ఆ సమయంలో రాణా తోడుగా వుంటే బావుండేదనిపించిందతనికి.
"జగపతిగారూ....నేను మిమ్మల్ని ఇంటరాగేట్ చేయడానికి వచ్చాను"
"ఇంటరాగేషనా?" గుటకలు మ్రింగుతూ అన్నాడతను.
"అవును...."
"ఎం....దు....కు?"
"అదే....మీ భార్యను మీరు చంపినకేసులో...."
జగపతి కళ్ళలో మార్పును గమనిస్తూ అన్నాడు రంజిత్.
"నాభార్యను నేనెందుకు చంపుతాను....చక్రవర్తి, శ్రీప్రియ కలిసి చంపి, ఆ నేరాన్ని నాపై మోపారు." ఎలాగో తేరుకుంటూ మాటలను పూర్తి చేయగలిగాడు.
"ఆఫ్ కోర్స్....అలా అని మీరు శిక్షనుంచి తప్పించుకోగలిగారు. కానీ మీరే మీ భార్యను చంపారన్న నేరం మీదనే మిమ్మల్ని ముందు అరెస్టు చేశారన్న విషయాన్ని మరచిపోమంటారా?" పరీక్షగా అతనివేపే చూస్తూ రెట్టించాడు రంజిత్.
"కానీ, అది అబద్దం అని కోర్టు తీర్పుచెప్పింది కనుకనే నేను నిర్దోషిగా విడుదలయిన విషయాన్ని కూడా మీరు మరచిపోకూడదు"
"ఎస్....అదే....ఏ విధంగా నిరూపించబడిందో కాస్త వివరంగా చెప్పగలరా?"
"చెప్తాను...."
రంజిత్ అతను చెప్పే మాటలను జాగ్రత్తగా వింటున్నాడు.
"నా భార్యను, చక్రవర్తికి గతంలోనే అక్రమ సంబంధం వున్నది. కానీ శ్రీప్రియ అతని ప్రియురాలు.... ఆ విషయం నా భార్యకు తెలిసి చక్రవర్తిని నిలదీసింది. అపుడు తప్పనిసరి పరిస్థితులలో తను శ్రీప్రియను పెళ్ళి చేసుకోబోతున్నట్టు చెప్పాడు కానీ తనవాడనుకున్న చక్రవర్తి మరొకరిని ప్రేమించడమే కాకుండా పెళ్ళి చేసుకోవడం తెలిసి సహించలేకపోయింది.
"నేనులేని సమయంలో ఇంట్లో నుంచి కదలనీయకుండా చక్రవర్తిని తన గదిలోనే వుంచుకున్నది నా భార్య....అలాగయినా అతని నుంచి శ్రీప్రియను దూరం చెయ్యవచ్చని ఆమె ఆలోచన. కానీ అదే ఆమె పాలిట శాపమయింది. చక్రవర్తి ఎక్కడ వున్నదీ తెలుసుకున్న శ్రీప్రియ మా ఇంటికి వచ్చింది.
"శ్రీప్రియతో ముఖ పరిచయం లేని నా భార్య ఆమెను అనుమానించలేకపోయింది. పై పెచ్చు ఆమె నా కూతురు అలేఖ్య స్నేహితురాలిగా ఆమెకు తెలుసు. అందుకే నవ్వుతూ ఆహ్వానించింది శ్రీప్రియను....అది అవకాశంగా తీసుకుని నా భార్యకు పాయిజన్ ఇచ్చి చంపడంలో చక్రవర్తికి సహాయపడింది.
"ఆ శవాన్ని న కారు డిక్కీలో పెట్టి బయలుదేరే సమయానికి నేనొచ్చాను.
"మీ భార్యకు యాక్సిడెంట్ అయిందట వెళదాం రండి" అని నాతో చెప్పడం వలన నేను ముందు వెనకలు ఆలోచించకుండా కారెక్కాను. ఆ తరువాత తెలిసింది నన్ను ఆ నేరంలో ఇరికించడానికి తీసుకెళ్ళారని...."
అంతా చెప్పానన్నట్టు కర్చీఫ్ తో నుదుటిమీద చమట్లను తుడుచుకుంటూ చెప్పడం ఆపి ఇన్స్ పెక్టర్ రంజిత్ వేపు చూశాడు జగపతి.
"మీ ఆవిడకు, చక్రవర్తికి సంబంధం వున్నట్టు ఎలా చెప్పగలుగుతున్నారు?"
"మా పనిమనిషి చెప్పాడు...."
"పనిమనిషి అంటే...."
"అదే....వంట మనిషి...."
"మీ ఉప్పు కారం తినే వంట మనిషి అంతకాలం వరకు మీకు ఎలా చెప్పకుండా వున్నాడు...." ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఇన్స్ పెక్టర్ రంజిత్.
"నా భార్య వాడిని ముందే హెచ్చరించింది"
"ఆల్ రైట్...ఆఖరిగా ఒక ప్రశ్న అడుగుతాను"
"అడగండి...."
"చక్రవర్తితో కలిసి శ్రీప్రియ మీ భార్యను చంపిందని మీకు తెలుసు. మీరు నేరం చేయలేదని నిరూపించుకో గలిగినప్పుడు, అలానే శ్రీప్రియ కూడా ఆ హత్యకు బాధ్యురాలే అని నిరూపించి ఆమెను శిక్షించేప్రయత్నం చేయకుండా ఎందుకు వదిలివేశారు?" రంజిత్ సూటిగా ప్రశ్నించాడు.
"ఆమె నేరం చేసిందని రుజువు చేసే సాక్ష్యాలు ఏమీ లేవు....నేను తప్ప....అందుకని నా మాటలను విశ్వసించలేకపోయింది న్యాయస్థానం.
"ఐసీ....చక్రవర్తి, శ్రీప్రియ ఇద్దరూ కలిసే మీ భార్య హత్యకు ప్లాన్ చేసినమాట నిజమే అయితే జైలులో వున్న చక్రవర్తిని ఇంత వరకూ ఒక్కసారి కూడా శ్రీప్రియ కలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు?" మరొక ప్రశ్నవేశాడు ఇన్స్ స్పెక్టర్ రంజిత్.
"అది నాకేం తెలుస్తుంది....ఆమె ఎందుకు రాలేదో శ్రీప్రియనే అడగండి...."
"ఆ మాట మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారా?"
"అవును....ఆమెరాని కారణం నాకు నిజంగానే తెలియదు"
"థాంక్యూ....నాకు కావలసిన క్లూ దొరికింది"
ఇన్స్ స్పెక్టర్ రంజిత్ నవ్వడంతో జగపతి అయోమయంలో పడ్డాడు.
"వాళ్ళిద్దరూ అసలు ఏమాశించి మీ భార్యను హత్య చేశారో బయటనున్న ఆమెకు కూడా తెలుసునని మీ మాటలను బట్టి అర్ధమవుతున్నది. ఆ వివరాలు ఆమె ఎక్కడ బయటపెడుతుందోననే భయంతో మీరే ఆమెను ఎందుకు దాచి వుండకూడదు? అందువలనే ఆమె చక్రవర్తిని చూడటానికి రాలేకపోయిందని అనుకోవచ్చు కదా? ఏమంటారు జగపతి గారూ....యామ్ ఐ రైట్?"
ఇన్స్ స్పెక్టర్ రంజిత్ ఆ సంభాషణను ఎటువైపు నుంచి ఎటువైపు లాక్కు వెళుతున్నాడో అర్ధమయిన జగపతికి ముచ్చెమటలు పట్టాయి.