సుమారు 45 ఏళ్ళుంటాయి సుబ్బుకి. అందరిలోకీ పెద్దవాడు. దూరాలోచన ఎక్కువ అతనికి.
"చివరి నిమిషంలో ఏమైనా అనుకోని ప్రమాదం ఎదురయితే ఏం జరుగుతుందో చెప్పలేము కానీ....లేకపోతే మాత్రం హత్య ఖచ్చితంగా జరిగితీరుతుంది. ప్లాన్ చాలా పకడ్భందీగా వుంది. వాళ్ళు చాలా అనుభవమున్న వాళ్ళు. అందువలన వాళ్ళ తూటా గురితప్పటం కూడా అసంభవము" నమ్మకంగా అన్నాడు సెబాస్టియన్.
"వాళ్ళ అనుభవాన్ని, ప్లానింగుని తప్పుపట్టటం లేదు నేను. చివరి నిమిషంలో ఎదురయ్యే అనుకోని అవాంతరాల గురించి కూడా మాట్లాడటం లేదు. అసలు వాళ్ళు ఆమెను హత్య ఎందుకు చెయ్యాలి? వాళ్ళకి శతృత్వం వున్నది హోం మినిస్టరో, డి.జి.పి.తో. అందువలన వాళ్ళిద్దర్నీ ముందుగా చంపి ఆ తర్వాతే ఆమెను చంపుతారు. ఇది నా అనుభవంతో చెప్పగలను. కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తీ వుండగా హోం మినిస్టర్నో డి జి పి నో కాల్చిన తర్వాత సంజును కూడా చంపేటంత సమయం, అవకాశం వుంటాయా? ఏమో! నువ్వయితే వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నావు కానీ నాకయితే మాత్రం ఏ మాత్రం నమ్మకం లేదు. మరోసారి మీ పధకము గురించి పునరాలోచించటం మంచిది. మన ప్రయత్నం మనం చేయటం యింకా మంచిది" ఖచ్చితంగా అనేసి లోపలికి వెళ్ళిపోయాడు సుబ్బు.
అదిరిపడ్డారు అతని మాటలకందరూ.
నోట్లో పెట్టుకున్న ఆమ్లెట్ గొంతుకి అడ్డంగా పడినట్లయి ఉక్కిరి బిక్కిరి అయ్యాడు సెబాస్టియన్.
తొలిసారిగా కొత్త కోణంలో నుంచి ఈ విషయాన్ని చూడసాగాడతను.
'సుబ్బు అనేటంతవరకూ ఈ అనుమానమే లేదు. రాలేదు కూడా. కొన్ని విషయాల్లో అతనికి వున్న ఆలోచన తనకి లేదు' అనుకున్నారు.
ఆ మాట అని సుబ్బు వెళ్ళిపోయాక అందరిలోనూ ఆలోచన ప్రారంభమైంది.
నిజమే....హోం మినిస్టర్ని, డి.జి.పి.ని కాల్చిన తర్వాతనే సంజుని చంపుతారు వాళ్ళు.
ముందుగా వాళ్ళ సమస్య చూసుకున్నాకనే ఇతరుల సమస్యల గురించి చూస్తారు ఎవరయినా కూడా.
ఈ మర్డర్ జరగకపోతే....
తనని గుడ్డిగా నమ్మి ఈ పనిని తనకి అప్పగించిన బాస్ పరిస్థితి ఏమవుతుంది? తన మాటకి విలువేముంటుంది?
టెర్రరిస్ట్ గ్యాంగ్ ని కాంటాక్ట్ చెయ్యటం పొరపాటా?
ఉపేంద్ర నమ్మకంగా చెప్పాడు ఆమెను చంపుతానని. నర్సింగ్ కూడా అన్నాడు. ఇప్పటికి దాదాపు నాలుగు లక్షల వరకూ వాళ్ళకి డబ్బు రూపంగా యిచ్చాడు. వాళ్ళు ఆమెను కూడా చంపటానికి సిద్ధపడి వుండవచ్చు. కానీ ముగ్గుర్నీ చంపేటంత టైమ్ అక్కడ వుంటుందా?
ఖచ్చితంగా వుండదు.
ఆమెను చంపడానికి మరో ప్రయత్నం మొదలుపెట్టాలా?
ఈ క్షణంలో ఈ ఆలోచనతో పని మొదలుపెడితే సాధ్యమా?
స్టేజి మీద ఆమెను హత్య చెయ్యాలంటే ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడితేనె అది సాధ్యం. కానీ ప్రాణత్యాగం చేసేంతటి సాహసవంతులు తన దగ్గర లేరు.
