ఆమె నిర్విణురాలై చూస్తుండగానే క్రమంగా చైతన్యాన్ని నింపుకుంటూ వెల్లకిలా తిరిగాడు.
మూసిన కనురెప్పల అంచునుంచి నీటిబొట్లు రాలుతుంటే అతడి పెదవులు కదులుతున్నాయి ఏ మంత్రమో ఉచ్చరిస్తున్నట్టు.
శృతి స్థాణువైంది.
మరో రెండు నిముషాలలో కళ్ళు తెరిచాడు జయేంద్ర.
"జయా...నువ్వు..." ఆమెకు తెలిసిన వైద్యశాస్త్ర పరిజ్ఞానం, నేర్చుకున్న హేతువాదాల ఓటమిసైతం ఆ క్షణాన అపదృశమైన ఆనందాన్ని కలిగిస్తుంటే నిశ్చేష్టతగా మాటలు కూర్చుకుంటూంది.
మృదువుగా నవ్వాడు అలసటగా కూర్చుంటూ...
"నువ్వు నమ్మని సిద్ధాంతం నన్నిప్పుడు బ్రతికించింది శృతీ... నేనిప్పుడు మామూలు మనిషినే..."
ఎలా...కింగ్ కోబ్రా కాటేసిన ఈ వ్యక్తి ఎలా బ్రతకగలిగాడు? అసలిదంతా ఎలా సాధ్యమైంది...
ఆమె విభ్రమంగా చూస్తూంది.
నిర్మానుష్యంగా వున్న ఆ పొదలమధ్య ఇప్పుడతడు సర్పంలా అనిపిస్తుంటే అవాక్కయింది.
"శృతీ" జయేంద్ర కళ్ళలో చిత్రమైన స్థబ్దత. పైకిలేచి నడుస్తున్నాడు" మామూలుగా నువ్వు చూసింది కలకాదు నిజం...నన్ను నాగు కాటేసింది. నాలోకి విషం ప్రాకింది. కాని నేనిప్పుడు బ్రతికాను... నీ మందుల మూలంగా కాదు...నా మంత్రాల ప్రభావంతో."
"నిన్ను కాటేసింది కింగ్ కోబ్రా జయేంద్రా" విభ్రమంగా నేల చూపులు చూస్తూనే నడుస్తూంది.
"శృతీ ఒక మనిషికి ప్రాణహాని కలగటానికి అయిదు మిల్లీ లీటర్ల విషంచాలు. కాని కింగ్ కోబ్రా ఒక్కసారి కాటుకే ముప్పై మిల్లీలీటర్లు ఇంజెక్ట్ చేస్తుంది. బ్రతకడం అసంభవం."
ఓ క్షణం ఆగేడు... "మరి నేనెలా బ్రతికాను...శృతీ...నీ శాస్త్ర విజ్ఞానానికి అందనిదంతా నిజం కాకుండాపోదు...నిజం శృతీ" మామూలు సర్పం కాటుకి నేను అణువంతయినా చలించను. కాని కరిచింది కళింగనాగు కాబట్టే నువ్వన్నట్టు కాస్త నీరసించాను...అంతే!"
"జయేంద్రా" ఖంగుమంది శృతి కంఠం. "అసలు నువ్వెవరివి. ఇదంతా ఎలా సాధ్యమైంది." ఉవ్వెత్తున లేచిన ప్రశ్నల పరంపరతో అతడ్ని నిలదీసింది. తనకతడిగురించి తెలిసింది ఎంత స్వల్పమో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంటే ఉద్వేగంగా అడిగింది.
అప్పటికే ఓ వందగజాల దూరం నడిచిన జయేంద్ర ఓ బండరాతిపై చేతినుంచి దూరంగా చూస్తున్నాడు.
"నాకు జవాబు కావాలి జయేంద్రా... నీ గురించి నాకు పూర్తిగా తెలియాలి చెప్పు. ప్లీజ్!" తనను తాను నిగ్రహించుకోలేనట్టు చనువుగా వెనక్కి తిప్పుకుంది.
"అప్పుడు చూసింది జయేంద్ర కళ్ళలో నిలచిన నీటిసుడుల్ని. కోరని రీతిలో గతం ద్వారాలు తెరుచుకుంటున్నట్టు సన్నని ప్రకంపన."
"నిన్ను...నిన్ను నేనో పరిచయస్తుడిగా ఇప్పుడు ప్రశ్నించడం లేదు జయేంద్ర. నా ప్రపంచమంతా ఆక్రమించిన నా మనిషిగా నేను త్రికరణశుద్దిగా ఇష్టపడే నా వాడిగా అడుగుతున్నాను."
