"నేనంతకాలం ఇల్లు పట్టకుండా తిరిగినా, బాధ్యత లేకుండా ప్రవర్తించినా ఎందుకు ప్రేమతో ఆదరించింది?"
"కొడుకువి కాబట్టి..."
"చివరి ప్రశ్న - స్వామికీ మీకూ ఏమిటి సంబంధం?"
"ఆయన నా గాడ్ ఫాదర్. నేను బికారిగా వున్న రోజుల్లో నా తెలివితేటలు గుర్తించిన మొదటి వ్యక్తి. పరమపద సోపానంలో నన్ను పై అంతస్థుకి తీసుకువెళ్ళాడు. చట్టంతో తనకి నేను కల్పిస్తూన్న రక్షణకి ప్రతిగా సమాజంలో నాకు స్థానం కల్గించాడు. ఒక స్వంత తమ్ముడిలా నన్ను చూసుకుంటూ వచ్చాడు."
"కానీ నీలాంటి స్వంత తమ్ముడే ఒకడు అక్కడ ఆస్పత్రిలో తన రహస్యాలు బయట పెడతాడేమో అన్న అనుమానం రాగానే, మరో తమ్ముడిచేత అతడిని చంపించడం ఎలా- అని ఆలోచిస్తున్నాడు.... చూశావా నాన్నా మన ఇంటికీ ఆ ఇంటికీ వున్న తేడా! ఈ యిల్లు ప్రేమా ఆప్యాయతలు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు. ఆ ఇల్లు ఏ క్షణం కూలిపోతుందో తెలియని లక్క ఇల్లు. ఇక్కడ బంధాలకు పునాది ప్రేమ. అక్కడ మీ మధ్య బంధాలకి పునాది డబ్బు. ఇక్కడ తప్పుచేస్తే ప్రేమగా తిడతాం. అక్కడ తప్పుచేస్తే అడ్డు తొలగిస్తారు. ఈ ప్రేమ, మమత, ఆప్యాయత మనిషికి నైతిక ధర్మాన్ని, కట్టుబాట్లని బోధిస్తూ వుంటాయి. అవే లేకపోతే ఈ పాటికి ప్రతివాడూ ఒక తుపాకో, కత్తో తీసుకుని డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకునేవాడు."
"భేష్" వెనుక నుంచి వినిపించింది. స్వామి చప్పట్లు కొడుతూ మరోసారి "భేష్" అన్నాడు. అతడు తమ ఇంట్లో వున్నాడని వూహించని విహారి క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకున్నాడు. అతడి కోపం ద్విగుణీకృతమైంది. ఈ లోపులో స్వామి అన్నాడు.
"పరమేశ్వరం! ఇన్ని తెలివితేటలున్న కొడుకుని కన్నందుకు చాలా సంతోషంగా వుంది. పోతే మీ వాడు ఇంకా చిన్నపిల్లాడిలా, చిన్న మెదడుతో, యువరక్తపు ఆవేశంతో ఆలోచిస్తున్నాడు. కొంచెం పాఠాలు చెప్పాలి" అని విహారివైపు తిరిగి, "నువ్వు నాది లక్క యిల్లు అన్నావు కదూ... చాలా అజ్ఞానంతో కూడుకున్న మాట అది. నాది నాలుగు స్థంభాల మీద నిర్మింపబడిన పటిష్టమైన భవనం... ఈ దేశపు రాజ్యంగమంత పటిష్టమైన భవనం అది."
"ఎంత గట్టి భవనమైనా, తెలివితేటలనే గునపంతో తవ్వి, పట్టుదల అనే డైనమేట్ తో పేలిస్తే కూలిపోక తప్పదు."
