Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 36


    "జంటిల్ మన్! నేను ముందే చెప్పాను_నిన్ను ఇంటరాగేట్ చేయడానికి రాలేదని. కేవలం అకడమిక్ ఇంటరెస్ట్ తో అడుగుతున్నాను!"

    అతను నవీన్ కళ్ళలోకి చూశాడు. అవి ప్రశాంతంగా వున్నాయి. ప్రేమ, వాత్సల్యం, పెద్దరికం వాటిలో కనుపిస్తున్నాయి.

    ఆ కళ్ళలో ఏదో మెస్మరిజం వున్నది!

    తన గురించి, తన మంచి_చెడుల గురించి అడిగి తెలుసుకునే వ్యక్తి ఒకరు ఈ సమాజంలో వున్నారనే తలంపు అతనిని కదలించింది.

    కదిలాడు. పెదవి విప్పాడు.   

    "నా సబ్జక్టు జువాలజి. గ్రామీణ వాతావరణంలో వుంటూ రిసెర్చ్ చేశాను. పట్టణాలకంటే గ్రామాలే నన్ను బాగా ఆకర్షించాయి. అందుకనే గ్రామీణ వాతావరణంలో జీవించాలని నిర్ణయించుకున్నాను. ఉపాధికోసం పక్షులను పెంచి అమ్ముకుని బతుకుతున్నాను...." నిదానంగా చెప్పడం ప్రారంభించాడతను.

    "ఏ పక్షులను పెంచుతున్నావ్?" ఆసక్తిగా కనబరుస్తున్నట్టు అడిగాడు నవీన్.

    "ఒకటనేమిటి_పిచ్చుక నుంచి డేగ వరకు, చిలుక నుంచి గోరింక వరకు. అవసరాన్నిబట్టి అడవి పక్షులను కూడా పట్టి తెచ్చి అమ్ముతుంటాను."

    "ప్రస్తుతం నీ దగ్గర పావురాళ్ళు వున్నాయా?" అతని ముఖ కవళికలను ఓర కంట కనిపెడుతూ అడిగాడు నవీన్.

    అసలు కథలోకి అడుగుపెట్టాడు.

    అతను మౌనం వహించాడు.

    ఆలోచిస్తున్నాడు: 'ఏమిటి ఈయన ఉద్దేశం....?"

    "గుర్తు లేకుంటే, సరే! పక్షులను మచ్చిక చేసుకుంటే, వాటిని అవసరాలకు ఉపయోగించు కోవచ్చు. కదూ?" అతని నొసట చెమటను చూస్తూ అడిగాడు నవీన్.

    అతను అయోమయంగా చూస్తున్నాడు.

    తనేదో వ్యూహంలో చిక్కుకుంటున్నట్టు తోస్తున్నది.

    "ఉదాహరణకు_నా వద్ద మైనా పక్షి ఒకటి వుంది. నిజానికి మనిషికి వున్న తెలివితేటలన్నీ దానికి వున్నాయా అనిపిస్తుంది. కంప్యూటరులోకి మనం వేటిని పంపితే వాటినే తిరిగి మనకు అవసరం అయినపుడు అది ఫీడ్ చేస్తుంది. అలాగే మైనాకూడ. మనం నేర్పిన విషయాలను గుర్తు పెట్టుకుని, మన అవసరాన్ని గుర్తించి అది తెలివిగా ప్రవర్తిస్తుంది, మనకు కావలసిన సమాచారాన్ని సమయానికి అందిస్తుంది. సరిగ్గా నీ గురించిన సమాచారాన్ని కూడా చాలా వరకు మైనాయే తెచ్చింది. లేకుంటే ఎక్కడో మారుమూల పల్లెలో వున్న నీ దగ్గరకు మేం ఎలా రాగలిగామనుకున్నావ్ !"

    అతని ముఖం పేలవమయింది. పాలిపోతున్నది.

    "అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం మనం పావురాళ్ళను కేవలం ఆకర్షణ కోసమో లేక కాలక్షేపం కోసమో మాత్రమే పెంచడంలేదు. పోటీలకోసం పెంచుతున్నాం. అలాగే ఒక ప్రాంతంనుంచి మరొక ప్రాంతానికి ఉత్తరాలు వంటి వాటిని బట్వాడా చేయడానికి కూడా ఉపయోగించుకుంటున్నాం. అవునా?"

