అతని గుండెల్లో కంగారు మొదలైంది.
"నో...నాకేమీ తెలియదు....నేను ఆమెను దాచలేదు" ఒక్కసారిగా అరిచాడతను.
"లేదు....మీరే దాచారు....అందుకే ఆమె కనిపించడం లేదు"
"శ్రీప్రియ ఎక్కడ వున్నదో, ఏమైపోయిందో నిజంగానే నాకు తెలియదు"
"ఏమో....మీ మాటలను నమ్మలేకపోతున్నాను. మీకు సరిగ్గా ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్నాను. ఈ సారి తప్పుడు సాక్ష్యాలతో మీరు కోర్టుని నమ్మించే అవకాశాన్ని నేను ఇవ్వనని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను....గుడ్ బై జగపతి గారూ....శ్రీప్రియ కోసం ఎదురుచూస్తుంటాను...."
ఇన్స్ స్పెక్టర్ రంజిత్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
జగపతికి అంతా అయోమయంగా వున్నది.
ఇప్పుడతను ఆలోచిస్తున్నది ఒక్కటే....
శ్రీప్రియ....!
ఆ రాక్షసి తన భార్యను చంపించి తనను సాధించడమే కాకుండా....ఇప్పుడు తను ఎక్కడున్నదో తెలియకుండా దాక్కుని కూడా సాధిస్తున్నది.
ఎక్కడున్నదో....ఏం చేస్తున్నదో....
తాను మాత్రం మనశ్శాంతి లేకుండా తల్లడిల్లిపోతున్నాడు.
ఎడతెగని ఆలోచనలతో తలపట్టుకుని కూర్చుండిపోయాడతను.
* * *
ఆ గదిలో కూర్చునివున్న చక్రవర్తి, రాజేంద్రలు చాలాసేపు మౌనంగా వున్నారు. ఇద్దరూ ఎవరికి వారే ఆలోచిస్తున్నారు.
ఇద్దరూ ఆలోచించేది శ్రీప్రియ గురించే!
"చక్రవర్తీ....నీ కోసం వెదుకుతున్న రాణా మనుషులు నాకు తటస్థపడ్డారు" రాజేంద్ర అన్నాడు చక్రవర్తితో.
"ఎలావున్నది పొజిషన్"
"రాణా నీమీద పగపట్టినట్టున్నాడు. సిటీ మొత్తాన్ని తన గుండాగ్యాంగుతో నింపివేశాడు. అంతేకాదు నిన్ను కానీ, శ్రీప్రియను కానీ పట్టితెచ్చిన వానికి మంచి బహుమానం ఇస్తానని కూడా అనుచరులకు చెప్పడంతో వాళ్ళు పట్టుదలగా వెదుకుతున్నారు"
"అంటే....వాళ్ళు కూడా శ్రీప్రియను వెదుకుతున్నారన్నమాట"
"అవును...."
"రాజేంద్రా....శ్రీప్రియ వాళ్ళకు దొరకడానికి వీల్లేదు"
"ఎందుకని?"
"జగపతి ఆమె మీద కక్ష కట్టివుంటాడు. ఆమె వాళ్ళిద్దరిలో ఎవరి చేతికి దొరికినా ఆమె మానప్రాణాలతో ఆటలాడుకుంటారు...."
"ఆడుకుంటే నీకేం?"
"లేదు రాజేంద్రా....అలా జరగడానికి వీలులేదు"
"అంటే, నువ్వు ఆమెను ఇంకా ప్రేమిస్తున్నావా చక్రవర్తీ...."