జయేంద్ర పెదవులు అదురుతున్నాయి.
"నేను నిన్ను కోరుకుంటున్న ఆడదాన్నని ఇంత సూటిగా చెప్పడానికి సిగ్గుపడటం లేదు జయేంద్రా. తొలి చూపులోనే మానసికంగా నీకు చేరువైనదాన్ని. నీ అర్ధంకాని ప్రవర్తనతో నీ సాహసంతో నాకు తెలియకుండానే నీపైన ఇష్టం పెంచుకున్నదాన్ని, అవును జయేంద్రా...దీనికి నేను అర్హురాలినోకాదో నాకు తెలీదు. బట్ ఐ లవ్యూ...అందుకే అడుగుతున్నాను... నేను నీ మనిషిని నా ప్రేమ అర్హమైనదనే నువ్వు అనుకుంటే చెప్పు... ...ఈ విషాన్ని నువ్వెలా జీర్ణించుకోగలిగావు. ఇది నీకెలా సాధ్యమైంది."
"నా బ్రతుకు తుఫానులో తారసపడిన ప్రియనేస్తానివి నువ్వు కోరుకుంటావేమోకాని చేరువకాలేని మనిషిని శృతీ..." ఒక నీటిబొట్టు అతడి కనుకొలకులనుంచి నిస్సహాయంగా రాలిపడింది. "నేను మనిషినే కాని నీ మనసును అంగీకరించలేని విషపూరితమైన ప్రాణిని."
నిశ్చేష్టతగా వింటూంది శృతి.
"ఏ బడబానలపు ఉద్విగ్నతనో నిభాయించుకుంటూ రొప్పుతున్నాడు. నేను పెదవి విప్పితే గాయత్రి...నా తల్లి పేరు గాయత్రి... నిస్సహాయంగానే ఏనాడో నేలరాలింది. నేను పెరిగిన శారదానది సైకతాలలో ఉదయసంధ్యని వార్చుతూ వల్లించిన మంత్ర పుష్పాలూ లేవు. రేగి చెట్ల నడుమనో నాన్నతోకలిసి తిరిగిన గరిక పచ్చదనాలలోనో గడ్డిపువ్వులై రాలిపోయాయి" అతడి కళ్ళిప్పుడు ధారాపాతంగా వర్షిస్తున్నాయి" నాన్న శివాలయ అర్చకుడిగా నేర్పిన ఓంకారం అమ్మ పొత్తిళ్ళలో నేను రుచిచూచిన మమకారం గడ్డకట్టి రెండు దశాబ్దాలు దాటిపోయాయి శృతీ..."
ఓ క్షణం ఆగేడు గతం కరిగి వరదై మనసుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు... "అమ్మకి నాన్న దైవం...నాన్నకి శివుడే సర్వస్వం. అలాంటి నా బ్రతుకుగతి తప్పింది భవిష్యత్తు కాళరాత్రిగా మార్చింది ఓ శివరాత్రి..."
"ఎలా?"
"అర్ధరాత్రి శివాలయానికి వెళ్ళి శివుడికి అర్చన చేసివస్తున్న అమ్మని బలవంతంగా నాశనంచేసాడు శివాలయ ధర్మకర్త కొడుకు..."
శృతి అప్రతిభురాలై వింటూంది.
"ఆ రాత్రి అమ్మ మామిడితోపులో చెట్టుకి ఉరిపోసుకుని చనిపోయింది. నాన్న మతిభ్రమించింది. రెండు దశాబ్దాలపాటు శివుడి సేవకే అంకితమైన నాన్న అప్పటినుంచే శివుడ్ని ద్వేషించడం ప్రారంభించాడు. మాకు జరగాల్సిన న్యాయం బలవంతుడి అహంకారంమాటున సమాధి అయ్యింది. మరో పల్లె మాకు ఆశ్రయమిచ్చింది. అక్కడే నన్ను పెంచాడు నాన్న. అక్కడి గుడిసెల్లో మనుషులుతోపాటు బుట్టల్లో పాములుండేవి...మనుషులకీ పాములకీ మధ్య అసాధారణమైన సఖ్యతవుండేది. వాళ్ళ వృత్తి పాముల్ని పట్టడమేకాదు. పాముకాటుకి బలైన వ్యక్తుల్ని మంత్రాలతో రక్షించడం కూడా. అలా జ్ఞానం తెలీని వయసులో నాకూ సర్పాలతో చెలిమి ఏర్పడింది. నేనూ మంత్రాలని నేర్చుకున్నాను...నా పదోఏటనే నాన్న చనిపోయాడు. చనిపోతూ చెప్పాడు..."