    జవాబు కోసం అతని కళ్ళలోకి చూశాడు నవీన్.

    "కాని, నా దగ్గర వున్న పావురాలు...." అతను ఏదో చెప్పడానికి అమాయకంగా ప్రయత్నిస్తున్నాడు.

    తను డిఫెన్స్ లోకి పడిపోతున్నట్టు గుర్తించాడు.

    "పెంపుడు పావురాలు కాదు; అడవి పావురాలు, గుడి పావురాలు కోసుకు కూరొండుకు తినడానికి అవి పనికివస్తాయి అంటావు. అవునా?" నవీన్ సూటిగా చూస్తూ ఘాటుగా ప్రశ్నించాడు.

    మాటలో వ్యంగ్యం ధ్వనించింది.

    అతను బిక్క చచ్చి బిత్తర పోయాడు.

    గుండె కదలిక వేగం హెచ్చుతున్నది.

    "మిస్టర్ విప్లవకుమార్ ! అతితెలివి పోకు! నీ ఎదుట నిలచి అడుగుతున్నది ఇంటరాగేషన్ లో ఓనమాలు తెలియని పోలీస్ ఆఫీసరనుకోకు ! ఈపాటికే నీ గురించి చాలా హోమ్ వర్క్ చేశాను! నువ్వు నీ పావురాన్ని ఉపయోగించి మా వాళ్ళ ఫోటో నెగిటివ్ లను తెలివిగా సంపాదించి మీ నాయకునికి అందించావు! అంటే నువ్వు కమాండరుకు కొరియరుగా పనిచేస్తున్నావన్నమాట. అవునా కాదా? నాకు కావలసింది నీ నోటి నుంచి వినవచ్చే నిజం !"

    నవీన్ కళ్ళలో ఎర్రజీర ఏర్పడింది. ఇప్పుడు అతను ఇందాకటి నవీన్ కాదు, బాధ్యతాయుతమైన ఇన్ వెస్ట్ గేషన్ ఆఫీసరు.

    గొంతులో కూడా మార్పు....

    "సారీ సార్....అన్నీ తెలుసుకున్నారుగా_ఇక అంతకుమించిన సమాచారం నా దగ్గర ఏమీ లేదు!" నిట్టూరిస్తూ చెప్పాడు.

    మరొక కొత్త ఇంటరాగేషన్ ను ఎదుర్కొనే స్థితిలో తాను లేనట్టు అతను తేలిపోయాడు....

    "ఏఁవి టేఁవిటీ ! నీ దగ్గర ఇక సమాచారమే లేదా అసలు ! నువ్వు ఈ టెర్రరిస్టిక్ ఉద్యమంలోకి ఎందుకు చేరావని, ఎలా చేరావనీ అడగడం లేదే నిన్ను! కేవలం సిద్ధాంత చర్చకోసం అడుగుతున్నాను. నేనూ కాస్తో కూస్తో చరిత్ర, రాజనీతి, అర్ధ, సామాజిక శాస్త్రాలను చదువుకున్నాను. మార్క్సిజాన్ని లెనినిజాన్ని కూడా కొద్దో గొప్పో అధ్యయనం చేశాను. కాని, ఏ సిద్ధాంత శాస్త్రంలో కూడా సంఘంలో అరాచకాలను సృష్టించి, అమాయక ప్రజల ప్రాణాలను బలిగొని, ప్రభుత్వం ఆస్తిపాస్తులను ధ్వంసం చేయడం ద్వారా విప్లవాన్ని సాంధించవచ్చునని రాసిలేదే! 'Anarchism and Tettorism Would not lead to revolution' అని కదా లెనిన్ మహాశయుని ఉవాచ! మరి! ఈ విషయమై సిద్ధాంతరీత్యా నన్ను కాస్త ఎడ్యుకేట్ చేస్తావా? లేక, నీ సొంత మార్క్సిజం ఏమిటో సెలవిస్తావా?"

 Previous Page Next Page