"ప్రేమకాదు రాజేంద్రా....ఆలోచిస్తుంటే నాకిప్పుడే అర్ధమవుతున్నది....ఆమె ఆడది....ఏదో బలీయమైన కారణంవుంటే తప్ప ఆమె మమ్మల్ని ఇలా చేయదు. శ్రీప్రియ ఏదిచేసినా ఒక ప్లాన్ ప్రకారం చేసింది. ఆమె ఆడించినట్టు ఆడిన జగపతి కానీ నేను కానీ ఏమైపోయినా ఆమెకు అనవసరం. మాపై ఆమెకు ఎలాంటి ప్రేమాభిమానాలు లేవని కేవలం నటించిందని పోలీసులకు ముందే ఫోన్ చేయడాన్ని బట్టి అర్ధమవుతూనే వుంది. ఆమె అలా ప్రవర్తించడానికి వున్న కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకునేవరకూ మనం ఆమెను నిందించకూడదు"
"వెల్ డన్ చక్రవర్తీ....యూ ఆర్ రియల్లీ గ్రేట్....నిన్ను దారుణంగా మోసం చేసి జైలుపాలు చేసిన స్త్రీ పతనాన్ని కోరుకోకపోగా, ఇంకా ఆమెపై సానుభూతి చూపుతున్నావంటే నీది మామూలు గుండె కాదు".
"పొగడ్తలకు ఇది సమయం కాదు రాజేంద్రా....ముందు శ్రీప్రియను రాణా చేజిక్కించుకునే లోపలే మనం ఆమె ఎక్కడ వున్నదో ట్రేస్ చేయాలి...." అసహనంగా అన్నాడు చక్రవర్తి.
"అప్రయత్నం లోనే వున్నాం కదా....అవునూ నాదొక సందేహం"
"ఏమిటది?"
"అసలు ఆ అమ్మాయి ఇంకా ఈ దేశంలోనే వుండివుంటుందంటావా?"
"దేశం వదిలి వెళ్ళిపోయేటంత గొప్ప నేరం ఏంచేసిందని నీకా అనుమానం వచ్చింది?" విసుక్కున్నాడు చక్రవర్తి.
"అది కాదు....నువ్వు జైలుకు వెళ్ళిన తరువాత నుంచి అసలు ఆమె కనిపించక పోవడాన్ని బట్టి అలా అనుకోవడంలో తప్పులేదు కదా...." తనను తను సమర్ధించుకున్నాడు రాజేంద్ర.
చక్రవర్తి కొద్దిసేపు ఆలోచించాడు.
"శ్రీప్రియను మనం కనిపెట్టడానికివున్న ఒకే మార్గం సుహాసిని....ఎందుకంటే మనం ప్రయత్నించిన టెలిఫోన్ నెంబర్లలో ఆమె తెలుసు అని చెప్పిన ఏకైక వ్యక్తి ఆమె మాత్రమే....నాకెందుకనో ఆమెకు శ్రీప్రియను గురించి ఎక్కువ డిటెయిల్స్ తెలుసుననే అనుమానం కలుగుతుంది. రాజేంద్రా....నువ్వు ఎలాగైనా సుహాసిని చిరునామా తెలుసుకునే ప్రయత్నం చేయి" చక్రవర్తి అన్నాడు.
"ఓకే....ప్రయత్నిస్తాను...."
"రాజేంద్రా....నాకోసం చాలా శ్రమ తీసుకుంటున్నావు...."
చక్రవర్తి కళ్ళలో కృతజ్ఞత.
"అదిగో....మళ్ళీ అదే వద్దంటున్నాను. మన మధ్య అలాంటి కృతజ్ఞతలు వుండకూడదు. అండర్ స్టాండ్" రాజేంద్ర సున్నితంగా మందలించాడు.
చక్రవర్తి అతన్ని పంపించి తలుపులేసుకున్నాడు.
బెడ్ మీద పడుకుంటూ న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడతను.
చక్రవర్తి జైలులో నుంచి పరారైన వార్త ఉన్న న్యూస్ పేపర్ అది....చదివిందే మళ్ళీ మళ్ళీ చదువుతూ దీర్ఘాలోచనలో మనిగిపోయాడతను.
ఇప్పుడతని ఆలోచనలలో నిండివున్న రూపం....శ్రీప్రియ!
* * *