నేనిప్పుడేం చేయాలి?
అందుకు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేక పోయింది.
తిన్నగా ఫోటో ఆల్బం వద్దకు నడిచాను.
నాకు తెలుసు ఆ ఆల్బంలో ఏ ఫోటోలుంటాయో...ఒకసారి చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది.
ఆల్బం తెరవకుండానే మనసు థ్రిల్ కాసాగింది.
ఆల్బం తెరిచాను.
యధాలాపంగా చూసినవాడ్ని నిశ్చేష్టుడినయి పోయాను.
డాక్టర్ విలాస్ నాకు ఆల్బం చూపించినప్పుడు కూడా నాకు అంత షాక్ తగల్లేదు.
నా చేతిలోని ఆల్బం జారిపడింది.
అయితే కుతూహలం ఆగదుకదా!
ఆల్బం తిరగేశాను.
విలాస్ నాకు స్లయిడ్స్ చూపించాడు. ఫోటోలు చూపించాడు కానీ ఇప్పుడు నా మనసులో కలిగిన సంచలనం అవి చూసినప్పటి సంచలనం సంచలనమే అనిపించుకోదు.
ఒక ఆడదానికి...ఇది సాధ్యమా?
నేను ఆల్బం అక్కడపెట్టాను.
వెనక్కు తిరిగి ఉలిక్కిపడ్డాను.
గుమ్మంలో ఆమె...విలాస్ ఉన్నది.
నేను వచ్చింది శ్రీమతి విలాస్ కోసమే...కానీ...
ఆమె నావేపు కోపంగా చూస్తున్నది.
నేను నిలబడిన చోటనే ఆగిపోయాను.
ఆమె నెమ్మదిగా నన్ను సమీపించి "ఎందుకు వచ్చావిక్కడికి?" అన్నది.
నేను మాట్లాడలేదు.
"మాట్లాడవేం?"
"నీ కోసం..."
"ఆమె గొంతులోని కాఠిన్యం మారలేదు. "నువ్వు నాతో చాలా అబద్దాలు చెప్పావు. నేను నిన్ను నమ్మను" అన్నాను.
"నన్ను నువ్వు నమ్మొద్దు. కానీ నీకోసం ఏదయినా చేస్తానంటే మాత్రం నమ్ము" అన్నదామె.
"కోమలీ!" అన్నాను. "నీవు విలాస్ భార్యవని నా కెందుకు తెలియనివ్వలేదు!"
కోమలి తడబడలేదు. "నా దురదృష్టం కొద్దీ నిజం తెలుసుకున్నావు కానీ__నేను విలాస్ భార్యనని ఈ జన్మకు తెలియనిచ్చేదాన్ని కాదు."
కోమలి నన్ను తప్పించుకువెళ్ళి మంచం మీద కూర్చున్నది. "రామం....నీవు నన్ను అర్ధం చేసుకోలేవు-"
"పోనీ నువ్వే అర్ధమయ్యేలా చెప్పు."
"రామం... ప్రేమంటే నాకు తెలియదు. కానీ నా మనసు నిన్ను కోరుతున్నది. నా తనువ్వు నిను చూడగానే పులకిస్తుంది. నీ కోసం ఈ ప్రపంచంలో ఎటువంటి త్యాగం సాధ్యపడుతుందన్నా చేయగలను. ఆ విషయం నీకు తెలుసు. నాకు నీ ముందు కోపం వుండదు. ఉక్రోషం ఉండదు. సిగ్గు తెలియదు. అభిమానం తెలియదు...అసలు నేను వేరే మనిషినన్న భావమే ఉండదు. ఆ రోజుల్లో నీ కోసం తపించి పోయాను-ఇప్పుడూ తపించిపోతున్నాను. ఇది నా బలహీనాథ అని నువ్వనుకుంటావు. అందరి విషయంలోనూ నేనిలాగేనని నువ్వనుకుంటావు. ఇంతవరకూ నా భర్తను తప్ప పరపురుషుడి నెరుగను నేను ఎవరయినా నా వంక అదోలా చూస్తే చాలు చెంపలు వాయించేస్తాను. కానీ ఒక్క నీ విషయంలో అంతా తేడా....ఈ తేడాకు ప్రేమ కారణమేమో చెప్పలేను" అని కోమలి ఒక్క నిముషం ఆగి మళ్ళీ చెప్పటం మొదలు పెట్టింది.
"రామం....విలాస్ ప్రవర్తన నాకు నచ్చదు. అతడి పద్దతులు నాకు నచ్చవు. కానీ భార్యగా నాకు అతడు చేసిన లోటేమీ లేదు. జీవితంలో నాకు తృప్తి ఉన్నది...ఒక్క నా విషయమే ఆలోచించుకుంటే! కానీ నా భర్త కారణంగా ఒకోసారి ఎన్నో కాపురాలు కూలిపోవచ్చు. ఎందుకంటే నా భర్తకు ఆడవారిని వలలో వేసుకునే తెలివి తేటలున్నాయి. ఒకసారి ఆయన వలలో పడిన స్త్రీ ఆయన్ని వదిలిపెట్టలేదు. స్త్రీని శారీరకంగా సుఖపెట్టడంలో ఆయన ప్రత్యేక సాధన చేశాడు. అదే కదా ఆయన జీవితం! మొత్తం జీవితాన్ని ఆయన స్త్రీతో ముడిపెట్టడం నాకు అసంతృప్తిని కలిగిస్తున్న మాట నిజం. కానీ నాకు ఆయనంటే కోపం లేదు. ఎందుకో తెలుసా? నాకు సంబంధించినంత వరకూ నిజంగా నాకాయన చేసిన లోటంటూ ఏమీ లేదు. నా పనిత్రతను కాపాడుకొనడం తప్ప...ఆయన పనిత్రత గురించి నేను పట్టించుకోను. నా మనస్తత్వం అలాంటిది, ఆయన్ను నేను ప్రేమించలేదు. కానీ అభిమానిస్తున్నాను. ప్రేమ లేకపోవడం వల్లనేమో....ఆయన్ని నాకే కట్టిపడేసుకోవాలన్న యోచన, పట్టుదల నాకు లేవు..."
కోమలి చెబుతున్నది. నేను వింటున్నాను.