ఒకవేళ ఆమె చావని పరిస్థితి వస్తే ఆమె క్యాంపస్ దాటేలోపుగా ఆమెను చంపేందుకు తనూ సిద్ధపడాలి.
అందులో ఎంత రిస్క్ వున్నా సరే ఆ పనిని తనే చెయ్యాలనుకున్నాడు.
ఇప్పుడు పథకం మార్చాలి.
కేవలం వాళ్ళని నమ్మి తను చేతులు కట్టుకుని కూర్చోవడానికి వీలులేదు. తన దగ్గర వున్న మనుషుల్లో తను చెప్పిన పనిని ఖచ్చితంగా చేయగలిగిన వాళ్ళెవరు?
కణ్ణన్ నమ్మకస్తుడు.
ఇప్పుడు బొంబాయిలో వున్న మక్బూల్ కూడా పెర్ ఫెక్ట్ షూటర్. అంతేకాదు. చెప్పిన పనిని ఖచ్చితంగా చెయ్యటానికి చివరి క్షణంవరకూ ప్రయత్నించే వ్యక్తి. కానీ లైఫ్ రిస్క్ వుంటే మాత్రం ఆ పనిని చెయ్యడు. పెద్ద మొత్తంలో డబ్బు ఆశచూపి అతనిని ఈ పనికి సిద్ధం చెయ్యాలి.
మక్బూల్, కణ్ణన్, తను కలిసి ఓ పథకం వెయ్యాలి. అందుకు అర్జెంటుగా మక్సూల్ ను బొంబాయి నుంచి పిలిపించాలి.
ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం టెలిఫోన్ వైపు నడిచాడు సెబాస్టియన్.
* * * * *
డిశంబర్ : 20.
"తలుపు వేసుకోండమ్మా. నేను వెళుతున్నాను."
బయటి నుంచి కేకపెట్టి వెళ్ళిపోయింది పనిమనిషి.
పొంగుతున్న పాలగిన్నె స్టౌ మీద నుంచి క్రిందికి దింపి గ్యాస్ ఆఫ్ చేసి బయటి గదిలోకి వచ్చి డోరు క్లోజ్ చేసింది అర్చన.
హాల్లోకి తిరిగొచ్చి ఈజీ చైర్లో కూర్చుని వాల్ క్లాక్ వైపు చూసింది.
సమయం నాలుగు అవుతుంది.
బయట ఎండ తీక్షణత కూడా తగ్గుతుంది.
టైము గడవటం చాలా కష్టంగా వుంది.
ఇప్పటికి అయిదు రోజులుగా ఆమె ఒంటరి జీవితం గడుపుతోంది. ఒంటరితనం ఆమెకు దుర్భరంగా అనిపిస్తోంది.
ఒక గంట గడిస్తే రోజు గడిచినంత బోరుగా వుంటోంది.
చంద్రకాంత్ నల్లమలై ఫారెస్ట్ వెళ్ళాడు.
ఆంధ్రప్రదేశ్ లో అడవుల మీద డాక్యుమెంటరీ ఫిలిం ఒకటి తీయటానికి అతనికి అవకాశం వచ్చింది.
దాదాపు పది లక్షల రూపాయల ప్రాజెక్ట్ అది.
ఖర్చులన్నీ పోను కనీసం మూడు లక్షలయినా మిగులుతాయని అతని అంచనా.
రెండు నెలల్లోగా మొత్తమంతా వీడియో షూట్ చేసి యివ్వాలి. అందులో మొదటి భాగంగా నల్లమలై అడవులకు వెళ్ళాడు.
చంద్రకాంత్ తో తన పెళ్ళి జరిగిన తొమ్మిదో రోజున వచ్చింది ఆ ఆఫర్. ఎగిరి గంతేశాడతను. పట్టలేని ఆనందంతో ఆమెను ముద్దులతో ముంచేశాడు.
ఇంత పెద్ద అసైన్ మెంట్ రావటం అతనికి మొదటిసారి.
"నీతో పెళ్ళయిన వేళావిశేషం అర్చనా! ఎంత పెద్ద వర్క్ వచ్చిందో చూశావా! ఇంక నాకు తిరుగులేదు. నా అదృష్టానికి నీ అదృష్టం కూడా తోడయ్యింది .ఇంక తిరిగి చూసుకోనవసరం లేదు. ఈ వర్క్ పూర్తవగానే ఒక కారు కొంటాను. ఎలా వుంది నా ఆలోచన?" అన్నాడు.
"నీ యిష్టం" అందామె.