"అదే జరిగిన మరుక్షణం నీ తల్లి నుదుటున కొత్తగా చేరిన బొట్టు చెరిగిపోతుంది. పట్టుచీరలా చుట్టుకున్న ఆనందం తొలగిపోయి వైధవ్యం మళ్ళీ మిగులుతుంది" అంటూ నవ్వేడు. "నువ్వు నీ ప్రయత్నాలు ప్రారంభించిన రోజున- అలా తెలిసిన మరుక్షణం నీ తల్లికి తన భర్త ఎటువంటివాడో తెలుస్తుంది. ఏం చేస్తుంది ఆవిడ? న్యాయం కోసం, ధర్మం కోసం భర్తని వదిలేస్తుందా? కొడుకు పక్షాన నిలబడుతుందా? అసలావిడ గుండె ఆ షాక్ కి తట్టుకోగలుగుతుందా? అయినా భర్త పోవడం వేరు. భర్త వదిలేయడం వేరు. సమాజంలో నీ తల్లి స్థానం దిగజారిపోతుంది కలిసి నెలరోజులయినా కాకముందే భర్త ఎందుకు వదిలేశాడో అని అందరూ చెవులు కొరుక్కుంటారు. చూశావా విహారీ నిన్నెంత ఇరుకున పెట్టానో.... నన్ను లోయలోకి తోసినందుకు ఇదీ ప్రతిఫలం. ఇకనుంచీ అనుక్షణం నిన్ను నరకయాతన పెడతాడు నీ తండ్రి. ఇదంతా భరించలేక ఏ క్షణమైతే నువ్వు నీ తండ్రిమీద తిరగబడి విజయం సాదిస్తావో, ఆ క్షణం నీ తల్లి విధవరాలవుతుంది. నీ తల్లి బొట్టుని నువ్వే చెరిపేసినవాడివి అవుతావు. భర్త చిన్నప్పుడే పోవడం వేరు. పోయాడనుకున్న భర్త తిరిగి దొరికాక నిజంగా ఇంకొకసారి పోవడం వేరు. చెప్పు... ఆవిడని నీ చేతుల్తో విధవరాల్ని చేస్తావా? ఏ పురాణాల్లోనూ, ఏ శాస్త్రాల్లోనూ ఏ తల్లికీ ఏ కొడుకూ యివ్వని "బొట్టు చెరపడం" అనే బహుమతిని నువ్విస్తావా?"
"అనంతానంతస్వామి అని పేరు పెట్టుకున్నందుకు శాస్త్రాల్నీ పురాణాల్నీ బాగా విశదీకరించావు. నేను చెప్పేది కూడా విను. ణా తండ్రిని నీ భవంతి పై అంతస్తులో బంధించావు. కాళ్ళను 'హోదా' అనే అడ్రసులోనూ, చేతుల్ని 'డబ్బు' అనే సంకెళ్ళలోనూ బిగించావు. ణా తండ్రిని ఆ శృంఖలాల్నుంచి తప్పించి, ఆ అంతస్థులన్నీ దింపి, ఒక మామూలు మనిషిగా ణా తల్లికి అప్పగిస్తాను. ఏ పురాణాల్లోనూ, ఏ శాస్త్రాల్లోనూ ఏ కొడుకూ ఏ తల్లికీ ఇవ్వని 'భర్త' అనే బహుమతి నేనిస్తాను..."
స్వామి బిగ్గరగా నవ్వాడు. "విహారీ...! నా నాలుగో స్థంభం ఏదో ప్రవల్లికకి మాత్రమే చెప్పాను. ఇప్పుడు నీకూ చెప్తాను విను. నా నాలుగో స్థంభం నువ్వు."
"నేనా?"
"అవును- నీలాంటి సామాన్యుడు. తన వీపుమీద మమ్మల్ని పెట్టుకుని మోస్తున్నాడు. మా తెలివికి లొంగిపోయి పన్నుల రూపంలో డబ్బులు ఇస్తూ మా సౌభాగ్యానికి సోపానాలు కడుతూన్న అమాయకుడు. మా రాజకీయానికి పొంగిపోయి, అదే స్వర్గమనుకుని ఓట్లు వేస్తూ మాకు అధికారం కట్టబెడుతున్న దౌర్భాగ్యుడు. మేము చేస్తున్నదంతా న్యాయం అని నమ్మినవాడు. వాడు పిరికివాడు, వాడు అజ్ఞాని, వాడు భయస్తుడు. అలాంటి ఆలోచనా రహితుల నుంచి విడివడి కావాలంటే నువ్వూ రా. ఈ భవంతిలో కావలసినన్ని సుఖాలున్నాయి. కోరినంత డబ్బు వుంది."
"మనిషికి డబ్బొక్కటే కాదు. చాలా కావాలి."
"ఆ చాలా కావాలంటే డబ్బు కావాలి."
"ఆ డబ్బుతో పాటు నైతిక విలువలు కూడా కావాలి."
"తాతలు సంపాదించిన ఆస్థి ఖర్చు పెడుతూ రోడ్డుమీద డాన్సులు, స్టేజీమీద నాటకాలు ఆడేవాడివి నువ్వు మాట్లాడుతున్నావా 'విలువల' గురించి... తప్పో ఒప్పో... ప్రాణాలు పణంగా పెట్టి మేం కష్టపడతాం- కష్టానికి ఫలితం అనుభవిస్తాం.... అంతేకానీ తిని కూర్చుని కబుర్లు చెప్పం..."
విహారి తెల్లబోయాడు. స్వామి మాటలు బాణాల్లా గుండెల్లో తగిలాయి. ఇంతవరకూ తనీ కోణంలో ఆలోచించలేదు. డ్రింకు కలుపుతూ విప్లవం గురించి మాట్లాడేవారికన్నా హీనుడతను. అది తట్టలేదు.
