Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 36


     చిన్నప్పుడు  అతడికి కలలేవో పడుతున్నాయని విన్నప్పుడు తమ చేతుల్లో హత్యకు గురైన జయసూర్య దెయ్యం పట్టిందేమో అనుకొన్నాడు.

     కాని, అవి గతజన్మ జ్ఞాపకాలని, అవి కలల రూపంలో వచ్చి వేధించేవని విని ఆశ్చర్యపోయాడు.

    జన్మ జన్మల జ్ఞాపకాలు వెంటాడితే ఆ మనిషి ప్రవర్తన ఎలా వుంటుంది?

    తండ్రి మనసులో ఆలోచన తెలిసిందో, కాకతాళీయమోగాని సరిగ్గా అదే విషయం స్వామితో ప్రస్తావిస్తున్నాడు శ్రీచక్ర.

     "కొండరాజు తిమ్మడు మహామంత్రవేత్త. జయసూర్య ఉపాసకుడు. కాని ఏం జరిగింది?  ఇహలోక బంధాలలో ఇమడలేక విషాదాంతమయ్యాయి వాళ్ళ జీవితాలు. ఆ జ్ఞాపకాలలో తిరుగాడుతున్నంత వరకు ఆ అశాంతి, ఆ సంఘర్షణ నన్ను వెన్నంటి  వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఆ స్మృతులనుండి బయటపడి నేను మామూలు మనిషిగా, శ్రీచక్రగా జీవించాలి!  జన్మ పరం పరగా వచ్చిన ఆ సూపర్ పవర్ ను విస్మృతిపథంలోకి నెట్టివేస్తే  తప్ప.....నేను మామూలు మనిషిగా జీవించలేనేమో అనిపిస్తోంది స్వామీ!"

    "అలాంటప్పుడు నువ్వు గతజన్మలో జయసూర్యవని ఎందుకు ప్రకటించుకొన్నావు? నాతో భైరవుని కొండకు వచ్చి గుప్తనిధిని ఎందుకు బయటికి తీశావు? ఇదంతా దేనికి చేశావు...? విస్మయం ప్రకటించాడు స్వామి.

     "నాలో అల-జడి రేపే పూర్వజన్మ జ్ఞాపకాలను కౌస్తుభతో పంచుకోవాలనిపించింది. ఆ జ్ఞాపకాలను ఒక  కథగా మలిచి, ఉత్తరాల రూపంలో ఆమెకందించి నా హృదయభారం కొంత తీర్చుకున్నాను.  బైరవ కొండలోని గుప్తనిధిని నువ్వు తీయబోతున్నావని తెలిసి,  ఆ పని మీ శక్తికి మించినదని, నువ్వా ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటావనిపించి, గతజన్మలో నీతో నాకున్న భాతృ సంబంధాన్ని పురస్కరించుకొని నీతో వచ్చాను.

     హత్యానేరం నీమీద పడకూడదన్న ఉద్దేశ్యంతో , అసలు హంతకులకు శిక్ష  పడాలన్న  ఉద్దేశ్యంతో ఎస్పీ రవికుమార్ ముందు నేను జయసూర్యనని నిరూపించుకోవాల్సి వచ్చింది. అంతేగాని నాకున్న అధ్బుత శక్తులు ప్రదర్శించాలని కాదు. ఈ ప్రజలముందు సూపర్ మేన్ గా నిలబడాలన్న  కోరిక నాకు లేదు!"

    "సాధకులందరికీ అణిమాది అష్టసిద్దులు లభ్యంకావు శ్రీచక్రా..... గురుదేవుల అపారమైన కృప నీయందుండడంవల్ల  అణిమాది అష్టసిద్దులు నీకై వశమయ్యాయి.  పంచభూతాలనే శాసించగల స్థాయికి చేరుకున్నావు. ఏమానస సరోవరంలోనో రాజహంసలా తిరుగులాడాల్సిన నువ్వు..... బురదలో బాతులా ఈదుతానంటావేమిటి?"

    "మానస సరోవరం! సరిగ్గా గుర్తుచేశావు స్వామీ! తిమ్మడి శేషజీవితము గడిచింది అక్కడే! అణిమాది అష్టసిద్దులనే అష్టదళాన్ని అధిగమించి సహస్రదళాన్ని చేరుకోడానికి పయనమైన యోగి అతడు.  ఆ వాసన, ఆ స్మృతులు వెన్నంటి వచ్చిన నేను ఎక్కువ రోజులు ఈ సంసారచక్రంలో ఇమడలేనేమో అనిపిస్తుంది. కౌస్తుభ కోసం అంత తపనపడిన నేను.... జీవితం చివరిదాకా కలిసి నడవలేని పరిస్థితి ఎదురయితే...."

