అతని ముఖంలో వస్తున్న మార్పులను గుర్తిస్తూ ఆగాడు నవీన్.
అతనొక భావనా లోకంలోకి వెడుతున్నట్టు గమనించాడు. అదే కావాలి తనకు!
"దేశంలో నానాటికి పెచ్చుపెరిగిపోతున్న అవినీతిని, అక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడిన ఏ ప్రభుత్వమూ అరికట్టలేకపోయింది. దారిద్ర్య రేఖకు దిగువున వున్న నిరుపేదలలో కుప్పతెప్పలుగా ఆకలి చావులు సంభవిస్తున్నా పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదు. ప్రభుత్వం విధానాల మీద ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితులలో వివిధ సమస్యల మీద దేశవ్యాప్తంగా సాయుధ వర్గ పోరాటాలు జరిపి, ఈ ప్రభుత్వాన్ని ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను కూకటి వేళ్ళతో సహా కుళ్ళగించి సమ సమాజాన్ని ఏర్పాటు చేయడం ప్రజలకు శ్రేయస్కరం కాదంటారా?" పిడికిలి బిగించి ఆవేశంగా ఉద్ఘాటించాడు విప్లవకుమార్.
"రైట్ ! నేనూ నీతో ఏకీభవిస్తున్నానే అనుకో! అయితే_బస్సులను తగలబెట్టడం, రైళ్ళను పడగొట్టడం, విమానాలను హైజాక్ చేయడం, ఆస్తులను నష్టపరచడం, ఫ్యాక్టరీలను తగులబెట్టడం, అమాయకులను వధించడం, అధికారులను, నాయకులను కిడ్నాప్ చేయడం_నువ్వు చెప్పే విప్లవానికి మార్గాలంటావా?"
"రక్తపాతం జరక్కుండా ఏ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది? రక్తపాతం జరక్కుండా ఏ సమాజం మార్పు చెందగలిగింది?" ఉద్రేకంగా ప్రశ్నించాడు విప్లవకుమార్.
"అంటే, మార్పు రావాలీ అంటే రక్తపాతం తప్పనిసరి అనే నీ అభిప్రాయం. అందుకు హింసా మార్గమే సరైనదంటావ్...."
"ఈ ప్రశ్ననే నేనూ అడిగితే?"
"అంటే....?"
"నేరస్తునిలో మార్పును కోరుతూనే, అతని నుంచి నిజాన్ని రాబట్టడం కోసం మీరు అవలంబిస్తున్నది హింసా మార్గం కాదా?"
"మరి! మంత్రాలకు చింతకాయలు రాలతాయా?"
"రాలవు. అందుకనే, సామాజిక మార్పుకోసం మేమూ, హింసా మార్గాన్ని ఎంచుకున్నాం"
"వెల్ మిస్టర్ నీకే_వెల్ సెడ్ ! ఈ దేశంలో సుమారు డజను నక్సలైట్ గ్రూపులు వున్నాయి. అంతే సంఖ్యలో శిక్కుల టెర్రరిస్టు ఆర్గనైజేషన్ లు వున్నాయి. అలాగే కాశ్మీర్, ఉల్ఫా, ఎల్.టి.టి.ఇ, మొదలైన ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు వున్నాయి. వ్యక్తిగత ముఠాలు వున్నాయి. వీళ్ళంతా ఎవరికి వారే తాము ప్రజల కోసమే పోరాడుతున్నా మంటున్నారు. ఇలా ప్రతి సమస్య గురించీ సాయుధ పోరాటాలు జరుపుకుంటూ పోతే దేశ సమగ్రత, జాతి సమైక్యత దెబ్బతినవా? చివరకు ఈ దేశం ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించు!" నవీన్ కంఠంలో మార్దవం, అనునయం.
అతనికి మౌనమే శరణ్యమయింది.
అది గమనించి అందుకున్నాడు నవీన్: "యంగ్ బోయ్ ! ముందే చెప్పాను. నిన్ను ఇంటరాగేట్ చేయడానికి రాలేదని! కేవలం మీ ఉద్యమం గురించి, మీ నాయకుని గురించి తెలుసుకోవాలెననుకుంటున్నాను. అంతే! నువ్వు మౌనం వహిస్తే ఎలా!"
"ఆఫీసర్ ! మీరు చాలా తెలివైనవారు! ఇంటరాగేషన్ కాదంటూనే ఇన్ ఫర్ మేషన్ లాగడానికి ప్రయత్నిస్తున్నారు. బట్....యు నో....ఐ యామ్ కమిటెడ్! నా నరనరాన మా విప్లవ సిద్ధాంతాలు జీర్ణించుకుని వున్నాయి. మీరు ఎంత అనునయంగా, మరెంత అభిమానంగా, ఇంకెంత తెలివిగా మట్టాడినా, ఘోరాతిఘోరంగా చిత్రహింసలు పెట్టినా నా నుంచి మీరు ఏ సమాచారాన్ని రాబట్టు కాలేరు. ఇక, మా నాయకుని గురించి అసలే చెప్పను!" స్పష్టీకరించినట్టు నొక్కివక్కాణించాడు విప్లవకుమార్.
అతని స్వరం బలం పుంజుకుంది.
ఖంగుతిన్నాడు నవీన్. కమిటెడ్ ఐడియాలజీ వున్న వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలెనని గుర్తించాడు. ఇది తనకొక గుణపాఠం !
"మిస్టర్ విప్లవకుమార్ ! మీ ఆశయాదర్శాల గురించి నేను తెలుసుకోవడం వలన మీకు నష్టం లేదుగా?" తన ఎత్తుగడను మార్చుకుంటూ యధాలాపంగా అడుగుతూ తన రివాల్వరును తీసి టేబుల్ మీద పెట్టి, సిగరెట్ వెలిగించుకున్నాడు నవీన్.
ఆ ఒక్క క్షణం చాలు విప్లవకుమార్ కు !
టేబుల్ మీద వున్న నవీన్ సర్వీస్ రివాల్వర్ ను ఛట్టుక్కున అందుకున్నాడు.
అనుకోని ఈ హఠాత్ సంఘటనకు సెల్ గేటు ఆవలగా నిలచి చూస్తున్న ఇన్ స్పెక్టరు వెంకటేష్ తో సహా సిబ్బంది అంతా కూడా స్థాణువులయ్యారు.
"ఆఫీసర్ ! స్టే బేక్....అడుగు ముందుకు వేశారో కాల్చిపారేస్తాను, సెల్ గేట్ తెరవమనండి!" ఉద్రేకంగా అరిచాడు విప్లవకుమార్.
"వినయ్ కుమార్ ఎలియాస్ భగత్! నేను నిన్ను నమ్మాను. మానవత్వం వున్న మనిషివనుకున్నాను. ఇలా ప్రవర్తిస్తావనుకోలేదు! చదువుకున్న మూర్ఖుడివి. కమిట్ మెంట్ తో కూడుకున్న నీ జీవితంలో నీ మనసులో ఇంత కల్మషం, ఇంత క్రోధం వున్నాయా?" మనస్థాపం చెందుతున్నట్టు కనిపించాడు నవీన్.