"విహారీ! నువ్వు అసలు విషయం మర్చిపోతున్నట్టున్నావు. వర్ధని ఆస్థికి "కొడుగ్గా" నీ కన్నా- "భర్త"గా నేను మొదటి హక్కుదారుడ్ని! నువ్వు నాకు ఏమాత్రం వ్యతిరేకంగా పనిచేసినా ఈ ఆస్థిలో ఒక్కపైసా అయినా ఖర్చుపెట్టే హక్కు నీకుండదు."
విహారి వినడంలేదు. అతడు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశాడు. పరమేశ్వరం చెప్పదల్చుకున్నది అర్ధమైంది.
అతడు తన తండ్రివైపూ, స్వామివైపూ చూసి స్థిరంగా అన్నాడు "నేనీక్షణమే ఇంటినుంచి వెళ్ళిపోతున్నాను."
అతడి గొంతులో ఒక నిశ్చయం తొంగిచూసింది.
"కోట లోపలుండి తిరగబడితే నమ్మకద్రోహం అవుతుంది. కోట బయట నుంచి తిరగబడితే అది యుద్ధం అవుతుంది. మీరన్నట్టు నేను చాలా సామాన్యుడిని, ఈ దేశపు శక్తివంతమైన దుర్మార్గుడిని ఎదుర్కొనే శక్తి కేవలం సామాన్యుడికే వుంది తప్ప మరే అధికార్లకీ.... బ్యూరోక్రాట్లకీ లేదు."
వెళ్ళబోతూ ఆగి అతనన్నాడు- "చూశావా స్వామీ... నాలుగు స్థంభాల పటిష్టమైన భవంతి అన్నావు. స్వార్ధాన్ని, భద్రతపట్ల భయాన్నీ ,సుఖాన్నీ వదులుకుని సామాన్యుడు తిరగబడితే, ఎంత సులభంగా నీ మొదటి స్థంభం కూలిపోయిందో చూడు. యిక మూడు స్థంభాలే వున్నాయి. నీ "బలాన్నీ", "రాజకీయాన్నీ" పడగొట్టి, "తెలివిని" నా తల్లికి బహుమతిగా ఎలా అర్పిస్తానో చూస్తూ వుండు- నీకే తెలుస్తుంది."
16
"గోల్డెన్ ఐలెండ్" లో స్వామి తాలూకూ స్వంత హెలికాఫ్టర్ దిగింది. హెలిపాడ్ నుంచి కారు వరకూ ఎర్ర తివాచీ, చుట్టూ పూలమొక్కలు, క్రమశిక్షణతో నిష్ణాతులయిన సైనికులు వందనం చేస్తుండగా స్వామి దిగి కారులో ఎక్కి కూర్చున్నాడు.
రోడ్డు కిరువైపులా కొబ్బతిచెట్లు, మధ్యలో చక్కటిదారి. దాదాపు పదినిమిషాలు ప్రయాణం చేసిన తరువాత అతడికారు పెద్ద కాంపౌండ్ లో ప్రవేశించింది. చుట్టూ బార్బ్ డ్ వైరు ఫెన్సింగ్- గార్డులు, సుశిక్షితమైన ఆల్సేషన్ కుక్కలు- అదో కొత్తరకం ప్రపంచంలా వుంది.
అశేషమైన ప్రజల అజ్ఞానాన్ని ధనంగా మర్చి కట్టినట్టు- ఆ దీవి మధ్యలో విశాలమైన భవంతి- ఎత్తయిన చెట్లు- మొత్తం పాలరాయి.
స్వామి ఠీవిగా ఎక్కుతూ వుంటే- బారులు తీర్చిన సైనికులు సెల్యూట్ చేశారు.
అతడు దీవికి చేరుకున్న గంటలోపులో మరో రెండు హెలికాప్టర్లు, మూడు ఫ్రెండ్స్ ఫోకర్స్ వచ్చి దిగాయి. మొరాకో, ఈక్విడార్ మొదలైన దేశాల్నుంచీ, కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లూమ్ ఫీల్డు మొదలయిన నగరాల్నుంచీ ప్రతినిధులు వచ్చారు. భారతదేశపు పక్క శత్రుదేశాలు, ఒక అగ్రరాజ్యపు రహస్య ప్రతినిధుల సంగతి సరేసరి. దక్షిణాఫ్రికా సంగతి తెలియనిదేముంది? రెండు కోట్లకు పైగా జనసంఖ్య వున్న దేశంలో కేవలం 37 లక్షల మందికే ఓటుహక్కు వున్న దౌర్భాగ్యదేశం. అటువంటి దేశ ప్రతినిధులు స్వామిలాటివారికి సాయపడడంలో విచిత్రం లేదు. ఆసియా ఖండంలో భారతదేశపు ప్రాబల్యం తగ్గిస్తే కొన్ని దేశాలకు మంచిది. వారూ పాల్గొన్నారు.
