"నాకేమీ అర్ధంకాలేదే?"
"ఆలోచించండి అర్ధమవుతుంది. ఎవరికీ చెప్పకండేం, సాయంత్రం వస్తున్నాను" అంటూ ఫోన్ పెట్టేసింది.
27
ప్రతిమా అగర్వాల్ డైరీ ఆధారంగా నివేదిత తయారు చేసిన రిపోర్టు చదువుతున్నాడు రంగప్రసాద్.
"IT IS VERY DIFFICULT TO LOVE
BUT VERY EASY TO FALL IN LOVE"
ఎంత చిన్న వాక్యం ఇది! కానీ ఆలోచించేకొద్దీ ఎన్నో అర్ధాలు స్పురించే వాక్యం!! ఎంత గొప్ప అర్ధం వున్నదీ వాక్యంలో... పైవాక్యమే నిజమైన పక్షంలో ఈ ప్రపంచంలో నూటికి ఏ ఒకరో ఇద్దరో నిజమైన ప్రేమని ఆస్వాదించి వుంటారేమో! జగదీష్ ని ప్రతిమ ప్రేమించింది...!!
అతడు పేజీ తిప్పాడు.
* * * *
"కానీ సరోజ్ కుమార్ అగర్వాల్ ప్రతిమని వివాహం చేసుకున్నాడు. అతడు బొంబాయిలో తన తల్లి పేరిట ఒక ట్రస్టు ఏర్పర్చి, మతి స్థిమితం లేని రోగుల కోసం ఒక ఆసుపత్రి కట్టించే నిమిత్తమై వచ్చి, ఇక్కడ హాస్పిటల్ పరిశీలిస్తున్న తరుణంలో ప్రతిమని చూడటం తటస్థించింది. అప్పటికి ఆమెకి పూర్తిగా స్వస్థత చేకూరి, విడుదలకి సిద్ధంగా వున్నది. జగదీష్ తో ప్రేమ విఫలమయ్యాక ప్రతిమ ఆరోగ్యం పాడయింది.
ప్రతిమది కన్ను తిప్పుకోనివ్వని అందం. దానికితోడు ఆమెలో ఏదో ఆకర్షణ వుంది.
అగర్వాల్ తో వివాహమై ప్రతిమ బొంబాయి వెళ్ళిన నెల రోజులకి తెలిసింది- అతడు మొగవాడు కాదని... అయినా ఆమె ఏమీ బాధపడలేదు. (ఈ విషయం స్పష్టంగా డైరీలో వ్రాసుకుంది.) కానీ ఆమె బాధపడే సత్యం మరొకటి ఉందని తెలిసింది. సరోజ్ కుమార్ అగర్వాల్ ఆమెని వివాహం చేసుకున్నది కేవలం సొసైటీలో తన పక్కన ఒక అద్భుత సౌందర్యరాశి కనబడటానికి మాత్రమే! వివాహానికి ముందే అతడు ఆమె గురించి ఎంక్వయిరీ చేసి, సంతృప్తి పొందాడు. తనెలాగూ మొగవాడు కాదు కాబట్టి, 'శీలం' పట్ల పెద్దగా నమ్మకం లేని ఆమెని చేసుకుంటే పెద్ద పెద్ద సర్కిల్స్ లో తన పనులు నెరవేరటానికి ఆమె ఉపయోగపడుతుంది అనుకున్నాడు. ఒకరిద్దరు పిల్లలు పుడితే వంశాంకురాలుగా పెరుగుతారు అనుకున్నాడు. కానీ ఆమె దానికి ససేమిరా వప్పుకోలేదు. ఒకప్పుడంటే జీవనం కోసం, చడువులనే నెరవేరటం కోసం ఆమె కుర్రవాళ్ళతో తిరిగింది. కానీ ఇప్పుడు ఒక లక్ష్యం కోటీశ్వరుడి భార్యగా తిరిగి ఆ పని చేయటానికి వప్పుకోలేదు. భార్య భర్త లిద్దరిమధ్య ఘర్షణ జరిగింది.
ప్రతిమది గొప్ప వ్యక్తిత్వం. అంతకుముందు చెప్పినట్లు శారీరకంగా చెడిపోవటానికీ, మానసికంగా స్వచ్చంగా వుండటానికీ ఆమె మంచి ఉదాహరణ. డబ్బు అవసరం తీరేక ఆమె ఒకసారి కూడా మొగవాడిని ఆహ్వానించలేదు. భర్త దగ్గిర నుంచి సుఖం లేకపోయిన స్థితిలో కూడా అలాగే వుండిపోతానంది. కానీ వేరే మొగుడిని కోరుకోలేదు. కానీ భర్తే ఆమెని ఆ పనికి ప్రోత్సాహించేసరికి కలత చెందింది. కావాలంటే విడాకులు ఇచ్చి, తనకున్న డిగ్రీతో ఏదైనా ఉద్యోగం చూసుకుంటానని అంది. దీనికి అగర్వాల్ ఒప్పుకోలేదు. అతడి ప్రిస్టేజి అడ్డం వచ్చింది.
