"పూర్ ఆఫీసర్....మా విప్లవ కార్యకలాపాలకు అడుగడుగునా అడ్డుతగిలే పోలీసులే మా ప్రథమ శత్రువులని మీకు తెలియదా?" కుటిలంగా నవ్వాడు విప్లవకుమార్. అతనిలో ఇప్పుడు కొత్త మనిషి నిలిచాడు! అతను ఉగ్రవాది....
పరిస్థితి గమనించిన ఇన్ స్పెక్టరు వెంకటేష్ వెంటనే ఎలర్ట్ అయి తన రివాల్వరును లోనికి గురిపెట్టాడు.
పొజిషన్ కోసం చూస్తున్నాడు ఆతురతగా, ఆందోళనగా....
"ఐ సే....నో....మిస్టర్ ఇన్ స్పెక్టర్ ! ఇతన్ని నేను టాకిల్ చేస్తున్నాను. మీ అవసరం లేదు. ప్లీజ్ డౌన్ యువర్ రివాల్వర్!" అరిచాడు బిగ్గరగా నవీన్.
ఈ లోగానే తన చేతిలోని రివాల్వరును వెంకటేష్ కు గురిపెట్టి షూట్ చేస్తూ ట్రిగ్గర్ నొక్కాడు విప్లవకుమార్ కసిగా, కక్షతో, క్రోధంతో.
అది పేలలేదు. మరల మరల ప్రయత్నించాడు. ఈసారీ అంతే!
తెల్లబోయాడు విప్లవకుమార్. ఖంగారు ఖంగారుగా గదంతా కలయతిరిగాడు. రివాల్వరును గోడకేసి విసిరికొట్టాడు. రెండు చేతులా తల బాదుకున్నాడు.
చిరునవ్వు నవ్వాడు నవీన్. అంతలోనే అతని ముఖం కోపంతో జేవురించింది.
"విప్లవకుమార్! ఆ రివాల్వరులోని బుల్లెట్లు ఇవిగో_నా జేబులో వున్నాయి! నువ్వు సగటు నేరస్తునిగానే ప్రవర్తించావు. హంతకునికీ నీకూ తేడా లేదు....యూ క్రిమినల్...."
"నో....సార్....! మమ్మల్ని క్రిమినల్స్ తో పోల్చకండి. మేము నూతన వ్యవస్థకోసం పోరాడుతున్నాం. ప్రజలకోసం ప్రాణాలనైనా అర్పిస్తాం. ఐ యాం నాట్ ఎటాక్_ఎ_క్రిమినల్....విప్లవం...." అతని మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. పడిపోయాడు.
అతను సైనైడ్ గుళిక మింగి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుసుకున్న నవీన్ కనులు చెమర్చాయి.
తెరచుకునివున్న కె.వి. కనుపాపలను తన వ్రేళ్ళతో మూసివేశాడు.
లాకప్ డెత్....!
సెల్ గేటు తెరచుకుని లోనికి వచ్చి చూశాడు ఇన్ స్పెక్టరు వెంకటేష్.
విప్లవకుమార్ ఛాతిమీద అక్షరాల పచ్చబొట్టు:
"ఎక్కడ పోరాటం వుంటుందో అక్కడ త్యాగం వుంటుంది. మరణం మామూలు సహజ ప్రక్రియ. హృదయంలో ప్రజల అవసరాలు వారి బాధలు పరచుకుని స్పందిస్తుంటాయి. వీటిని గుర్తించినవాడే మనిషి!"
* * * *
కొన్ని సందర్భాలు అంతే. ఒకరు తీసుకున్న నిర్ణయం మరొకరి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈ విషయాన్ని గుర్తించేప్పటికే జరగవలసింది జరిగిపోతుంది.
అపెండిసైటిక్ ఆపరేషన్ కు కేన్సర్ ఆపరేషనుకు తేడావుంది. ఇరవై నాలుగు గంటల లోపు గడువులో ఆపరేషన్ చేయగలిగితే అపెండిసైటిస్ పేషెంటు బ్రతికి బట్టుకట్ట గలుగుతాడు. కేన్సర్ ఆపరేషన్ జరిగిన ఇరవై నాలుగు గంటల తరువాత పేషెంట్ కండిషన్ బాగుంటే ఇక ఖచ్చితంగా అతను ఆ వ్యాధిని జయించినట్టే.
పోలీస్ ఆపరేషన్ జరిగి ఇంకా ఇరవై నాలుగు గంటలైనా గడవలేదు.
గోడకు విసురుగా బంతిని కొడితే అంతే వేగంతో అది వెనక్కు తిరిగి వచ్చినట్టే టెర్రరిస్టుల విషయంలో కూడా జరిగింది.
విప్లవకుమార్ శవం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రి మార్చురీకి వచ్చింది.
అదే క్షణాన నవీన్ ఒక్కగా నొక్క కొడుకు టింకూ శవం కూడా పార్శిల్ లో ఆసుపత్రికి వచ్చింది....
నవీన్ భార్య శైలజ కొడుకు శవం మీదపడి కుళ్ళి కుళ్ళి రోదిస్తున్నది.
బాధను, విషాదాన్ని కడుపులోనే దిగమింగుకుంటున్నాడు నవీన్.
తప్పు ఎక్కడ జరిగిందో అర్ధం కావడం లేదు వెంకటేష్ కు.
వేటగాని గురి తప్పితే, గాండ్రించిన పులి ఆ వేటగానిని మరి బ్రతుకనివ్వదు. అలాగే వేటగానికి గురి కుదిరితే ఆ జంతువు ప్రాణాలతో మిగలదు మరి...
ముక్కు పచ్చలారని పసివాడు ఇప్పుడు చదరంగంలో ఒక పావు అయ్యాడు.
నాటి ఉదయం ఇంటి నుంచి ఆఫీసుకు ఫోన్ వచ్చిన విషయం నవీన్ మరచిపోయినా, వెంకటేష్ కు గుర్తువుంది.
"నా మాట వినండి. నా బిడ్డను నాకు దక్కించండి. పట్టుదలకు పోకండి. మీరు అరెస్టు చేసిన ఆ టెర్రరిస్టును వాళ్ళ డిమాండ్ ప్రకారం విడుదల చేసేయండి...." శైలజ తల్లడిల్లింది, ఆ ఫోన్ లో....
బాధ్యత గల ఒక పోలీస్ అధికారిగా, కన్నబిడ్డ కోసమని టెర్రరిస్టులకు తలవంచ లేదు నవీన్.
ఫలితం టింకూ మరణం....
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం....
కన్నీటిని తుడుచుకున్నాడు వెంకటేష్.
ఎవరూ క్లైమ్ చేయని టెర్రరిస్టు మృతదేహాన్ని మునిసిపాలిటీ వాళ్ళు దహనం చేశారు.