    "నాన్నా, కన్నా! నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా కన్న వాళ్ల గుండెలు బద్దలైపోతాయిరా! ఇంకెప్పుడూ ఆ తిమ్మడినిగాని, జయసూర్యనిగాని గుర్తుచేసుకోవద్దు. మా శ్రీచక్రగానే వుండరా. నీకే సూపర్ పవర్ వద్దు - మంత్రసిద్దులూ వద్దు...." మారుతీరావు కొడుకుని వాటేసుకొని రుద్దంగా అన్నాడు.

     కానీ, స్వామికి తెలుసు.....

     ఒకసారి జ్ఞాననేత్రం తెరుచుకుంటే మళ్లీ మూయడం అసాధ్యం అని!


            *    *    *    *    *

       
    జయసూర్య హత్యకేసులో మునిరాజుకు యావజ్దీవ జైలుశిక్షపడితే - మారుతీరావు, భాషా, మిగతా యిద్దరు ఆరునెలల జైలుశిక్షతో బయటపడ్డారు.

     ఆరునెలల జైలుశిక్ష మారుతీరావులో చాలా మార్పు తీసుకువచ్చింది. అంతస్తు గర్వం, ఐశ్వర్యమదం అతడిని వదిలిపోయి ఒకవిధమైన వైరాగ్యము ఆవరించింది.

    కౌస్తుభను కొడుకు చేసుకోడానికి అడ్డు చెప్పలేదు.

    మధ్యతరగతి అయితేనేం? చదువుకున్నదీ, మర్యాదస్తుల ఇంటిపిల్ల, అది చాలు అనుకున్నాడు. అదే హత్యానేరంలో చిక్కుకోక ముందయితే అతడి ప్రవర్తన వేరుగా వుండేదేమో!

    ఇప్పుడు మాత్రం పడగ  చితికిన పాములా వున్నాడు.

     భార్యా, కొడుకూ ఏం చెప్పినా తలూగించేస్తున్నాడు.
 

                *    *    *    *    *   

   
    అదేరోజు సాయంత్రం ఒకటే హడావుడి యోగానందం ఇంట్లో!

    పద్మావతి తనకాబోయే కోడల్ని చూడాలని అందట.

    ఈరోజు సాయంకాలం అమ్మనీ, నాన్ననీ తీసుకువస్తున్నానని చెప్పాడు శ్రీచక్ర.

     అందుకే హడావుడి. చిన్నసైజు పెళ్లిసందడిలా వుంది ఇళ్లు. స్వీట్లూ హాట్లూ, పళ్ళూ అన్నీ రెడీ చేసి పెట్టారు.

     కౌస్తుభ మామూలు చీర కట్టుకుని సింపుల్ గా వుంటానంటే అనసూయ అస్సలు ఒప్పుకోలేదు. తనే చక్కగా దువ్వి జడ వేసింది. తన పెళ్లినాటి బెనారస్ చీర కట్టింది. తలనిండా పువ్వులు తురిమింది. కౌస్తుభ తనను చూసుకుంటూ అంది -
     "అబ్బా.....! అమ్మోరిలా తయారుచేశావు అత్తయ్యా! తల్లో గడ్డి మోపులా ఇన్నిపూలా? ఒక గులాబీపువ్వు తురుముకుంటే సింపుల్ గా వుంటుంది. వాయిల్ చీర కట్టుకొంటే ప్రాణానికి హాయిగా వుండేది!"

    "జీవితంలో అపురూపంగా  గుర్తుపెట్టుకోవాల్సినవి  కొన్ని వుంటాయి మణీ! వాటిలో పెళ్లిచూపులొకటి!"

    "ఆగాగు.... అత్తా! ఇవి పెళ్లిచూపులంటే నేనొప్పుకోను. ఆయన నన్నెప్పుడో చూడటం అయిపోయింది.  వరించడమూ అయిపోయింది. ఇది కేవలం లాంఛనానికే! అదీ వాళ్లమ్మగారి కోసం!"

    "ఎక్కడో రోడ్డు మీద చూడడాలు, వరించడాలు అవి లెక్కకాదు. ఈరోజు చూడటమే లెక్క. ఇవే నీకు పెళ్లిచూపులు. అతివకు అలంకరణే అందం. ఈరోజు నేను ఏం చేసినా ఎదురు చెప్పకూడదు. అమ్మోరిలా కాదు,. గంగిరెద్దులా తయారుచేసినాసరే!"

    "చిత్తం ...అత్తమ్మగారూ!"   

    "అదీ అలా వుండాలి" ప్రేమగా ఒక మొట్టికాయ వేసింది కోడలి నెత్తిమీద.

     అనుకొన్న టైంకి తల్లిదండ్రులతో వచ్చేశాడు శ్రీచక్ర.

 కౌస్తుభను చూసి ముగ్దురాలయిపోయింది పద్మావతి. శ్రీచక్ర ప్రక్కన నిలబెట్టి మళ్లీ మల్లీ చూసింది. "చక్కని సరిజోడీ. నా కోడలిగా ఎలాంటి పిల్ల రావాలనుకున్నానో అలాంటి పిల్లనే వరించాడు. మీరూ సెలెక్ట్ చేశారు కదా ఒక కోతిని" పనిలో పనిగా భర్తను ఎత్తిపొడిచింది.