కొంతమంది స్వార్ధపూరిత వ్యక్తులు, తమ లాభం కోసం పన్నే "వ్యూహా"నికి మరోపేరు "రాజనీతి!!" ఫిలిఫ్ఫైన్స్ లో అయినా, ఫీజీ ద్వీపంలో అయినా, దక్షిణాఫ్రికాలో అయినా వీరు ఉపయోగించేది ఆ పేరే. మొట్టమొదటిసారి భారతదేశంలో ఆ రకమైన తిరుగుబాటు జరగడానికి పునాదులు తవ్వబడుతున్నాయి.
స్వామి అండతో కేంద్ర మంత్రివర్గంలో నెంబర్ టూ అయిన సూర్యారావు చాపక్రింద నీరులా విజృంభిస్తున్నాడు. ఇప్పటికే రకరకాల "తలనొప్పు"లతో సతమతమౌతూన్న ప్రధానమంత్రి ,అతడిని తొలగిస్తే ఏ పరిణామాలు సంభవిస్తాయా అన్న సందిగ్ధంలో ఉన్నారు. సూర్యారావు ఎంత ప్రమాదకరమైన వ్యక్తో ఇంకా పూర్తిగా బయటపడలేదు. దేశంలో స్వామికి కావలసిన పరిస్థితులు క్రమంగా అలుముకుంటున్న సమయంలో-
ఇక్కడ దీనిలో.... ఆ హాలులో సమావేశం మొదలైంది.
అదేమీ రహస్య సమావేశం కాదు. రోమన్ సాంప్రదాయపు పద్ధతిలో అందమైన ఆడవాళ్ళు వైన్ నింపుతున్నారు. ఒక మూల ఒక స్త్రీ తీగెలతో చేయబడిన సంగాతి (సితారు లాంటి వాద్య విశేషం) వాయిస్తున్నది. కొందరు పరిచారికలు తినుబండారాలు సర్దుతున్నారు. అతిధుల మాటలన్నీ వింటున్నారు.
అదే అనుమానం ఎవరికో వచ్చినట్టుంది. "మనం ఏదైనా మందిరం లోపల కూర్చుంటే బావుంటుందేమో" అని అడిగాడు.
స్వామి నవ్వేడు. "ఈ దీవే ఒక మందిరం. ఇక్కడ పురుగుకూడా అనుమతి లేకుండా బయటకు పోలేదు."
నిజమే అయివుండవచ్చు. మామూలుగా అయితే ఇటువంటి మీటింగ్స్ అండర్ గ్రౌండ్స్ లోనో, చీకటి కప్పిన గదుల్లోనో జరగాలి. ఏది ఏమైనా అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా వుంది. చెట్ల నీడలు అద్దాల అవతల్నుంచి అందంగా కదుల్తున్నాయి. షాండ్లీయర్ల కాంతి కెరటాలు ఆ హాల్లో పరుచుకుంటూంది. బాలీసులు కాసుకుని కూర్చుని వున్నారు వాళ్ళు. అగరొత్తు పరిమళం ఆ హాలంతా పరుచుకుని వుంది. ఆ వాతావరణంలో వాళ్ళ భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించసాగారు.
జపాన్ నుంచి వచ్చే షిప్ లో మారణాయుధాలు ఎలా మార్పిడి జరగాలి. దేశంలోకి అవి ఎలా సరఫరా జరగాలి. ఈపాటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో సర్దుకున్న సుశిక్షితులైన సైనికులు వివిధ పుణ్యక్షేత్రాలలో ఎలా అలజడి సృష్టించి, హిందూ దేశపు మెజారిటీ మతస్తులని ఎలా రెచ్చగొట్టాలి. ఎన్ని రోజుల తరువాత ప్రధానమంత్రి మీద సూర్యారావు తిరగబడాలి. ఎప్పుడు అనంతానంతస్వామి సర్వసైనికాధికారిగా, మత సంరక్షకుడిగా, దేశపు రక్షణ బాధ్యత స్వీకరించాలి. వెంటనే ఎప్పుడు ఈ రాజ్యాలన్నీ అతడిని రాజుగా గుర్తించాలి- అన్న విషయంమీద చర్చలు జరిగి, ప్రామాణికలు ఏర్పాటు చేయబడ్డాయి.
దాదాపు అరగంట సమావేశం అయ్యాక వారు లంచ్ కి లేచారు.