ఈ విధంగా ఇద్దరూ దాదాపు ఆర్నెల్ల పాటూ గొడవపడ్డారు. చివరికి అగర్వాల్ జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ ని కన్సల్ట్ చేశాడు. పురుషుడితో శారీరక సంబంధం లేకపోయినా స్త్రీని గర్భవతిని చేసే విధానం గురించి తెలుసుకున్నాడు. అదే ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్!
అసలు విషయం చెప్పకుండా అగర్వాల్ ఆమెని ఇన్ స్టిట్యూట్ కి తీసుకొచ్చాడు. కానీ ఆమెని అంధకారంలో వుంచి, ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ జరపటానికి డాక్టర్ వంశీకృష్ణ ఒప్పుకోలేదు. వీలైనంతలో ఒక తెలివైన, ధృడమైన పురుషుడి వీర్యాన్ని ఎక్కిస్తానని మాత్రం హామీ ఇచ్చాడు. అసలు విషయం అక్కడ తెలిసిన ప్రతిమా అగర్వాల్ కోపంతో రెచ్చిపోయింది. తనకి తెలియకుండా తన వెనుక ఈ ఏర్పాటు చేసిన భర్తని డాక్టర్లముందే దులిపేసింది. అవమానంతో కృంగిపోయిన అగర్వాల్, ఆ రోజే భార్యని తీసుకుని బొంబాయి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత ఆరు నెలలకి ప్రతిమా అగర్వాల్ గర్భవతి అయింది-
28
చదువుతున్న రంగప్రసాద్ ఉలిక్కిపడ్డాడు.
"ఏమైంది" అని అడిగింది నివేదిత. ప్రతిమా అగర్వాల్ డైరీలన్నీ చదివి ఆ రిపోర్టు తయారుచేసింది ఆమె. దానివల్ల పెద్దగా ఉపయోగం వుండదని తెలిసినా- ఇదిగో ఈ ఆఖరి వాక్యమే ఆమెలో కుతూహలం రేపింది. వంశీకృష్ణ కూడా అక్కడే ఆగాడు.
"ఇది... ఇదెలా జరిగింది?" అని అడిగాడు.
"నాకు అదే అనుమానం వచ్చింది".
"ఈ విషయమై ప్రతిమా అగర్వాల్ ఏమీ వ్రాసుకోలేదా?"
"వివాహం జరిగేక ప్రతిమ ఇంతకు ముందంత జాగ్రత్తగా డైరీ వ్రాసుకోలేదు. అక్కడక్కడా వ్రాసుకుంది అంతే. బొంబాయి నుంచి రాగానే నేను మా ఇన్ స్టిట్యూట్ కి వెళ్ళాను. మా రిజిష్టర్లలో మూడు సంవత్సరాల క్రితం అగర్వాల్ దంపతులు వచ్చినట్టు వుంది. అయితే వచ్చిన ప్రతివారికి ఆ ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ గురించి ముందు పూర్తిగా వివరించి, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికీ ఇష్టం లేకపోయినా దీనిని అమలు జరపకూడదని మా రూలు. అందువల్ల అది చేయకుండానే వారు తిరిగి వెళ్ళిపోయారు".
"కానీ ఆ తర్వాత ప్రతిమా అగర్వాల్ గర్భవతి అయింది".
"ఔను"
"అంటే అగర్వాల్ ఆమెని ఆ తరువాత దీనికి వప్పించి వుండాలి".
"లేదు".
"లేకపోతే బలవంతంగా ఎవడితోనైనా రేప్ చేయించి వుండాలి".
"అదీ జరగలేదు. ఎందుకంటే ఆ తరువాత ప్రతిమా అగర్వాల్ చాలా ఆనందంగా వుంది. డైరీలో "ఈ రోజే డాక్టరు పరీక్షించి నేను గర్భవతినన్నారు. ఎంతో సంతోషం వేసింది. ఈ విధంగానైనా జీవితపు అంధకారంలో కాస్త వెలుగు ప్రవేశించింది" అని వ్రాసుకుంది. ఆ తొమ్మిది నెలలూ ఆమె చాలా ఉత్సాహంగా వున్నది. వికృత శిశువు జన్మించగానే మతిస్థిమితం తప్పింది- ఆ రకంగా చూస్తే ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరగలేదని తెలుస్తూంది".
"చాలా అయోమయంగా వుంది".
"అవును".
"దీని గురించి అగర్వాల్ ఏమంటాడు?"
"ఏమీ అనడు. అసలు ఈ డైరీని మనం సంపాదించిన విషయమే అతడికి తెలీదు. అతడిని మరోసారి కలుసుకోవటానికి ప్రయత్నిస్తే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాడు. తను మొగవాడు కాదన్న విషయం బయటపడటానికి ఎవరు వప్పుకుంటారు?"