"మనకి ఫ్రిజ్ వుంది. టి.వి, వి.సి.ఆర్, ఇటువంటి అవసరాలు వున్నాయి. స్కూటరు వుంది కానీ కారు లేదు. కాబట్టి కారు కొనితీరాలి. అదీ నా కోసం కాదు. నీ కోసం....ఏనాడూ కార్లో తప్ప తిరగని దానిని యీ రోజు ఇలా నా స్కూటర్ మీద నిన్ను కూర్చోపెట్టి తిప్పాలంతే సిగ్గుగా, బాధగా, ఇన్సల్ టింగ్ గా కూడా వుంది...." అన్నాడు.
"నువ్వు కార్లో తిప్పాలని నేను ఏనాడూ కోరుకోలేదు చంద్రకాంత్...."
"నువ్వు అనుకోలేదు. బట్....నాకా కోరిక వుంది. నా తల్లి దండ్రులు, నీ తల్లిదండ్రులంత డబ్బున్న వాళ్ళు కాదు అందుకే వాళ్ళ తాహతుకి యీ ఇల్లు యిచ్చారు. మీ అమ్మా నాన్నలు మన పెళ్ళికి యిష్టపడి వుంటే పరిస్థితి మరో విధంగా వుండేది. నీతోపాటు నీ కారు కూడా తెచ్చుకునేదానివి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందువల్ల మన కష్టం మనమే పడాలి. మనకి కావలసినవి మనమే కొనుక్కోవాలి. మన భవిష్యత్ కి మనమే పునాది వేసుకోవాలి. మనకెవ్వరి సహాయమూ వద్దు. భగవంతుడు మనకి మంచి అవకాశాలు యిస్తున్నాడు. వాటిని సద్వినియోగం చేసుకుందాం" అన్నాడు.
ఎవరి మీదా ఆధారపడకుండా స్వంతంగా సంపాదించుకోవాలన్న అతని ఆలోచన ఆమెకు చాలా నచ్చింది. అతని వ్యక్తిత్వాన్ని అభిమానించింది.
"కేవలం వారం రోజులే అర్చనా....! ఈ వారం రోజులు నువ్వు ఏదో ఒక విధంగా టైము గడిపెయ్. ఈ లోపు నల్లమలై ఫారెస్ట్ షూటింగ్ పూర్తి చేసేసి తిరిగి వస్తాను" అన్నాడు.
అయిష్టంగానే తల వూపిందామె.
"నీకు టి.వి. వుంది, విసిఆర్ వుంది, ఇదిగో బుక్స్ వున్నాయి. వీటితో కాలం గడుపు. వర్క్ పూర్తవగానే రెక్కలు కట్టుకొని వాలతాను" బయలుదేరుతూ అన్నాడు.
ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఆమెకు. అయితే అవి అతనికి కనపడకుండా జాగ్రత్తపడింది.
అతను చెప్పిన మాట ప్రకారం ఎల్లుండికి తిరిగి రావాలి.
అంటే ఇంకా నలభై ఎనిమిది గంటలు గడవాలి.
అప్పటికి చంద్రకాంత్ ని పెళ్ళిచేసుకుని దాదాపు రెండు నెలలు అవుతోంది. మొదటి పదిరోజులు దాదాపుగా ఇంట్లోనే ఆమెను అంటిపెట్టుకునే వున్నాడు. ఆ ఫారెస్ట్ వీడియోగ్రఫీ ఆఫర్ వచ్చింది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ చేసుకోవటానికి అతనికి దాదాపు నెలా పదిహేను రోజులు పట్టింది. మధ్యలో అతను ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళాడు. "మన పెళ్ళి విషయం మా అమ్మా నాన్నలతో చెప్పి వస్తాను. ఆ తరువాత మనం ఇద్దరమూ కలిసి మా ఊరు వెళదాం" అన్నాడు. "మా అమ్మా నాన్న యీ పెళ్ళికి పెద్దగా అడ్డుపెట్టకపోవచ్చు" అన్నాడు.
అదే విధంగా ఒకరోజు పొద్దున్నే బయలుదేరి రాత్రికి తిరిగి వచ్చాడు.
జరిగినదేమిటంటే....
చంద్రకాంత్ తల్లి ఈ పెళ్ళి చేసుకున్నందుకు నానా శాపనార్ధాలు పెట్టిందట! తండ్రి అతడిని చూడటానికే యిష్టపడలేదట! ఆ సంఘటన జరిగిన తరువాత దాదాపు రెండు రోజులపాటు డల్ గానే వున్నాడు చంద్రకాంత్.