     "వట్టి కోతి కాదు, డబ్బున్న కోతి."

    "ఇంకా మీకు డబ్బు పిచ్చి వదల్లేదా?" పద్మావతి కోపంగా చూసింది ఆయన్ని.

     "ఎప్పుడో వదిలిపోయింది. కనుకే ఈ ఇంటిపిల్లను కోడలిగా చేసుకోడానికి సంతోషంగా వచ్చాను."

    "ఈ ఇంటికేమైంది? చిన్నగా, పొందిగ్గా వున్న ఇల్లు. ఒకరిపట్ల ఒకరికి వున్న ప్రేమాభిమానాలు. ఎక్కడా భేషజం లేదు. కపటంలేదు. స్వచ్చమైన మనసులు. నిర్మలమైన ప్రవర్తన. ఇంతకంటే చూడాల్సిందేముంది వియ్యమందేచోట?"

    "మీది మంచి మనసు. మీకంతా మంచిగా కనిపిస్తుంది. అమ్మా" అన్నాడు యోగానందం పద్మావతి మాటలకు పులకించిపోయి.

     "రేపొకసారి కౌస్తుభనీ, మీ పిల్లలనీ తీసుకొని మా ఇంటికి రండి." యోగానందానికి చెప్పిన పద్మావతి "ఏమ్మా కౌస్తుభా వస్తవా?" అని అడిగింది.

     "కూతురినై రానా? కోడలినై రానా?" నవ్వుతూ అడిగింది కౌస్తుభ.

    "అదేమిటమ్మా అలా అంటావు? నా కొడుకు వరించిన పిల్ల మా ఇంటి కోడలవుతుందిగాని కూతురెలా అవుతుంది?" పద్మావతి నొచ్చుకుంది.

    "మా మణి ఈ రోజు పత్రికలో వచ్చిన ఒక వార్త చదివి తమాషాకి అలా అంటూందిలే, అక్కయ్యా" చెప్పింది అనసూయ.

     "వార్తా! ఏమిటది?"

    "వారాసిగూడా ఏరియాలో, అర్దరాత్రి పన్నెండు గంటలప్పుడు ఒక కులాసారాయుడు సెకెండ్ షో సినిమా చూసి వస్తున్నాడట. దారిలో కిళ్లీబడ్డీ దగ్గర ఆగి సిగరెట్ పాకెట్ ఒకటి కొనుక్కుని, అందులోంచి సిగరెట్ తీసి అంటించుకొని తాగుతూ తాపీగా ఇంటికి వస్తున్నాడట. అంతగా జన సంచారం లేని ఆ సమయంలో ఒంటినిండా నగలు సింగారించుకొన్న ఒక స్త్రీ ఎదురయిందట. అథడు కన్నుకొట్టి 'ఇంటికి వస్తావా?' అని అడిగాడట.  ఆమె కూతురినై రానా? కోడలినై రానా?  అని అడిగిందట.  'కన్ను కన్ను కలిశాక కోడలి వరుస అవుతుందేమోగాని కూతురు వరుస ఎలా అవుతుంది?' అన్నాట్ట ఆయన.  ఆమె 'వస్తున్నా పద, మామా' అంటూ వెంట మురుస్తూ, హుషారుగా ఈలపాట పాడుకొంటూ తలుపు మూస్తుంటే వీపు మీద ఒక్క చరుపు చరిచిందట. పిడగుపాటులా తాకిన ఆ దెబ్బకి అతడి కళ్లు మూతలు పడుతుంటే ఆమె మాటలు వినిపించాయట. 'నేను ధనశక్తినిరా! నా దెబ్బపడ్డాక ఎవరూ బ్రతకకూడదు. కాని నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. ఎందుకో తెలుసా? ఈ సంఘటన అందరికీ చెప్పాలని' అని చెప్పి మాయమైపోయిందట. అతడిప్పుడు హాస్పిటల్లో కోలుకొంటూ పత్రికలవాళ్లనీ, పోలీసులనీ పిలిచి ఇలా జరిగిందని చెప్పాడట."

    "ఇలాంటివన్నీ నీలివార్తలు. ఆ మధ్య ఇలాంటి వార్తే ఒకటి ప్రచారమైంది తెలుసా? కొన్ని ఇళ్ల తలుపుమీద 'ఓ స్త్రీ రేపురా!" అని వ్రాసేవాళ్లు. అదీ ఇలాంటి కథే. అర్దరాత్రివేళ  ఓ స్త్రీ  తలుపు తట్టేదట. ఎవరో పిలుస్తున్నారు కదాని తలుపు తెరిస్తే ఇహ ఇంతే సంగతులు. 'ఓ స్త్రీ రేపురా' అని వ్రాస్తే, ఆ స్త్రీ ఆ ఇంటి తలుపు తట్టదని ప్రచారమైంది ఆ మధ్య' అంది పద్మావతి. 

 Previous Page Next Page