"ఏమని?"
"కేవలం నేను మంత్రశక్తి గలవాడ్ని మాత్రమే కానని నా శరీరంలో పామువిషము వుందని..."
"అంటే" అర్ధోక్తిలో ఆగిపోయింది.
"నాకు గోరుముద్దలతో పాటు గరళాన్ని మింగించాడు. తన నమ్మకాన్ని నాశనం చేసిన శివుడిపై ద్వేషంతో గరళకంఠుడైన అతడ్ని మించి నన్ను గరళశరీరుడిగా మార్చాడు" జయేంద్ర శ్వాస బుసలా వినిపిస్తూంది. ప్రపంచమంటే తెలీని వయసులోనే నేను చేతిలోపావునయ్యాను శృతీ. కారణం ఏమన్నాకాని నా రక్తం విషమైపోయింది. మంత్రాలను ఉచ్చరించగలనా పెదవులూ విషపూరితమయ్యాయి. కాబట్టే ఒక్కోమారు సర్పరోషంతో నలిగిపోతుంటాను. నేను మనిషినే అన్న విచక్షణకి దూరంగా విసిరేయబడి కాటేసే కసితో కదిలిపోతుంటాను..."
శృతి ఆలోచిస్తూంది తార్కికంగా...
అతడు చెప్పిన మాటల్ని శాస్త్రంతో సమన్వయపరచుకుంటూ ఎక్కడ సరిగ్గా ఏ కేంద్రం దగ్గర అతడు పొరపాటుగా ఆలోచిస్తున్నదీ గ్రహించింది.పాము విషం అతడిపై పనిచేయకపోవడానికి కారణం మంత్రశక్తి అని విశ్లేషించబోతూ పక్కకి చూసింది.
కాని అప్పటికే జయేంద్ర నడుస్తున్నాడు నిశ్శబ్దంగా...
* * * *
"పట్టపగలు పాఠశాలలో పదకొండుమంది పిల్లలు పాముకాటుకు బలి."
కడుపుకోతతో శిలలైన కన్నతల్లుల విషాదగాధ.
"జంటనగరాలను మరోమారు చుట్టుముట్టిన మరణభీతి..."
"ఆరిన చిరుదివ్వెల దారుణ మానవ హోమం."
భాగ్యనగరంలో ఈవెనింగ్ ఎడిషన్స్ హాట్ కేక్స్ లా అమ్ముడు పోతున్నాయి.
యుగసంధ్య సమీపిస్తూందని ముందే తెలిసిన మనుషుల్లా కొన్ని ప్రాంతాలలో జనం గుమిగూడి గుండె లుగ్గబట్టుకుని అదే విషయం చర్చిస్తుంటే మరికొన్ని చోట్ల కర్ఫ్యూ విధించినట్టు ప్రజలు ఇళ్ళలో నక్కి ద్వారాలకు గడియలు బిగించుకున్నారు.
అందరిలోనూ ఒకటే ఆందోళన.
భయంకరమైన విషసర్పం...
ముందు అయిదారడుగులుగా కనిపిస్తూందట.
అదే అరనిముషంలో ఆరుగజాలమించి విస్తరిస్తుందట.
నల్లగా చాంతాడులా వుండే ఆ సర్పం క్షణాలలో కొండచిలువంత లావుగా మారిపోతుందట...
స్కూలుముందు నిలబడ్డవాళ్ళ కళ్ళముందే కనిపించినట్టు కనిపించి అదృశ్యమైందట...
వేగం ఒడుపుచూస్తే అదోదేవతా సర్పంలా వుందట...
తొలిసారి పార్కులో ప్రత్యక్షమైన ఆ పామునుంచి ప్రజల్ని కాపాడాలని ప్రయత్నించిన ఒక కస్టమ్స్ ఆఫీసర్ దాని తొలికాటుకి బలైపోయాడట...
నవాబులకాలంనుంచే ఆబిడ్స్ ప్రాంతాన ఉన్న ఓ పెద్ద పాము పుట్టని నేలమట్టంచేసి 'జి.పి.ఓ.' కట్టించారట... ఆ పగతో సరాసరి నాగలోకంనుంచి ఓ రాక్షస సర్పం నగరంలో అడుగుపెట్టిందట...