డాక్టర్ విలాస్ నాకు స్లయిడ్స్, ఫోటోలు చూపించి మనసును కలుషితం చేశాడా? మనసు కలుషితం కావడానికింత సామాన్య పధకం చాలునా?
అందంలో కోమలి తక్కువది కాదు. ఆమె ముఖం పద్మిని కంటె బాగుంటుంది.
మరి నాకు ఏం జరిగింది?
నేను ఆలోచిస్తూనే అడుగు ముందుకు వేస్తున్నాను. అడుగులు తడబడుతున్నాయి. కానీ ముందుకు వెడుతున్నాయి.
కొద్దిగా భయంకూడా నాలో తలెత్తుతున్నది.
ఇంతవరకూ నేనెప్పుడూ తప్పు చేయలేదు. ఈ రోజు నా మనసు తప్పువైపు పరిగెత్తుతున్నది. రాత్రికి శ్రీమతి విలాస్ ను కలుసుకోవాలనే అనుకున్నాను పద్మినీ యింటికి వచ్చేస్తుందనీ, నాకా అవకాశం లేదనీ తెలియగానే ఇప్పుడే ఇంటికి వచ్చేశాను.
మధ్యాహ్నం వరకూ కూడా నేను ఆగలేకపోయాను.
కారణం....నన్ను కోమలి పిలుస్తుంది. మూడింటికి ఎక్కడో కలుసుకోవాలంటుంది. ఈలోగానే నేను శ్రీమతి విలాస్ ను కలుసుకోవాలి.
నా అడుగులు పడకగది వరకూ ఆగిపోయాయి.
గది గుమ్మానికి అందమైన తెర వ్రేలాడుతున్నది.
తెర తొలగించాను. లోనికి తొంగి చూశాను.
గదిలో ఎవ్వరూ లేరు.
నిరుత్సాహమూ కలిగింది. మనసు తేలిక పడనూ పడింది.
ద్వైదీ భావం!
ఆమె కనబడలేదని నిరుత్సాహం నేనింకా తప్పు చేయలేదన్న సంతృప్తి...
అక్కడ నుంచి ఇల్లంతా తిరిగాను.
ఆమె ఎక్కడా కనబడలేదు. అప్పుడు నాకు కలిగిన నిరుత్సాహమింతా అంతా కాదు-
ఏమయిందామె?
నేను మళ్ళీ పడకగది ముందు ఆగాను. గదిలోనికిందాక తొంగి చూడగానే డ్రెస్సింగ్ టేబుల్ ప్రక్కనబల్ల మీద ఫోటో ఆల్బం కనపడింది.
నా మనసిప్పుడు నా అదుపులో లేదు.
ఆ ఆల్బం మళ్ళీ చూడాలనిపించింది.
ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆ యిల్లు నాదికాదు. ఆ యింట్లో నేను!...
ఇలాంటి పరిస్థితుల్లో నేనిరుక్కుంటాననుకోలేదు.
శరీరమంతా ఏదో టెన్షన్!
గదిలో అడుగుపెట్టాను. డ్రెస్సింగ్ టేబుల్ వైపు నడుస్తూండగా - గదికి ఉన్న అటాచ్ డ్ బాత్ రూంలోంచి సన్నగా నీళ్ళచప్పుడు వినపడింది.
ఉలిక్కిపడ్డాను. మనసు వేడెక్కింది.
శ్రీమతి విలాస్ స్నానం చేస్తున్నదా?
నేనిప్పుడెం చేయాలి? ఆమె కోసం ఎదురు చూడాలా లేక యిక్కడ నుంచి వెళ్ళిపోవాలా?
తనకు తానై ఆమె నన్ను కోరి వచ్చింది. నేనిప్పుడా గదిలోనికి వెళ్ళినా ఆమె అభ్యంతరం పెట్టదు. అభ్యంతరం పెట్టినా నేను హర్షించను లెక్క చేయను.
ఇప్పుడు నేను పూర్తి ఆవేశంలో వున్నాను ప్రపంచాన్నే లెక్కచేసే స్థితిలో లేను!
నేను బాత్రూంవైపు అడుగులు వేశాను.
ఎదురుగా రఘు అతడిప్పుడు నాలుగేళ్ళ కుర్రాడిలా ఉన్నాడు. నా కాళ్ళకు అడ్డుపడి నన్ను ఆపాలని ముందుకు వస్తున్నాడు.
అతడి వెనుకనే గోపీ- నేను డిపార్టుమెంట్లో చూసిన ఆకారమే! వాడు రఘుని పిల్లిపిల్లని ఎత్తినట్లు పైకెత్తి-నాకు దారి యిచ్చాడు.
నేను బాత్రూం వైపు దారి తీశాను.
తలుపు దాకా వెళ్ళగానే నా శరీరంలో వణుకు, మనసులో ఏదో సంకోచం.
తలుపు ఓరవాకిలిగా వేసి వున్నది.
ఆమె యింట్లో తానొక తెనే ఉన్నాననుకుని తలుపు దగ్గరగా వేసుకున్నది, నేనున్నానని తెలిస్తే...
నా సంకోచానికి నాకే నవ్వువచ్చింది.
ఆమె డాక్టర్ విలాస్ భార్య.
రాత్రి నేనొక్కడినీ నా యింట్లో ఉండగా నాకోసం వచ్చిందామె, ఆమె నన్ను చూసి కంగారు పడుతుందా?
నేనిలా వచ్చినందుకు ఆమె ఎంతగానో సంతోషిస్తుంది!
మనసు చిక్కబట్టుకుని తలుపు తీశాను.
ఒక్కక్షణం ఆగాను!
తలుపు తీయగానే ఏమీ కనపడదు ఆ విషయం నాకు తెలుసు. లోపల్నుంచి ఎటువంటి హాహాకారాలూ లేవు.
నా శరీరం ఉత్కంఠతను భరించలేకున్నది!
అందుకే ఇంచుమించు గదిలోనికి దూకాను. లేకుంటే ఆ గదిలో ప్రవేశించడం నా వల్లకాదు.
అప్పుడు....
సంకోచిస్తూనే అటు చూశాను!
మళ్ళీ నిరుత్సాహం....మనసుకూడా తేలికపడింది.
అక్కడ ఎవరూ లేరు కుళాయి సరిగ్గా కట్టలేదు. ఆ చప్పుడు విని నేను భ్రమపడ్డాను. మామూలు పరిస్థితుల్లో అయితే నాకా విషయం తెలిసిపోయేది. కానీఇప్పుడు...భ్రమలకు సులభంగా లోనై పోతున్నాను.
మళ్ళీ వెనక్కు వచ్చాను.
ఆమె ఇంట్లో లేదు మరి ఏమయింది?
ఇంటికి తాళం పెట్టి ఎక్కడికైనా వెళ్ళిందా?
అసలు ఇంటికి రాగానే అటువైపు చూడాల్సింది. చూడలేదు. నా మనసంతా ఇంటిలోపల డ్రాయింగ్ రూం లోని పార్టీషన్ వైపే కేంద్రీకరించి ఉండడంవల్ల ఇంకేమీ చూడలేకపోయాను నేను.